close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాసర దీక్ష.. జ్ఞాన భిక్ష!

బాసర దీక్ష.. జ్ఞాన భిక్ష!

ఒంటి మీద తెల్లని వస్త్రాలు, పెదాల మీద ‘సరస్వతీ నమస్తుభ్యం...’ అన్న శ్లోకం, భుజాన మధుకరపు మూట. మొహాల్లో ఆధ్యాత్మిక కాంతి. చూడగానే, ‘ఎవరీ సరస్వతీ పుత్రులు?’ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వాళ్లంతా చదువుల తల్లి ఉపాసకులు, ‘మధుకర దీక్ష’లో ఉన్నారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర క్షేత్రం జ్ఞానోపాసకులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.

కుందేందు తుషార హార ధవళా
యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా
యాశ్వేత పద్మాసనా...
ముగ్గురమ్మలలోనూ చదువులమ్మ స్థానం ప్రత్యేకమైంది. జ్ఞానం కరవైతే ఎంత సంపద ఉన్నా వ్యర్థమే, ఎన్ని శక్తియుక్తులున్నా నిరుపయోగమే. అందుకే, ఆ అక్షర కటాక్షం కోసమే, సరస్వతీ క్షేత్రమైన బాసరలో మధుకర దీక్షను చేపడతారు. అష్టాదశ పురాణకర్త వ్యాసభగవానుడే ఈ దీక్షకు అంకురార్పణ చేశాడని చెబుతారు.

సంధియుగంలో....
మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కౌరవ వంశ నిర్మూలన జరిగిపోయింది. యుద్ధంలో అపార ప్రాణనష్టం సంభవించింది. తానే నారుపెట్టి, నీరుపోసి పెంచిపెద్దచేసిన కురువృక్షం కుప్పకూలిపోవడంతో కృష్ణ ద్వైపాయనుడు తల్లడిల్లిపోయాడు. అందులోనూ, ద్వాపర ముగిసేరోజు దగ్గరపడింది. కలిప్రభావం మెల్లగా మొదలైపోయింది. ఆ ఆలోచనల మధ్య వన సంచారం చేస్తూ.. వ్యాసుడు దండకారణ్య ప్రాంతానికొచ్చాడు. ప్రయాణంలో అలసి సొలసి గోదావరి తీరాన సేదదీరాడు. ఎందుకో ఆ ప్రాంతాన్ని వదిలి ముందుకు వెళ్లాలనిపించలేదు. ఆ ఆలోచన కూడా అమ్మవారి ప్రేరణే అనుకున్నాడు. చదువులతల్లి స్వప్నదర్శనమిచ్చి.... ఆ ప్రాంతంలో అవ్యక్తరూపిణిగా ఉన్న తనను వేదోక్తంగా ప్రతిష్ఠించమని ఆదేశించింది. వాగ్దేవి ఆదేశాల ప్రకారం, వ్యాసుడు కుమారచల పర్వత ప్రాంతంలోని ఓ గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యం గోదావరిలో స్నానం చేసి, సరస్వతీదేవిని ఉపాసించేవాడు. దగ్గర్లోని గ్రామాల్లో భిక్ష స్వీకరిస్తూ ఆకలి తీర్చుకునేవాడు. రోజూ స్నానం నుంచి వస్తూవస్తూ మూడు పిడికిళ్ల ఇసుకను తీసుకొచ్చి...గుహలో మూడు రాశులుగా పోసేవాడు. ఆ రాశుల్లోంచి సరస్వతి, లక్ష్మి, మహంకాళి...ముగ్గురమ్మలూ ఉద్భవించారు. ఆ మూర్తులను కుమారచల పర్వతం కింది ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అదే వ్యాసపురిగా మారింది. కాలక్రమంలో బాసర దివ్యక్షేత్రంగా సుప్రసిద్ధమైంది.

దీక్ష నియమాలు
వాగ్భూషణం భూషణం...స్నానాలూ లేపనాలూ పుష్పాలూ ఆభరణాలూ ఇవేవీ అసలు అలంకారాలే కాదు. వాక్కును మించిన ఆభరణం లేనేలేదు. వాక్కు విద్యతో సొంతం అవుతుంది. ఆ విద్యకు అధిదేవత సరస్వతీ దేవి. ఆ అమ్మ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ... వ్యాస మహర్షి నిర్దేశించిన జీవన విధానం ద్వారా బాసర క్షేత్రంలో సాధకులు దీక్ష చేపడుతుంటారు. ఎప్పటి సంప్రదాయమో అయినా, ఆధునిక జీవితంలోని ఒత్తిళ్ల నుంచీ భయాల నుంచీ అపసవ్య ధోరణుల నుంచీ తమను కాపాడమంటూ చదువులతల్లిని ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. కుల ప్రస్తావన లేదు. సుముహూర్త దుర్ముహూర్తాలూ లేవు. అక్షర ప్రేమికులెవరైనా చేపట్టవచ్చు. అయితే, ముందుగా ఆలయ అర్చకుల నుంచి మంత్రోపదేశం పొందాలి. ఐదు, తొమ్మిది, పదకొండు, నలభై ఒకటి...ఇలా వీలునుబట్టి దీక్షా కాలాన్ని ఎంచుకుంటారు. ఆ సమయంలో శ్వేతవస్త్రాలే ధరించాలి. రెండు పూటలా పవిత్ర గోదావరిలో స్నానం చేసి అమ్మవారిని అర్చించాలి. ఆతల్లి ధ్యానంలోనే రోజంతా గడపాలి. ఒంటిపూట భోజనం, భూతల శయనం తప్పనిసరి. ఆ భోజనం కూడా భిక్ష రూపంలోనే. స్వయంపాకం నిషిద్ధం. దీన్నే ‘మధుకరం’ అంటారు.

వ్యాసుడి కాలంలో పునరుద్ధరణ జరిగినా...మధుకర దీక్ష యుగాల నుంచీ ఉందంటారు. ఓ సమయంలో ఇంద్రుడికి పదవీగండం ఏర్పడింది. దీంతో మహేంద్రపీఠాన్ని కాపాడమంటూ దేవలోకాధిపతి గోదావరి తీరంలో అమ్మవారి దీక్షను చేపట్టాడని ఐతిహ్యం. గణాధిపత్యం కోసం వినాయకుడు బాసరలో కొంతకాలం దీక్ష చేసినట్టు ఓ కథనం. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ సూర్యభగవానుడు కూడా బాసర పురదేవతను కొలిచాడట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూడా దీక్షాధారే. అమ్మ కటాక్షంతోనే ఆ రాజనీతి దురంధరుడు అక్షర సేద్యమూ చేశాడు. విశ్వనాథవారి రచనను ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించాడు. ‘సరస్వతి అమ్మవారి మధుకర భిక్ష ఎంతో విశిష్టమైంది. అమ్మ అనుగ్రహానికి మధుకరాన్ని మించిన మార్గం లేదు’ అంటారు బాసర సరస్వతి ఆలయ ముఖ్య అర్చకులు అచ్యుత్‌ కుమార్‌. దీక్షాధారుల పట్ల చదువులతల్లి అక్షయమైన అక్షర కటాక్షం కురిపిస్తుందని బలమైన నమ్మకం. విత్‌ అనే ధాతువు లోంచి విద్య అన్న మాట వచ్చింది. విత్‌ అంటే తెలుసుకుంటూ ఉండటం, నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగడం. ఆ సాధనకు అవసరమైన దక్షతను వరవీణా మృదుపాణీ వనరుహలోచన రాణి...మధుకర దీక్ష ద్వారా ప్రసాదిస్తుంది.

- దూస సంజీవ్‌కుమార్‌, ఆదిలాబాద్‌ డెస్క్‌
ఫొటోలు: వసంతరావు

ఇంకా..

జిల్లా వార్తలు