close
వీళ్లు... ఉత్తుత్తి కవలలు..!

వీళ్లు... ఉత్తుత్తి కవలలు..!

అచ్చం తమలాగే ఉండే కవల సోదరో సోదరుడో ఉంటే బాగుణ్ణని ఎంత సరదాపడినా చాలామందికి అది తీరని కోరికే. నిజంగా కాకపోయినా ఆటల్లో మాదిరి ఉత్తుత్తిగానయినా ఉంటే బాగుణ్ణు అనుకునేవాళ్ల కోసమే వస్తున్నాయి క్లోన్‌మీ కెమెరా ఆప్‌లు. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని క్లిక్‌ చేస్తే చాలు... ఒక్క కవలలనేముందీ, ముగ్గురూ నలుగురూ... ఇలా ఎంతమంది కావాలంటే అంతమందిని ఒకే రూపంతో ఫొటోలో పుట్టించేయొచ్చు. అది చూపించి కొత్తవాళ్లని మేం కవలలమని నమ్మించేయవచ్చు.

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. వినడమేగానీ చూసినవాళ్లెవరూ లేరనే చెప్పాలి. అలాగే అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ అచ్చుగుద్దినట్లుగా ఒకేలా ఉండటం కూడా అరుదే. పోలికలు చాలానే ఉన్నా ఎత్తులోనో బరువులోనో ఎక్కడో చిన్న తేడా అయినా ఉండకపోదు.

కానీ ముక్కూమొహమూ ఒడ్డూపొడవూ ఏమాత్రం తేడా లేకుండా అచ్చంగా ఒకేలా ఉండడం మాత్రం ఏకరూప కవలల్లోనే చూడగలం. అయితే అలా పుట్టడం అనేది మన చేతుల్లో లేని పని. కానీ అచ్చుగుద్దినట్లుగా ఒకేలా ఉండేవాళ్లను ఎంతమందినైనా పుట్టించగలిగే క్లోనింగ్‌ ప్రక్రియను జీవశాస్త్రనిపుణులు రూపొందించగలిగారు. అయితే అది సామాజిక విలువలకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రస్తుతం అది పరిశోధనలకే పరిమితమైంది. క్లోనింగ్‌తో నిజంగానే మనుషుల్ని పుట్టిస్తే తప్పు కానీ సరదాకోసం ఫొటోలో కనిపిస్తే తప్పేముందిలే అనుకున్నట్లున్నారు ఆధునిక సాంకేతిక నిపుణులు. అందుకే క్లోన్‌ యువర్‌సెల్ఫ్‌, స్లి్పట్‌ పిక్‌ 2.0, ఇన్‌స్టాస్లి్పట్‌, డిఎమ్‌డీక్లోన్‌, ట్విన్‌మీ, క్లోన్‌కెమెరా2.0, క్లోన్‌ కెమెరా... వంటి రకరకాల ఆప్‌లను సృష్టించేశారు. వీటిసాయంతో మనలాంటి మనుషుల్ని మనమే ఎంతమందినైనా రూపొందించుకోవచ్చన్నమాట.

ఈ కెమెరా ఆప్‌లను ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ మొబైల్‌ఫోనులోగానీ ఐఫోనులోగానీ డౌన్‌లోడ్‌ చేసుకుని విభిన్న భంగిమల్లో అంటే నిలుచునో కూర్చునో పడుకునో ఫొటోలు తీసుకుంటే చాలు, ఫొటోషాప్‌ అవసరం లేకుండా అందరినీ కలిపి ఒకేసారి ఫొటో తీసినట్లుగా ఒకే ఫ్రేములో బంధించేస్తాయివి. దాంతో నిజంగానే మనం కవలలమన్న భావాన్ని చూసేవాళ్లకు కలిగించవచ్చు. ఆప్‌ల్లోని ఫొటో లైబ్రరీలో భద్రంగా ఉండే ఈ ఫొటోలన్నింటినీ ఇ-మెయిల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా షేర్‌ చేసుకోవచ్చు కూడా.

అంతేకాదు, ఈ రకమైన ఫొటోలు తీసుకునేటప్పుడు మనలోని సృజనాత్మకతనూ ప్రదర్శించవచ్చు. ఒకరినొకరు హత్తుకున్నట్లూ సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్లూ కలసి వంట చేస్తున్నట్లూ... ఇలా ఎవరికి తోచిన ఆలోచనలను వాళ్లు ఈ క్లోన్‌ ఆప్‌ల ద్వారా ప్రదర్శించేయొచ్చు. వీటిల్లోని అదనపు ఫీచర్ల ద్వారా వాటిని మనకు కావాల్సినట్లుగా ఎడిట్‌ చేసుకోవచ్చు. సైజులూ లైటింగులూ ఫోకస్‌లూ ఫిల్టర్లూ ఫ్రేములూ... ఇలా అన్నింటినీ కెమెరాలో మాదిరిగానే సరిచేసుకోవచ్చు. సో... ఈ ఆప్‌లు తోడుంటే మీకులేని మీ కవల సోదరులతో కలసి ఫొటోలు తీయించుకోవచ్చు. మీ బంధుమిత్రులకు ఆ ఫొటోలు చూపించి వాళ్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తనూవచ్చు.