close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశ్వాస బంధం 

- ఆదోని బాషా

నేను హైదరాబాద్‌కి చేరుకోగానే నా తమ్ముడు రమేష్‌ విమానాశ్రయంలో నన్ను రిసీవ్‌ చేసుకున్నాడు. ఇద్దరం క్యాబ్‌ ఎక్కి ఇంటికి బయలుదేరాం. రమేష్‌ ముఖంలో కళ లేదు. ‘‘ఏరా, క్యాబ్‌ ఎందుకు మాట్లాడావ్‌, మన కారు ఏమైంది?’’ అనడిగాను.

‘‘కారు అమ్మేశాను’’ అసహనంగా అన్నాడు.

‘‘ఎందుకమ్మావ్‌?’’ నేను ఆశ్చర్యంగా అడిగాను.

‘‘ఏం చెయ్యమంటావ్‌? వైదేహి చేసిన పనికి నా తలకాయ పనిచెయ్యటం లేదు. దాంతో వ్యాపారంలో కొన్ని పొరపాట్లు చేసి నష్టపోయాను. ఆ నష్టాల్ని పూడ్చటం కోసం గత్యంతరంలేక కారు అమ్మేశాను’’ రమేష్‌ మాట్లాడినప్పుడు వాడి నోట్లోంచి బ్రాందీ వాసన గుప్పుమంది. భార్య నమ్మకద్రోహం తనని బాగా కుంగదీసిందని నాకు అర్థమైంది. అందువల్ల మౌనంగా ఉండిపోయాను.

నేను హఠాత్తుగా అమెరికా నుండి ఇండియాకి రావటానికి రమేష్‌ భార్య వైదేహే కారణం. పెళ్ళయి ఏడాది కూడా పూర్తికాకముందే ఆమె రమేష్‌ను వదిలేసి తన ప్రియుడితో వెళ్ళిపోయింది. పరువు పోతుందని రమేష్‌ ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. చివరికి వైదేహితో రాజీపడి ఆమె కోరిక ప్రకారం రహస్యంగా విడాకులిచ్చి తెగతెంపులు చేసుకున్నాడు. ఆ తర్వాతే నాకు ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పాడు. దాంతో నేను హఠాత్తుగా ఇండియాకి రావాల్సివచ్చింది.

మా అమ్మానాన్నలకు నేనూ, రమేష్‌ ఇద్దరమే సంతానం. రమేష్‌ నాకన్నా ఆరేళ్ళు చిన్నవాడు. నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు మా నాన్నగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దాంతో కుటుంబ బాధ్యత అంతా నాపైన పడింది. అదృష్టవశాత్తు ఎంబీఏ పూర్తికాగానే నాకు ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం దొరికింది. తర్వాత రమేష్‌ని మంచి కాలేజీలో చేర్పించాను. నేను నా సహోద్యోగి నీలిమని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. పెళ్ళయ్యాక ఇద్దరికీ మా కంపెనీ చికాగో శాఖలో పనిచేసే అవకాశం లభించింది. అలా ఇద్దరం అమెరికాలో స్థిరపడ్డాం. కొన్నాళ్ళవరకూ పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం. ప్రతి ఏడాదీ సంక్రాంతికి ఇండియాకొచ్చి ఓ ఇరవై రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్ళిపోతాం.

రమేష్‌ డిగ్రీ పూర్తిచేశాక ఉద్యోగం చెయ్యటానికి ఇష్టపడలేదు. నెలనెలా నేను పంపించే డబ్బుతో ఫర్నిచర్‌ వ్యాపారం మొదలెట్టాడు. గతేడాది మేం ఇండియా వచ్చినప్పుడు రమేష్‌ పెళ్ళి వైదేహితో జరిపించాం. వైదేహి ఓ మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి పక్షవాతం వల్ల కదలలేని స్థితిలో ఉన్నాడు. తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. డిగ్రీ వరకూ చదువుకున్న వైదేహి ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రుల్ని పోషించేది.

వైదేహిది పేద కుటుంబమైనా కష్టపడే నైజం. అణకువా సంస్కారం గల అమ్మాయి అని పదిమందీ ఆమెను ప్రశంసించటంతో నేను ఇష్టపడి ఈ పెళ్ళి జరిపించాను. పెళ్ళిలో ఎలాంటి కట్నకానుకలూ తీసుకోలేదు. పెళ్ళి ఖర్చులు కూడా నేనే భరించాను.

ఇంతచేసినా వైదేహి తనను వదిలేసి వినోద్‌తో వెళ్ళిపోయిందని రమేష్‌ నాకు ఫోన్‌చేసి చెప్పినప్పుడు నేను షాక్‌కి గురయ్యాను.

వైదేహిని చూడకముందు మా అమ్మ తన దూరపు బంధువుల అమ్మాయి అనితతో రమేష్‌ పెళ్ళి జరపాలనుకుంది. కానీ వైదేహి నాకు బాగా నచ్చటంతో అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే జరిగిందంతా తెలిసి కూడా అనిత తల్లిదండ్రులు ఇప్పటికీ తమ కూతుర్ని రమేష్‌కిచ్చి పెళ్ళి చెయ్యటానికి సుముఖంగానే ఉన్నారని అమ్మ నాకు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ వారంలోనే మంచి ముహూర్తం కూడా ఉంది, వెంటనే ఈ పెళ్ళి జరిపిద్దామని కోరింది. దాంతో నేను హడావుడిగా వారం రోజులు ఉద్యోగానికి సెలవుపెట్టి ఇండియాకొచ్చేశాను. సెలవు దొరక్కపోవటంతో నీలిమ అమెరికాలోనే ఉండిపోయింది.

నేను ఇంటికి చేరుకోగానే అమ్మతో మాట్లాడాను. జరిగినదానికి అమ్మ నన్నే తప్పుబట్టింది. ‘‘మంచి నడవడిక గల పిల్ల అని ముచ్చటపడి నువ్వా పిల్లతో రమేష్‌ పెళ్ళి జరిపించావ్‌. ఇప్పుడు చూడు... అది మన ఇంటి పరువుని గంగలో కలిపేసింది. అందుకే మన స్థాయికి తగ్గ సంబంధమే చూడాలంటారు పెద్దలు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన అదృష్టంకొద్దీ అనిత తల్లిదండ్రులు రమేష్‌కి తమ కూతుర్ని ఇవ్వటానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ పెళ్ళి జరిపించరా. చేసిన తప్పుని ఎంత తొందరగా దిద్దుకుంటే అంత మంచిది’’ అంది.

నేను మౌనంగా తలూపి బాత్‌రూమ్‌లోకి దూరాను. ఫ్రెష్‌ అయ్యాక భోంచేసి బెడ్‌రూమ్‌లోని మంచంపై వాలాను. ప్రయాణపు బడలిక తీర్చుకోవటానికి కాసేపు పడుకోవాలనుకున్నాను. కానీ వైదేహి ఆలోచనలు చుట్టుముట్టడంతో నిద్రపట్టలేదు.

ఎంబీఏ చదివిన నేను వృత్తిరీత్యా ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. కానీ జీవితాన్ని నేనెప్పుడూ వ్యాపార దృష్టితో చూడలేదు. అందుకే ఆర్థిక విషయాలకన్నా సంస్కారం, నైతికత వంటి అంశాలకే ప్రాధాన్యతనిచ్చి వైదేహిని రమేష్‌కి తగిన జోడీగా భావించాను. కానీ నా నిర్ణయం తప్పని తేలింది. తప్పు ఎక్కడ జరిగిందో నాకు అంతుబట్టలేదు. ఏది ఏమైనా నేను చేతులారా రమేష్‌ జీవితం పాడుచేశానన్పించింది. వాడిప్పుడు బాధని మర్చిపోవటానికి తాగటం మొదలెట్టాడు. పరిస్థితి మరింత దిగజారకముందే వాడి పెళ్ళి అనితతో చేసెయ్యాలని నేనిక్కడికొచ్చాను. ఇన్ని ఆలోచనల మధ్య, కాసేపు నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ మెసులుతుంటే దిండు లోపల ఏదో గట్టిగా తగిలింది. ఏంటా అని దిండు కవర్‌ తీసి చూస్తే ఓ పాత మోడల్‌ సెల్‌ఫోన్‌ బయటపడింది.

రమేష్‌ని పిలిచి ఆ ఫోన్‌ ఎవరిదని అడిగాను. ‘‘ఇంకెవరిది, ఆ రాక్షసిదే! రోజూ ఆ వినోద్‌గాడికి ఫోన్లు చేసేది. నేను ఫోన్‌ చెక్‌ చెయ్యకూడదని ఇక్కడ దాచిపెట్టినట్టుంది. ఇంట్లోంచి పారిపోయేటప్పుడు తొందరలో ఫోను తీసుకెళ్ళటం మర్చిపోయినట్టుంది. దాని గుర్తులేవీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దీన్ని ఇప్పుడే కాల్చేస్తాను’’ అంటూ ఫోన్‌ తీసుకెళ్ళాడు రమేష్‌.

ఓ అరగంట ప్రయత్నించాక నాకు నిద్రపట్టింది. సాయంత్రం నిద్రలేచాక ముఖం కడుక్కుని అమ్మ ఇచ్చిన కాఫీ తాగి మిత్రుడు రాజేష్‌కి ఫోన్‌ చేశాను. రాజేష్‌ ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకుని వెంటనే ఆటోలో అతని ఇంటికి చేరుకున్నాను. నేను హైదరాబాద్‌కి వచ్చినప్పుడల్లా నా పనులన్నీ రాజేష్‌ చేసిపెడతాడు. ఇంతకుముందు రమేష్‌ పెళ్ళి ఏర్పాట్లు కూడా తనే చేశాడు.

నేను రాజేష్‌కి జరిగినదంతా వివరించాను. అతను ఆశ్చర్యపోయాడు. ‘‘వైదేహి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మంచికి కాలం లేకుండా పోయింది’’ అంటూ నొచ్చుకున్నాడు.

‘‘జరిగిందేదో జరిగిపోయిందిరా. ఇప్పుడు వెంటనే రమేష్‌కి మన బంధువుల అమ్మాయి అనితతో పెళ్ళి జరపాలి. ఈ వారంలోనే మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఇప్పుడే పురోహితుడితో మాట్లాడి పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ చెయ్‌. పెళ్ళి సింపుల్‌గా జరిగిపోవాలి’’ అంటూ కొంత డబ్బు రాజేష్‌ చేతిలో పెట్టాను. తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగాను.
ఆటోలో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఓ సిటీ బస్సులో కిటికీ పక్కన కూర్చున్న వైదేహి కన్పించింది. ఆమెను చూడగానే ఎందుకో ఓసారి మాట్లాడాలన్పించింది. వెంటనే ఆటోవాడికి ఆ బస్సును వెంబడించమన్నాను. ఓ పావుగంట ఆటో బస్సును ఫాలో అయ్యాక ఓ బస్టాపులో వైదేహి కిందికి దిగటం కన్పించింది. నేను కూడా ఆటో దిగి ఆటోవాడికి డబ్బు ఇచ్చి పంపేశాను. ఆలోగా వైదేహి ఓ సందులోకి వెళ్ళింది. నేను కూడా ఆ సందులోకి దూరాను. కొంతదూరం నడిచాక వైదేహి ఓ బిల్డింగ్‌లోకి వెళ్ళడం కన్పించింది.

ఆ బిల్డింగ్‌ ముందు ఉన్న బోర్డు మీద ‘నిర్భయ మహిళాశ్రమం’ అని రాసి ఉంది. వైదేహి అక్కడికి ఎందుకెళ్ళిందో నాకు అర్థంకాలేదు. కాసేపు తటపటాయించి నేనూ లోపలికి వెళ్ళాను. అక్కడి వార్డెన్‌తో మాట్లాడి నేను వైదేహి బంధువునని చెప్పుకుని ఆమెతో మాట్లాడాలన్నాను. వార్డెన్‌ వైదేహి ఉన్న గదికి నన్ను తీసుకెళ్ళింది. వైదేహి నన్ను చూసి ఆశ్చర్యపోయింది. నాకు నమస్కరించి కూర్చోవటానికి కుర్చీ చూపించింది. వార్డెన్‌ వెళ్ళిపోయాక నేను కుర్చీలో కూర్చున్నాను.

‘‘ఎందుకిలా చేశావ్‌ వైదేహీ?’’ హఠాత్తుగా ప్రశ్నించాను.

‘‘నేనేం చేశాను బావగారూ?’’ వైదేహి తడబడుతూ ఎదురు ప్రశ్నించింది.

‘‘నా తమ్ముణ్ణి వదిలేసి ఆ వినోద్‌తో వెళ్ళిపోయావట! నువ్వు సభ్యతా సంస్కారం గల అమ్మాయివని నలుగురూ చెబితే అమ్మను ఒప్పించి ఈ పెళ్ళి చేశాను. కానీ నువ్వా వినోద్‌ని ప్రేమిస్తుంటే మావాణ్ణి ఎందుకు చేసుకున్నావ్‌?’’ కోపంగా అడిగాను.

‘‘నేనొక సభ్యతా సంస్కారం గల అమ్మాయినని మీకు రూఢీ అయ్యాక ఈ పెళ్ళి చేశానన్నారు. నాలాగే మీ తమ్ముడు కూడా సభ్యతా సంస్కారంగలవాడని పెళ్ళికి ముందు మీరు రూఢీ చేసుకున్నారా?’’ వైదేహి మళ్ళీ ఎదురు ప్రశ్నించింది.

ఆ ప్రశ్న విని నేను తికమకపడ్డాను. ‘‘నువ్వేం చెబుతున్నావో నాకు అర్థంకావటం లేదు’’ అన్నాను.

‘‘అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటినుంచీ చెప్పాల్సి ఉంటుంది. మీరు వింటానంటే చెబుతాను.’’

‘‘చెప్పు. నేను వాస్తవం తెలుసుకోవటానికే వచ్చాను’’ ఆత్రంగా అన్నాను.

వైదేహి దీర్ఘంగా శ్వాస పీల్చి చెప్పసాగింది- ‘‘ముందుగా నా గురించి చెబుతాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మా, వినోద్‌ తల్లీ ప్రాణ స్నేహితురాళ్ళు. ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే ఉండేవి. నేనూ వినోద్‌ చిన్నప్పటి నుంచీ కలిసి చదువుకున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల వినోద్‌ పదోతరగతి పాసయ్యాక కాలేజీలో చేరలేదు. నేను డిగ్రీ వరకూ చదివాను. అయితే, వినోద్‌ నా సాయంతో ఇంట్లోనే చదువుకుని ప్రైవేటుగా డిగ్రీ పాసయ్యాడు.మా నాన్నగారు హఠాత్తుగా పక్షవాతానికి గురికావటంతో ఇంటి ఖర్చుల కోసం నేను ఓ స్కూల్లో టీచర్‌గా చేరాను. నాన్నగారు ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేరు కాబట్టి మా ఇంటిపనులు చాలావరకూ వినోదే చేసిపెట్టేవాడు. అమ్మ కోరితే వినోద్‌ నాకోసం పెళ్ళి సంబంధాలు కూడా చూశాడు. చివరికి మీ తమ్ముడి సంబంధం అతనికి నచ్చింది. ధనవంతుల ఇంటి కోడలిగా వెళ్ళటానికి నేను భయపడ్డాను. అప్పుడు వినోద్‌ ‘వారు ఆదర్శభావాలున్నవారు. డబ్బుకన్నా నీ గుణగణాలకే విలువనిస్తారు. కట్నకానుకలు కూడా వద్దన్నారు. పైగా పెళ్ళికొడుకు హీరోలా ఉంటాడు’ అని నాకు నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించాడు.

పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను. కానీ కొద్దిరోజుల్లోనే మీ తమ్ముడి అసలు రూపం బయటపడింది. అతనొక అనుమాన పిశాచి. ప్రతి విషయంలో నన్ను అనుమానించేవాడు. పెళ్ళి ఫొటోల్లో ప్రతిచోటా వినోద్‌ కన్పించటం, నాకు సన్నిహితంగా ఉండటం చూసి మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు. తర్వాత ప్రతిరోజూ మాటలమధ్య వినోద్‌ ప్రసక్తి తీసుకొచ్చేవాడు. ‘నీ వినోద్‌తో మాట్లాడావా?... నీ వినోద్‌కి ఈ చీర చూపించావా?’ అంటూ నాతో వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ‘నేను వినోద్‌ని చిన్నప్పటినుంచీ ఓ ఆత్మీయ నేస్తంగా చూశానే తప్ప, మరో దృష్టితో చూడలేద’ని 
రమేష్‌కి స్పష్టంగా చెప్పాను. ‘మామధ్య అన్నాచెల్లెళ్ళ బంధం లేనంత మాత్రాన ప్రేమబంధం ఉందనుకోవద్దు. ఈ రెండు బంధాలకు అతీతమైన మరో పవిత్రబంధం కూడా ఉంది... అదే స్నేహబంధం. మామధ్య ఉన్నది ఆ బంధమే’ అని విడమర్చి చెప్పాను. అయినా రమేష్‌ ధోరణిలో మార్పు రాలేదు. ఓ శాడిస్టులా నన్ను టార్చర్‌ చెయ్యసాగాడు.

అతని మాటల్నీ చేష్టల్నీ మీముందు చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. రమేష్‌ పడక గదిలో తనని వినోద్‌తో పోల్చుకొనేవాడు. ‘నువ్వొక టీచర్‌వి కదా... మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులేస్తావ్‌?’ అని అసహ్యంగా అడిగేవాడు. భర్త నోటివెంట ఇలాంటి జుగుప్సాకరమైన మాటల్ని వినటానికి ఏ భార్యా ఇష్టపడదు. అయినా గత్యంతరంలేక విన్నాను. చివరికి విసుగొచ్చి ‘నా నిజాయతీని నిరూపించుకోవటానికి ఏం చెయ్యాలో చెప్ప’మన్నాను. దానికతను ‘వైదేహి అంటే సీత కదా... నువ్వు కూడా సీతలా అగ్నిలోకి దూకి నీ నిజాయతీని నిరూపించుకో’ అంటూ వెకిలిగా నవ్వాడు. అంతలోనే ‘వద్దులే, ఖర్మకాలి నువ్వు సగమే కాలి బతికి బయటపడితే అప్పుడు నేనే కాదు, వినోద్‌ కూడా నిన్ను ముట్టుకోడు’ అన్నాడు. తర్వాత ‘అగ్నిపరీక్షకన్నా సులువైన మార్గమేమంటే అందరి ఎదుటా ఆ వినోద్‌ని చెప్పుతో కొట్టు. అప్పుడు నువ్వతన్ని ప్రేమించటంలేదని నమ్ముతాను’ అన్నాడు. ‘అదికూడా చేతకాకపోతే వాడికి రాఖీ కట్టి ‘అన్నయ్యా’ అని పిలువ్‌’ అన్నాడు. అంతలోనే మళ్ళీ ‘వద్దులే. పైకి రాఖీలు కడుతూ లోపల రాసలీలలు సాగించటం ఈ కాలంలో మామూలైపోయింది’ అంటూ వెకిలిగా నవ్వాడు. ఇలా ప్రతిరోజూ రమేష్‌ సూటిపోటి మాటలతో నన్ను మానసికంగా హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు.

ఇలాంటి పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది. కానీ నాకా అదృష్టం కూడా లేదు. ఎందుకంటే నా పెళ్ళికి ముందు ఓసారి నాన్నకి స్వల్పంగా గుండెపోటు వచ్చింది. మరోసారి ఎటాక్‌ వస్తే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. నా బాధ ఆయనకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని భయమేసింది. అందుకే నా బాధను నా గుండెలోనే దాచుకున్నాను. చివరికి ఓరోజు మీ అమ్మగారికి చెప్పాను. కానీ, ఆమె నా మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే అంతకుముందే రమేష్‌ మీ అమ్మ చెవిలో నా గురించి లేనిపోనివి నూరిపోశాడు. పెళ్ళికి ముందే 
నాకు వినోద్‌తో సంబంధం ఉందని చెప్పాడు. కొడుకు మాటల్ని నమ్మిన మీ అమ్మ నన్ను నానా దుర్భాషలాడింది.’’

వైదేహి మాటలు విని నా తల దిమ్మెక్కింది. ‘‘ఇంత జరిగినా నువ్వు నాకెందుకు ఫోన్‌ చెయ్యలేదు?’’ ఆశ్చర్యంగా అడిగాను.

‘‘చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ, మీ ఫోన్‌ నంబరు నాకు తెలీదు. రమేష్‌ని అడిగితే ఇవ్వలేదు. పైగా నేనెవరికీ ఫోన్లు చెయ్యకుండా అతను నా సెల్‌ఫోన్‌ని ఎక్కడో దాచేశాడు.’’

ఆ మాట వినగానే ఇందాక నాకు ఇంట్లో తలగడ కవర్‌లో దొరికిన ఫోన్‌ గుర్తొచ్చింది. వైదేహి చెప్పటం కొనసాగించింది. ‘‘కానీ మీకు చెప్పినా లాభం లేదని తర్వాత అన్పించింది. ఎందుకంటే మీ అమ్మకు చెప్పినట్టే రమేష్‌ మీకు కూడా నా గురించి లేనిపోనివి చెప్పి ఉంటాడనుకున్నాను. నేను తనపైన ఎవరికీ ఫిర్యాదు చెయ్యకపోవటంతో రమేష్‌ మరింత రెచ్చిపోయాడు. అప్పుడప్పుడు నన్ను బెల్టుతో కొట్టేవాడు. ఆ దెబ్బల గుర్తులు ఇప్పటికీ నా శరీరం మీద ఉన్నాయి. వాటి ఆధారంగా రమేష్‌పైన గృహహింస కేసుపెట్టి అతన్ని జైలుకి పంపగలను. కానీ, అలా చేస్తే మా అమ్మానాన్నలకు విషయం తెలిసిపోతుందని భయపడ్డాను. నా బలహీనతని రమేష్‌ నా పిరికితనంగా భావించాడు. నాపైన జులుం కొనసాగించాడు. మీ అమ్మ ఒక్కసారి కూడా అతన్ని వారించలేదు. ఓరోజు రమేష్‌ నన్ను బెల్టుతో కొడుతుంటే అప్పుడే అక్కడికొచ్చిన వినోద్‌ చూసి కోపం పట్టలేక రమేష్‌ చేతిలోంచి బెల్టు లాక్కొని అతన్నే కొట్టబోయాడు. నేను అడ్డుకుని వినోద్‌ని ఆపాను. అహం దెబ్బతిన్న రమేష్‌ వెంటనే నాకు విడాకులిస్తానన్నాడు. విడాకులకు నేను ఒప్పుకోకపోతే నాకూ వినోద్‌కూ మధ్య అక్రమ సంబంధం ఉందని మా అమ్మానాన్నలకు చెబుతానని బెదిరించాడు.

నిజానికి నేను కూడా రమేష్‌తో విసిగిపోయాను. అందువల్ల వెంటనే విడాకులకు ఒప్పుకున్నాను. విడాకుల తర్వాత ఇక్కడికొచ్చి ఉంటున్నాను. మళ్ళీ పాత ఉద్యోగంలో చేరాను. అమ్మానాన్నలకు నా విడాకుల విషయం చెప్పకుండా అప్పుడప్పుడూ వాళ్ళ దగ్గరికెళ్ళి నేను ఆనందంగా కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నాను. దానివల్ల వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. కానీ ఇలా ఎంతకాలం నటించగలనో నాకే తెలియదు. మీరు నన్ను వెదుక్కుంటూ వస్తారని నేనూహించలేదు. మీరిక్కడికి రాకపోతే మీకు ఎప్పటికీ నిజం తెలిసేది కాదు. జీవితాంతం మీ దృష్టిలో నేనొక అపరాధిగా మిగిలిపోయేదాన్ని’’ ఆవేదనగా అంది వైదేహి.

జరిగినదంతా తెలిశాక నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా తమ్ముడు ఇలాంటివాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఆరేళ్ళుగా నేను విదేశాల్లో ఉండి క్రమం తప్పకుండా వాడికి డబ్బు పంపిస్తున్నాను. వాడికి డబ్బు ఇవ్వగలిగాను కానీ సంస్కారం ఇవ్వలేకపోయాను. ఓపక్క తల్లి గారాబం, మరోపక్క మితిమీరిన స్వేచ్ఛవల్ల వాడు చెడిపోయాడు. వైదేహి విషయంలో నా అంచనా తప్పుకానందుకు ఆనందం కలిగినా నా తమ్ముడి విషయంలో నా అంచనా తప్పయినందుకు ఎంతో బాధ కలిగింది. తన పెళ్ళయినప్పటి నుంచీ రమేష్‌ చెప్పిన ఒక్కో అబద్ధం నాకు గుర్తుకు రాసాగింది. అమెరికా నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అతను వైదేహితో నన్ను మాట్లాడనివ్వలేదు. ప్రతిసారీ ఆమె బాత్‌రూమ్‌కి వెళ్ళిందనో పుట్టింటికి పోయిందనో సాకులు చెప్పేవాడు. ఆమె ఫోన్‌ నంబర్‌ కూడా నాకు ఇవ్వలేదు. ఇందాక తలగడ కవర్లో దొరికిన వైదేహి ఫోన్‌ని కూడా రమేష్‌ దాచిపెట్టాడని ఇప్పుడు 
నాకర్థమైంది. మొత్తంమీద అతను వైదేహికే కాదు, నాకు కూడా నమ్మకద్రోహం చేశాడు.

జరిగిన తప్పును ఎలా సరిదిద్దాలి... వైదేహికి ఎలా న్యాయం చెయ్యాలి..? ఈ ప్రశ్నలు నన్ను వేధించసాగాయి. అప్పుడే నా సెల్‌ మోగింది. ఫోన్‌ ఎత్తగానే రాజేష్‌ మాట్లాడాడు- ‘‘ఒరేయ్‌ రామ్‌, నేను పురోహితుడి దగ్గరికెళుతుంటే దారిలో వినోద్‌ ఫ్రెండ్స్‌ కనిపించారు. మాటల మధ్య వారు వినోద్‌ని చాలా మంచివాడనీ పద్ధతైనవాడనీ మెచ్చుకున్నారు. వారి మాటలు విన్న తర్వాత వినోద్‌ గురించి తమ్ముడు చెప్పింది నిజం కాదనిపించింది. ఎక్కడో తప్పు జరిగిందనిపిస్తోందిరా...’’ అన్నాడు.

‘‘తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలిసిందిరా. మావాడికి పెళ్ళి చేయటమే నేను చేసిన తప్పు’’ అంటూ జరిగినదంతా రాజేష్‌కి వివరంగా చెప్పాను.

‘‘అలాగైతే ఇప్పుడు పురోహితుడి దగ్గరికి వెళ్ళొద్దంటావా?’’ రాజేష్‌ అడిగాడు.

‘‘వెళ్ళు. ఇదే ముహూర్తంలో పెళ్ళి జరగాలి. కానీ రమేష్‌, అనితలకు కాదు...వినోద్‌, వైదేహిల పెళ్ళి జరగాలి’’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాను.

ఆ మాట విని వైదేహి ఉలిక్కిపడింది. ‘‘అదేమిటి, అలా అన్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది.

‘‘జరిగిన తప్పును దిద్దుకోవటానికి ఇదే సరైన పరిష్కారమమ్మా. నా తమ్ముడి స్వభావం గురించి తెలుసుకోకుండా వాడితో నీ పెళ్ళి చేసి నీకు అన్యాయం చేశాను. ఇప్పుడు మరోసారి వాడి పెళ్ళిచేసి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యలేను. నిజానికి రమేష్‌కి ఇప్పుడు కావాల్సింది పెళ్ళి కాదు... మానసిక చికిత్స! వాణ్ణి ముందుగా ఓ మంచి సైకియాట్రిస్ట్‌కి చూపించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తాను. వాడి మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే వాడి పెళ్ళి చేస్తాను. దీనికోసం అవసరమైతే నేను అమెరికా ఉద్యోగం వదిలేసి ఇక్కడికి తిరిగొస్తాను. డబ్బుకన్నా నాకు కుటుంబమే ముఖ్యం.

వైదేహీ, నువ్వు చెప్పింది నిజం. పెళ్ళికి ముందు- నేను నీ గుణగణాల గురించి తెల్సుకోవటానికి చూపిన శ్రద్ధ... నా తమ్ముడి గురించి తెలుసుకోవటంలో చూపలేదు. నాలాగా చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. తమ పిల్లల కోసం మంచి గుణగణాలున్న వధువు లేదా వరుడు కావాలని పాకులాడతారు కానీ, అవే గుణాలు తమ పిల్లలకున్నాయా అని ఆలోచించరు. ఈ సమస్యను ముందే పరిష్కరించుకుంటే పెళ్ళి తర్వాత సంసారంలో కలతలు రావు. విడాకులకు ఆస్కారమే ఉండదు. విదేశాల్లో మన వివాహ వ్యవస్థకు మంచి ఆదరణ ఉంది. ఒకసారి పెళ్ళి చేసుకుంటే పరస్పరం సర్దుకుపోతూ కలకాలం కలిసి ఉంటారని మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే పాశ్చాత్యుల్లో పెళ్ళి అనేది నూరేళ్ళ బంధం కాదు. పెళ్ళి చేసుకున్న తర్వాత చిన్న తేడా వచ్చినా విడిపోవటం అక్కడ సర్వసాధారణ విషయం. ఇప్పుడదే జాడ్యం మన యువతకు అంటుకుంటోంది. పెళ్ళి విలువ రమేష్‌కి తెలియదు. కానీ నీకూ వినోద్‌కూ తెలుసు. వినోద్‌ నిన్ను మూగగా ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కానీ, ఆ విషయం చెప్పటానికి భయపడుతున్నాడు. ఒకర్ని ప్రేమించటం గొప్ప విషయం కాదుగానీ, ఒకరి ప్రేమను పొందటం గొప్ప అదృష్టం. వినోద్‌ ప్రేమను పొందిన నువ్వు అదృష్టవంతురాలివి. వినోద్‌ని పెళ్ళి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావ్‌. నీకు ఇష్టమైతే అమ్మానాన్నలతో నేను మాట్లాడతాను. ఇదే ముహూర్తానికి మీ పెళ్ళి జరిపిస్తాను. నేను చేసిన తప్పును దిద్దుకుంటాను’’ అన్నాను.

నా మాటలు వినగానే వైదేహి కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల రాలాయి. ఆమె వెంటనే నా కాళ్ళమీద పడి ‘‘బావగారూ, మీరు మనిషి కాదు దేవుడు. మీ రుణం ఈ జన్మలోనే కాదు... ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది. నా గుండెలపై నుంచి ఓ పెద్ద భారం దిగిపోయినట్టు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.