close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ కొన్ని నెలలు సూర్యుడు ఉదయించడు!

‘అక్కడ సూర్యుడు వేసవిలో త్వరగా అస్తమించడు, చలికాలంలో ఉదయించడు. అదే అమెరికా దేశానికి చెందిన అలాస్కా ప్రత్యేకత. చిత్ర విచిత్రమైన వాతావరణానికీ సుందర ప్రకృతి వింతలకీ పెట్టింది పేరైన ఆ ఉత్తర ధ్రువ ప్రాంతంలో పర్యటించడం ఆద్యంతం ఉత్కంఠభరితం’ అంటూ ఆ విశేషాలను వివరిస్తున్నారు కాలిఫోర్నియాకు చెందిన

 ఎ. అపరాజిత.

లాస్కాలో పర్యటించడానికి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ పదిహేను వరకూ అనుకూల సమయం. అమెరికా నుంచి అలాస్కా వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఓడమీదుగా ప్రయాణించడం లేదా సియాటల్‌ నుంచి అలాస్కాలోని ఆంకరేజ్‌ వరకూ విమానంలో వెళ్లి, అక్కడినుంచి కారులో డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. 
మేం రెండో దారినే ఎంచుకున్నాం. 
ముందుగా ఆంకరేజ్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీవార్డ్‌కి వెళ్లాం. ఆ దారంతా ఎత్తైన పచ్చని చెట్లూ కొండలూ సెలయేళ్లూ కనువిందు చేశాయి. రెండు గంటల్లో సీవార్డ్‌కి చేరుకున్నాం. మర్నాడు పడవలో బయలుదేరాం. సాగరజలాలూ వాటి మధ్యలోంచి పైకి లేచిన మంచుచరియలూ దూరంగా మంచుపర్వతాలూ... ఆ సౌందర్యాన్నీ చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు అనిపించింది. ప్రయాణం మధ్యలో తిమింగలాలూ సీ లయన్లూ, సీ ఓట్టర్లూ, ఎలుగుబంట్లూ, సముద్ర పక్షులూ కనిపించాయి. అవి కనిపించినప్పుడు బోటుని ఆపి, కాసేపు వాటిని చూస్తూ ఫొటోలు తీసుకునే అవకాశం కల్పించారు.

మంచుజల్లుల్లో... 
పడవలో ప్రయాణిస్తుంటే నీళ్ల మధ్యలో చిన్నాపెద్దా సైజుల్లోని అనేక మంచు కొండలు కనిపించాయి. వాటి చరియలు పెద్దగా శబ్దం చేస్తూ సముద్రంలోకి కూలిపోయి, అవి సముద్రంమీద తేలడం కళ్లారా చూశాం. మంచుచరియల దగ్గరకి వెళ్లాలనుకునేవాళ్లు కయాక్‌ అనే చిన్న పడవల మీద వాటికి దగ్గరగా వెళ్లి చూడొచ్చనడంతో మేం అక్కడకు వెళ్లాం. కానీ మేం వెళ్లేసరికి విపరీతమైన చలిగాలి, చిరుజల్లులు వణుకు పుట్టించాయి. కాసేపు ఆ చల్లని అందాలను ఆస్వాదించి వెనుతిరిగాం.

మర్నాడు సీవార్డ్‌లో మరోవైపున ఉన్న మంచు పర్వతం ఎగ్జిట్‌ గ్లేసియర్‌కి కాలిబాటన వెళ్లాం. ఇది నెమ్మది నెమ్మదిగా తరిగిపోతోంది. గత 20 సంవత్సరాల్లో దాదాపు వెయ్యి అడుగులు వెనక్కి వెళ్లిపోయింది ఈ పర్వతం. వాతావరణ కాలుష్య ప్రభావమే దీనికి కారణం అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. తరవాత సీవార్డ్‌ నుంచి డెనాలి జాతీయ పార్కుకి వెళ్లాం. ఆ దారిలో అడుగడుగునా పచ్చని ఉద్యానవనాలు కనువిందు చేశాయి. దీని వైశాల్యం 60 లక్షల ఎకరాలట. అక్కడ సొంత వాహనాలని అనుమతించరు. ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టూరు బస్సుల్లోనే వెళ్లాలి. ఎనిమిది గంటలపాటు ఆ బస్సులో విహరిస్తూ ఆ విశాలమైన పార్కు అందాలను వీక్షించాం. డెనాలి అంటే ఎత్తైన పర్వతం అని అర్థం. అక్కడ ఉన్న ఓ వ్యూపాయింట్‌ నుంచి మొత్తంగా పార్కులోని పర్వతాలనీ లోయల్నీ సరస్సుల్నీ చూడొచ్చు. అలా చూస్తూ ఎంతసేపు ఉండిపోయామో తెలీలేదు. అలా నిలబడి చుట్టూ చూస్తుంటే ఆ నిశ్శబ్ద ప్రకృతి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నట్లే అనిపించింది. అక్కడి కొండల మధ్య స్వేచ్ఛగా తమ సంతానంతో తిరుగుతున్న ఎలుగుబంట్లనీ అడవిజాతి గొర్రెలనీ కరీబొలనీ చూశాం. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మూస్‌ అనే ఓ జంతువుని కూడా చూపించారు. ఇది కూడా జింక జాతికి చెందినదే కానీ చాలా ఎత్తుగా పెద్దగా ఉంటుంది. అది శాకాహార జంతువు. దీని మాంసాన్ని స్థానికులు తింటుంటారట. ఎలుగుబంట్లకి కూడా ఇవే ప్రధాన ఆహారం. అక్కడ రాత్రి 9.30కి సూర్యాస్తమయమైంది.

మర్నాడు డెనాలి నేషనల్‌ పార్కులోని స్లెడ్జ్‌ డాగ్‌ కెన్నెల్‌ని చూశాం. మంచులో బండి లాగే కుక్కల్నే స్లెడ్‌ డాగ్‌లు అని పిలుస్తారు. అక్కడి కెన్నెల్‌లో రకరకాల జాతుల స్లెడ్‌ డాగ్స్‌ని పెంచుతున్నారు. వాటితో బళ్లను లాగించే ప్రదర్శనలూ ఏర్పాటుచేశారు. ఆ బండి లాగుతున్నంతసేపూ అవి మొరుగుతూనే ఉన్నాయి. తరవాత మజిలీ టాల్కీత్ను. అదో చిన్న పట్టణం. జనాభా 876. ఒక చదరపు కిలోమీటరుకి 11 నుంచి 12 మంది ఉంటారట. అడవిలో ఉన్నట్లున్న ఆ ఊళ్లోని ఇళ్లూ దుకాణాలూ పాతకాలం హాలీవుడ్‌ కౌబాయ్‌ సినిమాల్లోని సెట్టింగుల్ని తలపించేలా ఉన్నాయి. అక్కడి మార్కెట్లో స్థానికంగా తయారయ్యే కళారూపాల్ని విక్రయిస్తున్నారు.

ఆ ఊరు ఓ బంగరు గని! 
టాల్కీత్ను నుంచి అలాస్కాకి ఉత్తరాన ఉన్న ఫెయిర్‌బ్యాంక్స్‌ అనే నగరానికి వెళ్లాం. అలాస్కాలోని అతిపెద్ద నగరాల్లో ఇదీ ఒకటి. నగరంలోని ఎత్తైన కొండమీద సువిశాలమైన స్థలంలో నిర్మించిన విశ్వవిద్యాలయాన్ని చూడ్డానికి వెళ్లాం. ఆ ప్రాంగణంలోనే ఓ మ్యూజియంను నిర్మించారు. ఎత్తయిన ఆ ప్రాంతం నుంచి చూస్తే మొత్తం నగరం అంతా కనిపిస్తుంది. దూరంగా ఉన్న దెనాలి పర్వతశ్రేణుల్నీ వాటి మధ్యలో అన్నింటికన్నా ఎత్తైన మెకిన్లీ పర్వత శిఖరాన్నీ ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచే చూశాం. మబ్బుల్లో దాగినట్లుండే ఆ శిఖరం అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.

ఈ ఫెయిర్‌బ్యాంక్స్‌ బంగారుగనులకి ప్రసిద్ధి. ఇక్కడి నుంచే అమెరికాలో ఎక్కువ భాగం బంగారం ఉత్పత్తి అవుతుంది. దాన్ని తవ్వి తీసే ప్రాంతాన్ని చూసి, అక్కడే ఉన్న మరో అద్భుతం ఐస్‌ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. అందులో రంగురంగుల మంచు శిల్పాలు చెక్కి ఉన్నాయి. గుర్రం, ధ్రువపు ఎలుగుబంటి, క్రిస్మస్‌ చెట్టు, సింహాసనంమీద కూర్చున్న రాజు, ఇగ్లూ... ఇలా అనేక శిల్పాలూ గదులూ భవంతులూ అన్నీ కూడా మంచుతో చెక్కినవే అక్కడ ఉన్నాయి. ఆ మంచుశిల్పాల్ని ఎలా చెక్కుతారో ఓ కళాకారుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఆసక్తి ఉన్నవారు చెక్కే అవకాశం ఉంది. తరవాత పెట్రోలియం సరఫరా కోసం 1287 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఆయిల్‌ పైప్‌లైన్‌ చూశాం. 1973లో అక్కడ పెట్రోల్‌ కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయట. ఆ సమస్యకు పరిష్కారంగానే దీన్ని నిర్మించారట.

ఆకాశంలో వెలుగుజిలుగులు! 
ఫెయిర్‌ బ్యాంక్స్‌ మరో ప్రత్యేకత నార్తర్న్‌ లైట్స్‌. చలికాలంలో ఇంకా చెప్పాలంటే ఏడాదిలో 200 రోజులపాటు అర్ధరాత్రివేళ ఆకాశంలో రంగురంగుల కాంతి వలయాలు నృత్యం చేస్తున్నట్లూ ఒకదాంతో ఒకటి ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తుంటాయి. అమెరికాలో నార్తర్న్‌ లైట్స్‌ ఏడాదిలో ఎక్కువరోజులు కనిపించే ప్రదేశం అలాస్కా మాత్రమే. సూర్యకిరణాల్లోని అయాన్లు భూమి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు- వాటి అణువుల్లోని ఎలక్ట్రాన్ల శక్తిలో మార్పులు చోటు చేసుకుని, కాంతిమంతమైన ఫోటాన్లు విడుదలవుతాయి. ఈ క్రమంలో ఆకాశంలో ఆ రంగురంగుల కాంతివలయాలు నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి ఏ సమయంలో కనిపిస్తాయో ముందుగానే అంచనా వేస్తారు. మనం బస చేసిన హోటల్‌వాళ్లు ఆ సమయానికి నిద్రలేపుతారు. కచ్చితంగా చూసి తీరాల్సిన అద్భుత దృశ్యం అది. ఈ నార్తర్న్‌ లైట్లు డెనాలి నేషనల్‌ పార్కులో కూడా కనిపిస్తుంటాయి. అదీగాక ఫెయిర్‌బ్యాంక్స్‌ చలికాలపు సుదీర్ఘ రాత్రులకీ, వేసవి సుదీర్ఘ పగళ్లకీ కూడా పెట్టింది పేరే. అలాస్కాకి ఉత్తరకొసగా ఉన్న బారో ప్రాంతానికి వెళితే మరింత అందమైన అరోరా బొరియాలిస్‌లను చూడొచ్చు. అంతేకాదు, అలాస్కా సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే స్థానికులైన ఇనుపియాట్‌ ఎస్కిమోలనీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్‌ వలయంలో ఉండటంతో ఇక్కడ నివసించే ప్రజలు 64 రోజులు అంటే సుమారు రెండు నెలలపాటు సూర్యకాంతిని చూడలేరు. ఎందుకంటే భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో రాత్రీపగళ్లూ ఏర్పడితే, అలా తిరిగేటప్పుడు భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగడంతో ధ్రువప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో దీర్ఘరాత్రులూ దీర్ఘపగళ్లూ ఏర్పడుతుంటాయి. దీర్ఘరాత్రుల్లో భాగంగా సూర్యుడు పది నుంచి పన్నెండు గంటల మధ్య ఉదయించి మళ్లీ మధ్యాహ్నం రెండూ మూడూ గంటల్లోపే అస్తమిస్తాడు. ఉదాహరణకు నవంబరు నెలలో ఆరుగంటలపాటు డిమ్‌ లైటు వేసుకున్నట్లుగా వెలుతురు ఉంటే, డిసెంబరులో అది కాస్తా మూడు గంటలకి పడిపోతుంది. అదేమాదిరిగా వేసవిలో మూడునెలలపాటు అక్కడి ప్రజలు సూర్యాస్తమయానికీ నోచుకోరట. అంటే సూర్యాస్తమయం తరవాత కూడా విద్యుద్దీపకాంతుల అవసరం లేనంత వెలుతురు ఉంటుంది. దాంతో వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఆ వేసవి రాత్రుల్ని ఆనందంగా గడుపుతారు. చలికాలంలో కోల్పోయిన కాంతితో పోలిస్తే వాళ్లకి వేసవిలో లభించే కాంతి ఎక్కువే. అందుకే స్థానికులు ఈ దీర్ఘపగళ్లూ రాత్రుళ్లతో ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ఆనందంగా జీవిస్తారు. ఇలాంటి ప్రకృతి వింతలకు నిలయమైన అలాస్కాని మరోసారి చూడాలనుకుంటూ వెనుతిరిగాం.

 

 

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.