close
లక్ష్మీ రావమ్మా...

లక్ష్మీ రావమ్మా...

సిరితావచ్చిన వచ్చును...అన్న చందంగా తన భక్తుడి కోసం లక్ష్మీదేవే కొల్హాపూర్‌ నుంచి బయల్దేరి వచ్చింది. వైకుంఠ పురవాసిని కాస్తా పూరింట్లో స్థిరపడింది. కర్ణాటక, రాయచూరు జిల్లాలోని కల్లూరులో కొలువైన శ్రీమహాలక్ష్మి, భక్తులు ప్రేమగా పిలిస్తే చాలు... ఘల్లుఘల్లున అడుగులేస్తూ గడపలో కుడికాలు మోపుతుందని ఓ నమ్మకం.

లక్ష్మీనివాసం - శ్రీనివాసుడి హృదయ భాగం. ముక్కోపి భృగుమహర్షి విష్ణుమూర్తి గుండెల మీద తన్నడంతో మహాలక్ష్మి మనసు విలవిల్లాడింది. హరి మీద అలిగి పుట్టిల్లు కొల్హాపురానికి వచ్చేసింది. పద్మావతీ శ్రీనివాసుల పరిణయ వార్త తెలిసేదాకా...అక్కడే ఆధ్యాత్మిక జీవితం గడిపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ను లక్ష్మీదేవి జన్మస్థానంగా భావిస్తారు. క్షీరసాగర మథనం జరిగిన ప్రాంతం ఇదేననీ, ఇక్కడే పాలకడలి ఉండేదనీ ఓ నమ్మకం. అందుకే, ఈ ప్రాంతమంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. లక్ష్మికి ఇష్టమైనవన్నీ నారాయణుడికీ ప్రియమైనవే. కల్పాంతంలో కూడా లక్ష్మీనారాయణులు ఇక్కడే నివాసం ఉండేవారట. అందుకే ఈ ప్రాంతానికి అవిముక్తక్షేత్రమన్న పేరొచ్చింది. లక్ష్మమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఉపాసించే భక్తులకైతే కొదవే లేదు. ఆ భక్తకోటిలో ఒకరు...లక్ష్మీకాంతాచార్య. ఈ విద్వాంసుడు అదిల్‌షా పాలనకాలంలో...బిజాపూరులో (ఇప్పటి విజయపుర) నివాసం ఉండేవారు. అతడు బహు కుటుంబీకుడు. శిష్యగణమూ పెద్దదే. ఆ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా అమ్మవారి సన్నిధిలో జరగాల్సిందే. ఆచార్యుడి కుటుంబం అనివార్య పరిస్థితుల్లో విజయపురాన్ని వీడాల్సి వచ్చింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న కల్లూరుకు వచ్చి స్థిరపడింది. లక్ష్మీకాంతాచార్యుల ఎనభై ఎనిమిదేళ్ల వయసులో...ఇంట్లో ఓ మంగళ కార్యాన్ని తలపెట్టారు. అసలే వయోభారం, దానికితోడు అనారోగ్యం. రవాణా సౌకర్యాలూ అంతంతమాత్రమే అయిన రోజులు. కొల్హాపూర్‌ దాకా వెళ్లలేని పరిస్థితి ఆయనది. గంపెడు కుటుంబంతో ప్రయాణం కట్టడం కూడా స్తోమతకు మించిన పనే. ‘నీ సన్నిధికి రాలేని అశక్తుడిని. క్షమించు త‌ల్లీ! అని కన్నీళ్లు పెట్టుకున్నారు. కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై...‘ఈ వయసులో నువ్వు ఇంతదూరం రావడం ఎందుకు బిడ్డా! నేనే నీ ఇంటికి వస్తాను’ అని చెప్పింది. మరుసటి రోజు లక్ష్మీకాంతాచార్య..ఎప్పట్లానే స్నానసంధ్యాదులు పూర్తిచేసుకుని, పూజ కోసం గంధం తీయడానికి కూర్చున్నారు. సానరాయిని చేతిలోకి తీసుకోగానే...అందులో లక్ష్మీదేవి రూపం దర్శనమిచ్చింది. ఆ భక్తుడి ఆనందానికి అవధుల్లేవు. అష్టోత్తరంతో అర్చించాడు. సహస్రనామాలతో కొనియాడాడు. వూరు వూరంతా సంబరాలు జరుపుకుంది. తర్వాత కొద్దికాలానికి, ఆచార్యులు శిష్యులతో కలసి పర్యటనకు వెళ్తుండగా...రాయచూరు సమీపంలోని మమదాపూరు గ్రామంలో ఓ సంఘటన జరిగింది. ఓ రైతు పొలం దున్నుతుండగా...ఎద్దులు హఠాత్తుగా ఆగిపోయాయి. ఎంత అదిలించినా అడుగు ముందుకేయలేదు. ఇదంతా లక్ష్మీదేవి సంకల్పమే అని భావించి...నాగలి ఆగిన చోట తవ్వించమని సూచించారు. కొంత లోతుకు వెళ్లేసరికి, గునపానికి రాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. వెలికితీస్తే అది వేేంకటేశ్వర స్వామి విగ్రహం. తీసుకొచ్చి లక్ష్మీదేవి పక్కన ప్రతిష్ఠించారు. అలా, లక్ష్మీ శ్రీనివాసులు అక్కడ కొలువుదీరారు.

క్షీరాబ్ధి కన్యకకు...
కల్లూరు లక్ష్మీదేవి అంటే కన్నడిగులకు అపారమైన భక్తి! కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని విశ్వాసం. పిల్లల చదువులూ పెళ్లిళ్లూ విదేశీ ప్రయాణాలూ వ్యాపార విజయాలూ...ఇలా రకరకాల కోరికలతో ఇక్కడ కొబ్బరికాయలు కట్టే సంప్రదాయం ఉంది. ఆశలు తీరగానే, అమ్మవారిని అర్చించి ఆ నారికేళఫలాన్ని ఇంటికి తీసుకెళ్లిపోతారు. రాయచూరు - మాన్వి మార్గ మధ్యంలో...21కి.మీ దూరంలో కల్లూరు ఉంది. ఇటు రాయచూరు నుంచీ అటు సింధనూరు నుంచీ ప్రతి పది నిమిషాలకో బస్సు ఉంటుంది. కల్లూరులో దిగితే, సరిగ్గా ఒక కిలోమీటరు దూరంలో అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. సిరిదేవత వెలసిన ఇంటినే దేవాలయంగా తీర్చిదిద్దారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామిని అర్చించుకోడానికి వచ్చే భక్తుల్లో చాలా మంది కల్లూరు లక్ష్మీదేవినీ దర్శించుకుంటారు. ముస్లిం మహిళలు సైతం కొబ్బరికాయలు కట్టి వెళ్లటం అమ్మవారిపై ఉన్న అపార నమ్మకానికి నిదర్శనం. శ్రావణ శుక్రవారాలు విశేష పూజలు జరుగుతాయి. దీపావళి సమయంలోనూ అమ్మవారికి దివ్యాలంకారాలు చేస్తారు.

- రామాంజనేయులు, న్యూస్‌టుడే, మాన్వి

దీపావళి...లక్ష్మీపూజ

సత్యాదేవి సాక్షాత్తు శ్రీలక్ష్మి అవతారమే. పట్టుబట్టి పతి వెంట వెళ్లి నరకాసురుడిని సంహరించింది. భూలోకాన్ని ఆవరించిన చీకటిని తరిమేసింది. ఆ కృతజ్ఞతతోనే దీపావళినాడు వరుసదీపాలు వెలిగిస్తాం. ఆ వెలుగుల్ని కళ్లారా చూడటానికి లకుమాదేవి భూలోకానికి దిగొస్తుందట. అందుకే, నీరజాలయకు అన్ని నీరాజనాలు! దీపావళి అమావాస్య నుంచి కార్తిక అమావాస్య వరకూ ప్రదోష సమయంలో ఆకాశ దీపం వెలిగించడం సంప్రదాయం. క్షీరసాగర మథన సమయంలో...మహా తేజస్సుతో లక్ష్మీదేవి అవతరించిందట. ఆ కాంతిలో లోకాల్లోని చీకట్లన్నీ తొలగిపోయాయట. ఆ ఆనందోత్సాహాల్లోంచే దీపావళి పండగ పుట్టిందనీ అంటారు.