close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్దుబాటు 

- బాడిశ హన్మంతరావు

 

ఉదయం 9 గంటలు. రైల్వే స్టేషన్‌లో ఉన్నాడు విహారి. మాటిమాటికీ దుఃఖం పొర్లుకొస్తోంది. ఇప్పుడు వెంటనే ట్రైన్‌ దొరికినా ఇంటికి వెళ్ళేసరికి రేపు సాయంత్రం అవుతుంది. అప్పటివరకు నాన్న అలాగే... కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చూపు మసకబారింది.

‘ఏరా, విహా... ఇంతసేపు పట్టిందేరా?’ ఎప్పుడూ ఇంటికి వెళ్ళగానే, దిగేచోట కాచుకుని ఉండే నాన్న... ఎప్పుడూ అడిగే ప్రశ్న.

అదే దృశ్యం... వద్దన్నా తలపుకు వస్తోంది. ఎంత తుడుస్తున్నా కళ్ళు నీళ్ళతో నిండుతూనే ఉన్నాయి.

* * * విహారి మైసూరులో సివిల్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. విహారి నాన్నగారి పేరు చక్రవర్తి. ఒక్కడే కొడుకు. ఊరిలో చెప్పుకోదగ్గ రైతే. ఉన్న ఆరెకరాల పొలాన్ని సాగుచేస్తూ ఉంటాడు. విహారి చిన్నప్పుడే, బహుశా అతని అయిదవ తరగతిలో వాళ్ళ అమ్మ చనిపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ‘తోడుగా నా కొడుకు లేడా’ అంటూ నవ్వుతూ గడిపేశాడు.

రెండేళ్ళక్రితం వరకూ విహారి మేనత్త చక్రవర్తితోపాటు ఉండేది. కానీ ఆమెనూ కాలం తనతో తీసుకుపోయింది.

విహారి ఊరిలోనే హైస్కూలు వరకూ చదివి, ఆపై చదువులకు ఊరు విడిచినప్పటికీ, ఒక్కరోజు సెలవు దొరికినా తండ్రి దగ్గర వాలిపోయేవాడు. ఒక దశలో ‘నేనూ వ్యవసాయం చేస్తా’నని పట్టుబట్టినా తండ్రి మాటతో చదువు కొనసాగించాడు.

చదువులోనూ మెరుగైనవాడు కావడంతో బీటెక్‌ కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. ఆ స్థాయి పోస్టులు తక్కువగా ఉండటంతో ఉన్నంతలో దగ్గరని మైసూరులో చేరిపోయాడు. అదీ తండ్రి బలవంతం మీదనే.

‘ఒక్కడివీ ఏం ఉంటావు, వచ్చి నాతో ఉండ’మని తండ్రిని ఎప్పుడు బతిమాలినా ‘నా పనులు నేను చేసుకోలేని స్థితిలో తప్పదుగదరా, ఇప్పటికైతే ఇలా కానీ...’ అంటూ నవ్వేసేవాడు.

చక్రవర్తికి ఊరిలో పెద్దమనిషిగా గుర్తింపు. మంచివాడు అని... కాదు కాదు చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఒక విధంగా విహారికి అదే నచ్చడంలేదు.

వాళ్ళ పొలం దిగువనే కొండయ్య పొలం. చక్రవర్తి నీరు మడవ కట్టి, ఇటు రావడమే ఆలస్యం... ఆ మడవ తెంపి తన పొలానికి నీరు పెట్టుకునేవాడు.

ఇతరులు ఆ విషయాన్ని చక్రవర్తి చెవిన వేసినా ‘నాదైనా పొలమే, అదైనా పొలమే. పొలం నిండితే వాడుమాత్రం నీళ్ళేం చేసుకుంటాడు. అలాగే కానీ...’ అనేవాడు.

అలా రెండు మూడుసార్లు పొలం ఎండిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు.

 

మరో సందర్భంలో ఒక పంచాయితీలో ఎదుటివారివైపు మాట్లాడాడనీ, ఇంటిమీదకొచ్చి గొడవపెట్టి, చక్రవర్తి తల పగులగొట్టాడు నర్సయ్య. చుట్టూ ఉన్నవారు అడ్డుకుని ఆసుపత్రికి తీసుకుపోయారు. తను వచ్చేసరికి బెడ్‌ మీదున్న తండ్రిని చూసేసరికి కోపం ఆగలేదు. ఆవేశంగా నర్సయ్య ఇంటికి వెళ్ళబోతుంటే తండ్రే ఆపాడు. పోనీ స్టేషన్‌లో కేసు పెడదామన్నా ఒప్పుకోలేదు.

‘మనిషి తనకు నష్టం జరిగినప్పుడు ఆవేశపడతాడు. అలాగే నర్సయ్యా ఆవేశపడ్డాడు. ఎటొచ్చీ నియంత్రించుకోలేకపోయాడు. నువ్వూ అలాగే చేస్తే, నీకూ అతనికీ తేడా ఏముంది?’ అంటూ చేయిని గట్టిగా పట్టుకుని నవ్వాడు.

ఇలా ప్రతి సందర్భంలోనూ తండ్రి ప్రవర్తన విహారికి చిరాకు తెప్పించేది. కొన్ని నెలలకింద కూడా అలాగే జరిగింది. అవతలి బజారు సోమరాజు కూతురు, ఎవరో పిల్లాడితో చక్రవర్తి ఇంటి వెనుక గడ్డి వాము దగ్గర అభ్యంతరకరంగా కనపడితే, సోమరాజుకి కబురు చేశాడు. 
అది పెద్ద ఇష్యూ అయింది.

‘ఆహాఁ... మా అమ్మాయిని తప్పు పడతావా? చిన్నపిల్ల ఏదో అవసరం మీద అటు వెళ్ళుంటుంది. ఈ మాత్రానికే ఆడపిల్ల మీద అభాండాలు వేస్తారా?’ అంటూ పక్క చెవికి తెలియకుండా చెబుతున్న చక్రవర్తి మాటను, సోమరాజు అందరికీ డప్పేశాడు. ఇది జరిగిన రెండు నెలలకే ఆ పిల్ల, అదే పిల్లాడితో రాత్రికి రాత్రి లేచిపోయింది.

దానికీ చక్రవర్తినే తప్పుపట్టాడు సోమరాజు. ‘నువ్వు చేసిన రాద్ధాంతానికే మా అమ్మాయికి ఆ ఆలోచన వచ్చిందనీ లేకపోతే అలాంటి పని చేయదనీ’ దుమ్మెత్తిపోశాడు.

ఈ విషయాలన్నీ తనతో చెప్పినప్పుడు ‘నీకెందుకు నాన్నా, అందరి విషయాలూ... ఎవరెలాపోతే మనకేంటి, నువ్వు చెప్పినా మాట దక్కిందా? పైగా సోమరాజు బాబాయ్‌తో శత్రుత్వం వచ్చిపడింది’ అంటే... ‘అదేం లేదులేరా, పైకి అనకున్నా, వాడికి మాత్రం అసలు విషయం తెలియదా?’ అంటూ దాటేశాడు. ఇలా ఒకటేమిటి పదులకొద్దీ సంఘటనలున్నాయి.

ఒక్కోసారి, తండ్రి తన అసమర్థతను మంచితనం ముసుగులో కప్పేసుకుంటున్నాడేమో అనిపించేది విహారికి. ఒక్కోసారి అందరూ మంచివాడు అనుకోవాలన్న ఆలోచన కూడా ఒక జబ్బు లాంటిదే అనిపిస్తుంది. అందరూ మంచివాడు అనుకోవడం కోసం మనం ఎందుకు నష్టపోవాలి? ఉండటానికి ఆరెకరాల పొలం ఉన్నా, తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తరవాత కూడా, పెద్దగా వేరే ఆస్తి కొన్నట్టుగానీ, పోనీ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉన్నట్టుగానీ లేదు. ఎవరో ఒకరికి అవసరాలకి ఇచ్చి, మళ్ళీ తీసుకోలేక వదిలేసి ఉంటాడని విహారికి తెలుసు.

ఆ మాటే అడిగితే ‘ఇవ్వగలిగితే ఇవ్వకపోదురా? వెసులుబాటు కాగానే ఇస్తారులేరా’ అని తేలికగా కొట్టిపారేస్తాడు.

‘కాస్తో కూస్తో ఉండబట్టిగానీ లేకపోతే...’ అంటే- ‘ఉండబట్టే కదా చేయగలుగుతున్నాం’ అనేది జవాబు.

సాయం చేయడంలో విహారికేమీ అభ్యంతరంలేదుగానీ, మళ్ళీ వసూలు చేసుకోలేకపోవడం మాత్రం అసమర్థతే అని మాత్రం అభిప్రాయం.

ఇంతలో రైలు ప్లాట్‌ఫాం మీదకు వస్తున్నట్టు కూత వినిపించింది. పక్కకు వెళ్ళి ఒక నీళ్ళ సీసా తీసుకొనివచ్చి, ఆగిన ట్రైన్‌లో తన సీటు వెతుక్కుని కూచున్నాడు.

మళ్ళీ ఆలోచనలు తండ్రి మీదకు మళ్ళాయి. ఈరోజు ఉదయమే వచ్చిన గుండెపోటుకి పక్క టౌనులో ఉన్న ఆసుపత్రికి వెళ్తుండగానే శ్వాస ఆగిపోయిందట. ఫోన్‌లో ఆ వార్త వినగానే ఊపిరి ఆగినట్టయింది.

‘నాన్న చనిపోవడమేమిటి?’ నమ్మబుద్ధి కాలేదు విహారికి.

చక్రవర్తి ఎప్పుడూ ఏ నొప్పీ ఎరుగడు.

ఈ ఏడాది చివరికల్లా కొడుక్కి పెళ్ళి చేయాలని సంబంధాలు కూడా చూస్తున్నాడు.

‘నాతోపాటు వచ్చి ఉంటానంటేనే పెళ్ళి చేసుకునేది, లేకపోతే లేదు’ అన్న మాటకు ‘అలాగేలేరా... నాకూ నీ దగ్గరే ఉండాలనిపిస్తోంది’ అంటూ పెద్ద మీసాల మాటున చిన్న నవ్వు నవ్వుతూ ఒట్టేశాడు. కానీ ఇప్పుడిలా...

అయినా నిజాలకు మన నమ్మకంతో పనేమిటి?

విహారి ఉన్న ఫళాన బయలుదేరి... ఇప్పుడు రైలులో ఉన్నాడు.

ఎందుకో విహారికి ప్రపంచంలో తనొక్కడే ఒంటరి అన్న ఫీలింగ్‌ వస్తోంది. గుండె బరువెక్కుతున్నట్టూ, కనురెప్పలు మూసుకుపోతున్నట్టూ అనిపించింది.

మూగన్నుగా బెర్త్‌ మీద వాలిపోయాడు.

* * * కళ్ళు తెరిచేసరికి దిగాల్సిన స్టేషన్‌ వచ్చేసింది. హడావుడిగా బ్యాగు పట్టుకుని ట్రైన్‌ దిగాడు.

నాలుగు అడుగులు వేశాడో లేదో... కళ్ళు తిరిగినట్టు అనిపించి అక్కడున్న బెంచీ మీద కూర్చోబోతుంటే ఎవరో ‘‘విహారీ’’ అంటూ కేకేశారు.

బలవంతంగా కళ్ళు తెరుస్తూ అటువైపు చూశాడు. నర్సయ్య కొడుకు మనోహర్‌. వస్తూనే ‘‘నీ కోసమే చూస్తున్నా పొద్దున్నుంచీ ఇక్కడే. ఎప్పుడొస్తావో తెలియదు కదా’’ అంటూ చేతిలో బ్యాగు అందుకుని భుజం చుట్టూ చేయివేసి లేపి పార్కింగ్‌ వైపు తీసుకెళ్ళాడు. అక్కడపెట్టి ఉన్న మినీ వ్యానులో కూర్చోబెట్టి నీళ్ళు తెచ్చాడు. వాటితో ముఖం కడుక్కున్నాడు విహారి. సీటు వెనుక ఉన్న బ్యాగులో నుంచి రెండు అరటిపళ్ళు తీసి విహారికి ఇచ్చి తినమని వ్యాను స్టార్ట్‌ చేశాడు.

అరటిపళ్ళు తిన్నాక వ్యాను పక్కకు ఆపి, క్యాబిన్‌లో ఉన్న ప్లాస్కులో నుండి టీ పోశాడు. విహారి టీ తాగడం కాగానే వ్యాను స్టార్ట్‌ చేశాడు.

చక్రవర్తి గురించి అవీ ఇవీ మాట్లాడుతూ, వ్యాను కొనుక్కోవడానికి డబ్బులిచ్చిన విషయం కూడా చెప్పాడు. విహారికి ఈ విషయం తెలియదు. ‘‘అవునా’’ అని అడిగితే... ‘వడ్డీలకు తెచ్చీ, లోన్లు తెచ్చీ కొంటే నీకు మిగులుబాటు ఏముంటుందిరా... అలా తీర్చేదేదో నాకే ఇవ్వు’ అని చెప్పాడట. ఈ సంగతి చెబుతూనే భోరున ఏడ్చేశాడు మనోహర్‌.

నిశ్చేష్ఠుడై చూస్తుండిపోయాడు విహారి. మరో రెండు గంటల్లో ఊరు చేరారు. ఇంటికివెళ్ళే దారిమలుపు తిరిగారు. ఆ బజారంతా జనం. ఊరంతా అక్కడే ఉంది. ప్రతి ఒక్కరూ విహారిని పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. నర్సయ్య నలుగురినీ కలుపుకొని పనులు మొదలుపెట్టాడు. అంతిమ సంస్కారం పనులు చకచకా సాగాయి.

యాంత్రికంగా విధులు నిర్వర్తించసాగాడు విహారి. ప్రతి సందర్భంలోనూ అందరూ సొంతవారే అయినట్టు చేతుల మీద కార్యక్రమాలు పూర్తవుతున్నాయి.

ఊరేగింపులో కూడా చక్రవర్తి పార్థివదేహం అందరి చేతుల పైపైనే సాగిపోతోంది. దింపుడు కళ్ళెం దగ్గర విహారితోపాటు ప్రతి ఒక్కరూ గుండెలవిసిపోయేలా రోదించారు. దహనం ఏర్పాట్లూ ఇతరత్రా వంటల ఏర్పాట్లూ అన్నీ ఎవరూ పురమాయించకుండానే పూర్తి అయిపోయాయి.

చిన్నదినం కూడా పూర్తి అయిన తరవాత, ఊరులోని పెద్ద మనుషులూ, ఇంకా కొండయ్య, సోమరాజు, నర్సయ్య... ఇంకా చాలామంది విహారి దగ్గరకు వచ్చారు.

అందరి చేతులూ పట్టుకుని, పనులు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పబోతే కోప్పడ్డారు. ఖర్చుల గురించి మాట్లాడబోతే బాధపడ్డారు. అందరూ తమ ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్టు ఆవేదన చెందారు. చూస్తుండగానే పెద్దదినంతో సహా అన్ని కార్యక్రమాలూ అయిపోయాయి. పెద్ద దినానికి- లేచిపోయిన సోమరాజు కూతురు కూడా భర్తతో వచ్చింది. ‘పెదనాన్నా’ అంటూ చక్రవర్తిని తలచుకుంటూ తండ్రిని పట్టుకుని ఏడ్చింది.

సెలవులు మరికొన్ని రోజులు పొడిగించమని చెప్పాడు సర్పంచ్‌ వెంకటయ్య. వారంలోనే పొలం తాలూకు వ్యవహారాలూ, కాగితాలూ, కౌలు పనులూ మొత్తం పూర్తి చేశారు. ఏదీ విహారి ప్రమేయం లేకుండానే, ఎవరు చేస్తున్నారో తెలియకుండానే జరిగిపోయాయి. ఇంటినీ పొలాన్నీ చూసుకోవడానికి ఎవరికివారు బాధ్యతగా ముందుకు వచ్చారు.

* * * మైసూరుకు ప్రయాణం అయ్యాడు విహారి. ఊరంతా విహారికి వీడుకోలు పలకడానికి వచ్చారు. తండ్రి లేడని అనుకోవద్దనీ, ప్రతి ఒక్కరి ఇల్లూ తనదే అనుకోమనీ, చేతులు పట్టుకుని బతిమాలుతూ బెదిరిస్తూ చెప్పారు. వచ్చేటప్పుడు ‘ప్రపంచంలో ఒంటరిని’ అనుకున్న విహారి, మళ్ళీ వెళ్ళేటప్పుడు తన తండ్రి ఇచ్చిన ఇంత బలగాన్నీ, వాళ్ళ అభిమానాన్నీ గుండెల్లో నింపుకుని రైలెక్కాడు. మైసూరులో దిగీదిగగానే ఫోన్‌ మోగింది.

‘‘ఏరా విహా, చేరుకున్నావా?’’ అచ్చు తండ్రి అడిగినట్టుగానే...

జవాబుచెప్పి పెట్టేసేంతలో...మళ్ళీ ఫోన్‌...

అదే ప్రశ్న... అలాగే... తండ్రి అడిగినట్టుగానే అనిపిస్తోంది. కాదు కాదు... తన ఊరివారి గొంతుల్లో వ్యక్తమవుతున్న అభిమానం విహారికి అలా వినపడుతోంది.

ఫోన్‌ స్క్రీన్‌పైన తన తండ్రి ఫొటో చూస్తూ ‘తప్పులు ఎంచి దూరం పెడితే, మన పక్కన ఎవరూ ఉండరు. అలాకాక కాస్త సహనం చూపితే, పెద్ద మనసుతో సర్దుకుపోతే... అందరూ మనవారే. మన కుటుంబంలోనివారు ఏదైనా తప్పుచేస్తే సర్దుకోమా? అలాగే ఇదీ... వసుధైక కుటుంబం అంటారు కదా’- ఓ సందర్భంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.

విహారి కళ్లల్లో నీటి సుడి, గుండెల్లో అనురాగపు జడి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.