close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీవితమే ఓ యుద్ధ వ్యూహం!

తప్పించుకోలేం. పారిపోలేం. వాయిదా వేసుకోలేం. ఎదిరించి తీరాల్సిందే. ఇష్టాయిష్టాలతో నిమిత్తంలేని పోరాటమిది. ఎవరో ఒకరు ప్రారంభించినప్పుడు...ఎవరో ఒకరు ముగించి తీరాల్సిందే.

- అది యుద్ధనీతి!

యుద్ధం రణక్షేత్రంలోనో, సరిహద్దుల్లోనో, శత్రు శిబిరాల మధ్యనో ప్రారంభం కాదు - ముందు మెదడులో మొదలవుతుంది. ఆతర్వాతే రణభూమిలో అమలవుతుంది. యుద్ధానికి సిద్ధం కావడమంటే, నారి సారించడమో భేరి మోగించడమో మాత్రమేనా... మనసును సన్నద్ధం చేసుకోవడం, ఆలోచనల్ని లక్ష్యం వైపు మోహరించడం. సరిగ్గా ఇక్కడే, ఓ వ్యూహం అవసరం అవుతుంది.

యుద్ధంలో - కనిపించే ఆయుధాలు...
కత్తులూ కటార్లూ ఫిరంగులూ క్షిపణులూ అయితే, కనిపించని ఆయుధం...వ్యూహం!
కత్తి కంటే పదునైందీ, ఫిరంగి కంటే శక్తిమంతమైందీ, క్షిపణి కంటే వేగవంతమైందీ వ్యూహమే. పోరాటంలో ఎవరు గెలిచినా, గెలిపించేది మాత్రం వ్యూహమే. యుద్ధం ఓ కళ అయితే...వ్యూహం ఆ కళకు ఆయువు. వ్యూహం లేని యుద్ధం వీధిపోరాటంతో సమానం. వ్యూహంతోనే ఏ యుద్ధానికైనా ఓ స్థాయి వస్తుంది, గాంభీర్యం అలవడుతుంది. అలాంటి సంగ్రామాలకే చరిత్ర ప్రత్యేక పేజీని కేటాయిస్తుంది.

యుద్ధం లాంటి జీవితం...
యుద్ధ వ్యూహాల్ని జీవన పోరాటానికి అన్వయించుకోవచ్చు. యుద్ధంలో ఉన్నట్టే - ఇక్కడా ఎదురుదెబ్బలుంటాయి, బెదురుపరుగులుంటాయి. నెత్తుటి మరకల్లేని వెన్నుపోట్లూ, కరవాలాల ఝళిపింపులు వినిపించని కత్తిగాట్లూ లెక్కలేనన్ని. ఒక సమస్యనో, సంక్షోభాన్నో ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వ్యూహాన్ని ఆయుధంలా ప్రయోగించవచ్చు. ఎన్నికలకు సంబంధించింది - రాజకీయ వ్యూహం, వ్యాపారంతో ముడిపడింది - మార్కెటింగ్‌ వ్యూహం. వృత్తి ఉద్యోగాల చుట్టూ తిరిగేది - కెరీర్‌ వ్యూహం. పోటీ ఉన్న ప్రతిచోటా పోరాటం ఉంటుంది. పోరాటం అనివార్యమైన ప్రతిచోటా వ్యూహం తప్పనిసరి అవుతుంది.

‘శత్రువు’ అన్న మాటకు నిఘంటు నిర్వచనాన్ని యథాతథంగా తీసుకోవాల్సిన పన్లేదు. సందర్భాన్ని బట్టి అర్థాన్ని మార్చుకోవచ్చు. పోటీదారు, ప్రత్యర్థి, మరో కంపెనీ - ఎలా అయినా తీసుకోవచ్చు. మనలోనే మనకు కనిపించని శత్రువు ఉండవచ్చు...వ్యసనం, బలహీనత, నిర్లిప్తత - తదితర రూపాల్లో దాక్కుని ఉండవచ్చు.

ఇక, ఎవరి జీవితానికి వారే సర్వసైన్యాధిపతి. సమర్థ సేనానిలో...వివేకం, చిత్తశుద్ధి, ధైర్యం, క్రమశిక్షణ మొదలైన లక్షణాలు ఉండితీరాలంటుంది చైనీయుల వ్యూహ గ్రంథం ‘సన్‌ జు’. శత్రువును వెన్నంటి తరిమేవాడే కాదు, లక్ష్యం వెంట పరుగు తీసేవాడూ వీర సైనికుడే.

ఓ నిమిషం కళ్లు మూసుకోండి. జీవితాన్ని చదరంగపు బల్లగా వూహించుకోండి. చదువు, వ్యాపారం, వృత్తి- ఉద్యోగాలు, అనుబంధాలు...ఏ విషయంలో అయినా సరే మీ బలాల్ని తెల్లపావులుగా, బలహీనతల్నీ భయాల్నీ నల్లపావులుగా చిత్రించుకోండి. సరిగ్గా ఆ మానసిక స్థితిలో...రణతంత్ర పదకోశాన్ని కనుక చదివితే, కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. కొత్త ఆలోచనలు వెల్లువెత్తుతాయి. సమస్యల్ని ఎదుర్కోవడంలో, సంక్షోభాల్ని నివారించడంలో - కొత్త ఆయుధాలేవో మదిలో ఆవిష్కృతం అవుతాయి.

పోలారిటీ స్ట్రాటజీ...
భౌతిక శాస్త్రానికి సంబంధించిన పదం పోలారిటీ. ఆ మాటకు అర్థం...ఓ పదార్థంలోని రెండు వ్యతిరేక శక్తుల్ని గుర్తించడం. ముందు గుర్తించడమంటూ జరిగితే, ఏరివేళత చాలా సులభం. అదీ ఓ కళే. చాలా సందర్భాల్లో శత్రువు శ్రేయోభిలాషిలా నటిస్తూ ఉండవచ్చు. అదే సమయంలో శ్రేయోభిలాషి నిర్లిప్తంగానో అభావంగానో కనిపిస్తూ ఉండవచ్చు. దగ్గరికొచ్చినవాళ్లంతా దగ్గరివాళ్లు కాదు. దూరంగా ఉన్నవాళ్లంతా కానివాళ్లూ కాదు. యుద్ధనీతిలో ‘శత్రువు- మిత్రుడు’ అన్న మాటలకు నిర్వచనాలు మారిపోతూ ఉంటాయి. మిత్ర (స్నేహితుడు), అరి మిత్ర (శత్రువు స్నేహితుడు), మిత్రమిత్ర (స్నేహితుడి స్నేహితుడు)...మనుషుల్ని ఇలా విభజిస్తుంది అర్థశాస్త్రం. ఎవరు ఏ కోవలోకి వస్తారనే విషయంలో ఎంత స్పష్టత ఉంటే అంత మంచిది. శత్రువు ఎప్పుడూ ప్రమాదకారే. తెలిసిన శత్రువు కంటే, తెలియని శత్రువు ఇంకా ప్రమాదకారి. ముందు శత్రువును గుర్తించు. ఆతర్వాత నీ శత్రువును ‘అందరి శత్రువు’గా చిత్రీకరించు.

‘ఇతడు నా శత్రువు. మీరు ప్రాణాలకు తెగించి యుద్ధం చేయండి...’ అని చెబితే ఏ సైనికుడూ కత్తి ఎత్తడు. ఎత్తినా విజయమో వీరస్వర్గమో అన్నంత సమరోత్సాహంతో పోరాడడు. తెలివైన సైన్యాధిపతి...వ్యక్తిగత లక్ష్యాన్ని అందరి లక్ష్యంగా మారుస్తాడు. అంతర్జాతీయంగా జరిగినదీ జరుగుతున్నదీ ఇదే. ఒకరు మతాన్ని పాచికగా ఎంచుకుంటే, ఒకరు జాత్యహంకారాన్ని రెచ్చగొడతారు. ఇంకొకరు ఇంకో పాచిక వేస్తారు. అంతే తేడా! ఇదంతా ‘నెగెటివ్‌’ ఎనర్జీ. సమర్థుడైన సీయీవో ఆ సమష్టి శక్తిని ‘పాజిటివ్‌’గా మలుచుకుంటాడు. సిబ్బందిలో సంస్థ లక్ష్యాలే తమ లక్ష్యాలన్న భావన కలిగిస్తాడు, సంస్థ ఎదుగుదలలో తమ ఎదుగుదలను చూసుకునేలా ఆలోచనల్ని తీర్చిదిద్దుతాడు.

‘అటాక్‌ ఫస్ట్‌’ స్ట్రాటజీ...
మరొకరి నుంచి...దాడిని ఎదుర్కొంటున్నావంటే - ఆత్మరక్షణలో ఉన్నట్టే.
మరొకరి మీద...దాడికి ఆలోచిస్తున్నావంటే - ఆత్మవిశ్వాసం పుష్కలమైనట్టే.
ఎప్పుడైనా సరే, దాడి చేసినవాడిదే పైచేయి. అతడికే విజయావకాశాలు. ఎందుకంటే, అతడు ఆక్రమణే లక్ష్యంగా బరిలోకి దిగుతాడు. గెలిచితీరాలన్న తపనతో సర్వశకులూ ఒడ్డుతాడు. ఎదుర్కొనేవాడి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అతడి ముందు రెండు లక్ష్యాలుంటాయి. ఒకటి, శత్రువు నుంచి తనను తాను కాపాడుకోవడం. రెండు, ఆ దాడిని తట్టుకుని నిలబడ్డాక పోరాట తీవ్రతను పెంచి పైచేయి సాధించడం. దాడి చేసినవాడిలో ఉన్న ఉత్సాహం, దాడిని ఎదుర్కొనేవాడిలో ఉండదు. కారణం - అతడిది గెలుపు వ్యూహం, ఇతడిది ఆత్మరక్షణ వ్యూహం. ఇదే సూత్రాన్ని వ్యాపారానికి అన్వయిస్తూ ‘అటాకర్స్‌ ఎడ్వాంటేజ్‌’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మేనేజ్‌మెంట్‌ గురువు రామ్‌చరణ్‌. రిలయన్స్‌ జియో అచ్చంగా ఈ వ్యూహాన్నే అమలు చేసింది. టెక్నాలజీ అనే సైన్యాన్ని వెంటబెట్టుకుని మార్కెట్లోకి వచ్చింది. వచ్చీరాగానే ధరల యుద్ధం ప్రకటించింది, ఆఫర్ల ఫిరంగులు మోగించింది. ఒక్కసారిగా జియో విరుచుకుపడేసరికి...పోటీ సంస్థలన్నీ ఆత్మరక్షణలో పడ్డాయి. అగ్రస్థానం అన్న ఆలోచనను పక్కనపెట్టి ఉనికిని నిలుపుకోవడమే లక్ష్యమైనట్టు పావులు కదిపాయి. కొన్నయితే చేతులెత్తేశాయి కూడా. కాకపోతే, ‘అటాక్‌ ఫస్ట్‌’ వ్యూహాన్ని ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ‘టెన్‌ - ఎక్స్‌’ ఫార్ములాను అనుసరించాలి. అంటే, ఏ విషయంలో పోల్చుకున్నా ప్రత్యర్థి కంటే మనం పదిరెట్లు బలంగా ఉండాలి. అలా అయితేనే, సమర భేరి మోగించాలి.

గెరిల్లా వ్యూహం...
శత్రువు నీ దాడుల్ని వూహిస్తున్నాడంటే, నువ్వు విఫలమైనట్టే. శత్రువు స్థిమితంగా వూపిరి పీల్చుకుంటున్నాడంటే, నువ్వు బలహీనపడినట్టే. అతడిని అనూహ్యంగా దెబ్బకొట్టాలి, వూపిరి తీసుకోకుండా ఉరికించాలి. అదీ గెరిల్లా వ్యూహమంటే! ఆ వ్యూహంలో... శత్రువు ఎటువైపు నుంచి వూడిపడతాడో తెలియదు. ఎంతమందితో వస్తాడో తెలియదు. ఎలాంటి ఆయుధాలతో వస్తాడో కూడా తెలియదు. దాడి దాడికీ వ్యూహం మారిపోతుంది. దెబ్బదెబ్బకూ ప్రభావం తీవ్రం అవుతుంది. అలా అని భారీగా బలగాల మోహరింపేం ఉండదు. చిన్నచిన్న బృందాలుగా వస్తాడు. కానీ పక్కాగా వస్తాడు. ఎక్కడ కొడితే దిమ్మదిరుగుతుందో అక్కడే కొడతాడు. ఈ వ్యూహంలో మేధస్సే శత శతఘ్నులతో సమానం. ఆలోచనలే అక్షౌహిణుల సైన్యం. చేగువేరా ఈ పద్ధతినే అనుసరించాడు. శివాజీ ఈ మంత్రాన్నే పఠించాడు.

ఇదే వ్యూహాన్ని కార్పొరేట్‌ యుద్ధాల్లో ‘గెరిల్లా మార్కెటింగ్‌’ పేరుతో అమలు చేస్తున్నారు. రెప్పపాటు సమయంలో చౌరస్తాల్లో ప్రత్యక్షమైపోయి...నృత్యంతోనో, నాటికతోనో జనాన్ని ఆలోచింపజేసే ఫ్లాష్‌మాబ్స్‌ కూడా ఈ కోవలోకే వస్తాయి. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ గెరిల్లా స్ట్రాటజీకి సంబంధించి ఓ ఉదాహరణను ప్రస్తావిస్తుంది. బీట్స్‌ అనే హెడ్‌ఫోన్ల తయారీ కంపెనీ...ప్రచారం కోసం సంప్రదాయ పద్ధతుల వైపు వెళ్లకుండా కొత్త వ్యూహాన్ని సంధించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు వచ్చిన సెలెబ్రిటీలకు తమ ఉత్పత్తిని బహుమతిగా ఇచ్చింది. వాళ్లంతా ఆ హెడ్‌ఫోన్లతో పత్రికల్లో కనిపించారు, టీవీ తెర మీదా కనువిందు చేశారు. దీంతో, అతి తక్కువ సమయంలోనే బీట్స్‌ పేరు హోరెత్తిపోయింది. ఇదంతా చూసి కోట్లకు కోట్లు పోసి, అధికారిక స్పాన్సర్‌షిప్‌ తీసుకున్న సంస్థకు మండిపోయింది. బీట్స్‌ను స్టేడియంలోంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ప్రచారం మరింత పెరిగింది. ఎంత డబ్బు కురిపించినా ఇంత బ్రాండ్‌ విలువ సమకూరేది కాదేమో. ‘శత్రువుకు ముక్కుమీద కోపం ఉంటే, మరింత కోపం వచ్చేలా వ్యవహరించు. ఎందుకంటే, కోపంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు. శత్రువుకు దూకుడు ఎక్కువైతే, మరింత దూకుడుగా వ్యవహరించేలా రెచ్చగొట్టు. దూకుడులో ఎప్పుడూ వ్యూహం ఉండదు’ అని సలహా ఇస్తాడు చాణక్యుడు.

‘మోరల్‌’ స్ట్రాటజీ...
క్షిపణుల సంగతి తర్వాత...ముందు శత్రువు మీద మానసిక దాడిని ప్రారంభించు. అదే కనుక సాధ్యమైతే, అతడి బలాలు కూడా బలహీనతలుగా మారతాయి. ఆ ప్రయత్నంలో భారతీయ యుద్ధనిపుణులు అనేక వ్యూహాల్ని రచించారు. అప్పట్లో గజబలానిదే ఆధిపత్యం. గజాధిపతే సామ్రాజ్యాధిపతి కాగలడన్న గట్టి విశ్వాసం. ఒక్కసారిగా వందలకొద్దీ మదగజాలు రణమండలంలోకి దూకగానే, శత్రు సేనలు వాటి పాదాల కింద నుజ్జునుజ్జయిపోయేవి. యుద్ధానికి బయల్దేరే ముందు మావటివాడు వాటికి నల్లమందు పెట్టేవాడు. దీంతో ఏనుగులు పిచ్చెక్కినట్టు ప్రవర్తించేవి. ఆ ఎత్తును చిత్తు చేయాలంటే..ఒకటేదారి, ఏనుగుల మనసు మార్చగలగాలి. శత్రురాజులు ఆ సమయంలో ‘గజముఖ అశ్వవ్యూహాన్ని’ అనుసరించేవారు. గుర్రాలకు తొండాల బొమ్మలున్న ముసుగులు తొడిగేవారు. దీంతో మత్తగజాలు వాటిని పిల్ల ఏనుగులని భ్రమపడేవి. దాడులు ఆపేసి మురిపెంగా చూస్తూ నిలబడేవి. ‘స్వజాతి’ ప్రేమ ఎంత మత్తునైనా వదిలిస్తుంది. హల్దీఘాట్‌ యుద్ధంలో రాణాప్రతాప్‌ ఇలాంటి ఎత్తే వేశాడంటారు. చైనీయులు కూడా దాదాపుగా ఇదే వ్యూహాన్ని అనుసరించారు.. బలంగా ఉన్న సైనికుల్నే ముందు వరుసలో నిలిపి...సత్తువలేని వయోధికుల్నీ డొక్కలెండిన గుర్రాల్నీ వెనుక వరుసలో తోసేవారు.