close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కథ చెప్పే వేళయింది!

వెన్నెల రాత్రిళ్లు వాకిట్లో మంచం మీద పడుకుని ఆకాశంలో చందమామని చూస్తూ... అమ్మమ్మో తాతయ్యో చెప్పే కథల్ని వింటూ... అందమైన రాకుమారులూ ఎగిరే గుర్రాల గురించి కలలు కంటూ... నిద్రలోకి జారుకున్న అందమైన బాల్యం గురించి చెబితే- ఈ తరానికి ‘కథ’లాగే ఉంటుంది. హోంవర్కులూ పరీక్షల ఒత్తిడి మధ్య నలిగి, అమ్మానాన్నల ఉద్యోగాల హడావుడికి బెదిరి అసలు ‘కథ’ ఎప్పుడో కంచికెళ్లిపోయింది మరి! 

నగా అనగా ఒక రాజు. ఆ రాజు రోజుకో యువతిని పెళ్లి చేసుకుని ఓ రాత్రి గడిపి తెల్లారుతూనే ఆమెకు మరణశిక్ష వేయించేవాడు. అలా ఊళ్లోని యువతులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం చూసిన ఒక యువతి ఓ ఉపాయం ఆలోచించింది. తన వంతు వచ్చేదాకా ఆగకుండా ముందే వెళ్లి రాజుని పెళ్లి చేసుకుంది. ఆ రాత్రి రాజుతో తనకో కోరిక ఉందనీ తాను చెప్పే కథ ఒకటి రాజు వింటే చాలనీ కోరింది. సరేనన్నాడు రాజు. ఆమె కథ మొదలుపెట్టింది. చక్కటి గొంతుతో పాత్రల హావభావాలను పలికిస్తూ ఆమె కథ చెబుతూనే ఉంది. ఆయన వింటూనే ఉన్నాడు. ఇంతలో తెల్లారింది. కథ తర్వాత ఏమయిందో తెలుసుకోవాలని ఉంది రాజుకి. అందుకే ఆమెకు మరణశిక్ష వేయలేదు. మరొకరిని పెళ్లీ చేసుకోలేదు. గబగబా పనులు ముగించుకుని సాయంత్రం కాగానే భార్య దగ్గరికి వచ్చాడు. కథ చెప్పమన్నాడు. ఆమె చెప్పడం మొదలెట్టింది. ఊహించని మలుపులూ, కొత్త పాత్రలూ, కొత్త ప్రాంతాలూ, వింతలూ విడ్డూరాలూ- కథ ఎక్కడెక్కడికో పోతోంది. అవన్నీ తన కళ్లముందే జరుగుతున్నట్లు ఊహాలోకంలో తేలిపోతున్నాడు రాజు. అంతలోనే తెల్లారిపోతోంది. రోజులు గడచిపోతున్నాయి. వందల కథలు ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి... సాగుతున్నాయే తప్ప కథ ముగియడం అంటూలేదు. అలా వెయ్యిన్నొక్క రాత్రుల కథలతో ఆమె రాజు మనసు గెలిచింది. ఎందరో యువతుల ప్రాణాలు నిలిపింది. అన్నిటికన్నా ముఖ్యంగా కేవలం తన కల్పనాచాతుర్యంతో కఠినాత్ముడైన రాజుని కమ్మని కథలను ఆస్వాదించే పసివాడిగా మార్చేసింది. అదీ కథకున్న శక్తి! 
అనగా అనగా ఒక గురువు. ఆయనకు రాజు దగ్గర్నుంచీ కబురొచ్చింది. రాకుమారులకు విద్యనేర్పమని ఆదేశించాడు రాజు. సరేనన్నాడు గురువు. పిల్లలు చూస్తే అమాయకత్వాన్ని పోతపోసినట్లున్నారు. ప్రపంచజ్ఞానం ఏమాత్రం లేని వారికి చదువెలా నేర్పాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించాడు. వారిలోని అమాయకత్వాన్ని అందుకు ఆసరాగా చేసుకున్నాడు. పక్షులూ జంతువులనే పాత్రలుగా మలిచి కథలల్లాడు. రాకుమారులు కళ్లూ చెవులూ అప్పగించి విన్నారు. చిన్నారి మెదళ్లలో ఊహాలోకపు వాకిళ్లు తెరుచుకున్నాయి. మిత్రభేదం, మిత్రలాభం అంటూ చిన్న చిన్న కథలు రకరకాల కోణాల్లో స్నేహం గురించి చెబితే, కాకులూ గుడ్లగూబల కథలు యుద్ధమూ శాంతి గురించి విడమరిచాయి. రాకుమారులు ఆ కథల్లోని పాఠాలను గ్రహించారు. జీవితసత్యాలను అర్థంచేసుకున్నారు. గెలుపోటములను ఎదుర్కొనడమెలాగో తెలిసింది. పాలనాపగ్గాలు చేపట్టగల సమర్థులు అయ్యారు. పంచతంత్ర కథల పవర్‌ అది! 
ఇవే కాదు- బేతాళ కథలు, జాతక కథలు, నీతి కథలు, కాశీ మజిలీ కథలు... ఒకటా రెండా... ఎన్నో కథలు! మన వారసత్వ సంపదా సంస్కృతీ సంప్రదాయమూ అన్నీ కథలే! అసలు కథలు లేనిదే మనం లేము. కథ మన జీవితంలో భాగం. కథే మన జీవితవిధానం. భాషతో పాటూ మనిషి జీవితంలో భాగం అయిపోయిన కథ పిల్లల్ని అలరిస్తుంది. పెద్దయ్యే కొద్దీ ఆలోచింపజేస్తుంది. 

అసలీ కథ ఎలా పుట్టింది? 
చాలా చలిగా ఉంది. దుప్పటి ముసుగేసుకుని ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టడంలేదు. చలిమంట వేసుకుంటే ఒళ్లు వెచ్చబడుతుంది. హాయిగా పడుకోవచ్చు... అనుకున్నారు అన్నదమ్ములిద్దరూ. గబగబా నాలుగు పిడకలూ ఎండుపుల్లలూ జమ చేసి వీధి వాకిట్లో మంట వేశారు. అది చూసి పక్కింటి వాళ్లొచ్చారు... వారిని చూసి ఆ పక్కింటి వారు. అలా వీధిలోనివారంతా చలిమంట చుట్టూ చేరారు. చలికాచుకున్నారు. వణుకు తగ్గింది. కబుర్లు మొదలయ్యాయి. ఎవరేం వండుకున్నారో, ఎవరి పొలాల్లో పనులు ఎంతవరకూ వచ్చాయో చెప్పుకున్నారు. తాను పశువులను మేపుకురావడానికి వెళ్లినప్పుడు ఎంత పెద్ద కొండచిలువను చూశాడో చెప్పాడు వీరయ్య. అది మందలోని దూడని మింగేయబోగా రాళ్లతో కొట్టి తరిమేశానన్నాడు. వీరయ్య ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. పొరుగింటి పుల్లయ్యకీ ఉత్సాహం వచ్చింది. కట్టెల కోసం అడవికి వెళ్లినప్పుడు పులి కనపడిందనీ, దాన్ని తప్పించుకొచ్చిన వైనాన్ని వర్ణించి వర్ణించి చెప్పాడు. అది విన్న చిల్లర కొట్టు లక్ష్మయ్యకి పట్నం గుర్తొచ్చింది. అక్కడి పెద్ద పెద్ద భవనాలూ, పట్టుబట్టలు కట్టే మనుషులూ వారి మాటతీరూ గురించి చెప్పడం మొదలెట్టాడు... అలా చలిమంటల దగ్గర కాలక్షేపానికి చెప్పుకున్న కబుర్లు కాస్తా కథలయ్యాయంటుంది చరిత్ర. 
భాషతో పాటే కథలూ పుట్టాయనీ మొదట కాలక్షేపమూ ఆ తర్వాత అవసరమూ ఆలోచనా... కథలకు పుట్టిళ్లయ్యాయనీ నాగరికత చెబుతోంది. చాలా సమాజాలు తమ సంస్కృతీ సంప్రదాయాల్నీ, ఆచార వ్యవహారాల్నీ, నైతిక విలువల్నీ ముందుతరాలకు అందజేయడానికి కథలనే మాధ్యమంగాఎంచుకునేవి. దాంతో పుస్తకాలు రాయడాని కన్నా ముందే ఒక తరం నుంచీ మరో తరానికీ, ఒక సమాజం నుంచీ మరో సమాజానికీ, ఒక భాష నుంచీ మరో భాషకీ మౌఖికంగానే కథలు వ్యాపించాయి. అందుకే అడవి కథలు, జంతువుల కథలు, పల్లె కథలు, పట్టణాల కథలు, ప్రయాణాల కథలు,తీర్థయాత్రల కథలు, సాహసయాత్రల కథలు... ఇలా ఎన్నో రకాల కథలు ప్రపంచంలో ఏ పక్కకి వెళ్లినా వినిపిస్తాయి. ఆదిమమానవులు కొండగుహల్లో గోడల మీద చిత్రాల ద్వారా కథలు చెప్పుకుంటే ఈనాడు మనం బుల్లితెరమీదా వెండితెర మీదా కదిలే చిత్రాల కథలు చూస్తున్నాం. అప్పటినుంచీ ఇప్పటివరకూ కథలు చెప్పే తీరు మారింది కానీ కథల పట్ల ఆసక్తి ఏమాత్రం మారలేదు. 
కథలెందుకు? 
పసిపిల్లవాడు ఉక్కూ ఉంగా అనడం మొదలెట్టినప్పుడే తల్లి కబుర్లు చెప్పడమూ మొదలెడుతుంది. చిట్టితండ్రి బోసినోటితో నవ్వులు ఒలకబోస్తూ అమ్మ చెప్పిన మాటలు ఆలకిస్తుంటాడు. ఆ కబుర్లు వాడికి అర్థం కావని ఆమెకూ తెలుసు. అయినా ఎందుకు చెబుతుందంటే తల్లీ పిల్లల మధ్య అదో బంధం. అంతే. పిల్లలకు అమ్మ గొంతు వినడం ఇష్టం. ఆ ఇష్టమే పెద్దయ్యే కొద్దీ కబుర్లలోకీ కథల్లోకీ దించుతుంది. కథ చెప్పమని పిల్లలు అడిగితే వారిని చిన్నబుచ్చకుండా తప్పకుండా చెప్పమంటున్నారు పిల్లల మనస్తత్వ నిపుణులు. ఎందుకంటే- కథలు పిల్లల్లో సహజంగా ఉండే ఊహాశక్తికి రెక్కలు తొడుగుతాయి. సృజనశక్తికి పదునుపెడతాయి. పిల్లలు మాటలు నేర్చినప్పటినుంచీ వారికి కథలు చెప్పవచ్చు. అలా చెప్పడం వల్ల వారికి ఒకదాని తర్వాత ఒకటిగా పదాలను పేర్చి వాక్యాలుగా చేసి మాట్లాడడం ఎలాగో తెలుస్తుంది. మంచి భాష వస్తుంది. ఏ పదాన్ని ఎలా పలకాలో ఒత్తులూ దీర్ఘాలూ ఎక్కడ ఇవ్వాలో తెలుస్తుంది. విదేశాల్లో పిల్లల్ని నిద్రపుచ్చేముందు కథ చెప్పడమనేది తల్లిదండ్రులు తప్పనిసరిగా అనుసరించే సంప్రదాయం. అది రొటీన్‌గా కాకుండా గదిలో లైట్లు తీసేసి తగిన వాతావరణాన్ని సృష్టించి మరీ కథ చెబుతారు. పిల్లల వయసుకు తగినట్లు బొమ్మల కథలతో మొదలుపెడతారు. మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ వారికి ఏమి అర్థమైందో వారి మాటల్లోనే చెప్పనిస్తూ... పిల్లలకు దాన్నో చక్కటి అనుభవంగా మారుస్తారు. పిల్లల పెంపకంలో కథలు చెప్పడం కూడా ఒక భాగమనీ తల్లిదండ్రులంతా దాన్ని అలవాటు చేసుకోవాలనీ అంటున్నారు పరిశోధకులు. వారి సూచన ప్రకారం- ఆరేడేళ్లు నిండేవరకు అమ్మానాన్నలే కథలు చెప్పాలి. ఆ తర్వాత కొన్నాళ్లు చదివి విన్పించాలి. పిల్లలకు సొంతంగా చదవడం రాగానే వారి వయసుకు తగ్గ కథల పుస్తకాలను పక్కన ఉండి చదివించాలి. చదివిన కథని చెప్పమనీ ప్రోత్సహించాలి. 

ఆలోచన రేకెత్తిస్తాయి 
ఒకప్పుడు బడిలో చేరకముందే పిల్లలకు చిన్న చిన్న నీతి కథలూ, పురాణ కథలూ, పద్యాలూ ఇళ్లలో నేర్పించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో రైమ్స్‌ వచ్చాయి. టెలివిజన్‌లో కార్టూన్‌ ఫిల్ములుగా కథలన్నీ దృశ్యరూపం సంతరించుకున్నాయి. రంగుల చిత్రాలుగా అవి పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. అయితే వాటితో ఓ చిక్కు ఉంది. కథ దృశ్యరూపంలో ఉన్నప్పుడు- కళ్లు చూస్తుంటాయి, చెవులు వింటుంటాయి, తెరమీద బొమ్మలు నిరంతరం కదిలిపోతుంటాయి. దాంతో ఆ మూడిటినీ సమన్వయం చేసుకోవడం తప్ప మెదడుకి సొంతంగా ఆలోచించే అవకాశం ఉండదు. పిల్లలకు ఆ అవకాశం ఇచ్చేది మాతృభాషలో చెప్పే కథలే. ఆలోచించగలిగినప్పుడే ఎందుకూ ఏమిటీ ఎలా అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెంచుకుంటారు. తర్వాతేమయిందీ అంటూ ప్రశ్నించడం నేర్చుకుంటారు. అంతేకాదు, కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తీ ఏకాగ్రతా పెరుగుతాయి. విచక్షణాజ్ఞానం అలవడుతుంది. మనం వారికి నేర్పాలనుకునే మంచి లక్షణాలన్నిటినీ నేరుగా కాక కథల ద్వారా చెబితే ఎక్కువ ఫలితం ఉంటుందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. 
నీతికథలు... జీవితపాఠాలు 
అబద్ధం చెప్పకూడదని మాటల్లో చెప్పేకన్నా దాన్నో కథలో ఇమిడ్చి చెబితే చిన్నారి మనసు మీద అది చెరగని ముద్ర వేస్తుంది. చిన్నప్పుడు విన్న ‘నాన్నా... పులి’ కథ మరిచిపోగలరా ఎవరైనా! ఒకసారి అబద్ధం చెబితే ఎప్పటికీ మనమీద నమ్మకం కలగదనీ దాంతో మనమే నష్టపోవాల్సివస్తుందనీ ఆ చిన్న కథ చక్కగా చెబుతుంది. పులికి మాట ఇచ్చినందుకు లేగదూడకు పాలిచ్చి, జాగ్రత్తలన్నీ చెప్పి, తిరిగి పులికి ఆహారమవ్వడానికి అడవికి వెళ్లిన ఆవు కథ గుర్తుందా! ఆడిన మాట తప్పనందుకు ఆ పులి మెచ్చుకుని ఆవుని చంపకుండా వదిలేస్తుంది. మాట మీద నిలబడితే మంచి జరుగుతుందని చెప్పడానికి ఇటువంటి కథలెన్నో ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అనుకునే నక్క కథా, దుష్టులకు దూరంగా ఉండాలని చెప్పే తోడేలు- మేకపిల్ల కథా, అపాయాన్ని ఉపాయంతో తప్పించుకున్న కుందేలు కథా... ఇలా  జంతువులు పాత్రలుగా ఉండే ఎన్నెన్నో కథలు- పిల్లలను అలరిస్తూనే జీవిత పాఠాలనూ నేర్పుతాయి. 

సమయస్ఫూర్తికి... 
‘తిలకాష్ట మహిష బంధనం’ అంటూ లేని పుస్తకాన్ని పుట్టించి పొరుగు దేశ పండితుడి నోరు మూయించాడు. ‘బహుభాషా పండితుణ్ణి నేను. నా మాతృభాష కనిపెట్టడం ఎవరి తరమూ కాదు’ అని విర్రవీగిన విద్వాంసుడిని అర్ధరాత్రి భయపెట్టి అతడి అమ్మభాషని కనిపెట్టేశాడు. ఇంద్రజాలంలో తనని మించినవారు లేరని బీరాలు పలికిన విదేశీయుడిని నేను కళ్లు మూసుకుని చేసే పనిని నువ్వు కళ్లు తెరిచి చెయ్యి చాలు- అని సవాలు విసిరి కళ్లు మూసుకుని కనురెప్పలపై కారం పోసుకుని ఆ ఇంద్రజాలికుడు వెనుదిరిగి చూడకుండా పలాయనం చిత్తగించేలా చేశాడు... తెనాలి రామలింగడి గురించి ఎంత చెప్పుకున్నా తరగని కథలున్నాయి. అక్బర్‌ బీర్బల్‌ కథలూ అలాంటివే. పది పన్నెండేళ్ల పిల్లల్ని ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. వినగానే సరదాగా నవ్వుకుంటారు. సమస్యల్ని వాళ్లు ఎంతో తెలివిగా పరిష్కరించిన తీరు గురించి ఆలోచిస్తారు. సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో తెలియజేసే ఇలాంటి కథలు పిల్లలకు ఉత్సాహాన్నిస్తాయి. వారి బుర్రకి పనిపెడతాయి. 
హాయిగా నవ్వేస్తే... 
నిత్యం పాఠాలూ హోంవర్కుల ఒత్తిడితో సతమతమయ్యే పిల్లలకు నవ్వించే ఓ సరదా కథ ఇచ్చే రిలాక్సేషన్‌ అంతా ఇంతా కాదు. అందుకే పడీ పడీ నవ్వేలా వెర్రి వెంగళప్ప కథ ఒకటి చెబితే చాలు, రెట్టించిన ఉత్సాహంతో చదువులో లీనమవుతారు. కాస్త పెద్దయ్యాక బుడుగు, బారిష్టరు పార్వతీశం లాంటి పుస్తకాలూ పరిచయం చేయవచ్చు. కథలతో చరిత్ర పాఠాలూ చెప్పవచ్చు. చరిత్ర గురించి బడిలో ఎంత చదివినా అది మనసుమీద ప్రభావం చూపదు. అదే ఝాన్సీలక్ష్మీబాయి గురించో మహాత్మాగాంధీ గురించో వారు చేసిన పోరాటాలను కథలాగా చెబితే చరిత్రను మానవీయకోణంలో చూడగలుగుతారు. పాఠాలను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. దేశం గురించీ దేశభక్తి గురించీ తెలుస్తుంది. ప్రముఖ వ్యక్తుల గురించి కథలు విన్నప్పుడు వారి వ్యక్తిత్వానికి ప్రభావితమవుతారు. అలాగే అన్నదమ్ముల తగవుల్నీ ఇరుగూ పొరుగూ గొడవల్నీ ఓపిగ్గా విని నేర్పుగా తీర్పులు చెప్పిన మర్యాదరామన్న కథలూ ముల్లా నసీరుద్దీన్‌ కథలూ సమాజం తీరును విడమరిచి చెబుతాయి. 

ఊహలకు రెక్కలొస్తాయి! 
కథ వినేటప్పుడు పిల్లలు దాని గురించి ఊహించుకుంటారు. అందుకే కాస్త పెద్దయ్యాక వారికి ఫాంటసీ కథలు నచ్చుతాయి. అలనాటి బేతాళ కథలనుంచీ ఇప్పటి పిల్లలు మెచ్చుతున్న హ్యారీ పాటర్‌ కథల వరకూ అన్నీ అంతే. అక్కడ సాధ్యాసాధ్యాలంటూ ఉండవు. ఆ వర్ణనలే పిల్లల్ని ఊహాలోకాల్లోకి తీసుకెళతాయి. అందుకే సూపర్‌హీరోల కథల్నీ పిల్లలు అంతగా ఇష్టపడతారు. సూపర్‌ హీరోలు నిజజీవితంలో ఉండరని తెలిసినా పిల్లలు ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలని చేసిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను తెలిపింది... ఇలాంటి కథలను ఇష్టపడే పిల్లలు వాస్తవానికీ ఊహకీ మధ్య తేడాని తేలిగ్గా కనిపెట్టగలుగుతారట. పైగా మిగిలినవారికన్నా సృజనాత్మకంగానూ సైంటిఫిక్‌గానూ కూడా ఆలోచించగలుగుతున్నారట. 
పాఠాలూ కథలవుతున్నాయి! 
ఏ విషయమైనా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే కథే అందుకు సరైన మాధ్యమమని మనస్తత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దాంతో ఇప్పుడు లెక్కల నుంచి సైన్సు పాఠాలవరకూ అన్నిటినీ కథల్లాగా మలిచి చెప్పే సంప్రదాయాన్ని పాఠశాలలూ అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక విద్య విషయంలో చాలా దేశాలు ఈ పద్ధతినే అమలుచేస్తున్నాయి. ఇక భాషను నేర్పే పాఠ్యపుస్తకాలన్నీ కథల పుస్తకాలేనన్నది తెలిసిందే. కొత్త పదాలూ పదబంధాలూ సామెతలూ జాతీయాలూ... పిల్లలకు ఏవి పరిచయం చేయాలన్నా అందుకు తగిన కథలనే పాఠాలుగా ఎంచుకుంటున్నారు. అందులో ఉన్న వ్యాకరణాంశాలతో పాటు నీతినీ బోధిస్తున్నారు.

* * * * * * * * * *

అమ్మ చెప్పిన కథలే... శివాజీలో దేశభక్తిని రగిలించి వీరుణ్ణి చేశాయి.అమ్మ నోట విన్న సత్యహరిశ్చంద్రుడి కథే మహాత్ముడిని జీవితకాలం సత్యానికి కట్టుబడి ఉండేలా చేసింది. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కాశీ మజిలీ కథలు ముళ్లపూడి వెంకటరమణను రచయితగా మలచాయి.ఇప్పుడు చెప్పండి... మీ చిన్నారికి ఎలాంటి కథలు చెప్పబోతున్నారు?

ఆప్స్‌... లైబ్రరీలే ఉన్నాయి!

థల పుస్తకాలకోసం లైబ్రరీ దాకా వెళ్లనక్కరలేదు. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి సవాలక్ష ఆప్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క వేలి స్పర్శతో ఫోనే కథలు చెప్పేస్తుంది. ప్లేస్టోర్‌లో, ఆప్‌స్టోర్‌లో పిల్లలకోసం తెలుగు కథల ఆప్‌లెన్నో ఎదురుచూస్తున్నాయి. టాలీవుడ్‌కి చెందిన దంతులూరి ప్రకాశ్‌ ‘బుల్‌బుల్‌ కిడ్స్‌’ పేరుతో ఓ కంపెనీనే పెట్టారు. ఎనిమిదేళ్ల లోపు పిల్లలకోసం భారతీయ భాషలన్నిటిలోనూ కథలు చెప్పే ఆప్‌లను ఈ సంస్థ రూపొందిస్తోంది. వివిధ దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్లను ఉపయోగించుకుని పిల్లల కథల ఆప్‌లతో ఓ లైబ్రరీని తయారుచేసింది. జానపద కథలు, రాకుమారుల కథలు, పౌరాణిక కథలు... ఇలా ఎనిమిది విభాగాల్లో కథలూ గేయాలూ పుస్తకాలూ ఇందులో ఉన్నాయి. ఆప్‌ డౌన్లోడ్‌ చేసుకుంటే చాలు ఏ భాషలో ఏ తరహా కథ కావాలంటే ఆ తరహా కథ ఎంచుకోవచ్చు. 
ఇవి కాక - తెలుగు కిడ్స్‌ స్టోరీస్‌, చిన్నారి కథలు, పంచరత్న కథలు, నీతికథలు, మర్యాద రామన్న కథలు... ఇలా లెక్కలేనన్ని ఆప్స్‌ ఉన్నాయి. ఇక యూట్యూబ్‌ వీడియోలూ, ఆడియోలూ బోలెడన్ని వచ్చాయి. ఆసక్తి కలవారు ఎవరైనా కథలను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉండటంతో కథలంటే ఆసక్తి ఉన్న చాలామంది ఆ పనిచేస్తున్నారు. మరో పక్క ఔత్సాహికులు చాలామంది పాత చందమామలూ బాలమిత్రలనూ, రష్యన్‌ జానపద కథల అనువాదాలనూ వెబ్‌సైట్లూ బ్లాగుల్లో అందుబాటులోకి తెచ్చారు.

కథలే కెరీర్‌!

థలు చెప్పడం చిన్న విషయం కాదు. అదో గొప్ప కళ. ఇళ్లల్లో కనుమరుగవుతోన్న ఈ కళని కెరీర్‌గా మార్చుకుంటున్నారు కొందరు యువతీయువకులు. స్టోరీ క్లబ్బుల పేరుతో వారాంతాల్లో పిల్లలకు కథలు చదివి వినిపించడమూ, పిల్లల చేత చెప్పించడమూ, సొంతంగా రాసేలా వారిని ప్రోత్సహించడమూ చేస్తున్నారు. ఒక్కరే తమ మానాన తాము చెప్పుకుంటూపోతే అది కథ కాదు. చెప్పేవారూ వినేవారూ ఇద్దరూ కనెక్ట్‌ అయినప్పుడే కథలో మజా ఉంటుంది. ప్రయోజనం నెరవేరుతుంది. ఈ కథకులంతా అలాగే చేస్తున్నారు. పిల్లలు కూడా కథలో భాగం పంచుకునేలా ప్రోత్సహిస్తారు. చక్కటి అభివ్యక్తితో పాత్రల హావభావాలను పలికిస్తూ ఆకట్టుకుంటారు. దీపాకిరణ్‌, ప్రియా ముత్తుకుమార్‌, దేవయానిబాధురి, సీమా వాహి, అపర్ణా ఆత్రేయ, యోగితా అహూజా, శ్రీవిద్యా వీరరాఘవన్‌, నిధి అగర్వాల్‌, చిత్ర... ఇంకా చాలామంది ఇలా కథలు చెప్పడాన్నే కెరీర్‌గా ఎంచుకుని వర్కుషాపులు నిర్వహిస్తున్నారు. కథలు చెప్పడంలో పెద్దలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.