close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒట్టు... ఇది చెక్క కనికట్టు!

కర్రమీద పాము జరజరా పాకుతున్నట్లుంటుంది. దుంగలోంచి పులి గాండ్రిస్తూ బయటకు దూకుతున్నట్లుంటుంది. గుడ్లగూబేమో ఇంతింత కళ్లేసుకుని చూస్తుంటుంది. నట్టింట్లోకి అడుగుపెట్టగానే ఇలాంటి దృశ్యాలు ఎదురైతే ఎవరైనా ఉలిక్కిపడి ఓ అడుగు వెనక్కి వెయ్యడం తథ్యమే. అవన్నీ చెక్క కళాకృతులని తెలుసుకున్నాక, నమ్మలేక తడిమి చూడటమూ ఖాయమే. 

ఎంత ఖర్చు పెట్టి కట్టించుకున్న ఇల్లైనా లోపల అలంకరణ సరిగా లేకపోతే తేలిపోతుంది. ఒకప్పుడైతే హాల్లో ఓ షోకేసుని పెట్టి దాన్నిండా చిన్న చిన్న బొమ్మల్ని పేర్చేవారు. కానీ ‘పనిగట్టుకుని షోకేసు దగ్గరికెళ్లి ఆ చిన్న చిన్న బొమ్మల్ని ఎవరు పరీక్షగా చూస్తారూ... పెద్దగా ప్రత్యేకంగా ఉంటే ఒక్క కళాఖండమే హాలుకి సరిపడా అందాన్ని తెచ్చేస్తుంది...’ అంటూ ఇంటీరియర్‌ డిజైనర్లు ట్రెండ్‌ మార్చేశారు. అలా... గదంతా ఖాళీగా ఉంచి, ఏదైనా మూలనో టీపాయ్‌కి దగ్గర్లోనో చూడచక్కగా ఉండే పెద్ద బొమ్మను పెట్టడం ఈమధ్య ఫ్యాషన్‌ అయిపోయింది. అందులోభాగంగానే ఎవరికి నచ్చినట్లు వాళ్లు గాజు బొమ్మలూ చెక్క విగ్రహాలూ రాతి ప్రతిమల్లాంటివాటిని తెచ్చి పెట్టుకోవడమూ మొదలుపెట్టారు. ఇవన్నీ అందంగానూ అందరికీ అందుబాటులోనూ ఉంటాయి. కానీ ఈతరం రూటే సెపరేటు. తొడిగే బట్టలైనా వేసే నగలైనా నడిచే దారైనా నలుగురికీ భిన్నంగా ఉండాల్సిందే, తమ ప్రత్యేకత తెలియాల్సిందే అన్నది వాళ్లు మర్చిపోకుండా పాటించే సూత్రం. అందుకే, ఇంట్లోని అలంకరణ సామగ్రి సైతం చాలా ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అలాంటివారికోసం కొందరు డిజైనర్లు సృష్టిస్తున్నవే  ఈ ‘రియలిస్టిక్‌ వుడ్‌ స్కల్‌ప్చర్స్‌’. 
అందంగా పూలూ లతలూ బొమ్మలూ చెక్కిన చెక్క కళాఖండాల్ని ఇప్పటివరకూ ఎన్నో చూసుంటాం. కానీ పట్టి పట్టి చూసినా అది జీవం లేని బొమ్మంటే నమ్మలేనట్లూ ఆ బొమ్మను చెక్కతో చేశారంటే అస్సలు ఒప్పుకోలేని విధంగానూ రూపొందించినవే ఈ చెక్క బొమ్మలు. వీటిలో కొమ్మల మీద ఆడుతున్నట్లూ గూట్లో నుంచి తొంగి చూస్తున్నట్లూ ఉన్న రకరకాల పక్షి బొమ్మలు ఒకరకం అయితే చేతి కర్ర మీద పాములు పాకుతున్నట్లూ చెక్కిన బొమ్మలు మరొకరకం. ఎండిన చెట్టు దుంగల్లోంచి పులులూ తోడేళ్లూ గొర్రెలూ గుడ్లగూబల్లాంటివి దూసుకుని వస్తున్నట్లు రూపొందించిన అబ్‌స్ట్రాక్ట్‌ రూపాలు ఇంకోరకం. 

ఎలా చేస్తారంటే... 
మామూలుగా చెక్కబొమ్మల్ని చూడగానే అవి చెక్కతో చేసినవని అర్థమైపోతుంది. ఈ ‘రియలిస్టిక్‌ వుడ్‌ స్కల్‌ప్చర్స్‌’ని చూస్తే మాత్రం నిజమైన జంతువులూ పక్షులూ అక్కడ ఉన్నాయేమోననే భ్రమ కలుగుతుంది. అందుక్కారణం వీటిని ఆయా జంతువుల్లా కనిపించేలా చెక్కిన తర్వాత పై భాగంలో రంగులద్దుతారు. కళ్లూ కాళ్లూ ముక్కూ మూతీ చెవులూ కొమ్ముల దగ్గర్నుంచి రెక్కలూ ఈకలూ వాటి ఒంటిమీద కనిపించే మచ్చలూ పొలుసులూ వెంట్రుకల వరకూ ప్రతిదీ అత్యంత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. నిగనిగలాడే చెర్రీపండుని కొరకాలని చూస్తున్న చిలకైనా, రెక్కలు విప్పి నాట్యమాడుతున్న అందాల పిట్టైనా, దుంగ మీది నుంచి దూకడానికి సిద్ధంగా ఉన్న పిల్లి అయినా అంతలా కళ్లను కట్టిపడేయడానికి కారణం ఆ రంగులు చేస్తున్న మాయే. వీటిలో పక్షుల్ని విడిగా చెక్కి కొమ్మలమీదా చెక్క ఆర్ట్‌పీస్‌ల పైనా అమర్చుతారు. చేతి కర్రల విషయానికొస్తే కర్రలో భాగంగానే పాముని కూడా చుట్టుకున్న రూపంలో చెక్కుతారు. తర్వాత ఆ రూపాలకీ వేరు వేరు జాతి పాముల్లా రంగులు వేస్తున్నారు. ఇవి మరింత సహజంగా ఉండేలా చేతి కర్ర హ్యాండిల్‌ దగ్గర చిన్న చిన్న పక్షి, ఎలుక బొమ్మల్ని కూడా చెక్కుతున్నారు. అంటే, చూడగానే పాములు కర్రపైన వాలిన ఆ పక్షిని తినడానికి పాకుతున్నట్లూ అనిపిస్తుందన్నమాట. కావాలనుకుంటే ఈ కర్రల్ని ఎట్సీ.కామ్‌లోని ‘మైక్‌ స్టిన్నెట్‌ స్టూడియో’లో కొనుక్కోవచ్చు. ఇక, అబ్‌స్ట్రాక్ట్‌ చెక్కబొమ్మలైతే... మరింత వినూత్నం. రకరకాల రూపాల్లో ఉన్న ఎండిన దుంగల్ని ఎంపిక చేసుకుని అవి ఏ జంతువు రూపం చెక్కేందుకు వీలుగా ఉన్నాయో చూసుకుని తలభాగం వరకూ ఆ రూపం వచ్చేలా చెక్కి రంగులు వేస్తారు. అయితే, ఈ తరహా వాటిలో మొత్తం జంతువు విడిగా కనిపించదు. తలభాగం మాత్రమే ముందుకొచ్చినట్లూ కనిపిస్తుంది. శరీరం చెక్కలోంచి బయటకొస్తున్నట్లూ అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ తరహాలో తీర్చిదిద్దుతారు. అమెరికాకు చెందిన మార్చ్‌, ఫ్రాంక్‌ నెయమర్‌ ఈ తరహా కళాకృతులతో అంతర్జాతీయంగా పేరుపొందారు. 
అదండీసంగతి... ఇంత వింతగా వినూత్నంగా ఉన్న కళాఖండాల్ని తెచ్చి నట్టింట్లో పెడితే ఎంత క్రేజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది! అన్నట్లూ చేతికర్రల్ని అలంకరణకే కాదు, బయటికెళ్లేటపుడు ఊతంగా పట్టుకోవడం కోసం తాతగారికి కానుకగానూ ఇవ్వొచ్చు. కాకపోతే, అదాటున చూసి ఆయన హడలిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి...  ఇక, మరీ భయపెట్టే జంతువులు వద్దనుకునేవారు ప్రకృతిలోని సౌందర్యాన్నంతా మూటగట్టుకున్నట్లున్న పక్షుల బొమ్మల్ని పెట్టుకోవచ్చు. మీకేవి నచ్చాయి మరి..?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.