close

అక్కడ ఉండాలంటే ఆపరేషన్‌ జరగాల్సిందే!

ఎవరైనా మరో దేశానికి వెళ్లి ఉండాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ లాంటి పత్రాలు అడుగుతారని తెలిసిందే. కానీ చిలీలోని ఆ గ్రామంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆపరేషన్‌ చేయించుకుని అపెండెక్స్‌ని తీయించుకోవాల్సిందే. గర్భం దాల్చడమూ అక్కడ ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే... 
విల్లాస్‌ లాస్‌ ఎస్ట్రెల్లాస్‌... అంటార్కిటికాలో- ఉన్నంతలో ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న గ్రామం ఇది. ఆ మంచు ఖండంలో ఉన్న రెండే గ్రామాల్లో ఇదొకటి. మరొకరకంగా చెప్పాలంటే ఇది చిలీ దేశపు మిలటరీ స్టేషన్‌. వైమానికదళ సభ్యులూ వారి కుటుంబాలతో పాటు కొందరు శాస్త్రవేత్తలూ నౌకాదళ సభ్యులూ ఉంటారిక్కడ. మొత్తం జనాభా దాదాపు 150. చలికాలంలో ఈ ఊళ్లో ఉష్ణోగ్రతలు మైనస్‌47 డిగ్రీలకు పడిపోతుంటాయట. నేల కొన్ని మీటర్ల మందంలో మంచుతో కప్పబడిపోతుంది. మిగిలిన సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు సగటున మైనస్‌ 2-3 డిగ్రీల మధ్యే ఉండటంవల్ల ఎక్కువ సేపు బయట ఉండలేరు. ఇక, విల్లాస్‌లో ఉండాలనుకుంటే ఆరేళ్ల వయసుపైన వారెవరైనా ఆపరేషన్‌ చేయించుకుని కడుపులోని అపెండెక్స్‌ని తీయించుకోవడం తప్పనిసరి. దానివల్ల అనుకోకుండా ఎవరికైనా ఇరవైనాలుగ్గంటల కడుపు నొప్పి వస్తే పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే అక్కడి నుంచి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే మరి. గంటకు 200కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు విపరీతమైన మంచూ ఉండే విల్లాస్‌ నుంచి విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడానికే ఒక్కోసారి మూడు రోజులు పడుతుందట. అందుకే, ఎవరికైనా అపెండిసైటిస్‌ వస్తే ప్రాణాలు పోవడం ఖాయం. కాబట్టే చిలీ ప్రభుత్వం అపెండెక్స్‌ తీయించుకోవాలని నిబంధన విధించింది. ఇతర ఆరోగ్యసమస్యలేవైనా వస్తే అత్యవసర వైద్యం చెయ్యడానికి స్థానికంగా చిన్న ఆసుపత్రీ అందులో ఓ డాక్టర్‌ ఉంటారు. కానీ అక్కడ శస్త్రచికిత్స చేసే సౌకర్యం లేదు. ఈ కారణంతోనే గర్భం దాల్చడం కూడా ఇక్కడ సాహసం చెయ్యడమే. అలాంటి సందర్భం వస్తే మహిళలు నగరానికి వెళ్లిపోతుంటారు.

 

 

అందుకే ఉంటున్నారు 
ఈ ఊళ్లో ఓ పోస్టాఫీసు, బ్యాంకు, చర్చి, ఆసుపత్రి, పాఠశాల, కమ్యునిటీ క్యాంటీన్‌ ఉంటాయి. వీటిలోనూ ఒక్కరూ మహా అయితే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తుంటారు. స్థానిక పాఠశాలలో డజను మంది పిల్లలు చదువుకుంటున్నారు.  అన్నట్లూ విల్లాస్‌లో అందరూ అక్కడున్న క్యాంటీన్‌లోనే తినాలి. ఆ ఊళ్లో సరకుల్ని కొనుక్కునేందుకు షాపులుండవు మరి. ఇక్కడి చల్లదనానికి నీరు గడ్డకట్టి పైపులు పగిలిపోతాయని రాళ్లను తొలిచి మధ్యలో నుంచి పైపుల్ని వేస్తారు. ఇళ్ల లోపల వేడికోసం హీటర్లుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే... కొంతమంది సైనికులూ వారి కుటుంబాలూ అడిగి మరీ ఈ ప్రాంతానికి బదిలీ చేయించుకుంటారట. అదేమంటే, ‘అంటార్కిటికాలో ఉండే అవకాశం ఎంతమందికి వస్తుంది... పైగా బయట రకరకాల పనులతో సతమతమవుతూ సొంతవారితో గడిపే సమయం తగ్గిపోతోంది. ఇక్కడ కుటుంబమే జీవితం అన్నట్లుంటుంది. బోర్‌ కొడితే టీవీలో ఒకటీరెండు ఛానెళ్లు వస్తాయి. కమ్యూనిటీ జిమ్‌లో వ్యాయామంతో పాటు అందరూ కలసి ఆడుకోవచ్చు’ అంటారు.

 

ఓ అందమైన అనుభూతి! 
ఈ మంచు ఖండాన్నీ ఇక్కడి వేల్స్‌, పెంగ్విన్‌లను చూసేందుకూ ఫిబ్రవరి, మార్చినెలల్లో జరిగే అంటార్కిటికా మారథాన్‌ కోసమూ చాలామంది పర్యటకులూ వస్తుంటారు. రాత్రుళ్లు కూడా మధ్యమధ్యలో వెలుగు వచ్చే ఈ ప్రాంతంలో కొద్దిరోజులు ఉండడం వింత అనుభూతి. కింగ్‌ జార్జ్‌ ఐలండ్‌ నుంచి విల్లాస్‌కు సరకుల్నీ పర్యటకుల్నీ తీసుకొచ్చేందుకు విమానాలూ నౌకలూ ఉంటాయి. పర్యటకులు ఉండేందుకు ఇక్కడ ఓ లాడ్జ్‌ కూడా ఉంది. ఇలాంటి ఓ ఊరు ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.