close
వెర్రెంకయ్య

వెర్రెంకయ్య
- కే.వి.రమణరావు

జరగబోయే పరిణామాలు తల్చుకోగానే నాంచారమ్మ గుండెల్లో గుబులు మొదలైంది. బస్సులో కిటికీ దగ్గర సీటు దొరికి, బయట మబ్బేసి చల్లగా గాలి తగులుతున్నా, ఆలోచనలు వదలడం లేదు.

ఎల్లుండే కూతుర్నీ, చంటిదాన్నీ తీసుకెళ్ళడానికి అల్లుడొస్తున్నాడు. ఉన్న రెండు రోజులూ పనసపొట్టు కూరే వండాలని ముందుగానే చెప్పాడు. కూరపనస సీజనైపోయింది. పైగా కుండపోత వానలతో కాయలు నీరెక్కిపోయుంటాయంటే వినిపించుకోడు. పోనీ ఏజెన్సీవి తెద్దామా అంటే ఇప్పుడు అవి కూడా రుచి బాగోవు. అల్లుడికి అసలే కోపమెక్కువ, అందులోనూ మిలటరీ ఉద్యోగం. ఏం పేచీ యెడతాడో... చూస్తే కూతురు బాలింతరాలు. అత్తారింటికొచ్చినప్పుడు ఎవరైనా కోడి కూరో, చేపల పులుసో అడుగుతారు. అక్కడికీ ‘కాకినాడ నుంచి ఒకటో రకం రొయ్యలు తెప్పిస్తానయ్యా’ అన్నా వినడే. ఇతనెక్కడి తిక్కమేళంరా బాబూ, చెప్పుకుంటే సిగ్గుచేటు.

మూడేళ్ళక్రితం కూతుర్ని కొత్త కాపురానికి తీసుకెళ్ళడానికొచ్చినప్పుడూ ఇంతే - ఇలాగే పేచీ పెడితే ఇంట్లో కొత్తల్లుణ్ణెట్టుకుని తాలూకా అంతా పనసకాయ కోసం తిరిగింది నాంచారమ్మ. చివరాఖరికి నిడదోలు దగ్గరి ‘కేశోరం’లో ‘వెర్రెంకయ్య’ తోటలో దొరికింది.

ఈసారి కూడా అక్కడికే వెళ్తొంది. ఇప్పుడా వెర్రెంకయ్య తోటలో లేత పనసకాయ దొరక్కపోతే యెలాగరా దేవుడా- అని మధనపడసాగింది నాంచారమ్మ. కొత్తరోడ్డు మీద బస్సు మెత్తగా జారుతూ ఉంటే మూడేళ్ళకిందట పనసకాయ తెచ్చుకున్న వైనమంతా ‘యెన్టీవోడి సినిమా రీలు యెనకనించి తిరిగినట్టుగా’ ఆమెకు గుర్తొస్తోంది.

*** క్రితంసారి అల్లుడొచ్చింది శ్రావణమాసంలోనే. ఆరోజు కూడా ఇలాగే వేకువనే లేచి తయారై ఇల్లు కూతురికప్పజెప్పి బయల్దేరి రెండు బస్సులు మారి, నిడదవోలు మీదుగా కేశవరం చేరి వెంకటయ్య తోట గురించి వాకబు చేసింది నాంచారమ్మ. ‘ఒహరు చూపించక్కర్లేదు. వూరుదాటి పడమరకెళ్తే నువ్వే ఆనమాలు పట్టగలవు’ అని చెప్పారిద్దరుముగ్గురు. అన్నట్టుగానే వూరుదాటిన నాంచారమ్మ- చుట్టపక్కల తోటలన్నిటికీ తేడాగా, బాగా ముదురాకుపచ్చ రంగులో, చుట్టూతా ‘యిజిన్నారం కోటగోడ’లా అంతెత్తు చెట్లతో చిక్కగా ఉన్న వెర్రెంకయ్య తోటని ఇట్టే గుర్తుపట్టింది. చెక్కగేటు తెరుచుకుని లోనికెళ్ళిన నాంచారమ్మ ముందుకెళ్ళేకొద్దీ తోట చక్కదనాన్ని కళ్ళు పెద్దవి చేసుకు చూడాల్సొచ్చింది. ఆ తోటలో లేని చెట్టు లేదేమో. చుట్టూ పూలమొక్కలూ, పండ్లచెట్లూ, చెట్లనిండా పక్షులూ, మధ్యన సాళ్ళుగా దున్నిన పెడల్లో గొప్పులెంబడి అపరాలూ, కూరగాయలూ, ఆక్కూరలూనూ. తాను రాజమండ్రి సంతమార్కెట్లో చూసిన రకాలన్నీ పెడల్లో కనబడతా వున్నాయి. దూరంగా దూళ్ళకొట్టం, పచ్చెరువులు కలిసిన మట్టివాసన, పురుగులమందు వాసనన్నది లేదు. అంతా కంటికింపైన రంగులూ సువాసనలూ. కలుపులకాలం... రెండోసారేమో తీస్తున్నారు. మనిషి కష్టం అడుగడుక్కూ తెలుస్తా ఉంది.

ఆమె చూపు పనసచెట్ల మీద పడింది. కాయలు ముదిరి పెద్దవైపోతున్నాయి. ఆమెకు గాబరా పెరిగి వెంకయ్యను వెతుకుతూ, ఒకచోట గొంత్తుక్కూర్చుని పారతో గొప్పులు తొవ్వుతూ, ఎదరనుంచున్న ఒకతని మీద కేకలేస్తున్న పెద్దమనిషిని చూసి అక్కడికెళ్ళింది. ఆ పెద్దాయన నూలు బనీను వేసుకుని, పంచె ఎగ్గట్టి, తువ్వాలు పాగా చుట్టుకున్నాడు. ఎండలో కమిలిన చర్మం కింద పచ్చటి ఒంటిరంగు, మాసిన తెల్లగడ్డం, వయసు డెబ్భైకి దగ్గర. పక్కగా ఇద్దరాడవాళ్ళు నుంచుని మరోవైపు తిరిగి నవ్వుకుంటున్నారు. వాళ్ళ చేతిసంచుల్లో కూరగాయలున్నాయి.

‘‘బుడ్డోడా... నువ్వు నిన్న చెప్పకుండా ఆక్కూర కోసుకున్న మాట నిజవా కాదా? పోనీమంటే ఇవ్వాళైనా చెప్పావా... అదీ లేదు. ఈ ఆడపిల్లల్ని చూసి నేర్చుకో. వారందాకా నాక్కనబడకు’’ అని అతని మీద అరిచి ‘‘ఇంకెళ్ళండి, పిల్లలాకలికి చస్తారు’’ అంటూ లేచి మరోవైపు నడిచాడు పెద్దాయన.

నాంచారమ్మ అతనే వెంకయ్యని పోల్చి అతని వెనకాలే నడుస్తూ ‘‘నవస్కారం బాబాయిగారూ’’ అని తన కథంతా చెప్పి ‘‘తమరు దయబెట్టి కూర పనసకాయొకటి ఇప్పించాలండి. బీదదాన్ని, బస్సు చార్జీలు పోగా నా దగ్గరున్న పైకమంతా ఇచ్చుకుంటానండీ’’ అంది.

వెంకయ్య ఆమె కథ విని పెద్దగా నవ్వి, ఆమెను పరీక్షగా చూసి కొన్ని పొంతనలేని ప్రశ్నలడిగి, ఆమె జవాబులు చెప్పాక, ఒక కీరకాయ తుంచి ఆమె చేతిలోపెట్టి ‘‘తిను, చల్లగా ఉంటుంది, దూరం నుంచొచ్చావు, అదునైపోయాక వచ్చావు గదమ్మా... నాతో రా చూద్దాం’’ అంటూ ముందుకు కదిలాడు. దార్లో నలుగురు కుర్రాళ్ళు చేతుల్నిండా జామకాయల్తో పరుగెత్తుకుంటూ ఎదురొచ్చారు. కొంటెగా అటిటు తిరిగి నవ్వుతూ ఆయనకందకుండా తప్పించుకుని పరిగెత్తారు.

‘‘అప్పుడే రెండోసారొచ్చారా యెధవల్లారా... వొరే దాసూ, మీ చెల్లికివాళ జాంకాయల్వికపోతే యింక నిన్ను రానివ్వను, యేవనుకున్నావో’’ వాళ్ళమీద కేకలేశాడు వెంకయ్య.

యేదేదో మాట్లాడుతూ, అక్కడక్కడా గొప్పులు సరిచేస్తూ, కలుపు మొక్కల్ని తీసేస్తూ ఆమెను తోటలో నైరుతిమూలకి తీసుకెళ్ళాడు. అక్కడ మనిషెత్తు పాత ‘ఇంటిదేవత’ గుడీ, దాన్ని చుట్టి పూలమొక్కలూ ఉన్నాయి. మరోవైపు పురాతన దిగుడుబావి, ఆనుకునే ఒక మండపం ఉన్నాయి. గుడి పక్కన ఒక చిన్న మిట్టపైన కొన్ని పండ్ల చెట్లున్నాయి. వాటిల్లో పనసచెట్లు కూడా ఉన్నాయి. కాయలు చిన్నగా లేతగా నవనవలాడుతున్నాయి. ఆమె మొహం విప్పారింది.

ఇంతలో ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి చేతుల్లో ఉన్న అరిటాకుల చుట్టను గట్టుమీద పెట్టి ‘‘దీంతో మొత్తం వందా యిరవై రూపాయలైందని చెప్పమన్నాడు మా అయ్య, యెల్తున్నా తాతా, స్కూలుకాలస్యమైంది’’ అనేసి అదే వేగంతో తిరిగి వెళ్ళిపోయాడు.

‘‘వందా నలభయ్యేనమ్మా, నాకు లెక్కలు రావనుకుని ఎక్కువ చెప్తారు. అదేందో నాకు అరిటాకు తప్ప కంచం పడదు. వీళ్ళింటి పెరట్లో అరటి భలే నాణ్యం, అంతా నేలదినుసు. వీళ్ళకదొకటే ఆధారం పాపం. అన్ని పంటలూ మనమే యేస్తే యెట్లా... నిజవా కాదా’’ అంటూ నిచ్చెన వేసుకుని పచ్చగా మెరుస్తున్న పనసకాయల్లో ఒకటి కోసి ఆమెకిచ్చాడు. కాయను పసిబిడ్డ అందుకున్నట్టుగా అందుకుని మండపంలో పెట్టి రొండిలోంచి డబ్బు తీసి వెంకయ్యకు ఇవ్వబోయింది నాంచారమ్మ.

‘‘డబ్బుతో అన్నీ కొనేగలననుకుంటున్నావా ఏంటీ?’’ అని కోపంగా తలతిప్పి ‘‘యిది మా యిలవేలుపు చెట్టు, కాయలమ్ముకుంటామా? కూతుర్ని తొలిసారి కాపురానికి పంపిస్తూ అంతదూరం నుంచి వెతుక్కుంటూ వచ్చావని ఇస్తున్నా... నీ డబ్బు తీసుకుంటానా, బీదపిల్లలకు పుస్తకాలు కొనిపెట్టు’’ నిచ్చెన పక్కనబెడుతూ అన్నాడు వెంకయ్య.

‘‘ఇలా అన్నీ వూరికే ఇచ్చేస్తే యెలా బాబాయ్‌’’ నిష్ఠూరంగా అడిగింది.

‘‘అన్నీ వూరకే యెందుకిస్తా, ఇస్తే మా పక్షులూరుకుంటాయా? ఈ చెట్లు మనం పెంచితే పెరుగుతాయా అమ్మాయ్‌... ప్రకృతి ధర్మం. మనం పోసే నీళ్ళు ఏపాటి... నిజవా కాదా? మనమూ పంచుకోవద్దా..? రైతంటే రొయ్యల చెరువనుకున్నావా యేంటి? ‘ఈ మిట్టమీది చెట్లు అన్నిట్లో వెనకే’ అని మావాళ్ళు విసుక్కుంటారు. మరిప్పుడు కాలంగాని కాలంలో నీకు సహాయపడుతున్నయ్యా లేదా... ఇక బయల్దేరు, ఆలస్యమైతే అల్లుడోడికి కోపమొస్తుంది’’ అని పకపకా నవ్వాడు.

నాంచారమ్మ పనసకాయను అపురూపంగా సంచీలో పెట్టుకుని అతనికి దణ్ణంపెట్టి ఇంటిదారి పట్టింది. ఆ రాత్రినుంచే రోజూ అల్లుడు కూర తినడం, భలే సంబరపడటం ఇంకా గుర్తుంది.

బస్సు టైరు టెలిఫోన్‌వాళ్ళు తవ్విన గుంటలో పడటంతో నాంచారమ్మ వర్తమానంలోకి వచ్చింది. కిటికీలోంచి చూస్తే నిడదవోలు ఎప్పుడు దాటిందోగానీ, కేశవరం దాపులకొచ్చింది బస్సు.

***

నాంచారమ్మ కేశవరంలో బస్సు దిగి వడివడిగా వూరుదాటి వెర్రెంకయ్య తోట దారిపట్టింది. దూరం నుంచి చూసిన ఆమెకు తోట ఇదివరకటిలాగా లేకుండా ఏదో కళ తప్పి పలుచగా కనబడి గుండె ఝల్లుమంది. చుట్టూ చిక్కటి ఇనుపకంచెకున్న కడ్డీల పెద్దగేటును తీసుకుని లోనికెళ్ళాక చూస్తే చేవదేరిన చెట్లూ పూలమొక్కలూ లేవు. తోటంతా ఎగుమతికి పనికొచ్చే వాణిజ్య పంటలే ఉన్నాయి. మధ్యన సన్నటి మట్టిరోడ్లేశారు. దూళ్ళకొట్టం స్థలంలో చిన్న చేపల చెరువుంది. షెడ్లూ, తెరలపందిళ్ళూ, ట్రాక్టర్లూ, ఇతర యంత్రాలూ కనబడ్డాయి. తెల్లెరువులూ మందుల వాసనా ఘాటుగా తగిలింది. ఆమె వెంకయ్యను వెతుక్కుంటూ గుడి దగ్గరికెళ్ళింది. అక్కడ గుడి, పక్కనే మిట్టా, ఆ చెట్లూ అలాగే ఉన్నాయిగానీ పూర్వపు దిగుడుబావి, మండపాల స్థలంలో ఒక పెద్ద రేకుల షెడ్డుంది. దాని వెనకాలనుంచి అదో రకం కంపు.

షెడ్డు ముందర వరండాలో టేబుల్‌ఫ్యాను పక్కన పడక్కుర్చీలో ఒకతను కూర్చుని పుస్తకాల్లో లెక్కలు చూసుకుంటున్నాడు. ఎండపొడ తగలకుండా తెల్లగా శుభ్రంగా ఉన్నాడు.

‘‘నమస్కారం బాబూ, వెంకయ్యబాబుగారు లేరా?’’ అతని దగ్గరికెళ్ళి అడిగింది నాంచారమ్మ.

‘‘నాన్నగారికొంట్లో బాగులేదమ్మా, కిందపడ్డారు, పెద్దొయసు గదా... యింట్లోనే ఉంటున్నారు. నేను వాళ్ళబ్బాయిని. యేంగావాలి?’’ అన్నాడతను. నాంచారమ్మ తనెందుకొచ్చిందో చెప్పింది.

‘‘వర్షాకాలం కూడా దాటిపోయాక వస్తే ఎలా? సీజన్లో అయితే మేం ఇలా ఒకటీ అరా అమ్మం. ఇవి అరుదైన రకం చెట్లు, చూశావుగా గట్టిగా నాలుగైదు కాయలైనా కాయవు. ఒహటొహటి అమ్ముకోవాలి. మామూలు ధర కిట్టదు. వీటి తీరే వేరు. ఇక్కడి మోతుబర్లకే ఇస్తాం, వారైనా సొయంగా వొచ్చి యెంతైనా ఇచ్చి కొంటారు’’ అంటూ తల షెడ్డు వైపు తిప్పి ‘‘చిట్టెయ్యా’’ అని కేకేసి, ‘‘ఈమె దగ్గర మూడొందలు తీసుకుని మిట్టమీది చెట్టు నుంచి పనసకాయ కోసిచ్చి పంపు’’ అని అతనికి చెప్పాడు.

నాంచారమ్మ హతాశురాలై ‘‘బాబుగారూ, నా దగ్గర బస్సు చార్జీకి పోగా రెండొందలే ఉన్నాయి’’ అని దీనంగా చెప్పింది.

‘‘చూస్తున్నావుగామ్మా, కూలీలూ ట్రాక్టర్లూ మందులూ... ఈ తోటమీద ఎంత పెట్టుబడెడుతున్నామో. ఈ చెట్లు వూరకే కాస్తాయనుకుంటారు మీరు. నీళ్ళని కాదు నోట్లని పీల్చేస్తాయి. నీకిష్టమైతేనే తీసుకో, బలవంతమేటుంది’’ అనేసి పుస్తకాల్లో తలదూర్చాడు.

‘‘అయితే మళ్ళొస్తానయ్యా’’ అని ‘ఏదైతే అదవుతుంది ఇక తిరిగెళ్ళిపోదామని’ నిరాశగా వెనుదిరిగింది. కేశవరం వరకు వచ్చాక ‘ఓసారి వెంకయ్యబాబుని చూసెళ్తే బాగుంటుంద’నిపించి దారి వాకబు చేసుకుంటూ వూర్లోకి నడిచింది.

వెంకయ్యుంటున్నది పాత పెంకుటిల్లు, లోగిలి పెద్దదే. అతనున్న వరండా గదిలోకి వెళ్ళింది. మంచంమీద ఉన్న అతన్ని చూసి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మనిషి బాగా చిక్కాడు. గడ్డం, జుట్టూ పెరిగి ఉన్నాయి. అలికిడి విని ‘‘యెవరూ’’ అని ఇటువైపు ఒత్తిగిల్లాడు. నాంచారమ్మ నమస్కారం పెట్టి తనెవరో చెప్పింది. అతను కుశలప్రశ్నలడిగి కూర్చోమన్నాడు.

‘‘ఒక్కనాడూ చీదియెరిగినవాణ్ణి కాదు. స్తానాలగదిలోపడి రెండేళ్ళైంది. అప్పట్నుంచీ దాదాపు మంచమ్మీదే. పెద్ద వయసులో విరిగిన యెముకలు అతుక్కోవంటగా, మా అబ్బాయిలు చెప్పారు. వైసయ్యాక పైకెళ్ళిపోవడానికి యేదోవొక దారి యేర్పడాలి గదా. ఇక వెళ్ళే ప్రాణమే’’ అని నవ్వాడు.

ఆమె ఓదార్పుగా కాసేపు మాట్లాడి తను ఎందుకొచ్చిందో ఏమయిందో చెప్పింది.

‘‘మా అబ్బాయిల్లాంటోళ్ళ వ్యవసాయమంతా వ్యాపారమమ్మాయ్‌. వీళ్ళవన్నీ వూరికి ఉపకారంలేని కొత్త విద్యలు. యెవరెవరో పెద్దవాళ్ళతో వొప్పందాలు. మన చేతులు దాటిపోయింది’’ అని నీరసంగా కాసేపాగి ‘‘వో పని చెయ్యి. యింతదూరం వచ్చి వొట్టి చేతుల్తో యెలా వెళ్తావు. అందులోనూ కూతురు తల్లి కూడా అయ్యి పిల్లతో వెళ్తొంది’’ అంటూ నవ్వి ‘‘నేనొక చీటీ ఇస్తా, మా అబ్బాయికివ్వు, నీకు పనసకాయ రెండొందలకే యిస్తాడు’’ అని దీర్ఘంగా నిట్టూర్చాడు.

‘‘వొద్దులే బాబాయ్‌’’ అంటూ నాంచారమ్మ ఏదో చెప్పబోయింది. వెంకయ్య వినిపించుకోకుండా నెమ్మదిగా అటువైపు తిరిగి దిండుకింద చెయ్యి దూర్చి ఒక వంద రూపాయల నోటు బైటికి లాగి ‘‘నీ అదృష్టం, యిందాక మందులు తెచ్చిన కుర్రాడు మిగిలిన చిల్లర కూడా పొరబాటున నాకే ఇచ్చెళ్ళాడు’’ అంటూ చిలిపిగా నవ్వి నోటు ఆమె చేతిలో పెట్టాడు.

నాంచారమ్మ నిర్ఘాంతపోయి ‘‘యిదేంటి బాబూ, చీటీ అని డబ్బులిస్తన్నారు’’ అంటూ దాన్ని వెనక్కివ్వడానికి ప్రయత్నించింది.

‘‘పట్టుకెళ్ళు, ఇప్పుడు మావాడు చదవగలిగిన చీటీ యిదే. ఈ చదువు నాకు రాదనే నన్నందరూ వెర్రెంకయ్య అంటారు, ఇప్పుడర్థమైందా?’’ అని గలగలా నవ్వాడు వెంకయ్య.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.