close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనాథలకు అమ్మ ఒడి..!

వైద్యవిద్యార్థిగానే పేదలకోసం పనిచేయడం మొదలెట్టిన సత్యప్రసాద్‌ని ఓ ప్రశ్న అనునిత్యం వేధించేది. ‘అమ్మానాన్నలుండి అన్నీ చూసుకుంటుంటేనే పిల్లలు చదువుకుని పైకి రావడానికి నానా అవస్థా పడతారు. అలాంటిది ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏమిటీ’ అని. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ‘హీల్‌’...అండాదండా లేని చిన్నారులకు బడీ, గుడీ, అమ్మ ఒడీ..!

చిన్నారి జ్యోతికి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. ఊహ తెలిసినప్పటినుంచీ అమ్మా అమ్మమ్మా ఇళ్లల్లో పాచిపనులు చేస్తుంటే తాను తమ్ముణ్ణి పట్టుకునేది. తమ్ముడు కాస్త పెద్దవాడు కాగానే ఇద్దరూ కలిసి చుట్టుపక్కల ఇళ్లలో పేపర్లూ పాలపాకెట్లూ వేసేవారు. ఇంతలో ఓ రోడ్డు ప్రమాదం అమ్మనీ అమ్మమ్మనీ పొట్టనపెట్టుకుంది. పలకరించే దిక్కులేని పరిస్థితుల్లో మిగిలిన ఆ పిల్లలిద్దరూ మరొకప్పుడైతే ఏమయ్యేవారో కానీ ఇప్పుడు మాత్రం చక్కగా చదువుకుంటున్నారు. జ్యోతి అండర్‌ 14 జాతీయ ఖోఖో జట్టుకి ఎంపికై నెల్లూరులోని స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది.

అమ్మానాన్నలిద్దరూ అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. అమ్మమ్మాతాతయ్యలు అంతకుముందే పోయారు. ‘నా’ అంటూ చెప్పుకోడానికి మిగిలింది ఒక్క నాన్నమ్మే. కానీ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచగల శక్తిగానీ స్తోమతగానీ ఆ వృద్ధురాలికి లేదు. దిక్కులేక రోడ్డునపడ్డ ఆ చిన్నారులు నాగమల్లిక, నాగదుర్గ ఇప్పుడు ఓ అమ్మ ప్రేమనూ తోబుట్టువుల అనురాగాన్నీ అందుకుంటూ మంచి స్కూల్లో చదువుకుంటున్నారు.

వయసులో ఉన్న ఆడపిల్ల. దేవుడే అన్యాయం చేసి మనోవైకల్యాన్నిస్తే కన్నవారు రోడ్డున వదిలేసి చేతులు దులుపుకున్నారు. మంచీ చెడూ తెలియని ఆ అభాగ్యురాలిని క్షణికోద్రేకం తీర్చుకోడానికి ఎవరో వాడుకున్నారు. ఫలితంగా గర్భవతి అయింది. జాలి తలచి వాళ్లూ వీళ్లూ పెట్టింది తింటూ తొమ్మిది నెలలూ బిడ్డను మోసింది. దయగల తల్లులు నలుగురు కలిసి పురుడు పోశారు. తన బతుకే తనకు చేతకాని ఆ తల్లి కన్నబిడ్డను ఎలా పోషిస్తుంది? అయినా ఆ బిడ్డ అనాథ కాలేదు. మరో తల్లి నీడన పెరుగుతూ అక్షరాలు దిద్దుతున్నాడు.

అనాథల్లా రోడ్డున పడాల్సిన ఇలాంటి ఎందరో పిల్లల జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరిగి, మమతల ఒడి చేరి, చదువుల బాటపడుతున్నాయి... అందుకు కారణం ఒక స్వచ్ఛంద సంస్థ. కొన్ని వందల మంది అనాథలకి అమ్మ ప్రేమని అందిస్తోంది. మనసుకైన గాయాల్ని మాన్పుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి తమ కాళ్లమీద తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది. అదే ‘హీల్‌’(హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌). యాభై ఏళ్ల క్రితం ఓ వైద్యవిద్యార్థి మదిలో మెదిలిన చిన్న ఆలోచన జగమంత కుటుంబంగా ఎదిగి సేవలందిస్తున్న విధానం ఆసక్తికరం...అభినందనీయం.

విద్యార్థి దశలోనే... 
గుంటూరుకు చెందిన కోనేరు సత్యప్రసాద్‌ ఎంతో ఇష్టంతో వైద్యవిద్యలో చేరారు. చేరిన నాటి నుంచీ సమాజానికి సేవ చేయాలన్న ఆరాటం నిలవనిచ్చేది కాదు. తోటి విద్యార్థులతో కలిసి ప్రజా సేవాసమితి పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేశారు. దాని ఆధ్వర్యంలో వైద్య కళాశాల అధ్యాపకులూ స్థానిక వైద్యుల సహాయంతో పేదల వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించేవారు. రిక్షా కార్మికుల్లాంటి నిరుపేదలు నెలకు రూపాయి కడితే చాలు- కావలసిన వైద్యం అందించేవారు. పుస్తకాలను సేకరించి పేదవిద్యార్థులకు పంచేవారు. అలా అవసరమైనవారికి చేతనైన రీతిలో సేవలందిస్తూనే వైద్య విద్య పూర్తిచేసి పై చదువుకు ఇంగ్లాండ్‌ వెళ్లారాయన. అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నా స్వదేశంలోని పరిస్థితుల్ని మర్చిపోలేదు. తనలోని సేవాభావాన్నీ మరుగున పడనీయలేదు. పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ‘హీల్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. 1993లో ‘హీల్‌ ఇండియా’ శాఖ ఆధ్వర్యంలో మనదేశంలో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భావసారూప్యం ఉన్న మరికొందరినీ కలుపుకుని అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లలోనూ శాఖలు ఏర్పాటుచేసి విరాళాలు సేకరించి ఈ సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇంగ్లండ్‌లో వైద్యుడిగా కొనసాగుతున్న సత్యప్రసాద్‌ ఏడాదికి రెండుసార్లు తప్పకుండా భారత్‌ వస్తారు. రెండు మూడు నెలలు ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటారు. మిగతా సమయాల్లో ఆయన సోదరి లక్ష్మి ‘హీల్‌’ కార్యదర్శిగా బాధ్యతలు చూసుకుంటారు. ఇక వారికి అండగా ఉండి సేవలందిస్తున్న సేవాభిలాషులకు లెక్క లేదు.

‘అంకిత’ నుంచి ‘హీల్‌ విలేజ్‌’ దాకా... 
డాక్టర్‌ సత్యప్రసాద్‌ మొదట గుంటూరులోని తన సొంతింటిలోనే ‘అంకిత’ పేరుతో ఓ ఆశ్రయాన్ని ఏర్పాటుచేశారు. అనాథ బాలబాలికల్ని చేరదీసి వారికి తిండీ బట్టా వసతీ  కల్పించేవారు. ప్రేమగా పెంచేవారు. ఏడాది తిరిగేసరికే పిల్లల సంఖ్య పెరిగిపోయి ఇల్లు ఇరుకై పోయింది. అప్పుడు చోడవరంలో నాలుగెకరాల స్థలం కొని ‘హీల్‌ విలేజ్‌’ నిర్మించారు. అది ఏర్పాటుచేసేటప్పుడు ఆయన మనసులో గట్టిగా చెప్పుకున్న సంకల్పం ఒక్కటే... అనాథ పిల్లలు కదా అని మొక్కుబడిగా చేయకూడదని. అందుకే ‘హీల్‌ విలేజ్‌’ కట్టేటప్పుడే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి పదిమంది పిల్లలకూ ఒక కుటీరం ఉండేలా, అందులో వారిని ప్రేమగా కనిపెట్టుకుని ఉండడానికి ఓ అమ్మ ఉండేలా ఏర్పాటుచేశారు. దాంతో ప్రతి కుటీరమూ పిల్లలెక్కువున్న ఓ ఇల్లులా ఉంటుంది తప్ప అనాథాశ్రమమన్న ఆలోచనే రాదు. పిల్లలు తల్లీ తోబుట్టువుల ప్రేమా ఆప్యాయతల నడుమ ఆడుతూ పాడుతూ పెరుగుతారు. 26 మందితో ప్రారంభమైన హీల్‌ విలేజ్‌లో ఇప్పుడు 225 మంది పిల్లలున్నారు. టీనేజ్‌లోకి వచ్చిన మగపిల్లల కోసం విడిగా మరో హాస్టల్‌ కట్టారు. వారిని పర్యవేక్షించడానికి వార్డెన్లు ఉంటారు. వీళ్లంతా సమీపంలోని ఎయిడెడ్‌ పాఠశాలలో చదువుకుంటున్నారు. గత పాతికేళ్లలో దాదాపు ఐదువందల మంది ఇక్కడ పెరిగి పెద్దవారై తమ కాళ్ల మీద తాము నిలబడగల స్థితి వచ్చాక బయటకు వెళ్లిపోయారు. మూడు నెలల పాపగా ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకుని ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది ఓ యువతి. అలా వెళ్లినవారంతా సెలవుల్లో కుటుంబంతో గడపడానికి మళ్లీ హీల్‌ విలేజ్‌కి వస్తుంటారు. పెంచిన అమ్మలతో, తోటివారితో సరదాగా గడిపివెళ్తారు.

కృష్ణా జిల్లాలో ‘ప్యారడైజ్‌’! 
హీల్‌ విలేజ్‌ తరహా సేవల్ని మరింతగా విస్తరించే క్రమంలో రూపుదిద్దుకున్నదే ‘హీల్‌ ప్యారడైజ్‌’. పేరుకు తగ్గట్టే పచ్చని తోటలో వెలసిన మమతల ఒడి అది. కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో చుట్టూ కొండలూ ఓ పక్కగా పెద్ద చెరువూ కాలువలతో అలరారుతున్న అందమైన ప్రకృతి మధ్య 27 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ ప్యారడైజ్‌ని ఆవిష్కరించారు. ఇక్కడ కట్టిన వసతిగృహాల్లో 550 మంది పిల్లలున్నారు. ఒక్కో భవనంలో 40 మంది చొప్పున ఉండేలా వాటిని తీర్చిదిద్దారు. తల్లుల్లా వారి బాగోగులు చూసుకునేవారూ ఆ వసతి గృహాల్లోనే ఉంటారు. ఏ ఆధారమూ లేని మహిళలకు శిక్షణ ఇచ్చి పిల్లల బాధ్యతలు అప్పజెబుతున్నారు. కాస్త పెద్దపిల్లలు వార్డెన్ల సంరక్షణలో ఉంటారు. పసి పిల్లలు వచ్చినా చూసుకోడానికి వీలుగా ఇక్కడ కూడా కుటీరాలు కట్టారు కానీ ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఆరేళ్లు దాటిన పిల్లల్నే ఇక్కడ చేర్చుకుంటున్నారు. పిల్లలు చదువుకోవడానికి బయటకు వెళ్లనక్కరలేకుండా అక్కడే ఓ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలనూ కట్టారు. ఉపాధ్యాయులు కూడా చాలామంది ప్రాంగణంలోనే ఉంటారు. తరగతికి 25 మంది పిల్లలే ఉంటారు. కార్పొరేట్‌ పాఠశాలలకు తీసిపోని రీతిలో అక్కడ కంప్యూటర్‌ ల్యాబ్‌Ëతోపాటు సైన్సు ప్రయోగశాలలూ గ్రంథాలయం లాంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. కళలూ క్రీడలూ... పిల్లలకు ఏది ఆసక్తి ఉంటే అది నేర్చుకోవచ్చు. ఇక్కడి విద్యార్థులు కొంతమంది క్రీడాపాఠశాలకు ఎంపికవడం విశేషం. స్కూల్‌ రేడియోను పిల్లలే నిర్వహిస్తారు. వారు రూపొందించే కార్యక్రమాలు ఆన్‌లైన్లో ప్రసారమవుతాయి. సెలవుల్లో పిల్లలను విహారయాత్రలకూ క్షేత్రస్థాయి పర్యటనలకూ తీసుకెళ్తారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు! 
రకరకాల కారణాలవల్ల పిల్లలు అనాథలైన వార్తలు పత్రికల్లో చదివినా లేదా ఎవరైనా చెప్పినా ‘హీల్‌’ కార్యకర్తలు వెంటనే అక్కడికి వెళ్లి సంబంధీకులతోనూ, అధికారులతోనూ మాట్లాడి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తారు. కొంతమంది పరిచయస్తుల ద్వారానూ అనాథ బాలబాలికలు హీల్‌ ప్యారడైజ్‌కి  చేరుతుంటారు. పిల్లల విషయంలోనే కాదు, నిర్వహణపరంగానూ ‘హీల్‌ ప్యారడైజ్‌’కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ వినియోగించే కూరగాయల్లో చాలావరకూ 
ప్రాంగణంలో సేంద్రియ పద్ధతుల్లో పండించుకున్నవే. తడి పొడి వ్యర్థాలను వేరుచేసి ఎరువును స్వయంగా తయారుచేస్తున్నారు. రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌... అన్న పర్యావరణ పరిరక్షణ సూత్రాన్ని అక్షరాలా ఆచరిస్తున్నారు. రాష్ట్ర గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ పచ్చదనానికి ఇచ్చే అవార్డుల్లో ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో రెండో స్థానం ‘హీల్‌ ప్యారడైజ్‌’కి దక్కింది. ఇక్కడి వంటశాల పూర్తిగా సౌరశక్తితో నడుస్తోంది. 
ఇక్కడి పిల్లలు ఆటల్లో చూపుతున్న ప్రతిభను చూసి ముచ్చటపడిన ఓ దాత అత్యాధునిక ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి పూనుకున్నారు. 

ప్రతిభకు బాసట‘హీల్‌’ సేవలు అనాథ పిల్లలకే పరిమితం కాదు. పై చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయమూ అందిస్తోంది సంస్థ. ఇలా చేయూత అందుకుంటున్నవారిలో ఇద్దరు సీఏ, ముగ్గురు ఇంజినీరింగ్‌, ఒకరు బీఎస్‌సీ, ఒకరు మెడిసిన్‌ చదువుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని 15 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఐదువేల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు సరఫరా చేయడంతోపాటు పాఠశాలలకు బల్లలు, క్రీడా పరికరాలు, కంప్యూటర్లు కూడా అందిస్తున్నారు. రెండేళ్ల క్రితమే అంధుల కోసం ఓ ప్రత్యేక విభాగాన్నీ ప్యారడైజ్‌లో ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం 20మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి బ్రెయిలీలో విద్యాబోధన చేస్తూ వృత్తివిద్యల్లోనూ శిక్షణ ఇస్తున్నారు.

ఉచిత సేవలెన్నో! 
పోలియో బారినపడో, ప్రమాదానికి గురయ్యో కాళ్లు కోల్పోయినవారికి ‘హీల్‌’ కృత్రిమ అవయవాలు అందజేస్తోంది. ఫలానా వారికి అవసరం ఉందని తెలియగానే సంస్థ అంబులెన్స్‌ వారి ఇంటికి వెళ్లి రోగిని తీసుకొచ్చి, కాలు అమర్చాక మళ్లీ తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపుతుంది. ఎవరికైనా శస్త్రచికిత్స అవసరమైతే అది కూడా సంస్థ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. ఒక్కొక్కరికీ 36 వేల రూపాయల ఖర్చయ్యే కృత్రిమ కాళ్లను దాదాపు 70 మందికి అమర్చారు. ఎక్కువమందికి సేవలందించేందుకు వీలుగా కృత్రిమకాళ్ల తయారీకేంద్రాన్ని సంస్థలోనే నెలకొల్పారు. అలాంటి అవయవాలు అమర్చుకున్నవారికి వాటి నిర్వహణ విషయంలోనూ జీవితకాలం సంస్థ అండగా ఉంటోంది. 
నిరుద్యోగ యువతకు వసతి, భోజన ఏర్పాట్లు చేసి వృత్తివిద్యల్లో శిక్షణ ఇస్తోంది హీల్‌. ఇప్పటివరకు కొన్ని వందల మంది ఇక్కడ శిక్షణ పొందారు. ప్యారడైజ్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆసుపత్రిలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్యసేవలు లభిస్తున్నాయి. సాధారణ ఫిజీషియన్‌తో పాటు కంటి, దంతవైద్య నిపుణులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఈ సేవాకేంద్రాలన్నిటినీ ప్రాంగణంలో ఒక పక్కగా ఏర్పాటుచేశారు. 

ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం భద్రాచలం కేంద్రంగా ‘హీల్‌’లో ఓ విభాగం పనిచేస్తోంది. అక్కడి పాఠశాలలో చదువుకుంటున్న 356 మంది గిరిజన విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందజేయడమే కాక మధ్యాహ్న భోజన వసతీ కల్పిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో సంస్థ సహాయంతో 160 మంది గిరిజన బాలబాలికలు పదో తరగతి పూర్తిచేశారు.

*         *          *

అన్నదానం, విద్యాదానం, ఆర్థిక సాయం... సేవాభిలాష ఉండాలే కానీ ఏదైనా చేయొచ్చు. కానీ వాటన్నిటితోపాటూ అమ్మానాన్నల బాధ్యతనూ తీసుకోవడం అంటే... అందుకు చాలా పెద్ద మనస్సుండాలి. తన, పర భేదం చూపని మంచితనం ఉండాలి. 
అవి నిండుగా ఉన్నాయి కాబట్టే ‘హీల్‌’ నిర్వాహకులు వందలాది పిల్లలకు అమ్మలా ప్రేమను పంచుతూ నాన్నలా అండగా నిలుస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

 

 

- వేములపల్లి వెంకట సుబ్బారావు, ఈనాడు, అమరావతి 
ఫొటోలు: ఎం.పి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌

పరిస్థితులే కదిలించాయి!

‘గుంటూరులో మెడిసిన్‌ చదువుతున్నప్పుడు చుట్టూ సమాజంలో ఉన్న పేదరికమే నన్ను ఆలోచింపజేసింది. అష్టకష్టాలు పడి అయినా పరిస్థితులకు ఎదురీదేవారిని చూసినప్పుడు వారికి కాస్త సాయం అందితే ఎంత బాగుంటుందన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపించింది. అప్పుడైనా, ఇప్పుడైనా నా కుటుంబమూ స్నేహితులూ నాతోపాటు చదువుకున్నవారూ బంధువులూ అందరూ చేయీ చేయీ కలిపి నా వెన్నంటి నిలవడంతోనే ఇవన్నీ చేయగలిగాం. వారి సహాయం లేకుండా మాత్రం సాధ్యమయ్యేది కాదు. ఎవరికో సేవ చేస్తున్నానన్న భావన కాదు, చేస్తున్న పని వల్ల నాకు లభిస్తున్న సంతృప్తీ సంతోషం నేనీ మార్గంలో ముందుకు సాగడానికి ప్రేరణ అవుతున్నాయి. ‘అనాథలకు ఇంత అవసరమా’- అంటుంటారు కొందరు ‘హీల్‌’ కార్యక్రమాలు చూశాక. వాళ్లని మన పిల్లలుగా భావిస్తే ఆ ప్రశ్నే తలెత్తదు. మన పిల్లల్ని మనం ఎంత కష్టపడి అయినా ఉన్నంతలో బాగా పెంచాలనుకుంటాం. అలాగే మేం వాళ్లకి చేస్తున్నాం. అమ్మానాన్నల్ని కోల్పోవడమంటే... జీవితంలో అన్నీ కోల్పోయినట్లే. అంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి సేవచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాను. ఈ పిల్లలంతా బాగా చదువుకుని తమ కలలని పండించుకోవడానికీ మంచి మనుషులుగా ఎదగడానికీ అవసరమైనవన్నీ మేం చేస్తాం. ఈ ప్రాజెక్టుని ఒక నమూనాగా భావించి ఎక్కడైనా ఎవరైనా అనుసరించేలా ఉండాలన్నదే మా తాపత్రయం. ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కనీసం పదివేల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది మా లక్ష్యం. అంచెలంచెలుగా దాన్ని సాధిస్తాం’.
- డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్

నిధులూ సేవలూ... అన్నీ స్వచ్ఛందమే!

వందలాది పిల్లలకు వసతి, భోజన, విద్యాసౌకర్యాలు కల్పించడానికి కోట్లలోనే ఖర్చవుతుంది. అభినందించదగ్గ విషయమేంటంటే సంస్థ నిర్వహణకు కావలసిన నిధులన్నీ విరాళాల రూపంలో లభిస్తున్నాయి. ‘హీల్‌’ నిర్వహణలో పాలుపంచుకుంటున్నవారంతా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. నిర్వహణలో ఎక్కడా ఒక్క పైసా వృథా కాదు. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు చేసి పదవీ విరమణ పొందినవారూ వ్యాపార, పారిశ్రామికవేత్తలూ ప్రత్యేక శ్రద్ధతో సొంత వాహనాల్లో వచ్చి సంస్థ నిర్వహణలో పాలుపంచుకోవడం విశేషం. తన కన్నబిడ్డలు ఇద్దరే అయినా ఇక్కడ ఉన్న 550 మంది పిల్లలూ తన పిల్లలేనంటారు ప్యారడైజ్‌ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ పిన్నమనేని ధనప్రకాశ్‌. పిల్లల్లోనే దేవుడిని చూస్తానంటారు సీఈవో అజయ్‌కుమార్‌.  ఇక విరాళాల విషయానికి వస్తే ఒకరూ ఇద్దరూ కాదు... కొన్ని వందల మంది వైద్యులూ వృత్తినిపుణులూ ప్రవాసాంధ్రులూ ‘హీల్‌’కి భూరి విరాళాలను సమకూరుస్తున్నారు. కొందరు భవనాలు నిర్మించి ఇస్తే కొందరు పిల్లల్ని దత్తత తీసుకుని వారికయ్యే ఖర్చంతా భరిస్తున్నారు. మరి కొందరు నగదురూపంలో విరాళాలిచ్చి పెద్దమొత్తంలో కార్పస్‌ఫండ్‌ సమకూరడానికి తోడ్పడ్డారు. సంస్థ లక్ష్యాలూ పనితీరు పట్ల వారికి ఎంత నమ్మకమంటే- అమెరికాలో స్థిరపడిన ఓ వైద్యుడు ‘హీల్‌ ప్యారడైజ్‌’లో ఓ భవనం నిర్మించడానికి ఆర్థిక సహాయం అందించారు. పదవీ విరమణ చేసిన ఆయన భవిష్యత్‌ అవసరాల కోసం కొంత డబ్బు ఉంచుకున్నారు. ప్యారడైజ్‌లో సిబ్బందికోసం క్వార్టర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలియగానే ఆ డబ్బునీ ఇచ్చేసి మళ్లీ పనిచేయడం మొదలెట్టారట. పలువురు విదేశీయులు కూడా దాతలుగా ఉన్నారు. వారంతా ఏడాదికోసారైనా ఇక్కడికి వచ్చి కె•న్నాళ్లు పిల్లలతో గడుపుతుంటారు. వారికి ఇంగ్లిష్‌, లైఫ్‌ స్కిల్స్‌ లాంటివి నేర్పిస్తుంటారు. సంస్థను సందర్శించిన వారెవరూ ఏదో ఒక రీతిలో సాయం అందించకుండా వెళ్లలేరు. అంతగా స్ఫూర్తినిస్తుంది ‘హీల్‌ ప్యారడైజ్‌’ పనితీరు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.