close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిట్టి దేశం.. గట్టి సందేశం!

అగ్రదేశమనీ, అభివృద్ధి చెందిన దేశమనీ... పెద్ద దేశమనీ, ప్రజాస్వామ్య దేశమనీ... అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనీ, పారిశ్రామిక కేంద్రమనీ... చాలా దేశాలు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటాయి. మ్యాప్‌లోనే కన్పించవంటూ చిన్నదేశాలను చిన్నచూపు చూస్తాయి. కానీ ఆ చిన్నదేశాలూ ఒక్కోసారి సత్తా చూపుతాయి. పెద్ద దేశాలకు సాధ్యం కాని పనులు చేసిచూపిస్తాయి. ‘ఔరా’ అనిపిస్తాయి.

చెత్తకు కొత్త అర్థం... సింగపూర్‌

మనకి బాగా సుపరిచితమైన పేరు- సింగపూర్‌. అక్కడ వీధులు అద్దాల్లా మెరుస్తుంటాయనీ భవనాలు అద్భుతంగా ఉంటాయనీ... చెప్పుకోవడం వింటుంటాం. అలా కన్పించడానికి సింగపూర్‌ చేసిన కృషి గురించి మనకు తెలిసింది తక్కువే. సింగపూర్‌కి 8కి.మీ. దూరంలో సముద్రంలో రెండు చిన్న దీవులు ఉన్నాయి. ఆ రెండు దీవుల్నీ కలుపుతూ మరో కృత్రిమ దీవిని తయారుచేసింది సింగపూర్‌. పచ్చని చెట్లతో ఓ పెద్ద అడవిగా, పర్యాటక ప్రాంతంగా మారిన ఆ దీవిని చెత్తతో తయారుచేశారంటే నమ్మలేం కానీ నూటికి నూరుపాళ్లూ నిజం. సింగపూర్‌ వైశాల్యంలో చాలా చిన్న దేశం. పెద్ద పెద్ద దేశాలకే చెత్త నిర్వహణ సమస్యగా మారినప్పుడు అంత చిన్న దేశానికి అది ఇంకా పెద్ద సమస్యే అయింది. అయితే సింగపూర్‌ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచానికి ఒక చక్కటి ఉదాహరణని చూపుతోంది.

నిజంగానే సింగపూర్‌ వీధులు ఎంతో శుభ్రంగా ఉంటాయి. పార్కుల్లో కానీ బీచిల్లో కానీ ఎక్కడా వ్యర్థాలనేవి కన్పించవు. ఇళ్లనుంచీ చెత్తని సేకరించడం చాలా పద్ధతిగా జరుగుతుంది. ఎక్కడికక్కడే తడిపొడి చెత్తనీ, ప్లాస్టిక్‌ వ్యర్థాల్నీ, రీసైకిల్‌ చేయడానికి అవకాశమున్న వాటినీ వేరుగా సేకరిస్తారు. పునర్వినియోగానికి పనికిరాని చెత్తనంతా విడిగా తీసుకెళ్లి ఓ చోట తగలబెడతారు. తగలబెట్టడమంటే మనలాగా అగ్గిపుల్ల గీసి పడేసి మంటపెట్టడం కాదు, శాస్త్రీయంగా ఇన్సినరేషన్‌ ప్లాంట్లలో తగలబెడతారు. దీన్నే మనం  చెత్తనుంచి విద్యుత్తు తీయడం అంటున్నాం. ఈ పద్ధతి వల్ల రెండు లాభాలున్నాయి. చెత్తని మామూలుగా తగలబెడితే వెలువడే కాలుష్యం దీనివల్ల వెలువడదు. మరో పక్క విద్యుత్తూ తయారవుతుంది. ఇలా చెత్తంతా తగలబడిపోయాక తయారయ్యే బూడిదనీ, రీసైకిల్‌ చేయడానికి వీలుకాని లోహాల చెత్తనీ కలిపి ట్రక్కుల్లో తీసుకెళ్లి టగ్‌బోట్లలో నింపుతారు. ఆ బోట్లు దాన్ని సముద్రంలోకి తీసుకెళ్తాయి. అలా రోజుకు కొన్ని వందల టన్నుల చెత్త ఆ దీవికి చేరుతోంది. చెత్తే కదా అని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు పడేయరు. టగ్‌బోట్స్‌లో వెళ్లిన చెత్తని ఒక పెద్ద గోడౌన్‌ లాంటి చోట దించుతారు. ఆ చెత్తని మళ్లీ ఒక వాహనంలో నింపి ఒక పద్ధతి ప్రకారం ఆ దీవుల తీరంలో సముద్రపుటొడ్డున పరుచుకుంటూ వచ్చారు. దానిమీద మళ్లీ మంచి మట్టి పరిచారు. ఆపై మొక్కలు పెంచి చక్కని పార్కులు అభివృద్ధి చేశారు. ఆటుపోట్ల మధ్య మారే సముద్ర నీటిమట్టానికి తగినట్లుగా ఇంటర్‌టైడల్‌ ప్రాంతాన్ని సముద్రపుగడ్డితో నింపారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రక్రియ వల్ల కొత్తగా ఏర్పడిన దీవి మీద దట్టమైన వనం ఏర్పడింది. అందులో రకరకాల వన్యప్రాణులూ సహజంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు అదంతా మామూలు అడవిలా కన్పిస్తుందే తప్ప బూడిద కుప్పగానో, చెత్తకుప్పగానో కాదు. చెత్తతో తయారైన నేల అని చెప్పినా నమ్మలేము. వాసన కానీ ఇతరత్రా కాలుష్యం కానీ ఉండదు. దాని చుట్టూ ఉన్న సముద్రంలో జీవులకు ఎలాంటి హానీ కలగలేదు. అవి ఎప్పటిలాగే ఉన్నాయి. ఇతర దేశాల్లో ల్యాండ్‌ఫిల్‌గా పేర్కొనే చెత్తకుప్పల వల్ల మీథేన్‌ ఎక్కువగా తయారై వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ప్రజల ఆరోగ్యాల్ని పాడుచేస్తుంది. దీనివల్ల అలాంటివేవీ ఉండవు. ఈసారి సింగపూర్‌ వెళ్తే ఆ చెత్త- సారీ, కొత్త దీవినీ చూసి రండి మరి!

నీరు పూర్తిగా ఉచితం... అర్మేనియా

అర్మేనియా వెళ్తే... అక్కడ రోడ్డు పక్కన చిన్న చిన్న ఫౌంటెయిన్ల లాంటి నిర్మాణాల్లో నిరంతరం ప్రవహించే నీటిని చూసి అయ్యో అని కంగారుపడకండి. అక్కడది మామూలే. రోడ్డు మీద వెళ్తున్న వాళ్లు దాహమైతే తాగడానికి చేసిన ఏర్పాటు. ఫౌంటెయిన్‌ అంటే మన దగ్గర లాగా అదే నీరు మళ్లీ మళ్లీ తిరగదు. పంపుల్లో వచ్చినట్లుగా ఆ ఫౌంటెయిన్‌లో ఎప్పుడూ మంచి నీరే వస్తుంటుంది. అలాగని వారికి నీటి విలువ తెలియకా కాదు, నీరు ఎక్కువైపోనూలేదు.

కట్టెయ్యడానికి వీలున్న పంపులు పెట్టుకోకుండా ఇలా రోజంతా నీటిని ఎగజిమ్ముతూ ఉండే ఫౌంటెయిన్లను వారు ఎందుకు పెట్టారంటే... ఒకప్పుడు నీటి కోసం తాము పడిన కష్టాలను మర్చిపోకుండా ఉండడానికీ, ఉచితంగా ఎప్పుడు పడితే అప్పుడు లభించే నీటిని ఆస్వాదించడానికీ, నీటికోసం ప్లాస్టిక్‌ సీసాలు వాడకుండా ఉండడానికీ. నీటి విషయంలో ఈ దేశం చేసిన ప్రణాళికాబద్ధమైన కృషి ప్రశంసనీయం. సోవియట్‌ యూనియన్‌ విడిపోయినప్పుడు అర్మేనియాలో నీటి పరిస్థితి దారుణంగా ఉండేది. వారు ఆ సమస్యను అధిగమించిన తీరు... పాలకులూ ప్రజలూ చేయీ చేయీ కలిపి పనిచేస్తే మంచి ఫలితాలు ఎలా పొందవచ్చో చెప్పడానికి నిదర్శనం.

అర్మేనియా పర్వతప్రాంతం కావడంతో నదులన్నీ వేగంగా కిందికి ప్రవహిస్తాయి. ఆ నదుల నుంచి నీటిని పక్కకి మళ్లించి సంరక్షించుకోవడానికీ, నగరాలకు సరఫరా చేసే పంపింగ్‌ వ్యవస్థకీ చాలా విద్యుత్తు అవసరమయ్యేది. పాడుబడిపోయిన పైపుల వల్ల మూడొంతుల నీరు వృథా అయ్యేది. పంపింగ్‌ వ్యవస్థ నిరంతరంగా పనిచేసినా రోజుకి అరగంట కూడా నీటిసరఫరా ఉండేది కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. పరిస్థితుల్ని సమీక్షించిన ప్రభుత్వం జలవనరుల నిర్వహణని పీపీపీ విధానానికి మార్చింది. ప్రభుత్వమూ ప్రైవేటు సంస్థలూ సమాన భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తున్నాయి. దీనివల్ల బాధ్యతలను పంచుకోవడానికి వీలు చిక్కింది. ప్రైవేటు భాగస్వాములు తక్షణ అవసరాలపై దృష్టి పెట్టి పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించారు. నీటి సరఫరాని క్రమబద్ధం చేశారు. మరోపక్క ప్రభుత్వం భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలపు ప్రణాళికలపై దృష్టిపెట్టింది. ఎత్తిపోతల పథకాలు తగ్గించి నీటి వాలుకు అనుగుణంగా అంచెలంచెలుగా రిజర్వాయర్లను నిర్మించింది. సహజ నీటివనరులను కాపాడుతూ సంరక్షణ చర్యలూ చేపట్టింది. ఆధునిక యంత్రాలనూ, నాణ్యమైన పైపులనూ వాడి మొత్తంగా సరఫరా వ్యవస్థను సంస్కరించారు. దాంతో విద్యుత్తు ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. నీటి వృథా అసలు లేదు. ఇప్పుడు నీరు నిరంతరాయంగా సరఫరా అవుతోంది. రోడ్డు పక్కన తాగునీటి ఫౌంటెయిన్లు ప్రవహిస్తూనే ఉంటాయి. ఒకసారి ఫౌంటెయిన్‌ నుంచి బయటకు వచ్చిన నీరు మరో పైపు ద్వారా కిందికి వెళ్లిపోతుంది. ఆ నీటిని పార్కులకీ ఇతర అవసరాలకీ మళ్లిస్తారు. ఇప్పుడు అర్మేనియన్లు తమ దేశం గురించి ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఫ్రీ వాటర్‌’ అని చెప్పుకుంటున్నారు.

 

పట్టుదలకి ప్రతిరూపం... ఈ-స్తోనియా

ఎస్తోనియానే ఇప్పుడు ఆ దేశప్రజలు ఈ-స్తోనియా అని పిలుచుకుంటున్నారు. వివాహమూ విడాకులూ తప్ప మిగతావన్నీ ఆన్‌లైన్‌లోనే అయిపోతాయి మరి... అని సరదాగా నవ్వుకుంటున్నారు. ఆ పేరు తెచ్చుకోవడానికి ఆ చిన్ని దేశం చేసిన కృషి గురించి వింటే ముచ్చటేస్తుంది. అందుకు తగినట్లుగానే ఇప్పుడు డిజిటలైజేషన్‌ పాఠాలు నేర్పే సంస్థలకి అదో అద్భుతమైన కేస్‌ స్టడీ అయింది. 1991లో స్వాతంత్య్రం వచ్చింది ఎస్తోనియాకి. ప్రపంచమంతా ఆర్థిక, సాంకేతిక విప్లవాలతో 21వ శతాబ్దంలోకి దూసుకుపోతున్న రోజులవి. అణచివేతకు గురైన ఆ దేశంలోని వ్యవస్థలు మాత్రం 19వ శతాబ్దం తరహాలో ఉన్నాయి. టెలిఫోన్‌ కనెక్షన్లు కూడా అరుదే. పక్కనే ఉన్న ఫిన్లాండ్‌ ఆ దేశాన్ని చూసి జాలిపడి తాము డిజిటలైజేషన్‌ దిశగా వెళ్తున్నామనీ కావాలంటే తమ పాత టెలిఫోన్‌ ఎక్చ్సేంజీని ఇచ్చేస్తామనీ చెప్పింది. అది 1970ల నాటి అనలాగ్‌ ఎక్చ్సేంజ్‌. ఏమీ లేని చోట ఏదో ఒకటిలే అని ఎస్తోనియా ఎగిరి గంతేసి తీసుకోలేదు. అందరూ డిజిటల్‌ దిశగా వెళ్తోంటే మేం మాత్రం దీన్ని తీసుకుని ఏంచేస్తాం వద్దులెమ్మంది. అలా అని ఊరుకోలేదు. పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిజిటలైజేషన్‌ని ఆ దేశం ఎక్కడినుంచి మొదలుపెట్టిందో తెలుసా? స్కూళ్లనుంచీ. 1997 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన ఐదారేళ్లకల్లా దేశంలోని బడుల్లో 97 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. పిల్లల హాజరుతో మొదలుపెట్టి హోంవర్కులూ ప్రోగ్రెస్‌కార్డుల వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే. ఆ తర్వాత మూడేళ్లకి ప్రభుత్వ వ్యవస్థలూ ఆన్‌లైన్‌ అయ్యాయి. జీవోలూ చట్టాల డ్రాఫ్టులనుంచీ ఏ కీలకపత్రమైనా సరే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటుంది. పదిహేనేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఈ-పౌరసత్వం తీసుకోవాలి. ప్రత్యేకంగా డిజిటల్‌ సంతకంతో, చిప్‌తో కూడిన గుర్తింపుకార్డే అన్ని పనులకూ కీలకం. పన్నులూ, బిల్లులూ ఆఖరికి పార్కింగ్‌ ఫీజుతో సహా మొబైల్‌ఫోనుతో కట్టేస్తారు. పౌరుల హెల్త్‌రికార్డులూ వ్యాపారస్తుల లావాదేవీలూ సమస్తం అందులోనే. దీనివల్ల పారదర్శకత పెరిగింది. నిమిషాల్లో పనులు అయిపోతున్నాయి. ఇంతగా వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో ఉంటున్నా అది దుర్వినియోగం కాకుండా ఎక్కడికక్కడ దానికి తగిన భద్రతావ్యవస్థని అభివృద్ధి చేసుకోగలగడం ఎస్తోనియా ప్రత్యేకత. పౌరులు తమ సమాచారాన్ని తాము తప్ప మరొకరు ఎవరు ఉపయోగించినా క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. ఈ మార్పులన్నిటికీ ప్రతి దశలోనూ ప్రజల మద్దతు తీసుకుంటూ అంచెలంచెలుగా ముందుకు సాగింది ప్రభుత్వం. ఇంటర్నెట్‌ని ప్రతి వ్యక్తికీ హక్కుగా ప్రకటించిన ఆ దేశమంతటా ఆరేళ్లక్రితమే ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. జనరల్‌ ఎలక్షన్లని పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన తొలిదేశం ఎస్తోనియా. ఒకప్పుడు సొంత సర్వర్‌ ఏర్పాటుచేసుకునే స్తోమత లేని దేశం అది. ఇప్పుడు డేటాబేస్‌ని సమర్థంగా, సురక్షితంగా కాపాడుకునే సాంకేతిక వ్యవస్థని సొంతంగా సృష్టించుకోగలిగింది. ఎస్తోనియా ఈ స్థాయిలో అభివృద్ధిచెందడానికి పరోక్షంగా కారణమైన ఫిన్లాండ్‌ డిజిటలైజేషన్‌ని పాక్షికంగానే చేయగలిగింది. ఇప్పుడు ఎస్తోనియా సహకారంతో ముందుకు సాగుతోంది.

 

మహిళాశక్తికి మరో పేరు... రువాండా

ఇరవై నాలుగేళ్లక్రితం అక్కడో మారణహోమం జరిగింది. అంతర్యుద్ధం కారణంగా మూడు నెలల్లో ఎనిమిది లక్షల మంది శవాలయ్యారు. బడులూ ప్రార్థనాలయాలూ ప్రభుత్వ కార్యాలయాలూ అన్నీ విధ్వంసానికి గురయ్యాయి. ప్రపంచ పత్రికలన్నీ అది దేశం కాదు, శ్మశానం అని రాశాయి. మగవారిలో అధికసంఖ్యాకులు మరణించగా, వారి చావును కళ్లారా చూస్తూ మిగిలిన మహిళలు పిచ్చివారు కాకుండా మనుషుల్లా మనగలుగుతారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే పోయినవారు పోగా మిగిలిన జనాభాలో 70 శాతం మహిళలే. వారిలో సగానికి పైగా అత్యాచారాలకు గురైనవారే. తమను హింసించిన వారి బిడ్డలకు తల్లులైనవారే. అత్యాచారం ఫలితంగా తమ కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ చనిపోయిన కుటుంబసభ్యుల అంత్యక్రియలు పూర్తి చేయడానికే ఆ మహిళలకు కొన్ని నెలలు పట్టింది. అక్కడి ప్రభుత్వమూ ప్రజలూ కుదుటపడడానికీ, నాశనమైన వ్యవస్థలన్నిటినీ సరిచేసుకోవడానికీ కనీసం వందేళ్లయినా పడుతుందన్నది అప్పటి పరిశీలకుల అంచనా. ఆ అంచనాల్ని తిరగరాశారు మహిళలు. వారంతా, ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ రెండు దశాబ్దాల్లోనే అటు సంసారాల్నీ, ఇటు దేశాన్నీ పునర్నిర్మించుకున్న పద్ధతి మహిళా సాధికారతకి చక్కటి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు రువాండా ఆఫ్రికాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అందమైన కట్టడాలతో అలరారే ఆ దేశాన్ని ‘ఆఫ్రికా సింగపూర్‌’ అంటారు. అక్కడ అవినీతిరహిత, సుస్థిర పాలన కొనసాగుతోందంటే అందుకు కారణం అన్నిరంగాల్లోనూ స్పష్టంగా కన్పించే మహిళల పాత్ర. కొత్త రాజ్యాంగం చట్టసభల్లో 30 శాతం స్థానాల్ని స్త్రీలకు తప్పనిసరి చేసింది. కానీ అక్కడి మహిళలకు రిజర్వేషన్ల అవసరమే రాలేదు. వారు ఏకంగా 64 శాతం స్థానాలు గెలుచుకుని ప్రపంచంలోనే అత్యధిక మహిళలున్న చట్టసభగా చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలో మహిళల పాత్ర పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ సమానత్వానికి ప్రాధాన్యం పెరిగింది. చదువుల్లో ఉద్యోగాల్లో స్వయం ఉపాధిరంగాల్లో... ఎక్కడ చూసినా మహిళలే. వ్యవసాయం చేశారు.

ఇటుక బట్టీలు పెట్టారు. భవనాలు కట్టారు. ఆస్పత్రులు పెట్టారు. పిల్లల్ని చదివించారు. ఆ దేశ పునర్నిర్మాణంలో మూడొంతుల పాత్ర మహిళలదే. ఒకప్పుడు గృహ హింసా మహిళల పట్ల నేరాలూ విచ్చలవిడిగా సాగిన ఆ దేశమే ఇప్పుడు సమానత్వ సాధనకు సమీపంగా ఉన్న తొలి ఐదు దేశాల్లో ఒకటి.

క్రీడల్లో మేటి... దక్షిణ కొరియా

చైనా, జపాన్‌ తర్వాత ఆసియా క్రీడారంగంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న దేశం దక్షిణ కొరియా. ఒకప్పుడు తైక్వాండో, తైక్కియాన్‌, సిరియం, కొరియన్‌ రెజ్లింగ్‌ లాంటి మార్షల్‌ క్రీడలకు పుట్టినిల్లయిన కొరియా ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ ఒలింపిక్స్‌లోనూ పతకాల చిట్టాలో పైపైకి ఎగబాకుతోందంటే, స్పోర్టింగ్‌ పవర్‌ హౌస్‌గా పేరొందిందంటే దాని వెనక చాలా పద్ధతిగా సాగుతున్న కృషి ఉంది. ఈ కృషిలో ప్రభుత్వమూ ప్రజలూ సమాన పాత్ర పోషించడం విశేషం.

ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ, గోల్ఫ్‌... ఇలా ప్రతి ఆటకీ అక్కడ ప్రత్యేక క్లబ్బులున్నాయి. లక్షలాది క్రీడాభిమానుల సంఘాలున్నాయి. ప్రభుత్వం వీటిని ప్రోత్సహించడంతో అవి తరచూ టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతలో ఉత్సాహం నింపుతుంటాయి. అక్కడి యువతకి సహజంగానే ఆటలంటే ఇష్టం. ఆ ఇష్టానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం తోడై అదే క్రీడారంగంపైన పెట్టుబడిగా మారుతోంది. క్రీడాస్ఫూర్తిని రగిలించడానికి తరచూ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తూంటుంది. ఇక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా సంస్థల్ని నెలకొల్పింది. మారథాన్‌ క్లబ్బులైతే వర్షాకాలం మినహా మిగతా రోజుల్లో ప్రతి వారాంతమూ పరుగులు నిర్వహిస్తూనే ఉంటాయి. ట్రెకింగ్‌, హైకింగ్‌, సైక్లింగ్‌ లాంటి వాటికీ ఆదరణ ఎక్కువే.

సైన్సునీ క్రీడల్నీ కలిపి అక్కడి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయోగం లండన్‌ ఒలింపిక్స్‌నుంచీ మంచి ఫలితాలనిస్తోంది. కొరియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్‌సైన్స్‌లో క్రీడలూ సైకాలజీ, ఫిజియాలజీ లాంటి పలురంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. వీరందరి సమన్వయంతో ఒక్కో క్రీడాకారుడి బలాలూ బలహీనతలను అంచనావేస్తారు. ఒడ్డూపొడుగూ, దేహదారుఢ్యం, మానసిక స్థైర్యం... ఇలాంటివన్నీ పరిశీలించి వాటికి తగినట్లుగా ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ శిక్షణ విధానాన్ని రూపొందిస్తారు. శిక్షణ సమయంలోనూ పోటీల సమయంలోనూ ఈ నిపుణులంతా క్రీడాకారుడి వెన్నంటే ఉంటారు. క్రీడాకారుల ప్రాక్టీస్‌కి అవసరమైన ఇండోర్‌, అవుట్‌డోర్‌ మైదానాలూ, వసతి గృహాలూ తగినన్ని ఉన్నాయి. పతకం తెస్తే క్రీడాకారుడికి ఏమివ్వాలనే దానిపై కాక పతకం తెచ్చేలా క్రీడాకారుడిని తీర్చిదిద్దడంపైన అక్కడి ప్రభుత్వం శ్రద్ధ పెట్టడమే ఆ దేశం క్రీడల్లో పెద్ద పెద్ద దేశాలను పక్కకు నెట్టి విజేతగా నిలవడానికి కారణమైంది.

లీక్వాన్‌ యూ ముందుచూపూ పట్టుదలా సింగపూర్‌ని అందరూ ఆరాధించే దేశంగా మారిస్తే పాలకులూ ప్రజలూ చేయీచేయీ కలిపి అర్మేనియా, రువాండా, ఎస్తోనియాలను అగ్రస్థానాన నిలిపారు. అపరిమితమైన యువశక్తికి ఆటలతో కళ్లెం వేసి అటు వారికీ ఇటు దేశానికీ పేరు తెచ్చుకుంటోంది దక్షిణకొరియా.

పిట్ట కొంచెం కూత ఘనమన్న నానుడిని నిజం చేస్తున్న ఈ దేశాలు  పరిమాణాన్ని బట్టో జనాభాని బట్టో ఓ జాతి శక్తిని అంచనా వేయొద్దనీ ప్రజల శక్తిసామర్థ్యాల్నీ నాయకుల చిత్తశుద్ధినీ కూడా లెక్కేసుకోమనీ ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్నాయి, తమ సత్తా చాటుతున్నాయి.

- పద్మశ్రీ యలమంచిలి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.