close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఖైదీల పిల్లల్ని ఆదుకుంటాడు!

 

‘అనుమానంతో భార్య హత్య’, ‘క్షణికావేశం తీసింది ప్రాణం’... పత్రికల్లో రోజూ ఇలాంటి వార్తలెన్నో మన దృష్టికొస్తుంటాయి కదా! అనుమానంతో పక్కాగా ప్లాన్‌ చేసో, ఆవేశంతో రెచ్చిపోయో భార్యని కడతేర్చిన భర్త ఎలాగూ జైలుకెళతాడు. మరి తల్లి చనిపోయి తండ్రీ జైలుకెళ్లాక ఆ పిల్లల పరిస్థితేమిటో ఆలోచించారా! దివ్యాంగుడైన కేఆర్‌ రాజా అలా ఆలోచించడమే కాదు, వాళ్ల  కోసం ఓ సంస్థనీ ఏర్పాటుచేశాడు. భవిష్యత్తుకు బాట వేస్తున్నాడు. 
ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. పదేళ్లపాటు అంతా సవ్యంగా సాగిందికానీ ఆ తర్వాత అతనికి వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఆ బాధతో తాగుడికి బానిసై కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేశాడు. కుటుంబం గడవాలని భార్య ఓ దుకాణంలో ఉద్యోగానికి పోవడం మొదలుపెట్టింది. మొదటిసారి ఇంటి గడపదాటుతున్న మహిళ కదా... వాళ్ళూవీళ్ళూ చెవులు కొరుక్కున్నారు. దుకాణం యజమానికీ, ఈమెకీ సంబంధాలు అంటగట్టారు. అసలే తానేం సంపాదించలేకపోతున్నాననే బాధలో ఉన్నవాడు...ఆపై తాగుడుకి బానిసైనవాడు... వీటికి తోడు అనుమానభూతం అతణ్ణి ఆవహించింది. ఓ రోజు గొడవపడి... ఆమె తలని గోడకేసి బాది చంపేశాడు! తల్లి శవాన్ని చూసి పిల్లలు భోరుమని ఏడుస్తున్నప్పుడు కానీ... ఆ తండ్రికి పశ్చాత్తాపం కలగలేదు. తప్పు తెలుసుకునేసరికే జీవిత ఖైదీగా జైలుపాలయ్యాడు. పెద్దలకిష్టంలేని పెళ్లి చేసుకున్న జంటకాబట్టి ఎవరివైపు బంధువులూ రాలేదు! పోలీసుల దగ్గరే బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ ముగ్గురు పిల్లలు. చివరికి వాళ్లమ్మమ్మ వచ్చి తీసుకెళ్లింది. ఆమె పొట్టకూటి కోసం చుట్టుపక్కలవారి బట్టలు ఇస్త్రీ చేసి జీవిస్తుండేది. పోషించలేక ఈ పిల్లల్ని కూలీకి పంపించడం మొదలుపెట్టింది! ...ఇదంతా జరిగి ఎనిమిదేళ్లవుతోంది. అప్పట్లో కేఆర్‌ రాజా పుదుచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ చదువుతుండేవాడు. చివరి ఏడాది ప్రాజెక్టులో భాగంగా జైలు ఖైదీల మానసిక స్థితిగతులపై అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడే ఓ రిమాండు ఖైదీని కలిశాడు. పైన చెప్పిన వృత్తాంతం అతనిదీ, అతని పిల్లలదే. ఆ ముగ్గురు పిల్లలకి చదువుచెప్పి సాయం చేయాలని తెలిసిన ఎన్జీఓలని అడిగితే ‘ఆ పిల్లల్ని చేర్చుకుంటే మాకు వచ్చే నిధులు కూడా రావు!’ అని చేతులెత్తేశారు. అంతేకాదు... ‘వాళ్ల నాన్న క్రిమినల్‌. వీళ్లలోనూ ఎంతోకొంత ఆ లక్షణాలుంటాయ్‌’ అని చుట్టుపక్కలవాళ్లు తమ పిల్లల్ని వీళ్లతో కలవనివ్వలేదు. అసలే తల్లిలేక ఒంటరితనంలో కొట్టుమిట్టాడుతున్న ఆ పిల్లలకి సమాజం విధించిన ఈ శిక్ష రాజాని కలచివేసింది. అలాంటి పిల్లల్ని ఆదుకోవాలనే ‘గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ సంస్థని స్థాపించాడు.

 

ఇంజినీరింగ్‌ కాలేజీలకి పంపించాడు! 
తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో ఉండే పాళయంకోట్టై జైలులో తన సేవల్ని మొదలుపెట్టాడు రాజా. అక్కడున్న జీవిత ఖైదీలకి చెందిన 256 మంది పిల్లల్ని గుర్తించాడు. ఓ కార్పొరేట్‌ సంస్థకి విన్నవించి వాళ్లందరికీ ఐదు నుంచి పదిహేను వేల రూపాయల మేరకు ‘ఎడ్యుగేట్‌’ పేరుతో స్కాలర్‌షిప్‌ అందించాడు. అంతేకాకుండా ఈ పిల్లల్లో మరీ పేదరికంలో ఉన్న 78 మందికి ప్రతినెలా ఐదువేల రూపాయల మేరకు నెలవారీ స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తున్నాడు. బంధువులిళ్లలో కూడా ఉండలేని 15 మందికి వివిధ హాస్టళ్ళలో ఉచితంగా వసతి కల్పించి మరీ  చదివిస్తున్నాడు. కెవిన్‌కేర్‌ సంస్థకి చెందిన ఎబిలిటీ సంస్థ రాజాకి ‘ఎబిలిటీ ఎసెన్స్‌’ అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు ఫంక్షన్‌లో కలిసిన చెన్నై సత్యభామ ఇంజినీరింగ్‌ కాలేజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరియాజీనా జాన్సన్‌ ‘గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ సంస్థ గుర్తించిన పదిమంది విద్యార్థులకు ఏటా ఉచిత సీటూ, హాస్టల్‌ సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. తొలివిడతగా ఈ ఏడాది ఎనిమిదిమంది విద్యార్థులు ఈ కాలేజీలో చేరారు.

 

అది తన బాధే... 
కేఆర్‌ రాజాది తమిళనాడులోని విళుప్పురం జిల్లాలో ఓ కుగ్రామం. తండ్రి వ్యవసాయ కూలీ. రాజాకి ఎనిమిదినెలలప్పుడు జ్వరమొస్తే... దానికి వాడిన మందులు వికటించి శరీరమంతా పక్షవాతం వచ్చింది. ఫిజియోథెరపీ, ఇతర మందుల సాయంతో ఎనిమిదేళ్ల వయసుకి అతని శరీరం స్వాధీనంలోకి వచ్చినా కాళ్లు మాత్రం చచ్చుగానే ఉండిపోయాయి! కాలిపర్స్‌ వాడుతూ తొమ్మిదో ఏట నుంచి అక్షరాలు దిద్దడం మొదలుపెట్టాడు. అలా ఫిలాసఫిలో డిగ్రీ, సోషల్‌ వర్క్‌లో పీజీ చేశాడు. పీజీ చేస్తున్నప్పుడే జైల్లో అతనికి ఆ ఖైదీ తారసపడ్డాడు. 
‘ఓ వికలాంగుడిగా సమాజానికి దూరమైన నాకు ఒంటరితనం బాధేమిటో బాగా తెలుసు. ఖైదీల పిల్లలు ఎదుర్కొనే బాధ అంతకన్నా ఎక్కువనిపించింది. ఆ సహానుభూతే వాళ్లవైపు నన్ను  నడిపిస్తోంది..’ అంటున్నాడు రాజా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.