close

గుహాధీశుడు గవిగంగాధరుడు!

ఉమాదేవితో కలిసి కొండగుహలో కొలువయ్యాడు గవిగంగాధరేశ్వరుడు. ఆయనకా పేరురావడం వెనక గొప్పకారణమే ఉంది. చుట్టూ కొండలూ గుట్టలూ ఉండగా భక్తులు ఎక్కడి నుంచి అభిషేకపునీళ్లు తెస్తారనుకున్నాడో ఏమో... తన గర్భాలయంలోనే ఓ నీటి గుంతను ఏర్పాటు చేసుకుని ఆ నీళ్లతోనే నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. కోరి కొలిచిన భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. 
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం బెంగళూరులోని గవిగంగాధరేశ్వర క్షేత్రం. ఈ ఆలయంలోని శివయ్య పేరుమీదుగానే ఊరికి కూడా గవిపురం గుట్టహళ్లి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం అంతా కొండలూ గుట్టలతో నిండి ఉంటుంది. వీటిలోని ఒక చిన్న కొండ గుహాంతర్భాగంలో సాక్షాత్తూ దక్షిణామూర్తే లింగరూపంలో వెలిశాడని ప్రతీతి. గుహని కన్నడ భాషలో గవి అంటారు. దీంతో ఈ క్షేత్రానికి గవి గంగాధరేశ్వరాలయం అనే పేరువచ్చిందని చెబుతారు.

 

ఆలయ చరిత్ర 
పూర్వం గౌతమ, భరద్వాజ మహర్షులు త్రికాలపూజల్లో భాగంగా మధ్యాహ్న పూజను ఇక్కడ ఆచరించడానికి వచ్చేవారని స్థలపురాణం తెలియజేస్తోంది. వీరు ప్రాతఃకాలపూజ కాశీలో, అనంతర పూజ గవిగంగాధరేశ్వర దేవస్థానంలో, సాయంకాల పూజ శివగంగ ప్రాంతంలో (తుమకూరు) ఆచరించేవారట. అందుకే ఈ మూడు లింగాలూ రుషి పూజితాలుగా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కుడివైపున ఆశీనురాలై పూజలందుకుంటోంది. ఈ ఆలయంలో దక్షిణాభిముఖంగా కొలువైన పరమేశ్వరుడు గవిగంగాధరేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి శివయ్యను దర్శించుకుంటే ఆత్మలింగాన్ని దర్శించుకున్న ఫలితం వస్తుందంటారు. ఈ క్షేత్రంలో గవి గంగాధరేశ్వరుడితోపాటు మరో రెండు దేవతామూర్తులు విశేష పూజలందుకుంటున్నాయి. ఒకటి అగ్నిమూర్తి. ఈ విగ్రహానికి రెండు తలలూ, మూడు కాళ్లూ, ఏడు చేతులూ ఉన్నాయి. దృష్టిలోపం ఉన్నవారు పదహారు వారాలపాటు ఈ అగ్నిమూర్తిని అర్చిస్తే మంచి ఫలితం ఉంటుందన్నది భక్తుల నమ్మకం. రెండో విగ్రహం శక్తి గణపతి. ఈ గణపతికి ఎడమతొడ మీద పది చేతులతో ఆదిశక్తి  దర్శనమిస్తుంది. గర్భగుడిలో అయిదు గుహలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణించి కాశీకీ, శివగంగకూ వెళ్లొచ్చని చెబుతారు. పూర్వం భరద్వాజుడు, గౌతముడు ఈ గుహామార్గం ద్వారానే వచ్చి గంగాధరేశ్వరుడిని పూజించేవారట. 
ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంది. ఇందులో నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది. గంగా ప్రవాహం ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి.

రాజుల పాలనలో... 
విజయనగర రాజులకు సామంతుడైన మాగడి కెంపేకగౌడ (ఇతను బెంగళూరు నగర నిర్మాతగా కూడా ప్రసిద్ధి చెందాడు.) ఐదు వందల సంవత్సరాల కిందట ఈ దేవస్థానాన్ని పునరుద్ధరించాడని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. గర్భగుడి ప్రాకారం చుట్టూ బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలను ఏర్పాటు చేయించాడు. గుహలోని మూలవిరాట్టుకు ఇరువైపులా నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించాడు.

 

కిరణాభిషేకం... 
ఏటా మకర సంక్రాంతి రోజు సాయంత్రం సూర్యకిరణాలు గుహ అంతరాలయంలో ఉన్న లింగమూర్తిమీద పడతాయి. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. కార్తిక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలూ, వివిధరకాల అభిషేకాలూ జరుగుతాయి. ప్రతి మాఘమాసంలో బ్రహ్మరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటితోపాటు విశిష్ట దుర్గాహోమాలూ, చండికా హోమాలూ, రుద్రాభిషేకాలూ, నవగ్రహ శాంతులూ మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి నలభై ఎనిమిది రోజులపాటు నిర్వహిస్తారు. గవిగంగాధరేశ్వరస్వామి క్షేత్రానికి సమీపంలో ఉన్న బండిమహంకాళి ఆలయం, బసవనగుడి, కారంజ ఆంజనేయస్వామి దేవస్థానాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి.

ఇలా చేరుకోవచ్చు 
గవిగంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడి నుంచి లోకల్‌ బస్సులో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు. విమాన మార్గంలో... ఎయిర్‌పోర్టుకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉందీ క్షేత్రం. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.