close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలోవెరాతో మిలమిల..!

చలికాలం వచ్చిందంటే చాలు, అప్పటివరకూ మృదువుగా ఉండే చర్మం పగిలి మంట పుడుతుంటుంది. దీనికి అలోవెరా మంచి పరిష్కారమనీ ఇది మాయిశ్చరైజర్‌, క్రీమ్‌, నేచురల్‌ క్లెన్సర్‌, స్క్రబ్‌లా పనిచేస్తుందనీ అంటున్నారు సౌందర్యనిపుణులు. అలోవెరాలో ఉండే విటమిన్లూ ఖనిజాలూ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి. చేయాల్సిందల్లా....

* టేబుల్‌స్పూను అలోవెరా జెల్‌లో అరటీస్పూను ఆలివ్‌నూనె, టీస్పూను ఓట్‌మీల్‌ కలిపి మెత్తని పేస్టులా చేసి ముఖానికీ చర్మానికీ పట్టించి చల్లని నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల చర్మంమీద ఉన్న మృతకణాలన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. 
* టేబుల్‌స్పూను అలోవెరా గుజ్జులో రెండుమూడు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి ఓ గంట తరవాత కడిగేయాలి. దీనివల్ల ముఖంమీద ఉన్న మచ్చలుపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. 
* అలోవెరా గుజ్జుని పేస్టులా చేసి అందులో కాస్త తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసి 20 నిమిషాల తరవాత కడిగేసినా మంచిదే... చర్మం మెరుస్తుంటుంది. 
* కీరాముక్కలు, అలొవెరాగుజ్జు, పెరుగు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బి రెండుమూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తరవాత కడిగేసినా పొడిబారిపోయిన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

ఉపవాసం వద్దు!

‘రివర్స్‌ ఫాస్టింగ్‌’... వినడానికే కొత్తగా ఉంది కదూ. కానీ దీనివల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయనీ, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు పొట్ట మాడ్చుకోవడం కన్నా తినే టైమింగ్స్‌ని మార్చుకుంటే చాలు, క్రమంగా బరువు తగ్గడంతోబాటు, పొట్ట రాదనీ, బీపీ తగ్గుతుందనీ... అదే రివర్స్‌ ఫాస్టింగ్‌ అనీ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేకి చెందిన నిపుణులు. ఉదాహరణకు చాలామంది పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట తిని పడుకుంటారు. అలా చేయడం కన్నా రాత్రి 9 గంటలకు తినే ఆహారాన్ని సాయంత్రం ఐదు- ఆరు గంటల మధ్య తినాలి. అలాగే ఉదయాన్నే తినే అల్పాహారాన్ని ఓ గంటన్నర వెనక్కి జరిపి ఎనిమిదీ తొమ్మిది మధ్య తినాలి. లంచ్‌ వేళలో పెద్దగా మార్పు అవసరం ఉండదు. ఇలా చేయడం వల్ల పస్తులతో పని లేకుండానే బరువు తగ్గొచ్చు. ఎందుకంటే జీవగడియారం ఆ పద్ధతికే అలవాటుపడటంతో సూర్యాస్తమయం తరవాత జీర్ణక్రియ మందగిస్తుంది. మళ్లీ ఉదయం వరకూ ఏమీ తినరు కాబట్టి దాదాపు 12- 15 గంటలపాటు ఉపవాసం చేసినట్లే. దాంతో శరీరంలో పేరుకున్న కొవ్వులు నెమ్మదిగా కరుగుతాయి. పైగా పగటివేళతో పోలిస్తే రాత్రి సమయంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఉండదు, ఎటూ నిద్రపోతారు కాబట్టి ఆకలీ అనిపించదు అంటున్నారు సదరు పోషకనిపుణులు. పైగా ఇది కొత్తదేం కాదనీ ఆదిమ మానవుడు అనుసరించిన జీవన విధానమేననీ చెప్పుకొస్తున్నారు.

కౌగిలింత... మంచి మాత్ర!

ఆత్మీయులూ స్నేహితులూ కనిపించినప్పుడు కౌగిలింత మంచి పలకరింత అన్నది తెలిసిందే. అయితే ప్రేమికులూ దంపతులూ ఏదో ఒక విషయమై పోట్లాడకుని ఎడమొహం, పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు చొరవ తీసుకుని అవతలివాళ్లను హత్తుకుంటే అప్పటివరకూ ముడుచుకున్న ముఖం విప్పారుతుందనీ కౌగిలింత మంచి మాత్రలా పనిచేస్తుందనీ గుర్తించారు కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు దాదాపు 400 మందిమీద చేసిన అధ్యయనంలో- తరచూ ఒకరినొకరు కౌగిలించుకునే దంపతులు శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లూ అలాంటివాళ్లకి ఎదుటివాళ్లతో సంబంధబాంధవ్యాలు బాగున్నట్లూ గుర్తించారు. అంతేకాదు, భార్య లేదా భర్త ఒత్తిడితో ఉంటే, మాటలతో ఊరడించడం కన్నా దగ్గరకు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.

గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే...

రాత్రిపూట మజ్జిగలో అన్నం వేసి పులియబెట్టిన తరవాణిని పాత తరంవాళ్లు తింటుంటారు. ఉదయాన్నే అది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనీ చెబుతారు. ఆ విషయాన్నే ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్రన్‌ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు. ముఖ్యంగా పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, చీజ్‌... వంటి వాటిల్లో ప్రొటీన్లూ ఇతరత్రా పోషకాలతోబాటు కాల్షియం, విటమిన్‌-డి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు రెండువేలమందిని ఎంపికచేసుకుని దాదాపు ఇరవయ్యేళ్లపాటు వాళ్ల ఆహారపుటలవాట్లని నిశితంగా గమనించగా- అందులో పులియబెట్టిన పాల ఉత్పత్తులు తినేవాళ్లలో- తిననివాళ్లతో పోలిస్తే హృద్రోగాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తెలిసి చేసినా తెలియక చేసినా మనం తినే పెరుగు, ఇడ్లీ, దోసె... వంటివన్నీ 
కూడా పులియబెట్టడం ద్వారా వచ్చినవే. కాబట్టి అవి ఆరోగ్యానికి అన్నివిధాలా మంచివేనన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.