close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎక్కడ... ఎక్కడ... మీ పెళ్ళెక్కడ..?

 

పచ్చని ప్రకృతి సోయగమో, నీలాకాశం నీడన ఎగసిపడే అలల అందాలో, ఠీవిగా నిలిచిన కోటగోడల రాజసమో... కళ్లు తిప్పుకోనివ్వని అందమైన నేపథ్యంలో అంతకన్నా అందంగా అలంకరించిన పెళ్లి మండపం. చుట్టూ కూర్చుని కన్నుల పండగగా చూస్తూ కుటుంబ సభ్యులూ సన్నిహితులూ. సరదాగా జోకులేస్తూ ఆటపట్టించే క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అమ్మాయీ అబ్బాయీ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ సంప్రదాయ పెళ్లి వేడుకలకి ప్రేమసరాగాలద్దుతారు. రెండు జీవితాలను పెనవేసే ఒకానొక అపురూప క్షణం... అలా చిరస్మరణీయమవుతుంది. 
నువ్వూ నేనూ ఇకనుంచీ మనమై సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకరికొకరమై కలిసుందాం- అంటూ ప్రమాణాలు చేసినా... ఏడడుగులు నడిచినా... మూడు ముళ్లు వేసినా... మనిషి జీవితంలో పెళ్లి వేడుక మరువలేని మధురఘట్టం. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాం. శుభలేఖ డిజైను నుంచి దుస్తులూ నగలూ పాదరక్షలదాకా ప్రతిదీ మన అభిరుచికి అద్దంపట్టేలా ఉండాలనుకుంటాం. అటువంటప్పుడు పెళ్లి చేసుకునే చోటు మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఎందుకుండకూడదు? ఏ పూలతోటలోనో జలపాతం పక్కనో సాగరతీరానో ఇద్దరు ఒక్కటైతే ఎంత బాగుంటుంది... అన్న ఆలోచనే ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. సమంతా నాగచైతన్యలు గోవాను ఎంచుకున్నా, దీపికా రణ్‌వీర్‌లు ఇటలీకి ఎగిరివెళ్ళినా, ప్రియాంకా నిక్‌లు జోధ్‌పూర్‌ను కోరుకున్నా కారణం అదే. వీళ్లందరికీ సొంత ఇళ్ళున్నాయి. పెద్ద పెద్ద కల్యాణమంటపాలను అద్దెకు తీసుకుని వేలాది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోగల స్తోమత ఉంది. అయినా ఎందుకు ఇలా కొద్దిమంది ఆత్మీయుల మధ్య ఎక్కడికో వెళ్లి పెళ్లిచేసుకుంటున్నారూ అంటే... డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇప్పటి ట్రెండ్‌ కాబట్టి.

 

వధూవరుల ఇళ్లలోనో, ఊళ్లో ఉన్న కల్యాణమంటపంలోనో పెళ్లి జరగడం మామూలే. సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రుల్ని వెంటతీసుకుని, అరిటాకులూ పూలదండలతో అలంకరించిన బస్సుకి ‘పెళ్లివారమండి’ అన్న బోర్డు పెట్టుకుని సందడిగా పెళ్లి జరిగే ఊరికి ప్రయాణమవుతుంది వరుడి కుటుంబం. అక్కడ విడిది ఏర్పాట్లూ, భోజనాలూ, అతిథిమర్యాదలూ వధువు తరఫు వారి బాధ్యతలు. స్నానాలకు వేడినీళ్లు అందలేదనో, కాఫీలో పంచదార తక్కువైందనో, వేళకు భోజనాలు వడ్డించలేదనో మగ పెళ్లివారు అలగడాలూ పెళ్లివారు సర్ది చెప్పడాలూ... అదో సందడి. అటు మూడు తరాలూ ఇటు మూడుతరాల పెద్దలందరి ఆశీస్సులతో పచ్చని పందిరి కింద వధూవరులు ఒక్కటవుతారు. అయితే ఈ సంప్రదాయ వివాహం ఎంత సందడిగా ఉంటుందో ఇరు కుటుంబాలవారినీ అంత ఒత్తిడికీ గురిచేస్తుంది. ఆ ఒత్తిడిలో అపురూపమైన క్షణాలను ఆస్వాదించలేకపోతున్నామన్నది నేటితరం అభిప్రాయం. పెళ్ళి హాలు దగ్గర్నుంచీ పూల అలంకరణ వరకూ వంటల దగ్గర్నుంచీ వీడియోగ్రాఫర్‌ వరకూ ప్రతి పనినీ సమన్వయం చేసుకునే హడావుడిలో పెళ్లి ఆనందం ఆవిరయిపోతోంది. ఎక్కడ ఏ మర్యాదలకు లోపం జరిగినా బంధువులూ అతిథులూ చిన్నబుచ్చుకోవచ్చు. ఈ హంగూ ఆర్భాటాల కోసం తమ అనుభూతులను పణంగా పెట్టడానికి ఈనాటి యువత ఇష్టపడటం లేదు. పెళ్లంటే జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునే వేడుక. జీవితాన్ని పంచుకోబోతున్న భాగస్వామిని ఎంత జాగ్రత్తగా ఎంచుకుంటామో జీవితకాలం గుర్తుండిపోయే వేడుకనీ అంత అపురూపంగా జరుపుకోవాలనుకుంటోంది నేటి తరం. అందుకే పెళ్లి వేడుక కొత్త డెస్టినేషన్లను వెతుక్కుంటోంది..

 

ఈ మార్పుకి కారణమేంటి? 
ఒకప్పుడు పెళ్లిళ్లన్నిటికీ పల్లెటూరే డెస్టినేషను. ఊరివారంతా తలోచేయీ వేసి శుభకార్యాన్ని కానిచ్చేవారు. అప్పుడంటే వధూవరులు ఏ పక్క పక్క ఊళ్లలోనో ఉండేవారు. కాబట్టి ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి పెళ్లి చేసుకుంటే సరిపోయేది. మొక్కులాంటిది ఏదైనా ఉంటే ఏ అన్నవరమో, తిరుపతో వెళ్లేవారు. పెళ్లిళ్లు కూడా పొలం పనులు లేని రోజుల్లో పెట్టుకునేవారు. దాంతో చుట్టపక్కాలందరూ ముందుగానే వచ్చేసి పెళ్లి పనుల్లో తలో చెయ్యీ వేసేవారు. రాను రానూ పట్టణాలూ నగరాలూ పెరిగాయి. ఉద్యోగాలూ వ్యాపారాలూ పెరిగాయి. ఇప్పుడు వధూవరులు చెరో రాష్ట్రంలోనో చెరో దేశంలోనో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. బంధువులైనా పనులు మానుకుని వచ్చి పదేసి రోజులు ఉండే పరిస్థితులు కావు. అందరూ నేరుగా కల్యాణమంటపానికే వస్తున్నారు. అలా వచ్చిన వందలాది అతిథుల్ని మర్యాదపూర్వకంగా పలకరించి మాట్లాడేందుకు కూడా వధూవరుల తల్లిదండ్రులకు వీలు కుదరడం లేదు. పెళ్లి మండపం వైపు ఒక అడుగూ ఆహ్వానితుల వైపు ఒక అడుగూ వేస్తూ అటు బిడ్డల పెళ్లీ ప్రశాంతంగా చూడలేక ఇటు అతిథులనూ సరిగా రిసీవ్‌ చేసుకోలేక నానా హైరానా పడిపోతున్నారు. ఫొటోగ్రాఫర్లూ వీడియోగ్రాఫర్లూ వేదికను చుట్టుముట్టేస్తుండటంతో అతిథులూ కళ్లారా పెళ్లి వేడుకను చూడలేకపోతున్నారు. ఇదంతా ఆధునిక యువతకు నచ్చడం లేదు. అందుకే తమ కుటుంబసభ్యులూ అత్యంత ఆత్మీయులైన కొద్దిమంది స్నేహితుల సమక్షంలో సరదాగా పెళ్లి చేసుకోవాలనీ, ఆ వేడుకకు సంబంధించిన ప్రతి క్షణాన్నీ తామూ తమవాళ్లూ కూడా ఆస్వాదించాలనీ కోరుకుంటూ అందుకు అనువైన మార్గాలను వెతుక్కుంటున్నారు.

 

ఎటువంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు? 
సాధారణంగా సెలెబ్రిటీలూ ధనవంతులూ తమకు నచ్చిన ప్రకృతి రమణీయమైన ప్రాంతాలను వివాహ డెస్టినేషన్లుగా ఎంచుకుంటున్నారు. కొందరు సముద్రపు ఒడ్డున బీచ్‌లనూ, రిసార్టులనూ కోరుకుంటే కొందరేమో కోటలూ రాజప్రాసాదాల్లాంటి అందమైన భవనాలను ఎంపిక చేసుకుంటున్నారు. విదేశీయులైతే అడవుల్లో పచ్చని చెట్ల మధ్య పెళ్లి చేసుకోవడానికీ మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి ప్రాంతాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని హోటళ్లూ, రిసార్టులూ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలూ కలిసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. వధూవరుల బడ్జెట్‌కి తగినట్లుగా ప్యాకేజ్‌ వెడ్డింగ్‌, కస్టమైజ్‌డ్‌ వెడ్డింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు పేరొందిన దేశాల పర్యటక శాఖలు కూడా దీనిపై దృష్టిపెట్టి ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తున్నాయి. మనవాళ్లు ఎక్కువగా థాయ్‌లాండ్‌, మారిషస్‌, శ్రీలంక, ఇండొనేషియా, ఒమన్‌ లాంటి దేశాలను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఎంచుకుంటున్నారట.

దూరమైతే అతిథులెలా వస్తారు? 
పెళ్లంటే మనకి మామూలుగానే బంధువులూ స్నేహితులూ పరిచయస్తులూ... వందల్లో ఉంటారు. సమాజంలో కాస్త పలుకుబడి కలిగినవారైతే వేలల్లోనే అతిథులుంటారు. విదేశాల్లో అలా కాదు. అక్కడ సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిలో అతిథులు 150కి మించరు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అయితే 50 మందే. ఇప్పుడు మనవాళ్లూ అలాగే రెండు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులైన కొందరినే పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో వధూవరులూ వారి కుటుంబాలూ కలిసి ఆలోచించుకున్నాక ఆత్మీయులందరికీ ఓ మాట చెబుతారు. వారి అభిప్రాయాల్నీ పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారు. తాము తయారుచేసుకున్న అతిథుల జాబితాను మరోసారి పక్కాగా పరిశీలించి, వారందరికీ కొన్ని నెలలు ముందుగానే సమాచారమిస్తారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటే ఒక్కరోజులో అయ్యేది కాదు. కనీసం నాలుగు రోజులైనా ఉండాల్సి వస్తుంది కాబట్టి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోడానికి వీలుగా ముందస్తు సమాచారమన్నమాట. కొందరైతే అతిథులకు కూడా రానూపోనూ టికెట్లు ముందుగానే బుక్‌ చేసేస్తున్నారు.

 

పిలవనివారు చిన్నబుచ్చుకోరూ? 
డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నా పెళ్లికి ముందో, తర్వాతో సొంత ఊళ్లో అందరినీ పిలిచి రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తారు. బంధువులూ స్నేహితులూ పరిచయస్తులూ... ఇలా ఎవరినీ మిస్సవకుండా ఆహ్వానిస్తారు. దాంతో ఎవ్వరికీ పెళ్లికి వెళ్లలేకపోయామన్న భావన కలగదు. పైగా రిసెప్షన్‌లో ఎలాంటి సంప్రదాయాలూ అనుసరించాల్సిన అవసరం లేదు కాబట్టి వధూవరులూ వారి కుటుంబసభ్యులూ విందుకు వచ్చిన అతిథులందరినీ పేరుపేరునా పలకరించడానికి వీలవుతుంది. వధూవరుల జంటని వచ్చినవారంతా అక్షతలు వేసి ఆశీర్వదించగలుగుతారు.

ఇలాంటి పెళ్లిళ్ల వల్ల లాభమేంటి? 
డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లలో అన్నిటికన్నా ముఖ్యమైనది వధూవరుల సాన్నిహిత్యం. ఎలాంటి ఒత్తిళ్లూ ఆందోళనలూ లేకుండా తమ జీవితంలోని ఎంతో ముఖ్యమైన ఘట్టాన్ని వాళ్లు పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు. తక్కువ మంది అతిథులు- వాళ్లు కూడా అత్యంత సన్నిహితులే కాబట్టి అతిథి మర్యాదలతో అలసిపోనక్కరలేదు. వివాహానికి సంబంధించి జరిపే వేడుకల్లో ప్రతి క్షణాన్నీ వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులూ ఆస్వాదిస్తారు. అతిథులకూ అదో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అతిథులకు బస నుంచీ వధూవరుల మేకప్‌ వరకూ అన్ని సౌకర్యాలూ, సేవలూ ఈ డెస్టినేషన్లలో అందుబాటులో ఉంటాయి. నిర్వాహకులే అన్ని పనులూ చూసుకుంటారు. సంప్రదాయ పెళ్లి వేడుకలైన - పెళ్లి కుమార్తెను చేయడం, మెహందీ లాంటివాటితో మొదలెట్టి అప్పగింతల కార్యక్రమం వరకూ అన్నిటినీ నిర్వహించుకునేందుకు వీలుగా ఇక్కడ రకరకాల వేదికలను ఏర్పాటుచేస్తారు. వధూవరులూ వారి కుటుంబాలకూ బోలెడంత తీరిక దొరుకుతుంది కాబట్టి ప్రతి క్షణాన్నీ ఆనందంగా ఆస్వాదించవచ్చు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లలో పెళ్లి సీరియస్‌గా సాగే సంప్రదాయంలాగా కాక పార్టీలాగా సరదాగా జరుగుతుంది. మూడు నుంచి ఐదు రోజుల వరకూ అతిథులంతా అక్కడే ఉంటారు కాబట్టి వారికోసం ప్రత్యేక కార్యక్రమాలనూ, చుట్టుపక్కల ప్రాంతాలకు టూర్లనూ ఏర్పాటుచేస్తుంటారు. 
ఇలాంటి పెళ్లిళ్ల వల్ల మరో లాభం- మరో సుదీర్ఘ ప్రయాణం అవసరం లేకుండా హనీమూన్‌ కూడా అక్కడే జరుపుకోవచ్చు. లేదంటే అతిథులంతా వెళ్లిపోయాక రెండు మూడు రోజులు అక్కడే గడిపి ఆ తర్వాత వీలు చూసుకుని హనీమూన్‌కి మరోచోటికి వెళ్లవచ్చు.

 

నచ్చిన లొకేషన్‌లో రిసార్టులేమీ లేకపోతే..? 
రిసార్టులూ హోటళ్లలాంటి సకల సౌకర్యాలూ ఉండే చోటు కాక ఏ బీచ్‌లోనో, కొండపైనో, అడవిలోనో... పెళ్లి చేసుకోవాలనుకుంటారు కొందరు. అలాంటివారి కోసం అందుకు తగిన ఏర్పాట్లూ చేస్తున్నాయి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు. ఎంచుకున్న ప్రాంతమూ, అతిథుల సంఖ్యా, కావలసిన సదుపాయాలూ చెబితే చాలు- సమయానికి అన్నీ సిద్ధమైపోతాయి.

విదేశాల్లో చేసుకుంటే పెళ్లి రిజిస్ట్రేషన్‌ ఎలా? 
అదీ చేయించుకోవచ్చు. ఏ దేశంలో చేసుకుంటే ఆ దేశ చట్టాలకు లోబడి పెళ్లి సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించి పేపర్‌ వర్క్‌ కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. కావాలంటే అది కూడా వెడ్డింగ్‌ ప్లానర్లే చేసిపెడతారు. 
ఆ గొడవంతా ఎందుకనుకునేవారు పెళ్లికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని స్వదేశంలో చేసుకుని దాని ఆధారంగా ఇక్కడే పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

ఇవన్నీ సెలెబ్రిటీలకే సాధ్యమేమో? 
చాలామంది అలాగే అనుకుంటారు కానీ, గత ఏడాది టూరిజం మార్కెట్‌ అధ్యయనాన్ని అంకెల్లో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయ వివాహ మార్కెట్‌ విలువ లక్షా పదివేల కోట్ల రూపాయలైతే అందులో దాదాపు నాలుగోవంతు వాటా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లదేనట. మరో రెండు మూడేళ్లలో ఈ వాటా సగానికి పెరగవచ్చని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఒక్కో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కీ కోటి నుంచి 6 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతోందట. సెలెబ్రిటీల పెళ్లిళ్లయితే వార్తల్లో చూస్తాం కాబట్టి అందరికీ తెలుస్తుంది. మిగిలినవారి గురించి అలా తెలియడం లేదు అంతే. పైగా చాలామంది ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యాపారవేత్తలూ ఎగువ మధ్యతరగతివారూ ప్రవాసులూ ఎక్కువగా ఇలాంటి పెళ్లిళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లి దుస్తుల్ని నలగకుండా భద్రంగా గమ్యం చేర్చేందుకు విమానయాన సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయంటే ఈ ట్రెండ్‌ ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

*  *  *

పెళ్లంటే... నూరేళ్ల పంట. అది జరగాలీ కోరుకున్న వారి ఇంట- అని పాడుకునేవాళ్లం ఒకప్పుడు. ఆ పల్లవిని కాస్త మార్చుకుని- పెళ్లంటే నూరేళ్ల పంట... అది జరగాలీ కోరుకున్నచోట... అని పాడుకుంటోంది ఈ తరం! ‘శుభమస్తు’ చెప్పేద్దామా మరి.

ఇటలీనే ఎందుకంటే...

 

గత ఏడాది అనుష్కా విరాట్‌ కోహ్లి, మొన్న దీపికా రణ్‌వీర్‌లు ఇటలీ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ప్రపంచంలోనే అందమైన, రొమాంటిక్‌ పరిసరాలకు మరోపేరు ఆ దేశం. పొడవైన సముద్ర తీరప్రాంతానికి తోడు ఓ పక్క ఎత్తైన ఆల్ప్స్‌ పర్వతాలూ, లోయలూ, మరో పక్క కొండలను ఆనుకుని ప్రశాంతతకు అర్థం చెబుతున్నట్లుండే నీలి సరస్సులూ, చూడచక్కని విల్లాలూ, అద్భుతమైన రాతికొండలూ, విశాలమైన పచ్చిక మైదానాలూ... ఎటు వెళ్లినా కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సోయగం ఇటలీ సొంతం. ఎలాంటి అభిరుచి కలవారైనా ఏ స్థాయి బడ్జెట్‌లోనైనా ఎంచుకోవడానికి సరిపోయే అందమైన లొకేషన్లు అక్కడ అనేకం అందుబాటులో ఉంటాయి. వైవిధ్య భరితమైన ప్రకృతి అందాలను కళ్లారా చూసి, మనసారా ఆస్వాదించడానికే కాదు, నోరూరించే వంటకాలను రుచిచూడాలన్నా ఇటలీ వెళ్లాల్సిందే. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఇటాలియన్‌ వెడ్డింగ్‌ కేకులనైతే ఒకసారి తిన్నవారు ఎప్పటికీ మర్చిపోలేరు. వైన్‌ కూడా అక్కడ ఇతర దేశాలకన్నా తక్కువ ధరకే లభిస్తుందట. ఇలా అన్నిరకాల ప్రత్యేకతలూ ఉన్నాయి కాబట్టే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఇటలీ ఫస్ట్‌ ఛాయిస్‌ అవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో జమైకా, బహమాస్‌, పారిస్‌, బాలి, అరిజోనా, సెయింట్‌ లూసియా, హవాయ్‌, జోధ్‌పూర్‌, న్యూయార్క్‌ సిటీ లాంటివి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు వేదికలుగా ఆకట్టుకుంటున్నాయి.

 

 

ఒక్క రాత్రికి రూ. 43 లక్షలు!

 

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లొకేషన్లు మనదేశంలోనూ బోలెడన్ని ఉన్నాయి. కోటలూ అంతఃపురాల నేపథ్యంలో రాచరికపు హంగుల మధ్య ఠీవిగా పెళ్లి చేసుకోవాలనుకునేవారికి స్వాగతం పలుకుతుంటుంది రాజస్థాన్‌. తాజాగా ప్రియాంకా చోప్రా ఎంచుకున్న తాజ్‌ ఉమేద్‌ భవన్‌ మన దేశంలోని రాజప్రాసాదాల్లో చిట్టచివరగా కట్టింది. కరవుతో సతమతమవుతున్న ప్రజలకు ఉపాధి కల్పించడానికి రాజా ఉమేద్‌సింగ్‌ ఈ భవనాన్ని నిర్మించారు. 27 ఎకరాల్లో 347 గదులతో ఉన్న ఉమేద్‌ ప్యాలస్‌లోని ఒక భాగాన్ని తాజ్‌ గ్రూపు హోటల్‌గా మలచింది. ఎడారి మధ్య విరిసిన పచ్చదనాన్ని ఇక్కడి గార్డెన్లలో చూడవచ్చు. మంచుకురిసే వేళ నెమళ్లు విహరిస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంటాయి. ఇక్కడ ఒక్క రాత్రి బస చేయడానికి రూ.43 లక్షలు అవుతుంది. ఉదయ్‌పూర్‌, జైపూర్‌, జోధ్‌పూర్‌, ఆగ్రా కోటలు దేశ విదేశీ సెలెబ్రిటీలను ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సరస్సూ శతాబ్దాలనాటి దేవాలయాలతో ఆధ్యాత్మికశోభను ప్రతిబింబిస్తుంది పుష్కర్‌. హవేలీలూ, ఎడారి నేపథ్యంలో ఔట్‌డోర్‌ పార్టీలకు అనువుగా ఉంటుంది జైసల్మేర్‌. ఇక బీచ్‌లూ, రిసార్టులూ ఇష్టపడేవారు గోవా, కేరళ, తమిళనాడులకే కాక అండమాన్‌ నికోబార్‌ దీవులకీ వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలో రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న రిసార్టులూ విశాఖపట్నంలోని బీచ్‌ రిసార్టులూ పెళ్లిళ్లకు ఆతిథ్యమిస్తున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.