close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిన్నారుల నేస్తం ‘చూచూ’!

చిన్నారుల నేస్తం ‘చూచూ’!

  ‘చూచూ టీవీ’... చిన్నారులు ఉండే ఇంట్లో మిగతా టీవీలు ఉన్నా లేకపోయినా ఈ టీవీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనదేశంలో పిల్లలు ఎక్కువగా చూస్తున్న యూట్యూబ్‌ ఛానెల్‌ ఇదే!

అక్కడంతా కిండర్‌గార్టెన్‌ పుస్తకాలు తిరగేస్తుంటారు. పిల్లల వీడియోల్ని చూస్తుంటారు. అలాగని వారేమీ నర్సరీ విద్యార్థులు కాదు. డిగ్రీలు చదివిన పెద్దలే. ఆ పుస్తకాలూ, వీడియోల స్ఫూర్తితో పిల్లల రైమ్స్‌నీ, కథల్నీ రాస్తారు. కళాకారులు ఆ అక్షరాలకు బొమ్మల రూపం ఇస్తే యానిమేటర్లు ప్రాణం పోస్తారు. ఆపైన అవన్నీ యూట్యూబ్‌లోని"Chu Chu TV Nursery Rhymes& Kids songs" ఛానెల్లోకి వెళ్తాయి. అక్కణ్నుంచి చిన్నారుల్ని ఆటపాటల్లోకి తీసుకెళ్తాయి. చూచూ టీవీ వీక్షకుల్లో ఎక్కువ శాతం నాలుగేళ్లలోపు పిల్లలే. 60 లక్షలకుపైగా సబ్‌స్క్రిప్షన్లతో భారత్‌లో మూడో అతిపెద్ద యూట్యూబ్‌ ఛానెల్‌గా ఉందీ ఛానెల్‌. దీనికంటే ముందున్నవి వినోద రంగంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ‘టి-సిరీస్‌’, ‘సెట్‌ ఇండియా’. యూట్యూబ్‌లో టి-సిరీస్‌ 10వేల వీడియోల్నీ, సెట్‌ ఇండియా 14వేల వీడియోల్నీ అప్‌లోడ్‌ చేశాయి. కానీ చూచూ... వీడియోల సంఖ్య 130 మాత్రమే. కానీ వీక్షణల పరంగా చూసుకుంటే చూచూది ద్వితీయ స్థానం.

చిన్నారి పేరే చూచూ
చెన్నైకి చెందిన వినోద్‌ చందర్‌, సురేష్‌, అజిత్‌, సుబ్బిరామనియన్‌, కృష్ణన్‌, పార్థసారథి... ఈ ఆరుగురూ చూచూ టీవీని 2013 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వారంతా చిన్ననాటి స్నేహితులు కూడా. ‘బడ్డీస్‌ ఇన్ఫోటెక్‌’ పేరుతో అంతకు ముందు ఓ కంపెనీ ప్రారంభించి చిన్నస్థాయి ఐటీ సేవలూ, తమిళ పాటల రింగ్‌టోన్ల అమ్మకం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ తయారీ, వెబ్‌సైట్ల రూపకల్పనతోపాటు ఆప్స్‌ తయారు చేసేవారు. ఆ దశలో వారి వ్యాపారం అనుకోని మలుపు తిరిగింది. వినోద్‌ పాప పేరు హర్షిత. ముద్దుపేరు చూచూ. చలాకీ చిన్నారి. అందుకే చూచూ పోలికలున్న పాపతో ‘చబ్బీ చీక్స్‌...’కి యానిమేషన్‌ వీడియో రూపం ఇచ్చాడు వినోద్‌. యూట్యూబ్‌లో సరదాగా ‘చూచూ టీవీ’ పేరుతో ఛానెల్‌పెట్టి వీడియోని అప్‌లోడ్‌ చేశాడు. ఆకర్షణీయమైన రంగులూ, వినసొంపైన గొంతు, శ్రావ్యమైన సంగీతం... ఆ వీడియో ప్రత్యేకతలు. అందుకే కొన్ని నెలల్లోనే దాన్ని మూడు లక్షల మంది చూశారు. ఆ విషయాన్ని స్నేహితులకు చెప్పి... అక్కడున్న వ్యాపార అవకాశం గురించి వివరించాడు. తర్వాత ‘ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌...’ని తమదైన శైలిలో చిత్రీకరించి చూచూలో అప్‌లోడ్‌ చేస్తే... లక్షల్లో వీక్షణలు. నెల రోజుల్లో ఆ ఛానెల్‌ని అయిదు వేల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ‘చూచూకి మంచి స్పందన వస్తోంది... మరిన్ని వీడియోలు పెట్టండి’ అంటూ యూట్యూబ్‌ ప్రతినిధుల నుంచి ఫోన్‌. దాంతో పూర్తిగా ఇటువైపు దృష్టిపెట్టిందా బృందం. తర్వాత పదుల సంఖ్యలో వీడియోల్ని పెట్టారు. ఏడాది తిరిగేసరికి ఆదాయం కోట్లకు చేరింది. ‘చూచూ రైమ్స్‌కు సమకూర్చే సంగీతం లాలిపాటలా కాకుండా పిల్లలు ఆడుతూ పాడుతూ గెంతేలా ఉంటోంది. పిల్లలు రోజూ కొత్త పాటల్ని చూడ్డంకంటే నచ్చినవాటినే మళ్లీ మళ్లీ చూడ్డానికి ఇష్టపడతారు. అందుకే చూచూకి వీక్షణలు ఎక్కువ’ అని చెబుతారు యూట్యూబ్‌ ప్రతినిధి అమన్‌ దయాల్‌.

వీక్షకుల సలహాలతో...
చందర్‌, అతని బాబాయి పాటల సంగీతానికి సంబంధించిన అంశాల్ని చూస్తారు. రచనని కృష్ణన్‌ చూసుకుంటారు. యానిమేషన్లో మిత్రులెవరికీ ప్రవేశం లేకపోయినా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని పెట్టుకున్నారు. ‘మా పనిలో అన్నింటికంటే యానిమేషన్‌ ముఖ్యమైనది. ఎందుకంటే అదే స్క్రీన్‌మీద కనిపిస్తుంది. ఒక కన్ను పోవడం, చెవి మాయమవడం లాంటి పొరపాట్లు మొదట్లో చేశాం. వాటినుంచి త్వరగానే పాఠాలు నేర్చుకున్నాం’ అంటారు సంస్థ వ్యవస్థాపకుడూ, సీయీవో అయిన చందర్‌. చూచూ వీడియోల్ని చూసినవారు... ‘అన్నింటా ఒక్క క్యారెక్టరే ఉంటోంది’, ‘పిల్లలందరూ తెల్లగానే ఎందుకు ఉండాలి’, ‘పాటల్లో అందానికి ప్రాధాన్యమిస్తున్నారు’... అంటూ రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేసేవారు. ఆ సూచనల ఆధారంగా చూచూకి తోడు చాచా, చిక్కా, చిక్కూ క్యారెక్టర్లని పరిచయం చేశారు. పాటల్లోనూ, పిల్లల రూపురేఖల్లోనూ మార్పులు వచ్చాయి. చూచూ వీక్షకుల్లో భారతీయులతోపాటు అమెరికా, ఐరోపా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా దేశాలవారూ ఉన్నారు. అందుకే చాలా వీడియోల్ని భారత్‌, అమెరికాలకు వేర్వేరుగా చిత్రీకరిస్తుంటారు.

చూచూ టీవీని సగటున రోజుకి 7000 మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటున్నారు. సంస్థ ఆదాయం నెలకు రూ.కోటి నుంచి అయిదు కోట్ల వరకూ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల విభాగంలో సబ్‌స్క్రిప్షన్లలో చూచూది ఆరో స్థానం. వీక్షణల్లో తొమ్మిదో స్థానం. రైమ్స్‌, పజిల్స్‌, కలరింగ్‌ విభాగాల్లో ‘చూచూ’ ఆప్స్‌ కూడా వచ్చాయి. గతేడాది ‘చూచూ టీవీ సర్‌ప్రైజ్‌’ పేరుతో మరో ఛానెల్‌నీ ప్రారంభించారు. దీనిలో అక్షరాలూ, అంకెలూ, రంగుల్లాంటివి నేర్పే వీడియోలుంటాయి. దీనికి పదిలక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు.

‘మేం వచ్చేటప్పటికి చాలామంది ఈ విభాగంలో ఉన్నారు. కానీ వారికంటే బాగా చేయొచ్చు, చేయగలం అనిపించింది. ప్రతీ వీడియోకీ నేర్చుకుంటూ మెరుగుపడ్డానికి ప్రయత్నిస్తాం. అందుకే ఇక్కడివరకూ రాగలిగాం’ అంటారు చందర్‌. ‘ఇది పిల్లల కాలం’ అనడానికి చూచూ విజయమే నిదర్శనం.

ఏ కూరైనా నిమిషాల్లో తయార్‌..!

  మార్కెట్‌కెళ్లి కూరగాయలు తేవడం, కొయ్యడం, మసాలాలు దంచడంలాంటి పనులేవీ లేకుండా చిటికెలో అయిపోయే కూరేదంటే చింతపండు రసం అంటాం. మరి, పనీర్‌ కూరలూ, చోళెమసాలా, చికెన్‌, మటన్‌, చేపలూ, రొయ్యల్లాంటి కూరలన్నిటినీ ఇంత సులభంగా అమ్మ చేసినంత రుచిగా చేసేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఇప్పటి వరకూ రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్సూ వేడి చేసుకుని తినే చపాతీలూ పరాటాల్లాంటివే చూశాం. కానీ హైదరాబాద్‌కి చెందిన ఈజీకుక్‌ (ezycook.in)సంస్థ ఎన్నోరకాల శాకాహార మాంసాహార కూరల్ని ఇలా సులభంగా చేసుకునే వీలు కల్పిస్తోంది. ముందుగా ఈ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడున్న కూరల రెసిపీల్లో దేన్నైనా ఎంచుకుంటే చాలు, మనం చెప్పిన కూరకు సంబంధించిన ముక్కలతో సహా దినుసులన్నిటినీ విడివిడిగా ప్యాక్‌ చేసి, ఆ కూరను ఎలా వండాలో పాయింట్లవారీగా తెలిపే ఓ కార్డును కూడా జతచేసి పంపిస్తారు.

ఎంత కావాలో అంతే...
ఉదాహరణకు ఎవరైనా చేపల వేపుడు చేసుకోవాలనుకుంటే వండడంకన్నా ఆ ముందు చేసే పనులే ఎక్కువ ఉంటాయి. మార్కెట్‌కెళ్లి చేపలూ, మసాలాలూ, కొత్తిమీర... ఇలా కావల్సినవన్నీ తెచ్చుకోవాలి. చేపల ముక్కలు కడిగి, మసాలాలూ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని చేసుకుని, దానికి పట్టించి ఫ్రిజ్‌లో రెండు మూడు గంటలు ఉంచాలి. తర్వాత పచ్చిమిర్చి కోసి, కొత్తిమీరలాంటివాటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. అసలు వంట సమయం కన్నా ఈ పనులకే గంటల సమయం కరిగిపోతుంది. అదే ఆ చేపలవేపుడు కోసం ‘ఈజీ కుక్‌’లో ఆర్డరిస్తే చేపల్ని తెచ్చి కడిగి, ముక్కలు కోసి, వాళ్లే అవసరమైనంతసేపు మసాలా పట్టించి ఉంచుతారు. దాంతో పాటు వేపుడు చెయ్యడానికి అవసరమైన ఇతర మసాలాలూ కరివేపాకూ కొత్తిమీరలతో సహా అన్నిటినీ కావల్సినంత మేర విడివిడిగా ప్యాక్‌ చేసి పంపిస్తారు. మనం చెయ్యాల్సిందల్లా రెసిపీ కార్డులో చెప్పినట్లూ వరుసగా వాటిని నూనెలో వేసి వేయించుకోవడమే. ఇలా అయితే, ఇంటికి చుట్టాలొస్తున్నారన్నా ఏమాత్రం శ్రమ పడకుండా రెండు మూడు కూరల్ని చేసేసుకోవచ్చు. దీనివల్ల మరో ఉపయోగం ఏంటంటే... కొన్ని ప్రత్యేకమైన మసాలా వంటకాలూ పనీర్‌ కూరల్లాంటివాటిని ఎప్పుడోగానీ చెయ్యం. కానీ వాటికి రకరకాల సాస్‌లూ, బ్లాక్‌ సాల్ట్‌, అజినమోటో, క్రీమ్‌, వెన్న, చీజ్‌, పన్నీర్‌, మసాలా దినుసులు... ఇలాంటివి కొద్ది కొద్దిగా అవసరమవుతాయి. అవన్నీ ఒకచోట దొరకవు సరికదా... అన్నిటినీ సరిగ్గా కూరకు సరిపోయేంత తక్కువ పరిమాణంలో కొని తెచ్చుకోవడమూ కుదరదు. దాంతో మిగిలినవన్నీ వృథా అయిపోతాయి. ఈజీకుక్‌తో ఇలాంటి సమస్యే ఉండదు. పైగా వాళ్లు ఒక కూరకు ఎంతకావాలో అంతే కొలతతో ఇస్తారు కాబట్టి, మనకు ఎంత వెయ్యాలన్న సందేహం కూడా అక్కర్లేదు. అసలు వంటరానివాళ్లు కూడా దీంతో ఇంట్లోనే రుచిగా వండేసుకోవచ్చు.