close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంధుత్వం 

- గోగినేని మణి

హాస్పిటల్‌ నుంచి బయటకువచ్చి కారు ఎక్కబోతుంటే... ఎవరో పిలిచినట్లయి అటువైపు చూశాను. ఒకతను చేయి ఊపి చకచకా రోడ్డుదాటి వచ్చి ‘‘వేణూ, ఎన్నాళ్ళకు కనిపించావ్‌!’’ అంటూ నా చేయి పట్టుకున్నాడు. 
ఒక సెకను సాలోచనగా చూడగానే గుర్తుపట్టాను. ‘‘అరె, గోవిందూ... నువ్వేమిటి ఇక్కడ?’’ అంటూ భుజం మీద చేయి వేశాను. రెండేళ్ళక్రితం ఆ ఊరికి ట్రాన్స్‌ఫరై వచ్చినట్లు చెప్పి... ఉద్యోగం, కుటుంబం గురించి 
వివరాలు క్లుప్తంగా చెప్పాడు. మా బంధువులు అక్కడ పెట్టిన కార్పొరేట్‌ హాస్పిటల్లో ఆ సంవత్సరమే నేనూ డాక్టరుగా జాయినైన విషయాన్ని చెప్పాను.

మేమిద్దరం హైస్కూలునాటి స్నేహితులం. మూడేళ్ళు కలిసి చదువుకున్నాం. ఇన్నేళ్ళ తర్వాత కలుసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది. ‘‘కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పద’’ అంటూ క్యాంటీన్‌కు దారితీశాను. 
ఆ రోజులు గుర్తుకువచ్చాయి.

మా నాన్నకి ఆ ఊరు ట్రాన్స్‌ఫరైనప్పుడు నేను చేరిన స్కూల్లోనే గోవిందూ చదివేవాడు. నా క్లాస్‌మేటే కాకుండా, బెంచీలో నా పక్కనే కూర్చునేవాడు. అందువల్లనే అనుకుంటా మా ఇద్దరికీ తొందరగా స్నేహం కుదిరింది. 
మధ్యాహ్న భోజనానికి నేను బాక్సు తెచ్చుకునేవాణ్ణి. గోవిందూ వాళ్ళ ఇల్లు స్కూలుకి బాగా దగ్గర కావటంతో వాడు ఇంటికి వెళ్ళొచ్చేవాడు. నన్నూ తరచుగా వాళ్ళింటికి రమ్మని లాక్కుపోయేవాడు. అప్పట్లో గోవిందు బక్కగా ఉండేవాడు. వాళ్ళమ్మగారికి వాడిని కూర్చోబెట్టి కథలూ కబుర్లూ చెబుతూ అన్నం తినిపించటం అలవాటు. ఆ కథల కోసమే గోవిందు రమ్మన్నదే తడవుగా వెళ్ళిపోయేవాణ్ణి. నా బాక్సులోని అన్నాన్ని హడావుడిగా తినేసి గోవిందు పక్కన కూర్చుని వాళ్ళమ్మగారు చెప్పే కథల్ని ఇష్టంగా వినేవాణ్ణి.

ఎనిమిదో తరగతి చదివే పిల్లాడికి అన్నం తినిపించటమేమిటని ఎవరో అంటే... గోవిందువాళ్ళ అమ్మగారు ‘‘ఇదిష్టం కాదూ, అది నచ్చదూ అని వంకలు పెడుతూ సరిగ్గా తినడు. ఇలా కథలు చెబుతూ తినిపిస్తే చక్కగా తినేస్తాడు. ఏదో విధంగా నాలుగు ముద్దలు తినిపిస్తే కొంచెం బలం పుంజుకుంటాడేమోనని నా ఆశ, తాపత్రయమూనూ’’ అని బదులు చెప్పటం నేనోసారి విన్నాను. 
అప్పుడప్పుడు వాళ్ళమ్మగారు గోవిందుతోపాటు నా నోటికీ ఓ ముద్ద అందిస్తే, నేనూ కథలో లీనమై అప్రయత్నంగా తినేసి, తర్వాత ‘ఇదేంటమ్మా, నాకు పెట్టారూ..?’ అంటే, ‘రెండు ముద్దలు ఎక్కువ తింటే ఏం కాదులే, పిల్లలకి ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది’ అనేవారు.

నాకిష్టమైన కూరలేమిటో కూడా వాళ్ళమ్మగారికి తెలుసు. అవి చేసినప్పుడు నన్నూ గోవిందుతోపాటుగా తినమనేవారు. నేను మొహమాటంగా వద్దంటే, ‘నా మాట కాదన్నావంటే, నేనూరుకోనంతే..!’ అంటూ చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి నవ్వు మొహంతో చూసేసరికి, ఇక కాదనకుండా తినేసేవాణ్ణి. ఇంటికెళ్ళాక ఆవిడెలా మొహంపెట్టి ఆ మాట అనేవారో అలాగే అనుకరించి అమ్మకు చూపించి బాగా నవ్వుకునేవాడిని కూడా! 
గోవిందు నాన్నగారు ఉపాధ్యాయులు.

కొంతమంది పేద పిల్లలకి చదువు చెప్పటం, వాళ్ళందరికీ గోవిందు అమ్మగారు భోజనాలు పెట్టటమూ నాకు తెలుసు. అన్ని పనులూ ఆమే స్వయంగా చేసుకుంటున్నా అలుపన్నదే తెలియనట్లుగా పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెదిరేది కాదు. గోవిందు వాళ్ళమ్మగారి విశేషాలన్నీ మా అమ్మకి చెప్పినప్పుడు ‘ఆమెదెంత చల్లని మనసో, ఎంత గొప్ప మనిషో’ అంటూ మెచ్చుకునేది.గోవిందు నాన్నగారి పేరు దక్షిణామూర్తిగారు. ఆయనకి పండితుడిగా పేరుండేది. అమ్మగారి పేరు దేవకి. అయితే అందరూ దేవమ్మగారని అనేవారు.

అమ్మగారికి పుట్టిన కవలపిల్లల్లో గోవిందు కాకుండా రెండో అబ్బాయి నెలరోజులకే చనిపోయాడట. దేవమ్మగారు ఒకసారి ఆ విషయం గుర్తుచేసుకుని ‘మీరిద్దరూ పక్కపక్కన కూర్చుని అన్నం తింటూంటే నాకు ఇద్దరు కొడుకులూ ఉన్నట్లుగా చాలా ఆనందంగా ఉంటుంది’ అన్నారు. అందుకేనేమో నాకు తెలియకుండానే నేనూ ‘అమ్మా’ అని పిలిచేవాడిననుకుంటా! ‘‘మీ అమ్మా నాన్నగారు ఎలా ఉన్నార్రా..?’’ గోవిందు ప్రశ్నతో జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాను. 
‘‘నాన్నగారు చనిపోయి ఏడెనిమిదేళ్ళు పైగానే అయింది. అమ్మ నా పెళ్ళయిన ఏడాదే ఎటువంటి అనారోగ్యం లేకుండా హఠాత్తుగా గుండెనొప్పితో వెళ్ళిపోయింది’’ దిగులుగా చెప్పాను. 
 
‘అయితే నీ శ్రీమతి ఉత్తమురాలైపోయిందన్నమాట!’’ అన్నాడు. 
‘అత్తలేని కోడలు ఉత్తమురాలు’ అనే సామెతను గుర్తుచేస్తూ వాడలా ఛలోక్తిగా అన్నాడేమోగానీ నాకు మాత్రం మనసు చివుక్కుమంది. అమ్మ అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయాననే వ్యథ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు.

గోవిందు వెంటనే సర్దుకుని సంజాయిషీ ఇస్తున్నట్లుగా మళ్ళీ అన్నాడు ‘‘వయసు మళ్ళినకొద్దీ పెద్దవాళ్ళకి చాదస్తం పెరిగిపోతుంది. మనం వాళ్ళని కనిపెట్టుకుని ఇంట్లో ఉండలేం. బయటనుంచి వచ్చిన కోడలు చూడాలి. ఎవరిదీ తప్పనటానికి వీల్లేని సమస్యలతో మనకి తలనొప్పి తప్పనిసరి అవుతుంది. ఇలాంటి గొడవలేవీ పడకుండా మీ అమ్మగారు ప్రశాంతంగా వెళ్ళిపోయారని అన్నానంతే. నా విషయమే చూడు... నాన్నగారు చనిపోయాక, ఆ ఇల్లు అమ్మేసి, అమ్మను నా దగ్గరకు తీసుకువచ్చానా... ఎప్పుడూ సంతోషంగా కనిపించదు. ఏవో కోరికలూ అసంతృప్తే’’ అంటూ నిట్టూర్చాడు.

చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండే రూపమే నాకు గుర్తు. ఇప్పుడు వయోభారంతో వచ్చే అనారోగ్యాలతో మనిషి మారిపోయారా... ‘అయ్యో’ అనుకున్నాను. 
‘‘అమ్మను చూసి చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, పద’’ అన్నాను. 
ఎందుకోగానీ, గోవిందు- ముందు కొంచెం ఇబ్బందిగా చూసి, ఒక క్షణం తర్వాత‘‘అలాగే’’ అన్నాడు. 
గోవిందు తన ఆఫీసు దగ్గర బస్సెక్కి, మా హాస్పిటల్‌కి దగ్గరగా ఉన్న బస్టాపులో దిగి, ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి నడిచి వెళ్తానని చెప్పాడు. ఇద్దరం కారులో బయలుదేరి వెళ్ళాం.

*             *              *

మేం వెళ్ళేసరికి గోవిందు కూతురు ముందు గదిలో కూర్చుని టీవీ చూస్తోంది. గోవిందు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నాన్నమ్మ ఇంట్లో లేదనే విషయాన్ని తలెత్తకుండానే కొంచెం చిరాగ్గా చెప్పింది. 
‘‘చూశావా... ఇదీ అమ్మ వరస. సాయంకాలాలు అలా తిరిగొస్తానంటూ వద్దన్నా వెళ్ళి చీకటిపడినా తొందరగా తిరిగిరాదు. మాకేమో కంగారుగా ఉంటుంది- చీకట్లో ఎక్కడైనా పడిపోతుందేమోనని. ఇలాంటి చికాకులు అనుభవించేవాళ్ళకే అర్థమవుతాయనుకో’’ అంటూ నిట్టూర్చాడు. ‘‘మళ్ళీ ఒకసారి కాఫీ తాగుదాం’’ అంటూ లోపలికి వెళ్ళాడు.

కూతురి ముందే గోవిందు తన తల్లి గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఏమోలే, వాడి బాధలు వాడివి. అనుభవించేవాళ్ళకే తెలుస్తుందని అందుకే అన్నాడేమో అనుకుంటూ పక్కనే కూర్చున్న గోవిందు కూతురితో మాటలు కలిపాను. పేరు మంజరి అనీ ఫిఫ్త్‌క్లాస్‌ చదువుతున్నాననీ చెప్పింది. ‘‘మీ నానమ్మగారితో కథలు చెప్పించుకుంటావా?’’ అనడిగాను.ఆ అమ్మాయి పెద్దలకిమల్లే పెదవుల్ని కొంచెంగా సాగదీసి మొహం చిట్లించింది. 
‘‘అయ్యో, నానమ్మ చెప్పే కథలు వినటమా... నాకు చాలా బోర్‌! ఎప్పుడోగానీ నేను నానమ్మతో మాట్లాడనే మాట్లాడను’’ అంటూ కొంచెం ముందుకు వంగి, స్వరం తగ్గించి ‘‘మా నానమ్మ బుద్ధి మంచిదికాదండీ. మా అమ్మని బాగా విసిగిస్తుంది. బయటకు వెళ్ళాలంటే, మేము వంట గదిలోని అలమారాలకి తాళాలు బిగించి వెళ్ళాల్సిందే. లేకపోతే డబ్బాలన్నీ వెతికి గందరగోళం చేసేస్తుంది’’ అంది.

ఆ అమ్మాయి మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. వయసు చిన్నదేగానీ, పెద్దల మాటతీరూ హావభావాల ప్రకటనా బాగా వంటబట్టించుకుంది. తల్లిదండ్రులు పెద్దవాళ్ళ పట్ల నిరసన చూపిస్తే, పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు కాబోలు! దేవమ్మగారి వయసు ప్రభావంతో వచ్చే అనారోగ్యాలతో ఎంత విసిగిపోయి ఉన్నాగానీ, చిన్నపిల్ల ముందు అది ప్రదర్శించటం మాత్రం తప్పని గోవిందుని హెచ్చరించాల్సిందే అనుకున్నాను. అంతలోనే గోవిందూ అతని శ్రీమతీ లోపలినుంచి వచ్చారు. ఆమె తన చేతిలోని ట్రే నుంచి కాఫీ కప్పును అందిస్తూ నావైపు చాలా ఉదాసీనంగా చూసింది.

ఆమె పేరు సరళ అని చెప్పి, గోవిందు నన్ను ఆమెకి పరిచయం చేశాడు. నేను డాక్టర్నని తెలియగానే ఆమె వదనంలోని ఉదాసీనత మాయమై, ఆదరం వచ్చి చేరింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆవిడ మనసులోని భావాలు ఏవైనాసరే దాపరికం లేకుండా మొహం మీదకు వచ్చేస్తాయన్నమాట! ‘‘డాక్టరు కాబట్టి రెండు చేతులా సంపాదన ఉంటుంది. మీ ఆవిడ అదృష్టవంతురాలు. ఏం కోరుకున్నా కాళ్ళ దగ్గరకే వచ్చిపడతాయి. ఏ లోటూ ఉండదు. చదువుకునే రోజుల్లో కొంచెం కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. జీవితం సుఖంగా ఉంటుంది. ఈ మాట ఎంతచెప్పినా మా చంటిదాని చెవికెక్కదు. వాళ్ళ నాన్నకిమల్లే అరకొర జీతాలతో సరిపెట్టుకునే జీవితమే దాని మొహాన రాసిపెట్టి ఉందేమో...’’ అంటూ నిట్టూర్చి, మళ్ళీ నాతో ‘‘నిజమేకదండీ... ఈ రోజుల్లో పెద్ద చదువులు చదివినవాళ్ళకే మంచి సంబంధాలు దొరుకుతాయి’’ అంది.

నిజమేనన్నట్లుగా తలూపాను. ‘‘మీకు గోవిందు చెప్పలేదేమోగానీ, హైస్కూలు రోజుల్లో మా క్లాసులో ఎప్పుడూ గోవిందే ఫస్టు. ఒక తెల్లకాగితం అంటించిన అట్టమీద పెద్ద పెద్ద అక్షరాలతో ‘గోల్డెన్‌ స్టార్‌’ అని రాసి, కింద క్లాసు ఫస్టు, స్టూడెంట్‌ పేరు, బంగారు రంగు కాగితంతో చేసిన స్టార్‌ ఉండేవి. ఆ అట్టని క్లాసు రూములో అతికించేవాళ్ళు. ఒక్కసారైనా గోల్డెన్‌ స్టార్‌ అనిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు ఫలితం దక్కేదికాదు, ఎప్పుడూ గోవిందే ఫస్టు వచ్చేవాడు మరి! మా క్లాసులో ఇంకో గోవిందరావు ఉండటంతో, అందరం వీడిని ‘గోల్డ్‌ గోవిందు’ అని పిలవటం అలవాటై, గోల్డ్‌ అనేది ఇంటిపేరుగా మారిపోయింది.’’ 
ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆమెకి చెప్పాను.

ఆవిడ గలగల నవ్వింది. 
‘‘అబ్బో... ఆ రోజుల్లో ఈయనగారి ఇంటిపేరు బంగారమా..!? చాలా బావుంది. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత వెతికినా వీసమెత్తు బంగారం అయినా దొరకదు. ఈ మాట ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదనుకోండి- మమ్మల్ని చూస్తేనే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది’’ పరిహాసంగా అంటున్నట్లుగా నవ్వు మొహంతోనే చెప్పింది.

ఆ తరవాత మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది. ‘‘తక్కువ నోములు నోచి, ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎలా వస్తాయి? అంతా రాత ప్రకారం జరిగిపోతుందేమో! కట్నంలేదనీ తెలిసినవాళ్ళనీ చిన్న వయసులోనే పెళ్ళి చేసేసి, చేతులు దులిపేసుకున్న మావాళ్ళను తప్పు పట్టాలిగానీ, ఇంకెవరినీ ఏమనుకోవటానికీ లేదు. నా వయసువాళ్ళందరూ ఈవేళా రేపూ అన్నట్లుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నాకేమో తొమ్మిదేళ్ళ పిల్ల. ఇంటి చాకిరీతో ఇంకో పదేళ్ళు పైబడినట్లుగా అయిపోయాను.’’

ఆమె మాటల్లోకి మనసులోని అసంతృప్తి అలా ప్రవహించేసింది. 
గోవిందు చెప్పిన తన ఉద్యోగ వివరాల ప్రకారం తనకి మంచి శాలరీనే వస్తోంది. 
ఆమె కోరికలకీ, ఆ ఆదాయానికీ లంకె కుదరటంలేదా..? మొదటి పరిచయంలోనే ఆమె అలా మాట్లాడటాన్ని ఏమనుకోవాలో నాకు అర్థంకాలేదు. కొంచెం అయోమయంగానే అనిపించింది. 
నేను లేచి నిలబడి గోవిందుతో ‘‘అమ్మ ఇంకా రాలేదుగా, మరోసారి వచ్చి కలుస్తా, వెళ్ళొస్తా’’ అన్నాను.

‘‘చానాళ్ళకు కలిశాం, భోజనం చేసి వెళ్ళొచ్చుగా’’ మర్యాద కోసం గోవిందు గొణిగినట్లుగా మెల్లగా అన్నాడు. 
నేనేదో అనబోతూండగానే గోవిందు కూతురు ఠకీమని అంది ‘‘నాన్నా, పొద్దుటి అన్నం కొంచెం ఉంటే, అది నానమ్మకిసరిపోతుందని, మన ముగ్గురికీ చపాతీలు చేయటానికి గోధుమపిండి కోసం నానమ్మని అమ్మ పంపించింది. ఇప్పటికింకా నానమ్మ రానేలేదుగా...’’వాళ్ళిద్దరూ క్షణకాలం తెల్లబోయి, తర్వాత ‘నువ్వూరుకో’ అని మంజరిని కసురుతూ ఏదో అనబోతుంటే, నేనే ‘‘ఇప్పుడేం వద్దు, మరోసారి వస్తాగా. ముందు మీరే మా ఇంటికి భోజనానికి రావాలి. మళ్ళీ ఫోన్‌ చేస్తాలే’’ అని బయటకు వచ్చేశాను. 
రెండిళ్ళ తర్వాత ఆ వీధిలోనే నా కారుకి ఎవరో పెద్దావిడ తడబడుతూ అడ్డం వచ్చింది. సడన్‌ బ్రేక్‌తో కారు ఆపాను. ఆమె కారు పట్టుకుని నిలబడేసరికి ఏమైనా దెబ్బలు తగిలాయోమోనని కంగారుపడుతూ కారు దిగి ముందుకు వెళ్ళాను.

ఆ మసక వెలుతురులో పరికించి చూసి వెంటనే ‘‘అమ్మా, మీరా...’’ ఆనందంగా అన్నాను. 
దేవమ్మగారు చాలా బలహీనంగా నీరసంగా కనిపించారు. నేను నా వివరాలన్నీ గడగడా చెప్పి, దెబ్బలేమీ తగల్లేదని తెలుసుకుని 
స్థిమితపడ్డాను. 
దేవమ్మగారు నన్ను గుర్తుపట్టనట్లే అనిపించింది. ఒక క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండి తర్వాత మెల్లగా ‘‘బాబూ... నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తానని అంటున్నావుగా, నేనొక పని చెప్పవచ్చా?’’ అనడిగారు. 
‘‘అదేమిటమ్మా అలా అంటున్నారు, చెప్పండి... ఆనందంగా చేస్తాను’’ అన్నాను.

ఆరోగ్యరీత్యా ఏవైనా టెస్టులూ అవీ చేయమని అడుగుతారేమో అనుకున్నా. కానీ, ఆమె మెడలోని చిన్న గొలుసు తీసి చూపిస్తూ ‘‘ఇది బంగారమే. దీన్ని అమ్మి, కొంచెం డబ్బుతో ఏవైనా తినుబండారాలు కొని నాలుగు ప్యాకెట్లుగా, మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందని చెప్పి, మా అందరికీ తెచ్చిస్తావా? మిగతా డబ్బు నీ దగ్గరే ఉంచు, తర్వాత తీసుకుంటాను’’ అనేసరికి నేను నిశ్చేష్ఠుడినైపోయాను.ఒక నిమిషానికి విషయం ఏమిటో అర్థమై మనసంతా వికలమైపోయింది.

‘‘ఏమిటమ్మా ఇది... ఈపాటి దానికి గొలుసు ఇవ్వాలా! ఆ మాత్రం నేను మీకు ఇవ్వకూడదా?’’ డగ్గుత్తికతో అడిగాను. 
‘‘నీ అంతట నువ్వు అభిమానంగా ఇచ్చేది కానుక అవుతుంది. కాదనటానికి లేదు. కానీ, నేనే అడిగి ఉచితంగా తీసుకుంటే యాచనే కదా! అది నాకు గౌరవం కాదు’’ ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నారు ‘‘పదిమంది పిల్లలకు విద్యాదానం చేసిన దక్షిణామూర్తిగారి ఇల్లాలిగా నేనూ ఒకప్పుడు ఎందరికో వండి వడ్డించినదాన్నే! కన్నకొడుకు దగ్గరైనా చేయి చాపటం నాకిష్టం ఉండదు. కానీ... కానీ... జిహ్వచాపల్యం అన్నది చూశావూ... మనుషుల్ని ఎంత దిగజారుస్తుందో అర్థంచేసుకో నాయనా!’’ హీన స్వరంతో అని ఆ గొలుసును నా చేతిలోపెట్టి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు.

షాక్‌ తగిలినవాడిలా రెండు క్షణాలు అలాగే నిలబడిపోయిన నేను కొంచెంగా తేరుకుని ఒక స్థిర నిశ్చయంతో గోవిందు ఇంటివైపుగా అడుగులు వేశాను. 
ఇంటి మెట్లు ఎక్కుతుండగానే ముందు గదిలోనుంచి సరళ నామధేయురాలైన గోవిందు శ్రీమతి కర్కశ స్వరం వినిపించింది. ‘‘గొలుసు ఎక్కడో పడిపోయి, ఎంత వెతికినా కనిపించలేదా..? ఈ నాటకాన్ని మేం నమ్మాలి. మీరు గట్టిగా అడగండి, మెత్తగా మాట్లాడితే లాభంలేదు. అసలు సంగతేమిటో ఎలా బయటకు రాదో చూస్తాను.’’ 
ముదురు మాటల మంజరి వెంటనే అందుకుంది ‘‘అమ్మా, మొన్న నువ్వు ఆ గొలుసును నాకిమ్మని నానమ్మతో అన్నావుగా... అందుకని నానమ్మ దాన్ని అమ్మేసి ఏదో కొనుక్కుని తినేసి ఉంటుంది.’’ 
గుమ్మం దగ్గర నిలబడిన నన్ను చూసి అందరూ ఉలిక్కిపడి తెల్లమొహాలు వేశారు.

లోపలి గది గుమ్మం దగ్గర దోషిలా దీనంగా నిలబడిన దేవమ్మగారి కళ్ళల్లో బెదురూ భయమూ తొంగి చూశాయి. గోవిందు చూపులు నేలవైపుకి తిరిగాయి. 
‘‘వీధిలో మీ ఇంటికి దగ్గర్లోనే, కారు ఎక్కుతూండగా రోడ్డుమీద కనిపించేసరికి, మీదే అయివుంటుందని అడుగుదామని వచ్చాను. బంగారు వస్తువు కూడా మెరుగు పోగొట్టుకుని ఇంతలా నల్లబడిపోతుందని ఇపుడే తెలిసింది. మురికి వదిలేలా మెరుగుపెట్టించు’’ అంటూ ఆ గొలుసును గోవిందుకు ఎదురుగా ఉన్న బల్లమీద పెట్టేశాను.

దేవమ్మగారి దగ్గరకు వెళ్ళి ‘‘అమ్మా, మీరు నా చిన్నప్పుడు నన్ను మీ రెండో కొడుకునని అనేవారు. ఆ అర్హతతో నా దగ్గరకు రమ్మని ప్రాధేయపడుతున్నాను. మీకు అవసరమైన వైద్యాన్ని నేను చేయగలను. మీరు కాదంటే, నేనూరుకోనంతే!’’ అన్నాను. ఆ చివరి మాటను అమ్మలాగే బుంగమూతితో నవ్వు మొహంతో అనాలనుకున్నానుగానీ వల్లకాలేదు. పెదవులపైకి చిరునవ్వు రాలేదు సరికదా... గుండెలో నుంచి దుఃఖం మాత్రం తన్నుకువచ్చింది. 
అమ్మ ఏమనుకున్నారోగానీ ఒకసారి గోవిందు వైపు తీక్షణంగా చూసి, తర్వాత నావైపు అభిమానంగా చూస్తూనే నా చేయి పట్టుకున్నారు.

నాకు చాలా ఆనందంగా అనిపించింది. భుజం చుట్టూ చేయివేసి అమ్మతో కలిసి నాలుగు అడుగులు వేసేసరికి గుమ్మం దగ్గర ఒక పక్కగా నిలబడిన గోవిందు 
‘‘ఏ బంధుత్వమూ లేకుండా అమ్మ 
అంటూ నువ్వు వెంటబెట్టుకుని వెళ్తే... 
మీ ఇంట్లోవాళ్ళు కాదంటే... ఆ పరిస్థితి గురించి ఆలోచించావా..?’’ అనడిగాడు. 
‘అమ్మకీ దుస్థితి ఏమిటి... గోవిందు ఎందుకిలా అయిపోయాడు?’ అంటూ నా మనసును వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం గోవిందు మాటల్లో దొరికినట్లయింది. 
గోవిందువైపు చురుగ్గా చూసి స్థిరంగానే చెప్పాను ‘‘మా ఇంట్లో నాకు అటువంటి పరిస్థితి ఎదురుకాదనే నమ్మకం పూర్తిగా ఉంది. ఒకవేళ ఎదురైతే మాత్రం... అమ్మకి అన్నం పెట్టటానికి అభ్యంతరం చెప్పే ఆవిడ... నాకు అర్ధాంగిగానూ

అంగీకారం కాదు. ఇక బంధుత్వం గురించి అంటావా... మనిషికీ మనిషికీ మధ్య మానవత్వం అనే బంధుత్వం ఉండనే ఉంటుంది. దానికి మనం ఎలా 
స్పందిస్తామనేది మన సంస్కారాన్నిబట్టి ఉంటుంది.’’ 
బయటకు వచ్చి కారు డోరు తీయబోతుంటే, భుజంమీద చేయి పడినట్లయి వెనక్కి తిరిగాను. 
గోవిందు నిలబడి ఉన్నాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.

‘‘నా సంపాదనతో సంతృప్తిలేని భార్యాపిల్లల్ని సంతోషపెట్టాలని తాపత్రయపడుతున్నానేగానీ... అమ్మ విషయంలో నేనెంత అలక్ష్యంగా ఉన్నానో... నీ వెంట అమ్మ 
రావటానికి సిద్ధపడినప్పుడే నాకు తెలిసి వచ్చింది. నీ మాటలతో నా మనసుకు పట్టిన మకిలి వదిలిపోయి అమ్మకు కావాల్సిందేమిటో, నేను చేయాల్సిందేమిటో అర్థమైంది. నన్ను మన్నించమని అమ్మకు చెప్పరా!’’ వాడి 
గొంతు బొంగురుపోయింది. నేను రెండు చేతులతో ఆప్యాయంగా వాడిని హత్తుకున్నాను. నీటితెర చేరిన నా కళ్ళకు మసకగా... గోవిందు వెనకే నిలబడిన వాడి శ్రీమతీ కూతురూ కనిపించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.