close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా వయసు...అరవై దీపావళి పండగలు!

మా వయసు...అరవై దీపావళి పండగలు!

గిరిజనుల సమస్యలకు స్పందిస్తారు. వేదాల పరిరక్షణకు పాటుపడతారు. శ్రీమన్నారాయణుడి పూజకెంత విలువ ఇస్తారో, దరిద్రనారాయణుల సేవకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఆ ఆధ్యాత్మిక, మానవతామూర్తి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు షష్ఠ్యబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అరవై ఏళ్ల పండగ సందర్భంగా సామాన్య జీవితం నుంచి సర్వసంగ పరిత్యాగం దాకా అనుభవాలూ జ్ఞాపకాలూ ఆలోచనలూ స్వామీజీ మాటల్లోనే...

చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం.
అజ్ఞానం నుంచి జ్ఞానం దిశగా ప్రస్థానం.
...మనిషికి దీపావళి సందేశమిది.
సరిగ్గా అరవై ఏళ్ల క్రితం, మాతృగర్భం లోంచి బయటికొచ్చి మా జీవనయాత్రను మొదలు పెట్టింది కూడా దీపావళి రోజునే. ప్రతి దీపావళికీ భక్తుల నుంచీ శ్రేయోభిలాషుల నుంచీ జన్మదిన శుభాకాంక్షలతో ఉత్తరాలు అందుతుంటాయి. అందులో, అమ్మ రాసిన ఉత్తరం తప్పకుండా ఉంటుంది. ఎనిమిది పదుల వయసులో కూడా...చూపు ఆనకపోయినా, శరీరం సహకరించకపోయినా ఉత్తరం రాస్తూనే ఉంటారు అమ్మ. ఆ లేఖలో ‘సంప్రదాయ సేవ బాగా జరగాలి. రామానుజాచార్యుల సందేశం ప్రపంచమంతా విస్తరించాలి...’ అన్న ఆకాంక్షే తప్పించి మరో విషయం ప్రస్తావించరా తల్లి! మాతృత్వంలోని గొప్పదనమే అది. సన్యాసి భవబంధాలకు అతీతుడు. నా అన్న భావన ఉండకూడదు. ప్రతి స్త్రీమూర్తీ మాకు మాతృమూర్తితో సమానమే. అమ్మలందర్లోనూ ఆ అమ్మ కనిపిస్తుంది. ఆ అమ్మలో అమ్మలందర్నీ దర్శించుకుంటాం.

***

తూర్పుగోదావరి జిల్లాలోని అర్తమూరులో పుట్టాం. నాలుగేళ్లు వచ్చేవరకూ అక్కడే ఉన్నాం. ఆతర్వాత మా కుటుంబం రాజమహేంద్రవరానికి వచ్చింది. నాన్నగారి పేరు వేంకటాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. అమ్మ అలిమేలు మంగమ్మ అచ్చమైన గృహిణి. రోగులూ, ఔషధాలూ, ఆయుర్వేద గ్రంథాలూ...నాన్నగారి ప్రపంచం నాన్నగారిది. మారాం చేసినా, మొండికేసినా అమ్మ దగ్గరే. అమ్మకు భూదేవంత సహనం. శుభ్రంగా స్నానం చేయించి, నుదుట తిలకం దిద్ది బడికి పంపేవారు. ధనుర్మాసంలో తెల్లవారుజామునే నిద్రలేపి...పాశురాలు వల్లెవేయించేవారు. బడికెళ్లేముందు కమ్మని చక్కెరపొంగలి పెట్టేవారు. బాల్యంలో మా దృష్టిలో దేవుడంటే ప్రసాదమే.

చిన్నప్పుడు, మా అల్లరి కాస్త ఎక్కువే. ఏ మామిడిచెట్టో కనిపిస్తే చాలు. చిటారు కొమ్మల్నీ వదిలేవాళ్లం కాదు. ఓసారి, అంతెత్తు నుంచీ కిందపడిపోయాం. కంటికి దెబ్బతగిలింది. మరోసారి కొమ్మల్ని నరుకుతూ వేలికి గాయం చేసుకున్నాం. అలా అని, చదువుల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. గౌతమి విద్యాపీఠంలో మా ప్రాథమిక విద్యాభ్యాసమంతా సాగింది. ఎప్పుడు పరీక్ష పెట్టినా గణితంలో నూటికి తొంభై ఎనిమిది మార్కులొచ్చేవి. నూటికి నూరూ రావాల్సిందే కానీ, ‘చాలా బాగా రాశావురా. వందకు వందా ఇచ్చేస్తే నీకు కొమ్ములు వచ్చేయవూ...’ అంటూ మార్కులకు కోత పెట్టేవారు దత్తు మాస్టారు. ఆయన లెక్కలూ ఆంగ్లమూ చెప్పేవారు. సంస్కృతం మాస్టారి పూర్తిపేరు గుర్తులేదు కానీ...భ.వి.శర్మగారని పిలిచేవారంతా. చాలా ప్రేమగా పాఠాలు చెప్పేవారు. ఎప్పుడు వక్తృత్వ పోటీలు నిర్వహించినా మాకే మొదటి బహుమతి. దీపావళి వచ్చిందంటే సందడే సందడి. మతాబులూ తారాజువ్వలూ చిచ్చుబుడ్లూ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లం. పండక్కి వారం రోజుల ముందే సూర్యకారం, గంధకం వగైరా ముడిపదార్థాల్ని ముందేసుకుని కూర్చునేవాళ్లం. అప్పట్లో రష్యన్‌ అనువాద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా వచ్చేది. ఆ కాగితాలు నాణ్యంగా ఉండేవి. టపాసుల తయారీకి బాగా ఉపయోగపడేవి.

పుస్తకాలంటే మొదట్నుంచీ ఇష్టం. నాన్న మా కోసం చాలా పుస్తకాలు కొనేవారు. ఇంటికి దగ్గర్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. ఎటు చూసినా పుస్తకాల దొంతర్లే. నచ్చిన పుస్తకం తీసుకుని ఓపికున్నంత సేపూ చదువుకునే వాళ్లం. అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక బొమ్మల కథలు ప్రచురించేవి. వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. అందులోనూ రోదసి కథలంటే మాకు మహా ఇష్టం. నక్షత్రాలూ గ్రహాలూ ఉపగ్రహాలూ...ఆ అంతరిక్ష ప్రపంచం గురించి అందంగా వూహించుకునేవాళ్లం. ఏదో ఓరోజు ఆ నక్షత్రాల మధ్యకి వెళ్లాలనీ అంతుచిక్కని ఖగోళ రహస్యాల్ని ఛేదించాలనీ కలలుగనేవాళ్లం. ఎయిర్‌ఫోర్స్‌లో చేరినవాళ్లకే ఆ అవకాశం ఉంటుందని ఎవరో చెప్పారు. మరుక్షణం నుంచీ చేస్తేగీస్తే వాయుసేనలోనే ఉద్యోగం చేయాలని తీర్మానించుకున్నాం. పసితనపు అమాయకత్వమది! పెద్దయ్యాక కూడా ఆ కల మమ్మల్ని వదిలిపెట్టలేదు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, బోయిన్‌పల్లిలో వాయుదళం కోసం నియామకాలు జరుగుతున్నాయని తెలిసి ఉత్సాహంగా వెళ్లాం. ఎత్తు సరిపోదని వెనక్కి పంపేశారు. అయినా ఆశ తీరక, మళ్లీమళ్లీ ప్రయత్నించినట్టు జ్ఞాపకం!

హైస్కూలులో నెహ్రూ అనే స్నేహితుడు ఉండేవాడు. తనది వామపక్ష భావజాలం. లెనిన్‌, మార్క్స్‌ సిద్ధాంతాల మీద మంచి అవగాహన ఉండేది. హేతువాదం గురించీ సైన్స్‌ గురించీ లోతుగా విశ్లేషించేవాడు. మాదేమో పూర్తి సంప్రదాయ కుటుంబం. చదివిన ప్రతిదాన్నీ నమ్మేయకుండా...తార్కిక దృష్టితో చూడటం ఎలాగో నెహ్రూ నుంచే తెలుసుకున్నాం. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాళ్లం. అక్కడే కర్రసాము నేర్చుకున్నాం. పుస్తకాలు ఆలోచననిస్తే, స్నేహితుడు హేతువాద దృక్పథాన్నిచ్చాడు. కుటుంబం విలువల్ని అందించింది. ఆరెస్సెస్‌లో కఠిన క్రమశిక్షణ అలవడింది. ఓ మహావ్యక్తి తారసపడేదాకా ఆ ప్రత్యేకతలన్నీ ముడిసరుకులా మూలనపడున్నాయి.

***

మెట్రిక్‌లో ఉన్నప్పుడు నాన్నగారు మరణించారు. ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోయాయి. అమ్మ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. పెద్ద చదువుల ఆలోచనల్ని పక్కనపెట్టి, ఉపాధిమార్గం వెతుక్కోవాల్సిన అగత్యం ఏర్పడింది. సంచిలో రెండుమూడు జతల గుడ్డలు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చేశాం. కార్ఖానాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగమైనా రాలేదు. చివరికి, ఓ ఔషధాల కంపెనీలో కార్మికుడిగా చేరాం. అక్కడ ఉన్నప్పుడే టైపింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకున్నాం. పనితీరు నచ్చి స్టెనోగ్రాఫర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు. ఆతర్వాత టైర్ల కంపెనీలో ఇంకాస్త మంచి ఉద్యోగం దొరికింది. కుటుంబ పోషణ బాధ్యత మా మీదే ఉండటంతో..చాలా పొదుపుగా ఉండేవాళ్లం. అంతలోనే రాజమహేంద్రి నుంచి పిలుపు వచ్చింది. అక్కడ మా కుటుంబానికి కొన్ని ఆస్తులు ఉండేవి. ఆ వ్యవహారాలేవో చక్కబెట్టాల్సి వచ్చింది. వెంటనే బయల్దేరిపోయాం.

ఆ సమయంలోనే పెద్దజీయరు స్వామివారు కాకినాడలో యజ్ఞం తలపెట్టారు. ఆ కార్యక్రమం కోసం రాజమండ్రి నుంచి కొన్ని పూజాద్రవ్యాలు తీసుకెళ్లాల్సి వచ్చింది. అమ్మ ఆ బాధ్యత మాకు అప్పగించారు. ఒకటే వర్షం. రైలు వెళ్లిపోయింది. బస్సు తప్పిపోయింది. తెల్లవారుజాము సమయానికి స్వామివారి బసకు చేరుకున్నాం. ఏదో రాసుకుంటూ కూర్చున్నారు. తిరునామాలతో, త్రిదండంతో, కాషాయ వస్త్రాలతో...దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఓ సర్వసంగ పరిత్యాగిని అంత దగ్గర నుంచి చూడటం అదే మొదటిసారి. స్వామివారంటే మా కుటుంబానికి చాలా గౌరవం. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు. సేవా కార్యక్రమాల కోసం ఆస్తులన్నీ కరిగించుకున్న మహాదాత. మహాత్ముడి ప్రభావంతో ఖద్దరు కట్టారు. నూలు ఒడికారు. అప్పట్లోనే సొంతూళ్లొ పంచాయతీ వ్యవస్థను పరిచయం చేశారు. ఆధ్యాత్మికత మీద అనురక్తితో అన్నీ వదులుకుని...సన్యాసిగా మారారు.

పెద్ద జీయరు స్వామివారి దగ్గరికి బయల్దేరుతున్నప్పుడు అమ్మ మాకు రెండు బాధ్యతలు అప్పగించారు. ఒకటి...మా ఒడుగు గురించి వారి అభిప్రాయం తెలుసుకురమ్మన్నారు. ఆ మాటే చెప్పాం. సికింద్రాబాద్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఉపనయనానికి ముహూర్తం ఖరారు చేశారు. రెండు ...ఇంట్లోని అపార వైదిక వాజ్ఞ్మయాన్ని ఏం చేయాలో అడగమన్నారు. ‘మాకు ఆ గ్రంథాలేవీ అర్థం కావడంలేదండీ! ఏం చేయాలో ఆదేశిస్తే...’ అంటూ ఉండగానే, ‘అర్థం చేసుకుంటే అవే అర్థం అవుతాయి..’ అని చెప్పారు. ఆ కొద్ది మాటల్లోనే అనేక భావాలు, అంతర్లీన సందేశాలు. స్వామివారి ఆప్తమిత్రుల పేరు గోపాలాచార్యులుగారు. ఆయన గొప్ప పండితులు. ‘అవసరమైతే గోపాలాచార్యుల సలహా తీసుకోండి’ అని కూడా సూచించారు. అంతలోనే స్వామివారి రాజమండ్రి పర్యటన ఖరారైంది. ముందే వెళ్లి ఆ ఏర్పాట్లు చూడమని గోపాలాచార్యులు పురమాయించారు. ఉన్నపళంగా బయల్దేరాం. టెంట్లు వేయించాం. పూజకు ఏర్పాట్లు చేయించాం. తెల్లవారు జామున స్వామివారొచ్చారు. ఏ లోటూ రాకుండా సమన్వయం చేసుకున్నందుకు కళ్లతోనే ప్రశంసించారు. ‘మాకో స్టెనోగ్రాఫర్‌ అవసరం. మంచి కుర్రాడుంటే చూడండి’ అని ఎవరితోనో చెబుతూ ఉంటే మా చెవుల్లో పడింది. ‘మేమూ స్టెనోగ్రఫీ చేశాం. అవకాశం ఇవ్వండి’ అని కాస్త బెరుగ్గానే అడిగాం. ‘తక్షణం ఏదో ఓ ఉద్యోగం కావాలి. దీనివల్ల ఆర్థిక సమస్య తీరుతుంది. రెండు...మాకు ప్రయాణాలంటే ఇష్టం. జీయరు స్వామివారి దగ్గర ఉంటే దేశమంతా చుట్టేసి రావచ్చు. ఇలాంటి చిన్నచిన్న కోరికలు తప్పించి, జీవితం మీద ఎలాంటి స్పష్టతా లేని దశ అది. దేవుడి గురించీ పాపపుణ్యాల గురించీ మాలో తలెత్తిన సందేహాల్ని నివృత్తి చేసేవారెవరూ అప్పటిదాకా కనిపించలేదు. కనిపించినా సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. దీంతో ఆధ్యాత్మికత పట్ల ఓ రకమైన తటస్థ భావన ఏర్పడింది. అది అనుకూలతా కాదు, వ్యతిరేకతా కాదు.

స్వామివారితో కలసి తమిళనాడులోని దివ్యక్షేత్రాలన్నీ దర్శించుకున్నాం. భారతీయ ఆలయాల పునరుద్ధరణ కమిటీకి వారు నాయకత్వం వహించేవారు. ఉద్యమంలో భాగంగా శిథిల స్థితికి చేరుకున్న అనేక క్షేత్రాలకు జీవం పోశారు. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల్ని పొల్లుపోకుండా టైప్‌ చేయడం మా బాధ్యత. ఆ పర్యటనలో స్వామివారితో అలౌకిక అనుబంధం బలపడింది. వారి ఉపన్యాసాల్ని ఏకాగ్రతతో వినేవాళ్లం. పండిత చర్చల్ని ఓ మూలన నిలబడి ఆలకించేవాళ్లం. వారే చొరవగా ఓ నాలుగు పుస్తకాలు చేతిలో పెడితే శ్రద్ధగా చదివేవాళ్లం, ఏవైనా సందేహాలుంటే తీర్చుకునేవాళ్లం...ఇలా రోజంతా స్వామివారి సమక్షంలోనే గడిచిపోయేది. రామానుజాచార్యుల బోధనలూ, ఆళ్వార్ల తత్వాలూ, దివ్య ప్రబంధాలూ... నిన్నమొన్నటిదాకా తెలియని సాహిత్యం పరిచయమైంది. గురువు అంటే ఏమిటో అర్థమైంది. గురుదేవుల సన్నిధిలో ఆలోచనలు వికసించాయి. అజ్ఞానపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. తర్వాత, బదరికాశ్రమానికి తీసుకెళ్లి నారాయణమంత్రాన్ని బోధించారు. అక్కడే కొద్దికాలం ఉండి అనుష్ఠానం చేశాం. ఆతర్వాత నడిగడ్డపాలెంలోని వేద పాఠశాలకు పంపారు. గోపాలాచార్య స్వామివారి సమక్షంలో వేదళ వేదాంగాలూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతా...అధ్యయనం చేశాం. 1979 డిసెంబరు 31న... వైకుంఠ ఏకాదశి నాడు, పెద్ద జీయరు స్వామి పరమపదించారు. అదో శరాఘాతం! ఇక మా సందేహాల్ని ఎవరు తీరుస్తారు, మా వ్యక్తిత్వాన్ని ఎవరు సానబడతారు, మా సాధనకు ఎవరు దిశానిర్దేశం చేస్తారు...మనసు నిండా ఓరకమైన శూన్యం ఆవరించింది. స్వామివారు మా పితామహులే అయినా, నూటికి నూరుపాళ్లూ గురుశిష్య సంబంధం మాది.

అప్పటికే, స్వామివారు తిరుమలలో స్వాధ్యాయ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. తేదీ కూడా ప్రకటించారు. అంతటి కార్యాన్ని పూర్తిచేయడం పెద్ద సవాలు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న తలెత్తింది. భక్తులంతా మా పేరు ప్రతిపాదించారు. అప్పటికి మా వయసు పాతిక. ‘ఇంత చిన్న వయసులో సన్యాసం తీసుకోవాల్సిన అగత్యం ఏం ఉంది? సంసార బాధ్యతలు నిర్వర్తించాక అయినా సన్యాసిగా మారవచ్చు’ అన్న సూచన వచ్చింది. అందుకు మేం తిరస్కరించాం. స్వామివారి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడమే తక్షణ కర్తవ్యమని భావించాం. ఆ మహా సంకల్పాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, కుటుంబ బాధ్యతల్లో కూరుకుపోవడం సరికాదు. ఒక్క విషయంలో మాత్రం మనసు తటపటాయించింది. నాన్న లేరు. అమ్మ ఒంటరి. మా తర్వాత ముగ్గురు పిల్లలున్నారు. ఆసరా లేకపోతే వాళ్లెలా బతుకుతారన్న ఆలోచన ఇబ్బందిపెట్టింది. ఆ సమయంలో అమ్మ చూపిన పరిణతి గొప్పది. గుండె దిటవు చేసుకుని మా సన్యాసానికి అనుమతించారు. స్థిర నిర్ణయంతో...శ్రీపెరుంబుదూరు వెళ్లి సన్యాస దీక్ష తీసుకున్నాం. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయరుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం.

***

మాధవ సేవగా సర్వప్రాణి సేవ - మా నినాదమూ, విధానమూ. ఆధ్యాత్మికత, సేవ...వేరువేరు కాదు. తోటి మనిషి కష్టానికి స్పందించనప్పుడు, తోటి మనిషిని మనిషిగా గుర్తించనప్పుడు..మనిషితనానికి అర్థం లేదు, జీవితానికి విలువలేదు. సేవతోనే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత. ఆచార్యులు పెద్ద జీయరు స్వామి చెప్పింది అదే, పరమాచార్యులు రామానుజులవారు బోధించింది కూడా అదే.

ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక సన్యాసి చెరువులో స్నానం చేస్తున్నాడు. ఎట్నుంచో ఓ తేలు వచ్చింది. ఎక్కడ నీళ్లలో కొట్టుకుపోతుందో అన్న సానుభూతితో, ఆ సన్యాసి చేతితో తీసి ఒడ్డు మీద వదలబోయాడు. చటుక్కున కరిచేసింది. ఒడ్డున వదిలిన ప్రతిసారీ ఆ తేలు నీటిలోకి రావడమూ...నీటిలోకి వచ్చిన ప్రతిసారీ సన్యాసి దాన్ని ఒడ్డు మీదికి వేయడమూ... ఆ ప్రయత్నం జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆ తేలు సన్యాసి వేలు కుట్టడమూ జరుగుతూనే ఉంది. పక్కనున్న మిత్రుడు ఇదంతా చూశాడు. ‘అంత బాధ అనుభవిస్తూ కూడా ఆ విష కీటకాన్ని రక్షించడం అవసరం అంటారా?’ అని అడిగాడు. ‘అవసరం కాదు. బాధ్యత. మనిషిగా తోటి ప్రాణిని రక్షించడం నా సహజ స్వభావం. ప్రాణంపోతున్నా ఆ తేలు తన స్వభావాన్ని వీడలేదే, కొన వూపిరిలోనూ కుట్టడం మానలేదే. మనిషిగా నేను మాత్రం నా స్వభావాన్నెందుకు విస్మరించాలి?’ అని జవాబిచ్చాడు. ‘నలుగురి కోసం’ అన్న భావన మనిషి స్వభావంలో ఓ భాగం.