close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భం భం భయం... 

- విజయార్కె

 

భలేరావు వంక మిసెస్‌ భలేరావు ఆశ్చర్యంగా కాసింత అపనమ్మకంగా, మరికాసింత అనుమానంగా చూసింది. వాళ్ళ పెళ్ళయి పట్టుమని పాతిక రోజులు కూడా కాలేదు. మొదటిసారి భర్తతో సినిమాకు బయలుదేరింది. 
‘‘మనం ఇద్దరం కలిసి సినిమాకు ఫస్ట్‌ టైమ్‌ బయలుదేరుతున్నాం’’ అని భలేరావు అనౌన్స్‌ చేయగానే భలే థ్రిల్‌ అయ్యింది మిసెస్‌ భలేరావు. 
‘‘ఏం సినిమా అండీ?’’ 
‘‘ఊహించు చూద్దాం...’’ 
నీ కోసం... నువ్వు లేక నేను లేను... ప్రేమించుకుందాం రా... ఇలా ఏ రొమాంటిక్‌ సినిమానో అనుకున్న మిసెస్‌ భలేరావుకు అన్నింటికీ ‘నో’ అనే ఆన్సర్‌ వచ్చింది. 
పెళ్ళయిన తరవాత తన భర్త తనను తీసుకువెళ్ళే మొదటి సినిమా ...భూ ...త్‌...మొదటిసారి భర్త కారణంగా రామ్‌గోపాల్‌ వర్మను ముంబైకి వినపడేలా తిట్టాలనుకుంది.‘‘భూ...త్‌..?’’ కాసింత అనుమానంగా అడిగింది మిసెస్‌ భలేరావు. 
‘‘య్యా... య్యా... య్యా’’ అన్నాడు భార్య వంక చూసి. కానీ భార్యలో తననుకున్న ఎక్స్‌ప్రెషన్‌కు బదులు మరో ఎక్స్‌ప్రెషన్‌ వచ్చింది. తాను ఎక్స్‌పెక్ట్‌ చేసింది వేరు... భార్య క్యారీ చేసింది వేరు. 
అసలు భలేరావు మిసెస్‌ భలేరావు నుంచి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేశాడు... ఏ ఎక్స్‌ప్రెషన్‌ చూడాలనుకున్నాడు. అసలు భలేరావు ఎందుకు భార్యను ‘భూత్‌’ సినిమాకు తీసుకువెళ్తున్నాడు అంటే...  

*  *  *

కొందరికి హాబీలు ఉంటాయి...మరికొందరికి ఫోబియాలుంటాయి. భలేరావుకు ఇగోబియా ఉంది.భలేరావు అదో టైపు. అతనికి ‘భయపడే భార్యంటే’ ఇష్టం. 
తన భార్యలో భయాన్ని చూడాలి. అర్ధరాత్రి వర్షం వచ్చినా పిడుగుపడ్డా... వెంటనే భయంగా కళ్ళు మూసుకుని తనను వాటేసుకోవాలి.రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పోకిరీలు వెంటపడితే తన చేయి గట్టిగా పట్టుకోవాలి. తను హీరోలా ఫైట్‌ చేయాలి. తను ఆఫీసుకు వెళ్ళాక అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి ‘ఏమండీ, భయమేస్తోంది... త్వరగా ఇంటికి రండి’ అనాలి. తను ఆఫీసు పనిమీద క్యాంపులకు వెళతానంటే తనను గట్టిగా పట్టుకుని ‘మీరు లేకపోతే నాకు భయం... ఒంటరిగా ఉండలేను’ అనాలి.

ప్రతి నిమిషం భార్య కళ్ళల్లో భయాన్ని చూడాలి.అప్పుడెప్పుడో ఎవరో ‘బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి’ అన్నట్టన్నమాట.అందుకే పెళ్ళిచూపుల్లో ‘మీ అమ్మాయి రాత్రిళ్ళు ఒంటరిగా బయటకు వెళ్తుందా?’ అంటే... పెళ్ళికూతురు తండ్రి వెంటనే ‘అమ్మో, తనకు భయం... పెందరాళే ఇంటికి వస్తుందని’ చెప్పాడు. 
తను- తనకు కాబోయే భార్య వంక చూసినప్పుడు కూడా తల చిన్నగా పైకెత్తి కళ్ళు టపటపలాడిస్తూ తల దించేసుకుంటే ‘అబ్బో, సిగ్గూ ప్లస్‌ భయం’ అనుకున్నాడు. 
ఇవన్నీ తూచ్‌ అని తేలిపోయింది మొదటిరోజే!

మొదటిరాత్రి... మొదటిరోజే... అతని మనసులోని కోరికను పసికట్టిన ప్రకృతి- ‘పోనీలే పాపం’ అని వర్షంతోపాటు పిడుగుని పంపించింది. 
పెద్ద వర్షం... పిడుగు... భలేరావు చేతులు చాచి ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు- భయంతో వచ్చి తనను వాటేసుకుంటుందని. ఎందుకైనా మంచిదని ఫ్యూజ్‌ కూడా పీకేశాడు. మిసెస్‌ భలేరావు తాపీగా కూల్‌గా ఒక్కతే కిచెన్‌లోకి వెళ్ళి అగ్గిపెట్టె తీసుకుని, హాల్లోకి వెళ్ళి క్యాండిల్‌ తీసుకుని, వెలిగించి బెడ్‌రూమ్‌లోకి వచ్చింది. క్యాండిల్‌ వెలుతురులో గోడమీద భార్య నీడను చూసి భలేరావు భయంతో కెవ్వుమన్నాడు. మిసెస్‌ భలేరావు భర్తను దగ్గరికి తీసుకుంది. 
భర్త భుజం మీద చేయి వేసి ‘‘జస్ట్‌ నీడండి... భయపడకండి’’ అంది.

తన తలను ఏ బంకర్‌లో దాచుకోవాలో అర్థంకాలేదు భలేరావుకు.తెల్లవారాక టిఫిన్‌ చేస్తున్నప్పుడు అడిగాడు ‘‘రాత్రి కరెంట్‌ పోయింది... వర్షం... పిడుగు కూడా పడింది... భయం వేయలేదా? పైగా ఒక్కదానివే కిచెన్‌లోకీ హాలులోకీ వెళ్ళి వచ్చావు’’ భార్య మొహంలోకి చూసి అడిగాడు. 
‘‘భయమా..?’’ అని నవ్వి, ‘‘భయమెందుకండీ, అర్ధరాత్రి ఒంటరిగా బస్సులో క్యాబ్‌లో కూడా వచ్చేదాన్ని. 
మా ఇంట్లో - ఆ మాటకొస్తే - మా వీధిలో - నేనే ధైర్యస్తురాల్ని’’ అంది. 
పిల్లనిచ్చిన మామగాడి మీద పీకలదాకా కోపమొచ్చింది. భయపడే భార్య దొరికిందని లాంఛనాలు కూడా అడగలేదు. ఎలాగైనా భార్య కళ్ళల్లో భయం చూడాలనుకున్నాడు. 
అందుకే, హారర్‌ సినిమా చూపించాలనుకున్నాడు... పూర్‌ ఫెలో... భలేరావు.

*  *  *

మల్టీప్లెక్స్‌... పెద్ద స్క్రీన్‌... డాల్బీ సిస్టం... ముందు వరుసలో బుక్‌ చేశాడు కావాలనే. అందులోనూ సెకండ్‌ షో. 
సినిమా మొదలైంది. భలేరావు రెడీగా ఉన్నాడు... హారర్‌ సీన్స్‌ చూసి భయంతో భార్య కళ్ళు మూసుకుంటుంది... తన భుజం గట్టిగా పట్టుకుంటుంది. ‘భయపడొద్దు’ అన్నట్టు... తను ధైర్యం చెబుతాడు. 
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సన్నివేశాలూ ఆత్మలూ... అలా కళ్ళప్పగించి చూస్తోంది... చాలా కాన్సంట్రేషన్‌తో. ఆ మాటకొస్తే భలేరావే భయపడ్డాడు. సినిమా చూస్తోన్నవాళ్ళు కొందరు భయంతో అరుస్తున్నారు. మిసెస్‌ భలేరావు మాత్రం సినిమాను తెగ ఎంజాయ్‌ చేస్తోంది.

 

ఇంటర్వెల్‌లో భార్యను అడిగాడు ‘‘సినిమా చూస్తుంటే భయంవేయలేదా?’’ అని. 
‘‘భయమా..?’’ పాత సినిమాలో విలన్‌లా నవ్వింది. ‘‘నేను కాలేజీ రోజుల్లోనే ఇలాంటి సినిమాలు బోల్డు చూశాను. చిన్నప్పుడే స్కూలు ఎగ్గొట్టి ‘ఈవిల్‌ డెడ్‌’ చూశా. ‘పురానా హవేలీ, బీస్‌ సాల్‌ బాద్‌, రాజ్‌’... అన్నీ చూశా. ఇక వర్మ సినిమాలైతే లెక్కేలేదు... చెప్పుకుపోతోంది. 
‘మీ అమ్మాయి ఎలాంటి సినిమాలు చూస్తుం’దని మామగారిని అడిగినప్పుడు ‘మిస్సమ్మ, కీలుగుఱ్ఱం, ముత్యాలముగ్గు...’ అని చాంతాడంత లిస్ట్‌ చెప్పాడు. మచ్చుకు ఒక్క హారర్‌ సినిమా పేరు కూడా చెప్పలేదు. ఎంత మోసం... ఎంత మోసం... అని గుండెలు బాదుకున్నాడు భలేరావు.

*  *  *  

సినిమా వదిలేశారు.. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. స్ట్రీట్‌ లైట్స్‌ వెలగడం లేదు. కొద్దిగా భయం వేసింది భలేరావుకు. పైగా తన పక్కన భార్య ఉంది. అతని భయానికి తథాస్తు దేవతలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు... ముగ్గురు వ్యక్తులు తాగి తూలుకుంటూ వస్తున్నారు.

పచ్చి రౌడీల్లా ఉన్నారు. జనం పలచగా ఉన్నారు. ముగ్గురూ అడ్డం వచ్చి చచ్చారు. 
భలేరావు లేని ధైర్యాన్ని వడ్డీకి తెచ్చుకుని ‘‘ఏయ్‌, ఏంటీ న్యూసెన్స్‌’’ అన్నాడు. 
వెంటనే వాళ్ళలో ఒకడు ‘‘మాస్టారూ, మీకు న్యూసెన్స్‌ వద్దా... పోనీ న్యూస్‌ కావాలా? మీ సెటప్‌ బావుంది. ఈ సెటప్‌ను వదిలి నువ్వింటికి వెళ్ళు. రేప్పొద్దున పంపిస్తాంలే. అప్పుడు టీవీలో మాంచి న్యూస్‌ వస్తుంది’’ మిసెస్‌ భలేరావు వంక చూసి అన్నారు వాళ్ళు.

భలేరావు బిక్కచచ్చిపోయాడు. వాళ్ళు ముగ్గురు... పైగా అడ్డంగా దున్నల్లా బలిసి ఉన్నారు... చేతుల్లో బీర్‌ బాటిళ్ళు... సినిమాల్లోకి మల్లే... తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. భార్య ముందు పరువు విషయం దేవుడెరుగు... అసలు భార్యను ఎలా సేవ్‌ చేసుకోవాలో అర్థం కాలేదు. కానీ అప్పటికే మొగుడికి అర్థమయ్యే స్టయిల్‌లో రియాక్ట్‌ అయ్యింది మిసెస్‌ భలేరావు. ‘‘ఏంట్రా ఎక్‌స్ట్రాలు చేస్తున్నారు?’’ అంది టోన్‌ మార్చి.

తన భార్య నుంచి అలాంటి మాటలు విని షాకయ్యాడు... అంతకుమించి హడలిపోయాడు... రౌడీల రియాక్షన్‌ ఊహించుకుని. 
‘‘ఏంటీ, షీ టీమ్‌కు కంప్లైంట్‌ ఇస్తావా? వాళ్ళొచ్చేసరికి...’’ అంటూ మిసెస్‌ భలేరావు వైపు చూశారు. 
అప్పటికే మిసెస్‌ భలేరావు హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి పెప్పర్‌ స్ప్రే తీసింది. వాళ్ళ మొహాలమీదా కళ్ళమీదా పెప్పర్‌ స్ప్రే చేసింది. 
కొంగు బిగించి పిడికిళ్ళు బిగించి ‘‘య్యా... వూ...’’ అంటూ వాళ్ళ మొహాలను పచ్చడి చేసింది. రౌడీల్లోని ఒకడి చేతిలోని బీర్‌ బాటిల్‌ తీసుకుని వాడినెత్తి మీదే ఒక్కటిచ్చింది. బీరు బాటిల్‌ ముక్కలైంది... వాడి తల పచ్చడైంది. అంతే, క్షణాల్లో ఫీల్డ్‌ క్లియర్‌ అయ్యింది. ముగ్గురూ పరుగుపందెం మొదలుపెట్టారు. భలేరావుకు ఇంకా గుండె దడ తగ్గలేదు. ఈసారి రౌడీలను కాదు, తన భార్యను చూసి భయమేసింది భలేరావుకు.

*  *  *

ఇంటికెళ్ళగానే భార్య ఒళ్ళో తలపెట్టి భోరుభోరున ఏడ్చేశాడు. ‘వా... వా... వా’ అని.‘‘ఏమైందండీ...’’ అంటూ భర్త జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి గోముగా గోకి అడిగింది.‘‘మీ నాన్నా, నువ్వూ... నన్ను మోసం చేశారు’’ ఏడుస్తూనే చెప్పాడు భలేరావు.‘‘మోసమా... హౌ?’’ అని అడిగింది మిసెస్‌ భలేరావు.‘‘నీకసలు భయమే లేదు. నాకేమో భయపడే భార్య కావాలి’’ అమాయకత్వాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌ చేసి చెప్పాడు- తన మనసులోని మాటను. 
విషయం షాట్‌ బై షాట్‌ అర్థమైంది మిసెస్‌ భలేరావుకు.

  *  *  *

పొద్దున్నే కోడి కొక్కొరొక్కో అలారం వినిపించకముందే ‘కెవ్వు’మన్న సైరన్‌ లాంటి కేక వినిపించింది.భయాన్నీ, ఎదుటివారు భయపడటాన్నీ... ఇష్టపడే భలేరావు భయంతో బాత్‌రూమ్‌లోకి పరిగెత్తాడు. అక్కడ సబ్బు మీద కాలువేసి జర్రునజారి స్పృహతప్పి పడిపోయి ఉంది మిసెస్‌ భలేరావు.  

*  *  *

లేడీ డాక్టర్‌ వచ్చింది. గదిలోకి వెళ్ళింది. లోపల మిసెస్‌ భలేరావును పరీక్ష చేసింది. బయట పిచ్చ టెన్షన్‌తో భలేరావు వెయిటింగ్‌. డాక్టర్‌ బయటకు వచ్చింది... 
లోపలికి వెళ్ళింది. బయటకు వచ్చింది... లోపలికి వెళ్ళింది. ఈసారి బయటకు వచ్చింది కానీ లోపలికి వెళ్ళలేదు. సీరియస్‌గా భలేరావు వైపు చూసింది. ‘‘సారీ, మీ మిసెస్‌ తలకు బలమైన గాయం తగిలింది. దాంతో షార్ట్‌ టైమ్‌ మెమొరీలాస్‌ అవుతుంది.’’‘‘అంటే, గజనీలో సూర్య టైపా?’’ అడిగాడు భలేరావు.‘‘అలా అవ్వొచ్చు. దానికన్నా ముఖ్యమైన విషయం... మీ మిసెస్‌ మైండ్‌లో నుంచి ఒక ఎమోషన్‌ కూడా లాస్‌ అవుతుంది.

అది కోపం, బాధ, ఏడ్పు, భయం...ఏదైనా కావొచ్చు’’ చెప్పింది సీరియస్‌గా కళ్ళజోడు సవరించుకుని.‘‘మెమొరీ లాస్‌ విన్నాను కానీ...ఎమోషన్‌ లాస్‌ విన్లేదు డాక్టర్‌’’ అన్నాడు భలేరావు. 
‘నేను మాత్రం విని చచ్చానా?’ అనబోయి కంట్రోల్‌ చేసుకుని ‘‘ఇది అరుదైన లక్షణం... సో, బీ కేర్‌ఫుల్‌’’ చెప్పింది ఫీజు తీసుకుని వెళ్ళిపోతూ.

*  *  *  

మొదటిసారి భయపడుతూ బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టాడు. కళ్ళు తెరిచి గోడకేసి చూసి గట్టిగా ఫైరింజన్‌లా అరిచి భలేరావు చొక్కాను చించినంత పనిచేసింది. 
‘‘ఏమైంది?’’ దడుచుకుని అడిగాడు భలేరావు. గోడమీద బల్లిని చూపించింది మిసెస్‌ భలేరావు.

‘‘శుభమా అని ఆఫీసుకు బయలుదేరుతుంటే...’’ పెద్దగా అరిచొచ్చి భలేరావు కొత్త చొక్కాను నలిపేసింది. ‘‘ఏమైంది? మళ్ళీ వ్వాట్‌ హాపెండ్‌..?’’ అడిగాడు భలేరావు. చేత్తో దూరంగా ఉన్న పిల్లిని చూపించింది. 
‘పిల్లికి భయపడతారా’ అని తనలో తాను నవ్వుకుని జాగ్రత్తలు చెప్పి ఆఫీసుకు బయలుదేరాడు భలేరావు.

ఆఫీసులో రిజిస్టరులో సంతకం పెట్టి పది నిమిషాలైనా కాకముందే ఫోన్‌ చేసింది. ‘అర్జంటుగా ర‌మ్మంటూ మిసెస్‌ భలేరావు- విషయమేమిటో చెప్పకుండా. పరిగెత్తుకు వెళ్ళాడు భలేరావు భయపడుతూ.

 

*  *  *

  ‘‘ఎవడో ఇంటిముందు నిలబడి నావైపే చూస్తున్నాడు. అందుకే భయమేసి మీకు ఫోన్‌ చేశా’’ కళ్ళు టపటపలాడిస్తూ చెప్పింది. భలేరావు వాడివంక చూశాడు. పాత పేపర్లు కొనేవాడు.

పాత పేపర్లు కొనడం కోసం వచ్చాడు. 
అలా మొదలైంది భలేరావుకు భయం బాధ. పొద్దున్నే కూరగాయలవాడిని చూసినా భయపడిపోతోంది. పాలవాడిని చూసినా భయమని అరిచేసి బల్లిలా తనను కరుచుకుపోతోంది. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి ‘భయమేస్తోంది’ అంటోంది. అలారం వినిపించినా భయపడుతోంది. భలేరావు బతుకు మూతలేని మ్యాన్‌హోల్‌లా తయారైంది.ఇప్పుడు అతనికి భార్యను చూస్తే భయమేస్తోంది. ఒకసారైతే ఏకంగా ఆఫీసుకే వచ్చింది... ఇంట్లో భయమేస్తోందని. 
‘భయం ఇంత భయంగా ఉంటుందా’ అని భయమేసింది భలేరావుకు.

*  *  *

లేడీ డాక్టర్‌ను కలిసి రెండు చేతులూ జోడించి ‘‘మీరే ఎలాగైనా... నా భార్య... భయం లాస్‌ జబ్బు తగ్గించండి. లేకపోతే నా భార్య భయాన్ని చూసి ఆ భయంతో నిద్రలోనే పోయేలా ఉన్నాను. నో ఫుడ్‌, నో బెడ్‌... ఓన్లీ భయం’’ ఏడుస్తూ చెప్పాడు భలేరావు. 
‘‘అయితే, ఓ పనిచేయండి. సబ్బు మీద కాలేసి జారిపడి భయాన్ని లాస్‌ అయింది కాబట్టి... మళ్ళీ మీ ఆవిడను సబ్బు మీద కాలేసి జారిపడేలా చేయండి. అప్పుడు తిరిగి మైండ్‌సెట్‌ కావొచ్చు’’ చెప్పింది డాక్టర్‌, తనలో తను తెగ నవ్వేసుకుంటూ. 
వెంటనే రాఘవేంద్రరావు సినిమాలు చూశాడు. సంతూర్‌ నుంచి లక్స్‌ వరకూ అన్ని సబ్బులూ తెచ్చి బాత్‌రూమ్‌లో పరిచేశాడు. తాను బాత్‌రూమ్‌లో ఉండి భార్యను కేకేశాడు.భర్త పిలుపుతో భయంతో బాత్‌రూమ్‌లోకి పరుగెత్తుకు వచ్చి సబ్బుల మీద కాలేసి కిందపడింది.

*  *  *

బాత్‌రూమ్‌లోనే కళ్ళు తెరిచింది ‘‘నాకేమైంది?’’ అంటూనే కళ్ళు పైకెత్తి బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌ వైపు చూసి లేచి వెంటిలేటర్‌ నుంచి లోపలికి వస్తున్న అనకొండ కజిన్‌ చిన్న కొండ సైజు పామును చేత్తో పట్టుకుని బయటకు గిరాటేసింది.ఆ దృశ్యం చూసి భలేరావు షాకవ్వలేదు... భయపడలేదు. పైగా బోల్డు ఆనందపడిపోయాడు. తన భార్యకు ‘భయం లాస్‌’ పోయింది. ఆ సంతోషంతో భార్యను గట్టిగా పట్టుకోబోయి ఓ సబ్బు మీద కాలేసి కిందపడిపోయాడు. కాసేపయ్యాక కళ్ళు తెరిచి భార్య వంక చూసి ‘‘భార్యకు భర్త మీద ఉండవలసింది ప్రేమ కానీ భయం కాదు’’ అన్నాడు.

*  *  *

భలేరావు ఆఫీసుకు వెళ్ళాక డాక్టర్‌కు ఫోన్‌ చేసింది మిసెస్‌ భలేరావు. 
‘‘థాంక్యూ డాక్టర్‌, ఇప్పుడు ఆయనకు నా ధైర్యమే నచ్చుతోంది. నేను తనకు భయపడాలని అనుకోవడం లేదు. ఇదంతా మీవల్లే. ఆరోజు మీరలా నాకు కోఆపరేట్‌ చేయకపోయుంటే నా భర్త మారేవాడు కాదు. అన్నట్టు... తను కూడా సబ్బు మీద కాలేసి జారిపడ్డాడు... అచ్చం నేను పడ్డట్టే’’ నవ్వి చెప్పింది మిసెస్‌ భలేరావు. 
‘‘అలా పడటంతో... అతనిలో- భార్య భయపడాలనే వీక్నెస్‌ లాస్‌ అయి, నువ్వంటే ప్రేమ ప్లస్సయింది’’ డాక్టర్‌ నవ్వి చెప్పింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.