close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాగన్నా... మమ్మేలుమన్నా!

హైందవ సంప్రదాయంలో సర్పానికి ప్రత్యేక స్థానముంది. విశేష తిథుల్లో నాగదేవతగా సర్పాన్ని కొలిచే ఆచారముంది. అలాంటి తిథుల్లో విశిష్టమైందే కార్తిక మాసంలో వచ్చే నాగుల చవితి. దీపావళి వెళ్లిన నాలుగో రోజున వచ్చే ఈ పర్వదినాన పిల్లాజెల్లతో కలిసి జనమంతా పుట్టలో పాలు పోసి నాగేంద్రుడి ఆశీర్వాదాలు తీసుకోవడం పరిపాటి. (ఈరోజు నాగుల చవితి)

శ్రీమహావిష్ణువుకు పానుపుగా, మహాగణపతికి యజ్ఞోపవీతంగా, పరమేశ్వరుడికి కంఠహారంగా, క్షీరసాగరాన్ని చిలికేందుకు సాయపడ్డ వాసుకిగా... ఇలా పురాణేతిహాసాల్లో సర్ప ప్రశస్తి కనిపిస్తూ ఉంటుంది. నాగపూజ కూడా భారతీయ సంప్రదాయంలో అంతే సనాతనమైనదిగా దర్శనమిస్తుంది. అంతేకాదు, వివాహ విషయమైనా, సంతాన ఇబ్బందులైనా, అన్యోన్య దాంపత్యం కోసమైనా... ఇలా నిత్య జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలు సజావుగా సాగేందుకు సర్పదోష నివారణ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, నాగ పంచమి, స్కంద పంచమి... ఇలాంటి ప్రత్యేక తిథుల్లో నాగపూజ చేయడం విశేష ఫలాన్నిస్తుందంటారు. కుటుంబ శ్రేయస్సుకీ, ఆరోగ్య పరిరక్షణకూ, అపమృత్యు దోషాలు పోగొట్టేందుకూ, నేత్ర కర్ణ ఉదర వ్యాధుల నివారణకూ కూడా ఈ నాగపూజను చేస్తుంటారు. కార్తిక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే ప్రాచీన గ్రంథం చెబుతోంది. స్కంద పురాణం కార్తిక శుద్ధ చవితి నాటి పూజను శాంతి వ్రతంగా వర్ణించింది.

నాగపూజ 
చవితి రోజు తెల్లవారు జామునే లేచి స్నానపానాదులు పూర్తి చేసుకుని చలిమిడినీ, నువ్వులూ బెల్లంతో చేసిన చిమ్మిరినీ నాగేంద్రుడికి నైవేద్యంగా తయారు చేస్తారు. పుట్ట దగ్గరకు వెళ్లి అలికి ముగ్గులు పెట్టి ఆవుపాలు, చలిమిడి, చిమ్మిరి, అరటి పండ్లూ, తదితరాల్ని పుట్టలో వేసి పసుపూ కుంకుమలతో ఆ పుట్టను పూజించి వస్తారు. అంతేకాదు పుట్టలో పాలు పోసేప్పుడు... 
‘నన్నేలు నాగన్న నా కులమునేలు 
నా కన్నవారల నా యింటి వారల 
ఆప్తుల మిత్రుల అందరను నేలు 
పడగ త్రొక్కిన పగవాడనుకోకూ 
నడుము త్రొక్కిన నావాడనుకొనుమూ 
తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము 
ఇదిగో! నూక నిచ్చెదను మూకను నాకిమ్ము 
పిల్లల మూకను నాకిమ్ము’ 

అని పాడుతారు. తెలిసీ తెలియక నిన్ను తొక్కినా నావాళ్లే అనుకో అంటూ వేడుకుంటారు. బియ్యపు నూకను పుట్ట మీద పోస్తూ నూకలు తీసుకుని పిల్లల మూకనివ్వు నాగన్నా అని మొక్కుతారు. తర్వాత పుట్టమన్నును తీసుకుని చెవులకూ కళ్లకూ పొట్టకూ రాసుకుంటారు. ఇది ఆయా అవయవ సంబంధిత రోగాల నివారణకని చెబుతారు. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి పొయ్యి మీద వండని ప్రసాదాల్ని మాత్రమే స్వీకరిస్తారు. మరునాడు చల్ది పాల పేరిట మళ్లీ పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి వచ్చి భోజనం చేస్తారు.

భారత కథ 
నాగవ్రతానికి సంబంధించి భారతంలోని ఒక కథ విశిష్టంగా కనిపిస్తుంది. సర్పజాతికి ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ ఇది. ఈయన జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. తండ్రి పేరు జరత్కారుడు. చిన్నవయసులోనే సకల విద్యలూ అభ్యసించి ఆస్తీకుడు గొప్పజ్ఞానిగా పేరుపొందుతాడు. మరోవైపు పరీక్షిత్తు మహారాజు పాముకాటు వల్ల చనిపోతాడు. అందుకు ఆగ్రహించిన ఆయన కొడుకు జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి ఆ అగ్నిగుండంలో పడి మరణిస్తుంటాయి. మిగిలిన సర్పాలు జరత్కారువు దగ్గరికి వెళ్లి తమను రక్షించమని ప్రార్థిస్తాయి. ఆమె ఎలాగైనా రాజుతో ఆ యాగాన్ని ఆపించాలని తన కుమారుణ్ణి కోరుతుంది. ఆస్తీకుడు జనమేజయుడి దగ్గరకు వెళతాడు. తన పాండిత్యంతో అతడిని మెప్పిస్తాడు. జనమేజయుడు ఆస్తీకుణ్ణి సత్కరించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో సర్పయాగాన్ని ఆపడమే తనకు పెద్ద సత్కారమనీ, సర్పహింస ఇకనైనా మానమనీ కోరతాడు ఆస్తీకుడు. అందుకు అంగీకరించిన జనమేజయుడు సర్పయాగాన్ని ఆపుతాడు. అలా సర్పాల్ని రక్షించిన ఆస్తీకుడి కథను నాగులచవితి నాడు వింటే సకల సర్పదోషాలూ నివారణ అవుతాయన్నది పురాణోక్తి.

నిజానికి పంటలను నాశనం చేసే ఎలుకల్ని బొరియల్లోకి వెళ్లి మరీ చంపడం ద్వారా నిండుగా ధాన్యం ఇంటికి చేరేందుకు సాయపడే నాగన్నకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన్ను పూజించే జీవవైవిధ్య పండగగానూ నాగుల చవితిని చెప్పుకుంటారు. ఏదేమైనా అనంత ప్రాణికోటిలో పరమాత్మ రూపాన్నేచూడాలన్న ఆర్ష వాక్కుకి ఈ పండగ నిలువెత్తు నిదర్శనం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.