close
మిత్రమా... జర భద్రం!

 

కాస్త దూరం అయినా పర్వాలేదు, పది నిమిషాలు ఆలస్యమైనా ఏమీ కాదు, రోడ్డుమీద ఎక్కడోచోట యూ టర్న్‌ ఉంటుంది. వెనక్కి తిరిగి రావచ్చు. కానీ, జీవితంలో ఉండదు. ఒకసారి ప్రమాదం అంటూ జరిగితే ఇక ఆ తర్వాత జీవితం మామూలుగా మాత్రం ఉండదు. అందుకే- తొందరపడకండి. నిదానంగా వెళ్లండి. క్షేమంగా తిరిగి రండి. పెద్దలు చెప్పే నీతిపాఠమో పోలీసుల ప్రకటనో కాదిది... బాధిత కుటుంబాలు చెబుతున్న అనుభవపాఠం. మనదేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవం!

(ఈరోజు రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినం)

ఓ ఉమ్మడి కుటుంబంలో ముద్దుల మనవరాలు ఆ పాప. కొత్తగా పెద్ద స్కూల్లో చేరింది. ఆమె సంబరాన్ని అమ్మతోపాటు తాతయ్యా, ఇద్దరు బాబాయిలూ పంచుకోవాలనుకున్నారు. బడి కాగానే కారులో ఇంటికి తీసుకొస్తూ పాప చెప్పే కబుర్లు నవ్వుతూ వింటున్నారు. ఆ మూడుతరాల వారి మురిపెం మర్నాడు పత్రికల్లో పతాకశీర్షిక అవుతుందని వారికి తెలియదు. ఒకే ఒక్క క్షణం... ఏం జరిగిందో తెలియకుండానే ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆస్పత్రిలో పదిరోజులు మృత్యువుతో పోరాడి ఆ పసిప్రాణమూ ఓడిపోయింది. అది విని అప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్న తాత గుండె ఆగిపోయింది. జరిగినదాంట్లో వారి తప్పేం లేదు. ఎక్కడినుంచో దూసుకొచ్చిన మరో కారు వారి కారు మీద పడింది. మొత్తం కుటుంబమే తలకిందులైపోయింది. 
‘అన్నయ్య స్కూలుకు వెళ్తున్నాడు. టాటా చెబుదాం రమ్మ’ంటూ రెండేళ్ల బుడతడిని చంకనేసుకుని రోడ్డు మీదికి వచ్చింది ఓ తల్లి. స్కూలు బస్సెక్కుతున్న కొడుక్కి బ్యాగు అందించడానికి చంకలో పిల్లాడిని కిందికి దించింది. పుస్తకాల సంచీ, టిఫిన్‌ డబ్బా అందించి, జాగ్రత్తలన్నీ చెప్పి, కొడుకు లోపలికి వెళ్లి కూర్చునేదాకా కళ్లనిండుగా చూసుకుని టాటా చెప్పింది. బస్సు కదిలింది. అంతలోనే ఏదో చప్పుడు... చూస్తే బస్సు చక్రం కింద నలిగి రక్తపు మడుగులో చిన్న కొడుకు. ఆ తల్లి గుండె చెరువయ్యింది. 
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడడం తమకెటూ తప్పలేదు. పిల్లలనైనా బాగా చదివించాలనుకున్నారు ఆ పల్లెల్లోని తల్లిదండ్రులు. పట్టణంలోని ఇంగ్లిష్‌ మీడియం కాన్వెంట్‌లో చేర్పించారు. రోజూ పొద్దున్నే లేచి వంటలు చేసి టిఫిన్లు సర్ది బస్సెక్కించేవారు. తాము పొలాలకు వెళ్తూ రేపు బిడ్డలు పెద్దవాళ్లయి చేయబోయే ఉద్యోగాల గురించి ఎన్నో ఊహలల్లుకునేవారు. రైలు రూపంలో మృత్యుదేవత పొంచిఉందనీ తమ చిట్టితండ్రులు మాంసపు ముద్దలుగా తిరిగొస్తారనీ కలలో కూడా అనుకోలేదు. కన్నుమూసి తెరిచేలోపు పాతిక పసిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

దేవుడి దర్శనానికని కొందరూ, రకరకాల పనుల మీద కొందరూ త్వరగా ఊరు చేరాలని బస్సెక్కారు. చోటు లేకున్నా సర్దుకున్నారు. తప్పదు మరి. ఉద్యోగాలకీ కాలేజీలకీ వెళ్లే సమయమూ అదే... అందరికీ పనులవ్వాలి. అందుకే అందరూ ఆ బస్సే ఎక్కారు. కానీ అది వారిని గమ్యం చేర్చలేదు. రోడ్డు మీదినుంచి లోయలోకి దూసుకెళ్లి ఏకంగా పైలోకాలకే పంపేసింది. ఒకటీ రెండూ కాదు... డెబ్బై కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడ్చాయి. ఏం లాభం? పోయిన ప్రాణం తిరిగిరాదని వారికీ తెలుసు. 
ఆఫీసుకు టైమైపోతోంది. ట్రాఫిక్‌ని తప్పించుకుంటూ నేర్పుగా బండి నడుపుతూ వెళ్తుంటే జేబులో సెల్‌ మోగింది. ఎవరు చేశారో ఎందుకు చేశారో- ఓ చేత్తో బండి నడుపుతూ మరో చేత్తో ఫోను తీసి భుజానికీ మెడకీ మధ్య ఇరికించి వంచిన తలతో వంకరగా రోడ్డును చూస్తూ స్నేహితుడికి సాయంకాలం కలుసుకుంటానని హామీ ఇస్తూండగా జరిగిందది... అంతే. మరో గంట తర్వాత విరిగిన కాళ్లూ చేతులతో వంటి మీద స్పృహలేకుండా ఆస్పత్రి మంచం మీద ఉండాలా పోవాలా అంటూ కొట్టుమిట్టాడుతోంది ప్రాణం. 
ఇలా చెప్పుకుంటూ పోతే పదినిమిషాలకు మూడు ప్రాణాల చొప్పున ఒక్క మన దేశంలోనే రోజుకు 400 మంది గురించి చెప్పుకోవాలి. పత్రికల్లో నేరవార్తల పేజీల్లో ఒకటీ రెండు పేరాగ్రాఫుల వార్తలాగా నిత్యం కన్పించే ఘటనలే ఇవన్నీ. చదివి, అయ్యో అనుకుని పేజీ తిప్పేస్తాం. పేజీతో పాటే మనసూ మళ్లుతుంది. కానీ, కాలు విరిగో చేయి తెగిపోయో నెలల తరబడి ఆస్పత్రిపాలైన వాళ్లూ, వైద్యం కోసం అప్పులపాలైనవాళ్లూ, వెన్నెముక నలిగిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైనవాళ్లూ, చేతికందివచ్చిన చెట్టంత కొడుకునో కూతురినో కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిన అమ్మానాన్నలూ, సంపాదించి పెట్టే ఒక్క ఆధారాన్నీ కోల్పోయి దిక్కూ మొక్కూ లేకుండా మిగిలిన తల్లీబిడ్డలూ- అలా పేజీ తిప్పేయగలరా? రోజులూ నెలలూ కాదు, ఏళ్ల తరబడి ఆ గాయం వారిని బాధిస్తూనే ఉంటుంది. ఆ ఒక్క క్షణం... అలా జరక్కుండా ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటూ వాళ్లు అనుభవించే వేదనని గుర్తు చేయడానికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ నవంబరు మూడో ఆదివారాన్ని సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నాయి. రోడ్డుప్రమాదాల నివారణపై దృష్టిపెడుతున్నాయి.

 

తప్పెవరిది? 
అసలు రోడ్డు ప్రమాదాలకు కారణమెవరు? నూటికి తొంభై సంఘటనల్లో- సమాజమే... సమాజంలోని మనమే! మిగిలిన పది శాతం ప్రమాదాలకు మాత్రమే రోడ్డూ లేదా వాహనాలూ కారణాలు. నిజానికి ప్రమాదం జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ప్రమాదం జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేనంత జాగ్రత్తగా ఉంటున్నామా అంటే... లేదనే చెప్పాలి. రోడ్డు మీద ప్రయాణికులుగా భారతీయులు ప్రవర్తించే తీరు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దానికి తోడు లైసెన్సులిచ్చే చోట అవినీతి, రోడ్ల నిర్మాణంలో లోపాలు, ట్రాఫిక్‌ నియంత్రణా నియమాల గురించి సరైన చట్టాలు లేకపోవడం, ఉన్నా అమలుచేయకపోవడం, వాహనాల నాణ్యతలో రాజీపడడం, మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలు జరిగినప్పుడు విచారణలో లోపాలు, కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారని ఎంతో కొంత నష్టపరిహారంతో సర్దుకుపోవడం... కర్ణుడి చావుకి కారణాల్లాగే మన రోడ్డు ప్రమాదాలకూ లెక్కలేనన్ని కారణాలు. అన్నీ స్వయంకృతాలే, ప్రభుత్వాలూ ప్రజలూ తలచుకుంటే మార్చగలిగేవే.


 

 

మనం మారాలి... 
అదేమిటో బండి ఎక్కగానే ప్రతివాళ్లూ పరీక్ష రాసే పిల్లల్లాగే ఫీలైపోతారు. ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్తే ఎక్కడ లోపలికి రానివ్వరోనన్నట్లు దూసుకుపోతుంటారు. పదినిమిషాలు ఆలస్యంగా వెళ్తే కొంపలేమీ అంటుకోవు. కాకపోతే ఆఫీసుకు రోజూ ఆలస్యంగా వెళ్లకూడదు కాబట్టి ఇంకా కొంచెం ముందు బయల్దేరాలి. అర్ధరాత్రి వరకూ సినిమాకో షికారుకో వెళ్లి, ఉదయం ఆలస్యంగా నిద్రలేచి హడావుడిగా తయారై వాహనాన్ని వేగంగా నడపడం ద్వారా ఆలస్యాన్ని సర్దుబాటు చేసుకోవాలనుకోవడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే కాదు, ఎదుటివారినీ ప్రమాదంలోకి నెట్టడమే. రోడ్డు మీద ప్రయాణం టీమ్‌ వర్క్‌ లాంటిది. అందరూ కలిసి సమన్వయంతో సాగితేనే ప్రయాణం సజావుగా ముగుస్తుంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు స్పీడు పెంచినా తగ్గించినా, బ్రేకు వేసినా, సిగ్నల్‌ ఇవ్వకుండా సడన్‌గా కుడిపక్కకో ఎడమపక్కకో మలుపు తిరగాలనుకున్నా ప్రమాదం జరుగుతుంది. చుట్టూ ఉన్న వాహనాలను దృష్టిలో పెట్టుకుని మన వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. అసహనం అసలు పనికిరాదు. పచ్చలైటు పడేవరకూ ఉండలేక రాంగ్‌రూట్‌లో మరో పక్కకి తిరగడమంటే మనం నియమాలను అతిక్రమించడమే కాక రూల్స్‌ ప్రకారం వెళ్లేవాళ్లకూ చికాకు కలిగించడమే. బండి నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌ అర్జెంట్‌గా మాట్లాడాల్సివస్తే ఒక్క క్షణం బండి పక్కన ఆపి మాట్లాడొచ్చు. ఆ తర్వాత ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించొచ్చు. ఇక మద్యం తాగి బండి నడపడమూ, మైనర్లు సరైన శిక్షణ లేకుండా నడపడమూ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతోందో రహదారుల భద్రత శాఖ వెలువరించే గణాంకాలు చెబుతాయి. బండి మీద డాడ్స్‌ గిఫ్ట్‌, మామ్స్‌ గిఫ్ట్‌ అని గర్వంగా రాసుకుంటే సరిపోదు. వారికీ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా! ‘మీ అబ్బాయికి యాక్సిడెంట్‌ అయింది’ అన్న ఫోన్‌ కాల్‌ ఎప్పటికీ వారికి వెళ్లకుండా చూసుకోవడమే వారికిచ్చే సరైన బహుమతి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కించుకుని మరీ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తారు. రేపు పిల్లల నుంచి ఎలాంటి వార్తలు తాము వినకూడదనుకుంటారో ఒకసారి ఆలోచిస్తే మళ్లీ ఆ పని చేయరు.

 

సాయం చేసేవారేరీ! 
ప్రమాదానికి మనం కారణం కాకుండా ఉండడమే కాదు, ఎవరికైనా ప్రమాదం జరిగితే స్పందించడమూ సమాజంలో పౌరులుగా మన బాధ్యతే. ఈ విషయంలోనూ మన స్పందన అంతంతమాత్రమే. ఇటీవలే దిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సహాయం కోసం అభ్యర్థిస్తే ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ సంఘటన వీడియో సోషల్‌ మీడియాకెక్కింది. అలాంటిదే మరో సంఘటన బెంగళూరులోనూ జరిగింది. సైకిల్‌ మీద వెళ్తున్న ఓ కుర్రాడిని బస్‌ ఢీకొంటే రక్తపుమడుగులో ఆ అబ్బాయి దాదాపు అరగంటసేపు నరకం అనుభవించాడు. తనని ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ అక్కడున్నవారికి దండాలు పెట్టాడు. ఎవరూ ముందుకు రాలేదు. 
పోలీసులు వచ్చేసరికి ప్రాణం పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్నవారో, ఆ టైములో ఆ రోడ్డు మీద వెళ్తున్నవారో ఎవరో ఒకరు ఆ పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లుండవచ్చు, కనీసం ఫోన్‌ చేసి పోలీసులకో, అంబులెన్సుకో సమాచారం ఇచ్చివుండవచ్చు. అవేమీ చేయకుండా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రమాదబాధితులకు సహాయం అందించడంలో సమాజం ఎందుకు వెనకంజ వేస్తోందన్న విషయం చర్చల్లోకి వచ్చింది. మనదేశంలో 76 శాతం ప్రజలు ప్రమాద బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదంటే అందుకు కారణం- పోలీసు కేసు అవుతుందనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ భయపడడమే. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట చాలా కీలకం. ఆ సమయంలో వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశాలు పెరుగుతాయి. శాశ్వతవైకల్యం సంభవించే ప్రమాదమూ తగ్గుతుంది.

 

పదినిమిషాలు... మూడు ప్రాణాలు 
‘ఇదిగో, పదినిమిషాల్లో అక్కడుంటా...’ అని ఫోనులో చెబుతూ రయ్‌న దూసుకుపోతుంటారు చాలామంది. ప్రయాణ సమయం దూరాన్నీ ట్రాఫిక్‌నీ బట్టి ఉంటుంది. వేగంతో వాటిని అధిగమించాలనుకోవడమే చాలామంది చేస్తున్న పొరపాటు. మనదేశంలో నిమిషానికో ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదాల వల్ల మూడు నిమిషాలకో ప్రాణం గాలిలో కలిసిపోతోంది. అనుకున్న టైముకన్నా పదినిమిషాలు ముందుగా వెళ్లామా పావుగంట ఆలస్యంగా వెళ్లామా అన్నది కాదు, క్షేమంగా ఇంటికెళ్తామా అన్నదే ప్రధానం. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నాయి. సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, ఎరైవ్‌ సేఫ్‌, ముస్కాన్‌ ఫౌండేషన్‌, సేఫ్‌రోడ్‌ ఫౌండేషన్‌... తదితర సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో కృషిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకూ, మరణాలను తగ్గించడానికీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాధితులకు ప్రథమచికిత్స అందించడంలో వలంటీర్లకూ, పోలీసులకూ శిక్షణ ఇస్తున్నాయి. కొత్త చట్టాల రూపకల్పనకూ దారిచూపుతున్నాయి. జాతీయ రహదారులపై 500మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు, కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ‘గుడ్‌ సమరిటన్‌ అండ్‌ మెడికల్‌ ప్రొఫెషనల్‌ బిల్‌ 2016’ లాంటివి అలా వచ్చినవే. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన బిల్లు వల్ల ప్రమాదబాధితులకు సకాలంలో సహాయం అందుతుంది. బాధితులకు సహాయపడేవారు కోర్టులూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారిని ఆస్పత్రికి చేర్చి తమ దారిన తాము వెళ్లిపోవచ్చు. ఈ చట్టంకింద ఆస్పత్రులు కూడా వెంటనే చికిత్స అందించాలి. కేసు నమోదు చేసేదాకా చికిత్స ఆపకూడదు. దిల్లీ ప్రభుత్వం మరో రకంగా ప్రయత్నిస్తోంది. ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి రూ. 2000 ప్రోత్సాహక బహుమతినీ, ఓ ప్రశంసాపత్రాన్నీ ఇస్తోంది. ఇలాంటి చట్టాల్ని ప్రతి రాష్ట్రమూ చేస్తే, ప్రజలు భయాలను వదిలి సానుభూతితో స్పందిస్తే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

*  *  *

కొత్త బండీ స్నేహితులిచ్చే హుషారూ రోడ్డుమీద వాహనాలన్నిటినీ కట్‌ కొట్టి యువతని ముందుకు దూసుకుపొమ్మంటాయి.
వెళ్లాల్సిన దూరమూ చెయ్యాల్సిన పనులూ మనసును తొలిచేస్తూ స్టీరింగ్‌ మీద ఉద్యోగస్తుల చేతులను స్పీడోమీటర్‌తో పోటీపడమంటాయి. 
విశ్రాంతి లేని పనీ రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ప్రయాణాల్లో గడపడమూ డ్రైవర్లని నిస్పృహకి గురిచేస్తాయి. 
‘కొనుక్కున్న’ లైసెన్సులూ కాలం చెల్లిన వాహనాలూ ప్రయాణికుల్నే కాదు రోడ్డు మీద ఉన్నవారినీ మింగేస్తాయి. 
వద్దు... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సాక్షిగా ఈ పరిస్థితుల్ని మార్చుకుందాం. 
భద్రంగా ప్రయాణాలు చేద్దాం!

 

60 శాతం యువతే!

రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నవాళ్లలో 60 శాతం 18-35 మధ్య ఉన్న యువతే. ఆ తర్వాత స్థానం 45-60 మధ్య వయస్కులది. మొత్తమ్మీద ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో 87శాతం సంపాదించే వయసులో ఉన్నవారే. 
ఇక, బాధితుల్లో సగం మంది రోడ్డుమీద నడుస్తున్నవాళ్లూ, సైక్లిస్టులూ, ద్విచక్రవాహనం నడుపుతున్నవాళ్లే.

వేగం... వేగం...

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మొదటి ముద్దాయి అతివేగమే. 2016లో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 73,896 మరణాలు అతివేగం వల్ల సంభవించిన ప్రమాదాల్లో జరిగినవే. సగటు ప్రయాణ వేగం గంటకు కిలోమీటరు చొప్పున తగ్గినా చాలు- ప్రమాదాలు 3 శాతం తగ్గుతాయి. 
ఆ తర్వాత కారణమూ వాహనం నడిపేవారు చేసిన పొరపాట్లే. హెల్మెట్‌ పెట్టుకోకపోవడమూ, ఓవర్‌టేకింగూ, సీటు బెల్టు పెట్టుకోకపోవడమూ లాంటివి.

పదేళ్లలో... 14 లక్షలు

మన దేశంలో గత పదేళ్లలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు 13,81,314 మంది. 
* ప్రమాదాల్లో గాయపడి వైకల్యంతో బతుకుతున్నవారు 50,30,707 మంది.

ఏటా లక్షన్నర మంది

2016లో 4,80,652 ప్రమాదాలు జరగ్గా 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* 2017లో 4,64,910 ప్రమాదాలు జరగ్గా 1,47,913 మంది ప్రాణాలు కోల్పోయారు.

నంబర్‌ వన్‌ ఉత్తరప్రదేశ్‌

దేశంలో రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే మరణాల్లో మాత్రం ఉత్తరప్రదేశ్‌ ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో, తెలంగాణ 9వ స్థానంలో ఉన్నాయి. 
నగరాల్లో దిల్లీది ప్రథమస్థానం. చెన్నై, జైపూర్‌, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ద్విచక్రవాహనాలదే పెద్ద వాటా

రోడ్డు ప్రమాదాల్లో మూడో వంతు మరణాలకు ద్విచక్రవాహన ప్రమాదాలే కారణం. కార్లూ జీపులది రెండో స్థానం. మూడో స్థానంలో ట్రక్కులూ ట్రాక్టర్లూ, నాలుగో స్థానంలో బస్సులూ ఉన్నాయి.

ఇలా చేస్తే...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చట్టాలను సరిగ్గా అమలుచేస్తే 20శాతం ప్రమాదాలు తగ్గుతాయి. 
* హెల్మెట్‌ వాడకం వల్ల తలకి తీవ్రగాయమై సంభవించే మరణాల్ని 45 శాతం తగ్గించవచ్చు. 
* šసీట్‌బెల్టుని సరిగ్గా వినియోగిస్తే కారు ప్రమాదాల్లో 61 శాతం మరణాలు తగ్గుతాయి.

రహదారులకూ కథలుంటాయి...

రోడ్డు ప్రమాద బాధితులను గుర్తు చేసుకుంటూ ఓ రోజును నిర్వహించడాన్ని 1993లో ఇంగ్లండ్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. క్రమంగా దీన్ని యూరోప్‌ అంతటా అమలుచేయడం మొదలెట్టారు. ఇలాంటి ఓ రోజు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఏటా నవంబరులోని మూడో ఆదివారాన్ని రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినంగా నిర్వహించాలని 2005లో ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించడంతో పాటు, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఏటా ఒక అంశాన్నీ ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది ఎంచుకున్న అంశం- ‘రోడ్స్‌ హావ్‌ స్టోరీస్‌’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.