close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉంగరాల సింగారం

 

ఒకటీ రెండూ మూడూ నాలుగూ ఐదూ చెయ్యీ... ఇదేం లెక్కా అనకండి. ఎందుకంటే ‘ఉంగరం అంటే ఏదైనా ఒక వేలికి పెట్టుకునే రింగులాంటిది’ అనే లెక్కలన్నీ మారిపోయాయి. రకరకాల డిజైన్లతో పాటు, ఒక్కొక్క వేలునీ కలుపుకుంటూ అరచేతిని చుట్టేసేవరకూ ఎన్నెన్నో ఉంగరాల ఫ్యాషన్లు రంగంలోకి దిగుతున్నాయిప్పుడు.

ఉంగరం పైన ఎన్ని రకాల రాళ్లనైనా పొదగొచ్చు. పైనుండే డిజైన్లలోనూ ఎన్నో వెరైటీలు రావొచ్చు. కానీ వందల ఏళ్ల నుంచీ దాని రూపం మారలేదు. పెట్టే విధానంలోనూ మార్పు రాలేదు. ఇక, అది ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఏం వెలుగులోకి వస్తుంది. కానీ సృజనాత్మకత పాళ్లు మరీ ఎక్కువగా ఉండే ఈతరం ఫ్యాషన్‌ గురూల కన్ను ఉంగరం మీదా పడింది. అంతే, అంగుళీయకాలు పాతదనాన్ని పోల్చలేనంత కొత్తగా అయిపోయాయి. ఒకప్పుడు సన్నటి రింగుకి పైభాగంలో మహా అయితే పావలా లేదా అర్ధ రూపాయంత రత్నమో బంగారంతో చేసిన దేవుడి బొమ్మా లేదంటే ఇంకేదో డిజైన్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఉంగరాల స్టైల్‌తో పాటు సైజు కూడా పెరిగింది. ఒకే ఉంగరాన్ని రెండూ మూడూ వేళ్లకు పెట్టుకునేలా రకరకాల రూపాల్లో డిజైన్లలో రూపొందిస్తున్నారు. వాటిలోనే అడ్డంగా బ్రేస్‌లెట్‌లా ఉండి రెండు మూడు వేళ్ల నుంచి అరచేతి వరకూ ఆభరణంలా అమరేవి ఒక రకమైతే, రెండు ఉంగరాలను కలుపుతూ చెయిన్లు ఉన్నవి మరో రకం. ఇక, నాలుగు వేళ్లనూ చుట్టుకుంటూ ముంజేతి వరకూ కంకణంలా వచ్చే డిజైన్లతే చెయ్యంతటికీ అందాన్ని తెస్తాయి.

గోరంత అందం
గోటిని అలంకరించే ఉంగరాలూ వస్తున్నాయి. వీటిని పెట్టుకుంటే మన గోళ్లకు రంగు రాళ్లూ రత్నాలను పొదిగినట్లే ఉంటుంది. వీటితో పాటు ఒక ఉంగరం పెట్టుకుంటే రెండు మూడు ఉంగరాలు పెట్టుకున్నట్లూ భ్రమ కలిగించేవీ ఉన్నాయి. ఇక, ఉంగరం పైభాగం కలవకుండా రూపొందిన ‘అడ్జెస్టబుల్‌ పర్ల్‌ స్టోన్‌ రింగ్స్‌’ పెట్టుకుంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈరకం అడ్జెస్టబుల్‌ ఉంగరాలను వేలు పైనుంచి చూసినపుడు ముత్యాలు వాటంతటవే వేలుని అంటిపెట్టుకున్నట్లూ అనిపిస్తాయి. మొత్తంగా చూస్తే ఒక ఉంగరం ఎక్కువ వేళ్లకు పెట్టుకోవడం ప్రస్తుతం ఎక్కువగా నడుస్తున్న ఫ్యాషన్‌. అయితే, మరీ అంత భిన్నంగా వద్దనుకునేవాళ్లు ఒకే వేలికి చిన్న చిన్న ఉంగరాలను ఎక్కువ పెట్టుకుంటున్నారు. అంగుళీయకాలు ఇన్ని రకాల ఫ్యాషన్లలో వస్తున్నాయి కాబట్టే గాజులూ బ్రేస్‌లెట్లను పక్కకు తోసేంతగా ప్రాచుర్యం పొందుతున్నాయి.