close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిటారుకొమ్మ మీద వేలాడే వంతెన..!

చిటారుకొమ్మ మీద వేలాడే వంతెన..!

ఈసారి అమెరికా వెళ్లినప్పుడు సియాటల్‌ నుంచి కెనడాలోని వాంకూవర్‌, విక్టోరియా ప్రదేశాలకు వెళ్లాలనుకున్నాం. అందుకోసం ముందుగా భారత్‌లో ఉండగానే కెనడా వీసా కూడా తీసుకున్నాం. అనుకున్నట్లే ఓ వారాంతంలో కారులో ఓడలు ఆగి ఉండే పియర్‌కు వెళ్లి కారును కూడా ఓడలో ఎక్కించి, మేం లిఫ్ట్‌ ద్వారా ఓడ పై అంతస్తులోకి చేరుకున్నాం. ఆ రోజంతా ప్రయాణించి రాత్రికి వాంకూవర్‌కు చేరుకుని అక్కడున్న ఓ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాం.

చెట్లమీద ఉయ్యాల..!
మర్నాడు ఉదయాన్నే బయలుదేరి కారులో ప్రయాణించి కాపిలానో నదిపై వేలాడే ట్రీటాప్‌ వంతెన ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. ఇది అత్యంత అందమైన అటవీ ప్రాంతంగా చెప్పవచ్చు. ఏటా దాదాపు ఎనిమిది లక్షలమంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. మొదటగా 1889 ప్రాంతంలో స్థానిక గ్రామీణులతో కలిసి స్కాట్లాండ్‌కు చెందిన ఓ సివిల్‌ ఇంజినీరు చెట్ల తీగలు, దేవదారు చెక్కలతో ఓ మామూలు వంతెనను కాపిలానో నదిని దాటడానికి నిర్మించుకున్నారు. ఆ తరవాత ఇది అనేకమంది చేతులు మారింది. 1983లో నాన్సీ స్టిబ్బర్డ్‌ అనే వ్యక్తి ఈ పార్కునీ వంతెననీ కొనుగోలు చేసి ఎకోథీమ్‌ పార్కునూ వేలాడే వంతెననూ ఏర్పాటుచేసి ట్రీ టాప్‌ అడ్వెంచర్‌గా తీర్చిదిద్దాడు. కాపిలానో నదిమీద 230 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన, 446 అడుగుల పొడవునా ఉండి అతి ఎత్తైన ఫిర్‌ చెట్ల శిఖర భాగాల్ని కలుపుతూ కిందకి వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన కారణంగా కింద ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా కేబుల్‌ వైర్లూ దేవదారు చెక్కలూ ఉపయోగించి నిర్మించారు. మొత్తంగా ఏడు వేలాడే వంతెనల సమూహంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిమీద నడుస్తుంటే అది ఉయ్యాల మాదిరిగా వూగుతుండటంవల్ల కొందరికి తలతిరగడం, వికారం, భయం వంటివి కూడా కలుగుతాయి. కాస్త ధైర్యవంతులు మాత్రమే దీనిమీద నడవగలరు. వృద్ధులూ అనారోగ్యంతో బాధపడేవాళ్లూ దీనిమీద ప్రయాణించడం చాలా కష్టం.

మేం పక్కనే ఉన్న ఇనుపవైర్లను పట్టుకుని దీనిమీద నడుస్తూ కిందనే వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న కాపిలానో నదీ సౌందర్యాన్నీ పచ్చని పరిసరాల సొగసుల్నీ చూస్తూ ప్రకృతిలో లీనమైపోయాం.

చెక్క కళారూపాలు!
ఈ అటవీప్రాంతపు కాలిబాటలో చాలాచోట్ల ఈ ప్రాంతం గురించీ అక్కడి చెట్ల గురించిన వివరాలను పొందుపరిచిన బోర్డులు ఉన్నాయి. ఇక్కడే మేం అలాస్కా, కెనడాలకే ప్రత్యేకమైన గోధుమఛాయతో కూడిన ఎరుపు రంగు ఎలుగుబంట్లను చూశాం. తరవాత ఈ అడవిలోనే ఏర్పాటుచేసిన గ్రౌస్‌ పర్వతం అనే పార్కుకి వెళ్లాం. అక్కడ అలాస్కాలోని స్థానిక తెగల సంస్కృతిని ప్రతిబింబించే టోటెమ్‌ పోల్స్‌ కనిపిస్తాయి. పొడవాటి చెక్కలమీద చేపలూ గద్దలూ ఎలుగుబంట్లూ... వంటి అనేక బొమ్మల్ని చెక్కిన ప్రాచీన శిల్పకళకు ప్రతిరూపాలే ఈ టోటెమ్‌ పోల్స్‌. ఇవే కాదు, పూర్వం స్థానికులు నివసించిన తెప్పలూ వాళ్ల సంస్కృతికి సంబంధించిన శిల్పాలూ కూడా ఈ పార్కులో కనిపిస్తాయి.

క్లిఫ్‌ వాక్‌..!
ఈ థీమ్‌ పార్కులోని మరో సందర్శక స్థలమైన క్లిఫ్‌ వాక్‌కు బయలుదేరాం. అర్ధవృత్తాకారంలో ఉండే దీన్ని కాపిలానో నదిమీద వంద మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేశారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యానికి దీన్ని ప్రత్యక్ష తార్కాణంగా చెప్పవచ్చు. దీనిపైకి లిఫ్ట్‌ ద్వారా వెళ్లాం. లేజర్ల సాయంతో త్రీడీ గ్రానైట్‌ క్లిఫ్‌ను తలపించేలా దీన్ని అద్భుతంగా నిర్మించారు. దీనిమీద నుంచి మొత్తం అడవినీ కాపిలానో నదిమీద వేలాడే వంతెననూ మంచుపర్వతాలనూ చూస్తుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది.

బ్రిటిష్‌ కొలంబియాలో...
మర్నాడు ఉదయాన్నే వాంకూవర్‌నుంచి బయలుదేరి మా కారులోనే విక్టోరియాకు చేరుకున్నాం. దీన్నే బ్రిటిష్‌ కొలంబియా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది వాంకూవర్‌ ద్వీపానికి దక్షిణంలో ఉంది. 1948వరకూ ఇది వాంకూవర్‌ ద్వీప రాజధానిగా ఉంది. తరవాత వాంకూవర్‌, విక్టోరియాలు కెనడాలో భాగంగా మారాయి. ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలోని వేడి వాతావరణం కారణంగా విక్టోరియాలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. పార్కులన్నీ పూలతోటలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అత్యంత సన్నగా ఉండే జువన్‌ డి ఫూకా జలసంధి విక్టోరియాను ఉత్తర అమెరికా ఖండం నుంచి వేరు చేస్తుంటుంది. ఆకాశహర్మ్యాలు లేని అత్యంత సుందర ప్రదేశం ఇది. ఇన్నర్‌ హార్బర్‌ ప్రాంతంలోని డౌన్‌టౌన్‌తో కలిసి ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తుంటే చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలా అనిపించింది.

విక్టోరియాలో చూడదగ్గవాటిలో హెరిటేజ్‌ భవనాలూ ఎంప్రెస్‌ హోటలూ రాయల్‌ బ్రిటిష్‌ కొలంబియా మ్యూజియమూ ముఖ్యమైనవి. ముందుగా మేం రాయల్‌ బ్రిటిష్‌ కొలంబియా మ్యూజియానికి వెళ్లాం. ఇది పార్లమెంటు భవనానికీ ఫెయిర్‌మాంట్‌ ఎంప్రెస్‌ హోటల్‌కీ మధ్యలో ఉంది. నేచురల్‌ కల్చరల్‌ హిస్టరీ మ్యూజియం ఆఫ్‌ కెనడాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో స్థానికుల సంస్కృతీ సంప్రదాయలన్నిటి గురించిన బొమ్మల్నీ చూడవచ్చు. ఇన్నర్‌ హార్బర్‌ దక్షిణ భాగంలో నియో బారోక్‌ శైలిలో రాతితో కట్టిన పార్లమెంటు భవన అందాలను చూసి తీరాల్సిందే. దీనికుండే డోమ్‌ పైభాగంలో కెప్టెన్‌ జార్జ్‌ వాంకూవర్‌ శిలా ప్రతిమ ఉంటుంది. ఈ ద్వీపాన్ని కనుగొన్న తొలి నౌకా కెప్టెన్‌ ఆయనే. ఈ ఆవరణలోనే విక్టోరియా మహారాణి శిలా ప్రతిమ కూడా ఉంటుంది. ఈ భవన సముదాయంలోకి పర్యటకులను అనుమతించరు. చుట్టూ తిరుగుతూ ఫొటోలు తీసుకోవచ్చు. గుర్రపు బగ్గీల్లో కూర్చుని వాళ్లిచ్చే రజాయిలు కప్పుకుని వాళ్లు చెప్పే విశేషాలను వింటూ సాయంత్ర వేళలో విక్టోరియా అందాలను చూస్తూ పర్యటించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి గుర్రపు బగ్గీలను స్త్రీలే నడపడం విశేషం.

పర్యటకులకో ప్రత్యేకమైన టీ!
తరవాత ఇక్కడకు దగ్గరలోనే ఉన్న థండర్‌ బర్డ్‌ పార్కునీ జె.ఎస్‌. మెల్‌హెకన్‌ ఇంటినీ చూశాం. ఓ వైద్యుడూ రాజకీయవేత్త అయిన మెల్‌హెకన్‌ బ్రిటిష్‌ కాలనీ అయిన విక్టోరియాను కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ కెనడాలో భాగంగా చేర్చడానికి ఎంతగానో కృషి చేశాడట. అక్కడ నుంచి ఫెయిర్‌మాంట్‌ ఎంప్రెస్‌ హోటల్‌కి వెళ్లాం. ఇన్నర్‌ హార్బర్‌ ప్రాంతంలో ఉండే ఈ హోటల్‌ను 1908లో నిర్మించారు. ఇది విలాసవంతమైనదే కాదు, పురాతనమైనది కూడా. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈ హోటల్‌కే ప్రత్యేకమైన టీని స్టైలిష్‌గా పర్యటకులకు అందించడం ఇక్కడి ప్రత్యేకత.

చైనా టౌన్‌!
పాత విక్టోరియా నగరాన్ని ఆనుకునే ఉంటుంది చైనా టౌన్‌. శతాబ్దానికి పూర్వం ఎనిమిది వేలమంది చైనీయులు ఇక్కడ నివసించారట. 1971 నుంచీ దీన్ని ఓ చరిత్రాత్మక జిల్లాగా ప్రకటించారు. అక్కడ కాసేపు తిరిగి చూశాక బేకన్‌ హిల్‌ పార్కుకి వెళ్లాం. ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఇక్కడి నుంచి చూస్తే జువాన్‌ డె ఫుకా జలసంధీ అక్కడ నిర్మించిన ప్రావెన్షియల్‌ పార్కూ మంచు పర్వతాలూ కనువిందు చేస్తాయి.

తరవాత క్రెయిగ్‌డారోచ్‌ క్యాజిల్‌ను సందర్శించాం. విక్టోరియా కాలం నాటి రాజరిక వైభవాన్ని చూడాలంటే ఈ భవనాన్ని సందర్శించాల్సిందే. స్కాటిష్‌ పారిశ్రామికవేత్త రాబర్ట్‌ డన్స్‌ముయిర్‌ 19వ శతాబ్దం ప్రారంభంలో తన భార్యకోసం బొగ్గుగనుల్లో సంపాదించినంతా ఖర్చుపెట్టి మరీ ఈ భవనాన్ని నిర్మించాడట. కానీ ఇది పూర్తికాకముందే అతను మరణించాడట. పెద్ద కోటలా ఉండే ఈ భవనంలో 39 గదులను పర్యటకులు చూడ్డానికి అనుమతిస్తారు. దీనికి దగ్గరలో అనేక ఉద్యానవనాలు ఉన్నాయి.

తరవాత మారిటైమ్‌ మ్యూజియం ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాకు వెళ్లాం. ఇందులో టిలికమ్‌ అనే ఓ పెద్ద నావ ఉంది. ఇందులోనే కొంతమంది భారతీయ నావికులు పూర్వకాలంలో ఇంగ్లాండ్‌కు వచ్చారట. దాన్ని అక్కడ అలాగే ఉంచారు. ఈ మ్యూజియం 1869 వరకూ కోర్టుగా ఉండేదట.

తరవాతరోజు సీతాకోకచిలుకల ఉద్యానవనానికి వెళ్లాం. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ వనంలో వెయ్యి రకాల అరుదైన సీతాకోకచిలుకలూ మాత్‌లూ ఉన్నాయి. సుమారు మూడువేల సీతాకోకచిలుకలు అందులో ఎగురుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని రకాల పక్షుల్నీ సరీసృపాల్నీ చేపల్నీ కూడా ఇక్కడ చూశాం. తరవాత అక్కడ నుంచి విక్టోరియా బగ్‌ జూకి వెళ్లాం. ఇందులో చిన్నా పెద్దా కీటకాలనేకం కనిపిస్తాయి. కొన్ని పురుగులు రంగురంగుల్లో మెరుస్తుంటాయి. చీకట్లో వెలుగుతున్నట్లు ఉండే ఓ రకం తేలు కూడా ఇందులో ఉంది.