close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదే చిదంబర రహస్యం!

శ్రీకాళహస్తి, జంబుకేశ్వర్‌, తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం... ఈ ఐదూ ప్రదేశాలూ గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం... అనే పంచభూతాల రూపంలో ఆ బోళాశంకరుడు కొలువైన పుణ్యస్థలాలు... అందుకే అవి పంచభూత క్షేత్రాలు... వాటిన్నింటినీ ఏకకాలంలో పర్యటించి ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కె.వాసవదత్త రమణ.


‘ఓం నమశ్శివాయ...’ పరమశివుడి పంచాక్షరీ మంత్రం... దీన్ని పఠిస్తేనే సకల పాపాలు నశించి మోక్షం ప్రసాదిస్తాడనేది భక్తుల విశ్వాసం. అలాంటిది ఆయన పంచభూతాల రూపంలో వెలిసిన ఆ పుణ్యస్థలాల దర్శనం పూర్వజన్మసుకృతమే అనిపిస్తుంది. అందుకే వాటన్నింటినీ ఒకే పర్యటనలో చూడాలనుకున్నాం. చెన్నైకి చేరుకుని అక్కడినుంచి 230 కి.మీ.దూరంలోని చిదంబరానికి బయలుదేరాం. దారిలో పాండిచ్చేరిలో ఆగి మనకుల వినాయకర్‌ దేవాలయాన్ని దర్శించుకుని, పక్కనే ఉన్న అరబిందో ఆశ్రమానికి వెళ్లాం. ఇదో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో అరబిందో తన శిష్యులతో ఇక్కడే నివసించి నిర్యాణం చెందారు. దగ్గరగా ఉన్న బీచ్‌లో కాసేపు ఉండి, కడలూరు జిల్లాలోని పిచ్చవరం మడ అడవుల దగ్గరకు వెళ్లాం. ఇవి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు. ద్వీపాలుగా ఉండే ఈ అడవులు పక్షులకూ జంతువులకూ ఆలవాలం. ఇక్కడకు అనేక వలస పక్షులు వస్తుంటాయి. ఇక్కడి నీళ్లలో పడవల్లో ప్రయాణిస్తూ వాటిని చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

చిదంబర రహస్యం! 
చిదంబరం చేరేసరికి సాయంత్రం నాలుగయింది. నలభై ఎకరాల విస్తీర్ణంలోని అతిపెద్ద ఆలయ ప్రాంగణం అది. ఆలయానికి ఉన్న 9 ముఖద్వారాలూ మానవశరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి. క్రీ.శ. రెండో శతాబ్దానికే ఈ ఆలయం ఉంది కానీ తరవాత 13వ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ పరమశివుడు ‘నటరాజ, చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, ఏ రూపమూ లేని దైవసాన్నిధ్యం’ అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడోదే నిరాకార రూపంలోని ఆకాశలింగం గా చెబుతారు. అంటే గర్భాలయం వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు కట్టి వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజారులు తెరను నామమాత్రంగా తొలగించి చూపుతారు. అక్కడ సాధారణ దృష్టికి ఏమీ అగుపించదు. కానీ మనోనేత్రంతో చూడగలిగినవాళ్లకు 
శివపార్వతులు కనిపిస్తారనేది నమ్మకం. స్వామివారు ఎవరికి కనిపిస్తారో ఏ రూపంలో కన్పిస్తారో తెలియదు కనుక అది చిదంబర రహస్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తెర తొలగించినప్పుడు కనిపించే ఆ చోటునే శివోహంభవ అనీ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనసు... ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవసాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం.

చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ నటరాజవిగ్రహంలోని కాలిబొటనవేలు భూమధ్యరేఖలోని బిందువని సూచిస్తుందనీ చెబుతారు. పరమశివుని ఆనంద తాండవ భంగిమ, సుప్రసిద్ధ భంగిమల్లో ఒకటి. స్వామి పాదం కింద ఉన్నది అజ్ఞానమనీ, చేతిలోని నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందనీ, పైకి ఎత్తిన చేయి సర్వ జగత్తునీ రక్షిస్తుందనీ, వెనక ఉన్న వలయం విశ్వానికి సంకేతమనీ, చేతిలోని ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుందనీ చెబుతారు. భరతనాట్యం ఈ నటరాజ దేవాలయం నుంచే వచ్చిందట. గర్భాలయ దర్శనం తరవాత శివగామి సుందరిని దర్శించుకుని వెనుతిరిగి వస్తూ వెనక్కి చూస్తే గోపురం మనవెంటే వస్తున్న అనుభూతి కలుగుతుంది.

జంబుకేశ్వర క్షేత్రం! 
దారిలో వైద్యనాథీశ్వరుడిగా పేరొందిన వైద్యనాథ కోవెల్లో ఈశ్వరుణ్ణి దర్శించుకుని అక్కడకు వంద కిలోమీటర్ల దూరంలోని తంజావూరుకి చేరుకున్నాం. రాత్రి అక్కడ బస చేసి తెల్లవారే బృహదీశ్వరుని ఆలయానికి చేరుకున్నాం. పదకొండో శతాబ్దంలో చోళులు నిర్మించిన అతిపెద్ద ఆలయమిది. ఇక్కడి శిల్పకళను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. శ్రీరంగంలోని రంగనాథుడిని చూశాక అఖిలాండేశ్వరి అమ్మవారిని చూసి, జలరూపంలో వెలసిన జంబుకేశ్వరుడి క్షేత్రమైన తిరువణైక్కవల్‌ ఆలయానికి వెళ్లాం. 
కావేరి, కొల్లిడం రెండు నదుల మధ్యలో రంగనాథ, తిరువణైక్కవల్‌ ఆలయాలు ఉన్నాయి. జంబుకేశ్వరుడి ఆలయం దాదాపు 18 వందల సంవత్సరాల నాటిది. ఆలయం లోపల ఐదు ఆవరణలు ఉన్నాయి. ఐదోదాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. ఇది రెండు అడుగుల వెడల్పుతో 25 అడుగుల ఎత్తులో సుమారు మైలు దూరం వరకూ వ్యాపించి ఉంది. నాలుగో ఆవరణలో 796 స్తంభాలు, విశాలమైన హాలు ఉన్నాయి. గర్భగుడి పశ్చిమ ముఖం అంతర్భాగమైన రాతి కిటికీలోంచి స్వామివారిని దర్శించుకోవాలి.  పార్వతీదేవి కావేరీ జలాలతో లింగాన్ని చేసి తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై జ్ఞానాన్ని బోధించాడట. అందుకే ఈ ఆలయాన్ని జ్ఞాన నేత్రం అనీ అంటారు. జల అంశతో కూడిన ఇక్కడి శివుడిని అప్పు(నీరు)లింగం రూపంలోనూ అమ్మవారిని అఖిలాండేశ్వరీదేవిగానూ పూజిస్తారు. ఇక్కడ అమ్మవారి, స్వామివారి ఆలయాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఇలాంటి దేవాలయాలను ఉపదేశా స్థలాలు అంటారు. గురుశిష్య బాంధవ్యంగా చెప్పుకోవడంతో ఈ ఆలయంలో కళ్యాణాలు జరగవు. జంబుకేశ్వరుడి దర్శనం అయ్యాక, అమ్మవారిని దర్శించుకున్నాం.

అరుణాచలేశ్వర్‌! 
తిరువణైక్కవల్‌ నుంచి నాలుగు గంటలపాటు ప్రయాణించాక సాయంత్రానికి తిరువణ్ణామలై చేరుకుని అరుణాచలేశ్వరుడి దర్శనానికి బయలుదేరాం. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అన్నామలైయర్‌ ఆలయానికి నాలుగు గోపురాలు ఉన్నాయి. ఎత్తైనది తూర్పు గోపురం. దీని ఎత్తు 217 అడుగులు. విజయనగర పాలనలో నిర్మించిన వెయ్యి స్తంభాలు అలాగే ఉన్నాయి.

ఈ ఆలయంలో శివుణ్ణి అగ్నిగా పూజిస్తారు. విష్ణు, బ్రహ్మ ఆధిపత్యంకోసం పోటీపడ్డారనీ ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు శివుడు మంటగా కనిపించి, మూలాన్ని కనుక్కోమని చెప్పగా వాళ్లిద్దరూ కనిపెట్టలేకపోయారనీ అందుకే అక్కడ స్వామి అరుణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడనీ చెప్పారు. కార్తిక ఉత్సవ సమయంలో ఈ ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో అన్నామలై పర్వతంమీద మూడుటన్నుల నేతితో ఓ పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఇక్కడ పౌర్ణమినాడు భక్తులు చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల పాపాలన్నీ పోయి, పునర్జన్మ ఉండదని చెబుతారు. రమణమహర్షి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా అనిపించింది.

కంచి ఏకాంబరేశ్వరుడు! 
అక్కడినుంచి కంచికి బయలుదేరాం. కంచిని వెయ్యి ఆలయాల నగరంగా పిలుస్తారు. ఉదయాన్నే ఏకాంబరేశ్వరుడినీ, కామాక్షినీ దర్శనం చేసుకున్నాం. పృథ్వీ లింగం కావడంతో ఇక్కడ స్వామిని మల్లె నూనెతో అభిషేకిస్తారు. శివుడి ఆగ్రహానికి గురయిన పార్వతీదేవి కాళి రూపంలో భూమ్మీదకి వచ్చి, ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వేగవతీ నది సమీపంలోని ఓ మామిడిచెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించి శివైక్యం చెందిందట. అందుకే ఈ ఆలయానికా పేరు. ప్రస్తుతం ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో 194 అడుగుల ఎత్తులో ఉంటుంది.

వాయురూపా... శ్రీకాళహస్తీశ్వరా..! 
చివరగా మా యాత్రలో మిగిలిన వాయులింగాన్ని చూడ్డానికి  కాంచీపురం నుంచి కాళహస్తి బయలుదేరాం. పూర్వం వాయుదేవుడు వేలసంవత్సరాలపాటు కర్పూర లింగం రూపంలో ఆ పరమశివుడిని ఆరాధించగా ఆయన ప్రత్యక్షమై- మూడు వరాలు కోరుకోమన్నాడట. అప్పుడు వాయుదేవుడు ప్రపంచమంతా తాను ఉండాలనీ ప్రతి జీవంలోనూ తాను భాగం కావాలనీ అక్కడ కొలిచే లింగాన్ని తన పేరుతో కలిపి సంబోధించాలనీ  కోరుకోగా అలాగే అని వరమిచ్చాడట శివుడు. అప్పటినుంచీ ఆ కర్పూరలింగమే వాయులింగంగా నీరాజనాలు అందుకుంటోంది. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవిని కనులారా దర్శనం చేసుకున్నాం. సువర్ణముఖీ నదీ తీరంలో వెలసిన స్వామి స్వయంభూలింగం. త‌మిళ‌ రచనల్లో ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా వర్ణించారు. శివలింగం ఇక్కడ చతురస్రాకారంలో ఉంటుంది.

స్థలపురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశం. సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడైన కన్నప్ప కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంలో పెనవేసుకుని ఉన్నాయి. కన్నడి భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజున కంటి నుంచి నెత్తురు కార్చాడట. అది చూసి కన్నప్ప వెంటనే తన కన్ను పీకి స్వామికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండో కంటి నుంచి కూడా రక్తం కారడంతో భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్ను పీకి స్వామికి అమర్చాడు. అంతట స్వామి ప్రత్యక్షమై కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడట.

విశాలంగా ఉన్న ఈ దేవాలయం పై కప్పుమీద రంగులతో చిత్రించిన అనేక చిత్రాలూ స్తంభాలపై శిల్పాలూ చెక్కి ఉన్నాయి. ఇక్కడ స్వామి ఉత్తరాభిముఖుడై దర్శనమిస్తాడు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఆవిధంగా మా పంచభూత ఆలయాల యాత్రని పూర్తిచేసుకుని తిరిగొచ్చాం.

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.