close
నీ కారు బంగారం కానూ...

ఒకప్పుడు రాజులు బంగారు రథాల్లో తిరిగేవారట. ఇప్పుడూ రాజసానికి కొదవలేని అపర కుబేరులు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. అయితే, అప్పట్లా ఇది రథాల కాలం కాదు, స్పోర్ట్స్‌ కార్ల యుగం. అందుకే, ఈతరం సంపన్నులు తమ ఖరీదైన కార్లూ బైక్‌లను బంగారంతో తాపడం చేయించేస్తున్నారు.

ధ్యతరగతి వాళ్లు బైకుల్లో తిరిగితే డబ్బున్నవాళ్లు కార్లలో తిరుగుతారు. అంతకన్నా సంపన్నులైతే కోట్ల విలువచేసే స్పోర్ట్స్‌ కార్లూ రోల్స్‌రాయిస్‌లూ కొంటారు. తరాలు తిన్నా తరగని సంపద ఉన్నవాళ్లు కూడా ఆ కార్లతోనే సరిపెట్టేసుకుంటే గొప్పేముందీ... అలాంటి కుబేరులు సృష్టించిందే ఈ బంగారు కార్ల ట్రెండ్‌.

అరబ్‌ దేశాల్లో వేసవి వస్తే చాలు, బ్రిటన్‌ రోడ్లమీద బంగారపు కార్లు పదుల సంఖ్యలో రివ్వున దూసుకుంటూ వెళ్తుంటాయట. దానికీ దీనికీ సంబంధం ఏంటంటే... పుత్తడి కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేది అరబ్బు షేక్‌లే. చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉండే సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌... లాంటి దేశాల్లో అత్యధికులు కోట్లకు పడగలెత్తినవారే. బీఎమ్‌డబ్ల్యూ లాంటి ఖరీదైన కార్లు ఒకటికి నాలుగు ఉండడం వారికి మామూలు విషయం. కాబట్టే అరబ్బు దేశాల్లోని రాజ కుటుంబీకులూ వేల కోట్లకు పడగలెత్తిన షేక్‌లూ తమ దర్పాన్ని నలుగురికీ చూపించుకునేందుకు కోట్ల విలువచేసే కార్లను కొని వాటికి బంగారంతో తాపడం చేయించడం మొదలుపెట్టారు. ఇక, వీళ్లు తమ దేశాల్లో వేసవి ఎండ తీవ్రతను తట్టుకోలేక ఏటా బ్రిటన్‌కు విహారయాత్రకు వస్తుంటారు. ఆ సమయంలో ‘రాజు వెడలె రవితేజములలరగ...’ అన్నట్లూ ఈ షేక్‌లు అనుచరులతోపాటు, తమ బంగారు కార్లను కూడా వెంట తీసుకెళ్తున్నారట. అదికూడా ఒకటీ రెండు కార్లు కాదండోయ్‌... సౌదీ రాజకుటుంబీకుడిగా చెప్పుకునే ‘తుర్కి బిన్‌ అబ్దుల్లా’ అనే యువకుడైతే 
ఏటా నాలుగు బంగారు కార్లను సౌదీ నుంచి లండన్‌కి తీసుకొస్తుంటాడు. అతడెక్కడికి వెళ్తే అక్కడికి బంగారు కార్ల కాన్వాయ్‌ వెళ్లాల్సిందే. రోల్స్‌రాయిస్‌ ఫాంటమ్‌ కూప్‌, రేంజ్‌రోవర్‌, మెర్సిడెస్‌ ఏఎమ్‌జి జీ 63, లాంబొర్గిని కంపెనీలకు చెందిన ఈ మొత్తం కార్ల విలువ 12కోట్ల రూపాయలకు పైమాటే. ఇక, వీటిని విమానాల్లో తీసుకొచ్చి తీసుకువెళ్లడానికి ఏటా సుమారు రూ.18 లక్షలు అదనం. అంతంత బంగారు కార్లు ఒకదాని వెంట ఒకటి రోడ్డుమీద వెళ్తుంటే చూడ్డానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, తుర్కి బిన్‌ కార్లను చూడ్డానికీ వాటితో సెల్ఫీలు తీసుకోవడానికీ ఎంతోమంది వస్తుంటారట. ఇన్నికాకపోయినా ఒకటీ రెండూ బంగారు కార్లున్నవాళ్లు అరబ్బు దేశాల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్లు కూడా ఏటా ఇలా బ్రిటన్‌, ఫ్రాన్స్‌లాంటి దేశాలకు తమ కార్లతో సహా టూర్లకు వెళ్తుంటారట. అన్నట్లూ ఈ బంగారు కార్లను కొనేవారికోసం లగ్జరీ కార్ల కంపెనీలు కూడా దుబాయ్‌లో మోటారు వాహనాల ఎక్స్‌పోల్లో ప్రత్యేకంగా పుత్తడి కార్లనూ బైకుల్నీ ప్రదర్శిస్తున్నాయి.

ఇతర దేశాల్లోనూ... 
ఈమధ్య ఈ పుత్తడి కార్ల ట్రెండ్‌ బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, భారత్‌, పాకిస్థాన్‌, జపాన్‌... ఇలా చాలా దేశాలకూ పాకింది.

ఆమధ్య పుణెకు చెందిన వ్యాపారవేత్త ‘సచిన్‌ ఖెసె’ కూడా తన 63లక్షల రూపాయల జాగ్వార్‌ కారుకి బంగారంతో తాపడం చేయించుకుని వార్తల్లోకెక్కేశాడు. ఎందుకలా... అంటే గొప్పకోసం కాదు, జాతకరీత్యా అని చేప్పేశాడు. పుణెకు దగ్గర్లోని పింప్రి చించ్‌వాడ్‌కి చెందిన సన్నీ వాగ్‌చౌరె కూడా తన బంగారు ఆడీ కారులో ఒంటి మీద కిలోల కొద్దీ బంగారంతో తిరుగుతూ స్థానికంగా సెలెబ్రిటీ హోదా సంపాదించేశాడు. అన్నట్లూ ఇతడు బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌కి స్నేహితుడు. అమెరికాకు చెందిన ర్యాపర్‌ ఫ్లో రైడా కూడా తన రూ.12 కోట్ల విలువైన బుగాటీ వెరాన్‌ కారుకి 24 క్యారెట్ల బంగారంతో మెరుపులద్దించాడు. హాలీవుడ్‌ నటుడు జామీ ఫాక్స్‌ బుగాటీ కారూ పుత్తడి పూత వేయించిందే. ఇలా బంగారు కార్ల యజమానుల్లో వివిధ దేశాల వ్యాపారవేత్తలతో పాటు హాలీవుడ్‌ సెలెబ్రిటీలూ అంతర్జాతీయ క్రీడాకారులెందరో ఉన్నారు.ఒకప్పుడు డబ్బుందని తెలియజేయడానికి ఒంటినిండా బంగారు ఆభరణాలు వేసుకునేవారు. వెండిదారాలతో నేసిన పట్టువస్త్రాలూ పాదరక్షలూ ధరించేవారు. కానీ ఈ కంప్యూటర్‌ కాలంలో ఎంత డబ్బున్నా పెళ్లిళ్లూ ఫంక్షన్లకు తప్ప ఆభరణాలు ధరించడంలేదు. అందుకే, ఉన్నతవర్గాల్లో దర్పాన్ని చూపించడానికి విలువైన ఫోన్లూ స్పోర్ట్స్‌ కార్లూ బైక్‌లే ప్రత్యామ్నాయం అవుతున్నాయి మరి. యువతకి కొత్తదనం అంటే ఎప్పుడూ ఆసక్తే. అందుకే, బైక్‌లకూ ఈ స్వర్ణకాంతులు అంటుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు కూడా ఈ తరహా బంగారు బైక్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. ఇలా కార్లకు బంగారాన్ని పూత పూయడానికి అయిదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందట.

పచ్చటి బంగారంతో చేసినవే కాదు, అరబ్బు దేశాల్లో తీవ్రంగా ఉండే వేసవి ఎండల్ని తప్పించుకునేందుకు కార్లకు వైట్‌గోల్డ్‌ని కూడా పూతగా వేస్తుంటారు. ఏమైనా... ఈ బంగారు కార్ల ధగధగలు చూడ్డానికి రెండు కళ్లూ 
సరిపోవనడం అతిశయోక్తి కాదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.