close

చౌకగా క్యాన్సర్‌ మందు తయారుచేశా!

తెలుగువాడికంటూ కొన్ని లక్షణాలున్నాయి. ముక్కుసూటిదనం, ఎవ్వరికీ తలవంచని తత్వం, నచ్చితే ఎంతటి కార్యమైనా నెత్తినేసుకునే బోళాతనం... ఇలా. సాధారణంగా ఈ లక్షణాలన్నీ వ్యక్తిగతంగా మనకి నష్టమే కలిగిస్తాయి. కానీ ఇవే ఆళ్ళ వెంకటరామారావుని తెలుగువారు గర్వించదగ్గ రసాయనశాస్త్రవేత్తగా నిలిపాయి. బ్లడ్‌ క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులకి అతితక్కువ ఖర్చుతో మందుల తయారీ పద్ధతుల్ని కనిపెట్టి ప్రపంచానికి భారత్‌ సత్తా చాటేలా చేశాయి. ఆ ప్రయాణంలోని మైలురాళ్లివి..

‘మీకు నేను రెండోభార్యనే. మీ మొదటి భార్య ఆ కెమిస్ట్రీయే. అయినా అదంటే అంత పిచ్చేమిటో...!’ నా భార్య అప్పుడప్పుడూ నన్నిలా దెప్పుతూ ఉంటుంది. తనకెప్పుడూ చెప్పలేదుకానీ... కెమిస్ట్రీ నాకు పరిచయం కావడానికి ముందు నాకు రెండు వ్యామోహాలుండేవి. ఒకటి... సినిమా. రెండోది... పేకాట. ఆ రెండిటి మాయలో పడి నేను పదో తరగతి ఫెయిలయ్యాను కూడా! మాది గుంటూరు. నాన్న ప్రభుత్వాఫీసులో క్లర్కు. ఆయనకి బదిలీలు ఎక్కువకాబట్టి తొమ్మిదో తరగతిదాకా నా చదువు సరిగ్గా సాగలేదు. ఇలాకాదని మా నాన్న నన్ను గుంటూరులో నాన్నమ్మవాళ్ల దగ్గర ఉంచాడు. అక్కడే హిందూ హైస్కూల్లో పదో తరగతిలో చేర్చాడు. ఆ స్వేచ్ఛతో మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్లేవాణ్ణి. ఏఎన్నార్‌ ‘బాలరాజు’ సినిమా ఏ యాభై అరవైసార్లో చూసుంటాను! సినిమాలతోపాటూ పేకాటా అలవాటైంది. అలా పదో తరగతి ఫెయిలైపోయాను. పైగా మా ఇంట్లో తొమ్మిదిమంది సంతానం. అందరిలోకీ పెద్దవాణ్ణయి ఉండీ పదోతరగతి తప్పడం చిన్నతనంగాఅనిపించింది. మళ్లీ బడికెళ్లి పదోతరగతి రాస్తానని చెప్పాను. ఈసారి నాన్న నన్ను అత్తయ్యవాళ్లింట్లో ఉంచాడు. శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. అది 1945ల నాటి కరవు సమయం. అత్తయ్యవాళ్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. నాన్న నా కోసం నెలకి పంపే 40 నలభైరూపాయలతోనే ఇల్లు గడవాల్సిన పరిస్థితి. రోజుకి ఒక్కపూటే అన్నం తినేవాళ్లం. తినగా మిగిల్తేనే రాత్రి భోజనం ఉండేది! ఆ పరిస్థితుల్లోనే పదో తరగతి రాసి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను.

నేను విన్లేదు... 
నాకు మ్యాథ్స్‌ అంటే భయం ఉండటం వల్ల కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్‌ గ్రూప్‌ తీసుకున్నా. గుంటూరు హిందూ కాలేజీలో చేరాను. రసాయనశాస్త్రంపైన పిచ్చో వెర్రో... ఏదో మొదలైంది అక్కడే. మా పాఠ్యపుస్తకాలే కాకుండా లైబ్రరీకి వెళ్లి చదివేవాణ్ణి. పుస్తకాల్లోనే కాదు నా చుట్టూ ఉన్న ప్రతి రంగూ, వాసనా, రుచీ అన్నింటా నాకు కెమిస్ట్రీయే కనిపించేది. ఆ ఆసక్తి కారణంగా ఇంటర్‌లోనూ మంచి మార్కులతో పాసయ్యాను. ఏసీ కాలేజీలో డిగ్రీ ముగించాక అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం చేశాను. సరిగ్గా అప్పుడే నాకు కేంద్రప్రభుత్వంలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. ‘డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టు తాత్కాలిక ఉద్యోగం. సెంట్రల్‌ గవర్నమెంటులో క్లర్కంటే జీవితాంతం ఢోకాలేదు. రిటైరయ్యాక పెన్షన్‌ కూడా బోల్డంత వస్తుంది. నువ్వు ఆ ఉద్యోగమే చేయాలి!’ అని నాన్న పట్టుబట్టాడు. కెమిస్ట్రీపైన ప్రేమలో అప్పటికే తలమునకలై ఉన్న నేను ఆ మాటల్ని ఎందుకు వింటాను?! ఆ ఆసక్తితోనే బొంబాయి యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్స్‌ స్పెషలైజేషన్‌తో రసాయనశాస్త్రంలో బీఎస్సీ-టెక్‌ కోర్సులో చేరాను. రెండేళ్ల కోర్సు నిమిషాల్లో పూర్తయినట్టు అనిపించింది! చివరి రోజు ‘మీలో ఎవరైనా పీహెచ్‌డీ చేస్తారా!’ అని అడిగారు. ఎవ్వరూ చేయెత్తలేదు నేనొక్కణ్ణి తప్ప. నా క్లాస్‌మేట్స్‌ అంతా నన్ను పిచ్చివాడిలా చూడటం మొదలుపెట్టారు. ఎందుకంటే మాలాగా ఫార్మాటెక్‌ కోర్సు చేసినవాళ్లందరినీ కంపెనీలు వేలాది రూపాయల జీతం చూపి తన్నుకుపోతున్నాయి మరి! పైగా అప్పట్లో పీహెచ్‌డీ పుణెలోని ‘నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ’ (ఎన్‌సీఎల్‌)లో చేయాలి. దానికి ప్రఖ్యాత పరిశోధకుడు డాక్టర్‌ వెంకటరామన్‌ డైరెక్టర్‌. ఆయన దగ్గర తొమ్మిదిపదేళ్లకిగాని ఎవ్వరూ పీహెచ్‌డీ పూర్తిచేయరని ప్రతీతి! నేను మాత్రం మూడేళ్లలోనే పీహెచ్‌డీ ముగించాను. ‘ఆర్గానిక్‌ సింథసైజ్‌’లో నాకు తిరుగులేదనిపించుకున్నాను. సింథసైజ్‌ అంటే...  వివిధ పద్ధతుల ద్వారా రసాయన మూలకాలని మనం ఆశించినట్టు మార్పూ, చేర్పూ చేయడం! ఆ మార్పులతో సహజ మూలకాలకి బదులు కృత్రిమమైనవాటిని ల్యాబ్‌లోతయారుచేయొచ్చు. ఓ ఆర్గానిక్‌ కెమిస్ట్‌గా నా జీవితమంతా దాని చుట్టే తిరిగింది.

హార్వర్డ్‌లో... 
భారతీయ జౌళి పరిశ్రమ అప్పుడప్పుడే తొలి అడుగులేస్తోంది. పువ్వుల్నుంచీ, పురుగుల్నుంచీ మూలకాలు తీసి వాటిని సింథసైజ్‌ చేసి రసాయన డైలు తయారుచేసి ఇచ్చేవాణ్ణి. నా గురించి తెలుసుకుని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఈజే కోరీ(ఆయనకి 1990లో నోబెల్‌ బహుమతి వచ్చింది) పిలిచారు. క్యాన్సర్‌, మొండి బ్యాక్టీరియాలపై పోరాడే మందులపైన పరిశోధన ఏ దిశగా సాగాలో నేను అక్కడే నేర్చుకున్నాను. కానీ నాకు హార్వర్డ్‌ని చూసేకొద్ది ఏదో కసిగా ఉండేది. ‘మనదేశం ఇలా ఎందుకు లేదు... స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్లకి కూడా పేదరికం, రోగాలు తగ్గలేదు’ అని ఉక్రోషంగా అనిపించేది. ఆ సమస్యల్ని రూపుమాపేందుకు నా వంతుగా ఏదైనా చేయాలనుకుని మళ్లీ భారతదేశం వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక చూస్తే పరిస్థితి వేరుగా ఉంది. నన్ను హార్వర్డ్‌కి పిలిపించుకోవడానికి ఈజే కోరీ తన అనుమతి కోరలేదనే కోపంతో ఉడికిపోతున్నారు అప్పటి మా ఎన్‌సీఎల్‌ డైరెక్టర్‌! నన్ను ‘ఈ’ గ్రేడు సైంటిస్టుగా ఉన్న నా స్థాయిని ‘బి’ గ్రేడ్‌కి దించేశారు! నేను అవన్నీ పట్టించుకోలేదు. నేనిక్కడ క్యాన్సర్‌పైన పనిచేస్తానన్నాను. ‘కుదర్దు’ అన్నారు. దాంతో నేను వేరే దారి చూసుకోవాల్సి వచ్చింది.

బిళ్లగన్నేరు ఆకుల్తో... 
బిళ్లగన్నేరు పువ్వు మన గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఏ జంతువూ ముట్టదు. కనీసం బ్యాక్టీరియా కూడా సోకదు. మనవాళ్లు దాన్ని అమంగళంగా చూస్తారు. అలాంటి బిళ్లగన్నేరు పువ్వులో బ్లడ్‌ క్యాన్సర్‌ని తగ్గించే మూలకాలున్నాయని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆపువ్వుల్ని మనదగ్గర్నుంచే దిగుమతి చేసుకునేవారు. ఒక దశలో దిగుమతులు మానేసి అమెరికాలోనే ఆ మొక్కల్ని పెంచడం మొదలుపెట్టారు. దాంతో అప్పటిదాకా ఆ సేకరణపైన ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకి ఉపాధి పోయింది! వాళ్లకి సాయపడాలని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వాటిని సేకరించి... ఇక్కడే క్యాన్సర్‌ మందుని తయారుచేయాలనుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సైన్స్‌ శాఖని ఏర్పాటుచేసింది. కానీ ఇక్కడున్న శాస్త్రవేత్తలందరూ ‘అది చాలా కష్టం. మనవల్ల అయ్యేపనికాదు!’ అని చేతులెత్తేశారు. ఎందువల్ల కష్టమంటే... ప్రతి బిళ్లగన్నేరులో మొత్తం 95ఆల్కలాయిడ్లుంటాయి. వాటిలో ఒక్కటే క్యాన్సర్‌ నివారణకి పనికొస్తుంది. ఆ 95లో నుంచి ఒకదాన్ని వేరుచేయడమే కష్టం. ఇందుకోసం విదేశాల్లో భారీగా ఉండే క్రొమటోగ్రఫీ పరికరాలని వాడి చాలా సంక్లిష్టమైన పద్ధతుల్లో వేరుచేస్తారు. అప్పట్లో మనదేశంలో ఆ వసతుల్లేవు. ఆ పరిస్థితుల్లోనే నేను దాన్ని సులువైన పద్ధతుల్లో చేయగలనని మహారాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. ఓ పెద్ద డ్రమ్ముకి నీటి కొళాయి బిగించి... ఆ నీటిలో ఓ ప్రత్యేక రసాయనాన్ని వాడి క్యాన్సర్‌ నిరోధక ఆల్కలాయిడ్‌ని వేరు చేయగలిగాను. దాంతో మందులూ తయారుచేశాను. విదేశీ మందు రూ.85 రూపాయలైతే నా పరిశోధనతో దాని ధర 25 రూపాయలకి తగ్గింది! అంతే... మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఓ యువశాస్త్రవేత్త తక్కువ ఖరీదున్న క్యాన్సర్‌ మందు కనిపెట్టేశాడు’ అని అసెంబ్లీలో ప్రకటిస్తే సభ్యులందరూ లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచీ నన్నో హీరోగా చూడటం మొదలుపెట్టారు. అప్పట్లో నేను తయారుచేసిన 600 మందుల ‘వయల్స్‌’ను టాటా క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పుణెలోని నర్సింగ్‌హోమ్‌లకి ఉచితంగా ఇచ్చేశాను. అప్పట్లో వాటి ధర రెండు లక్షలు! ఇది జరిగిన కొన్నాళ్లకే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్న శివరాజ్‌ పాటిల్‌ నా దగ్గరకు వచ్చి గంటసేపు నా పరిశోధనల గురించి మాట్లాడారు. ఆయన ఉద్దేశమేంటో అప్పుడు చెప్పలేదుకానీ... ఆ సమావేశం జరిగిన కొన్నాళ్లకే హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి డైరెక్టర్‌గా నియమించారు!

ఎయిడ్స్‌ మందు చౌకగా... 
1988లో గల్ఫ్‌ నుంచి వచ్చిన ఓ యువకుడికి ఎయిడ్స్‌ ఉన్నట్టు తొలిసారిగా గుర్తించారు. దాన్ని నియంత్రించడానికి ‘జిడోవుడైన్‌’(ఎ.జెడ్‌.టి అనీ అంటారు) అనే మందుని వాడతారు. అప్పట్లో దాని ధర చాలా ఎక్కువగా ఉండేది! జనాభా ఎక్కువగా ఉండే మనదేశంలో ఎయిడ్స్‌ ప్రబలే ప్రమాదముందని నాకు అనిపించింది. అందువల్ల ఎ.జెడ్‌.టిని సింథసైజ్‌ చేసి తక్కువ ధరకే అందించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించాను. సిప్లా సంస్థ అధినేత యూసఫ్‌ హమీద్‌కి విషయం చెబితే మందుల ఉత్పత్తి మొదలుపెట్టారు. మా చౌక మందుకి ఇదివరకే ఎక్కువ ధరతో ఔషధాలు తయారుచేస్తున్న ‘బరోస్‌ వెల్కమ్‌’ సంస్థ మోకాలడ్డింది. కేంద్రప్రభుత్వంలోని ఓ అధికారి మా ఫైల్‌ని ముందుకు కదలనివ్వలేదు. ఆ అధికారికి ఫోన్‌ చేసి, అనుమతి ఇవ్వకపోతే విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించా! ఆ తర్వాతే అనుమతులొచ్చాయి. అలా 1992కే మన దగ్గర యాంటీ రిట్రోవైరల్‌ మందులు సిద్ధమయ్యాయి. అయితే, 1995కిగానీ ఎయిడ్స్‌ గురించి అందరికీ సరైన అవగాహన రాలేదు! వచ్చాక వేలాదిమందిని మా మందులే ఆదుకున్నాయి. సిప్లా సంస్థ ఐరాస ద్వారా పేదదేశాలన్నింటికీ మా ఔషధాలే అందించి ప్రపంచ ఖ్యాతి అందుకుంది!

ఆ చిన్న పువ్వే.... 
1995లో నేను రిటైర్‌ అయ్యాను. అయినా ‘డిస్టింగ్విష్డ్‌ సైంటిస్టు’గా సేవలు కొనసాగించమన్నారు. అది కేబినెట్‌ కార్యదర్శి ర్యాంకు! కానీ... నాకేమో ప్రభుత్వంలో పనిచేయడం ఇక చాలనిపించింది. విదేశీ కంపెనీలకి ఇక్కడి ఐటీ సంస్థలు ఔట్‌సోర్సింగ్‌ సేవలు అందిస్తున్నట్టే... సైన్స్‌ పరిశోధనలో అలాంటి సేవలు అందించాలనిపించింది. అప్పటికది చాలా కొత్త ఆలోచన! కానీ ల్యాబ్‌ ఏర్పాటుచేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. హైదరాబాద్‌లో నా అభిరుచి మేరకు విశాలమైన ఇల్లు కట్టుకోవడంతో రిటైరయ్యాక నాకొచ్చిన డబ్బంతా అటే పోయింది. అప్పుడే నాకు విదేశీ యూనివర్సిటీల్లోనూ, ఫార్మా కంపెనీల్లోనూ లెక్చర్‌ ఇచ్చే అవకాశాలు వచ్చాయి. అలా వెళ్లినప్పుడు జీడీ సెర్ల్‌, సైటోమెడ్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు వాళ్లకి కష్టంగా ఉన్న రెండు పరిశోధనలు నాకు అప్పగించాయి! ఆ డబ్బుతో మొదలుపెట్టిన సంస్థ ఇప్పుడు రెండు యూనిట్‌లతో కోట్ల టర్నోవర్‌ని అందుకుంది. మాకంటూ సొంత సంస్థను స్థాపించాక పేరేంపెట్టాలనే ప్రశ్న వచ్చింది. నా ముగ్గురు పిల్లలూ ‘నాన్నా మీరే మన సంస్థకి బ్రాండ్‌ కాబట్టి మీపేరే పెడదాం!’ అన్నారు. అలా నా పేరులోని తొలి నాలుగు అక్షరాలు వచ్చేలా ‘ఆవ్రా’ అని పెట్టాం. నేను అతితక్కువ ధరకి క్యాన్సర్‌ మందుని కనిపెట్టడానికి కారణమైన బిళ్లగన్నేరు పువ్వునే లోగోగా పెడదాం అనుకున్నాను. అలా అందరూ అమంగళం, అపవిత్రంగా అనుకునే ఆ చిన్ని పువ్వు మా లోగోగా మారింది!

క్యాన్సర్‌, ఎయిడ్స్‌కే కాదు...

విటమిన్‌ బి-6, మూత్రపిండాల మార్పిడి తర్వాత వాటిని శరీరం నిరోధించకుండా చూసే సైక్లోస్పిరిన్‌, అబార్షన్‌లకి వాడే ఆర్‌యూ-486 వంటి మందుల ధరలన్నీ నా సింథసైజ్‌ వల్లే భారీగా తగ్గాయి. క్యాన్సర్‌కి ‘ఇరినోటిసిన్‌’ అనే మందుని వాడుతుంటారు. దాని తయారీకి అవసరమయ్యే మూలకాన్ని చైనాలో కనిపించే ‘హ్యాపీ ట్రీ’ నుంచి తీస్తుంటారు. అందువల్ల ధర ఎక్కువ. దాన్ని మేం ల్యాబ్‌లోనే తయారుచేసి... ధరని మూడోవంతుకి తగ్గించేశాం. ఇప్పుడు చైనాకి మనమే ఎగుమతి చేస్తున్నాం! నాకున్న తక్కువ వనరులతోనే ఇవన్నీ చేయగలిగా. భారతీయులం పరిశోధనలో ఎవరికీ తక్కువకాదని నిరూపించాలన్నదే నా తపన. నా పరిశోధనలకి కేంద్రప్రభుత్వం 1991లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ అందించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.