close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పదేళ్లలో రూ.25వేల కోట్లు!

పదేళ్లలో రూ.25వేల కోట్లు!

పదేళ్ల క్రితం ‘పతంజలి’ సంస్థను నమోదు చేయడానికి రూ.13,500 అవసరమైతే ఆచార్య బాలకృష్ణ చేతిలో మూడు వేల ఐదొందలు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బు అప్పు చేసి ఆ పని పూర్తి చేశారాయన. పదేళ్ల తరవాత అదే బాలకృష్ణ సంపద విలువ అక్షరాలా రూ.25,600 కోట్లు. ఈ ఏడాది ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన భారతీయ సంపన్నుల జాబితాలో తొలిసారి ప్రవేశించి ఏకంగా 48వ స్థానానికి చేరారు.

పతంజలి పేరు చెప్పగానే మొదట బాబా రామ్‌దేవ్‌ పేరే గుర్తొస్తుంది. దాని ఉత్పత్తులకు ప్రచారకర్తగా, ఆ సంస్థకు ముఖ చిత్రంగా కనిపిస్తారాయన. కానీ ఆ సంస్థ ఎదుగుదలకు పునాది వేసింది రామ్‌దేవ్‌ స్నేహితుడు బాలకృష్ణ. పదేళ్ల క్రితం హరిద్వార్‌లో ఇద్దరూ కలిసి పతంజలిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ సంస్థలో 97శాతం వాటా బాలకృష్ణదే. పతంజలికి వ్యవస్థాపక సీయీవో పదవితో పాటు యోగ్‌ సందేశ్‌ పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా, పతంజలి విద్యాపీఠ్‌కు అధినేతగానూ ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

* బాలకృష్ణ అసలు పేరు నారాయణ్‌ ప్రసాద్‌ సుబేది. పుట్టింది నేపాల్‌లో అయినా పెరిగిందంతా భారత్‌లోనే. హరియాణాలో ఓ గురుకులంలో రామ్‌దేవ్‌తో కలిసి చదువుకునేవారు. ఆ క్రమంలోనే ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. యోగా నిపుణుడిగా, సంస్కృత పండితుడిగా, అన్నింటికీ మించి ఆయుర్వేద వైద్యుడిగా, శాస్త్రవేత్తగా బాలకృష్ణకు మంచి పేరుంది. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశాక ఆయుర్వేద ప్రయోగాల పైన దృష్టి పెట్టి అనేక రకాల మందులను తయారు చేశారు.

* ఆయుర్వేద నిపుణుడిగా బాలకృష్ణ సామర్థ్యం రామ్‌దేవ్‌ను ఆకర్షించింది. యోగా గురువుగా అప్పటికే మంచి పేరు సంపాదించిన రామ్‌దేవ్‌కు ఆయుర్వేద ఉత్పత్తుల్ని తీసుకొచ్చి స్వదేశీ వైద్య విధానాన్ని విస్తృతం చేయాలన్న ఆలోచన కలిగింది. బాలకృష్ణకూ అలాంటి ఉద్దేశమే ఉండటంతో ఇద్దరూ కలిసి పదేళ్ల క్రితం దివ్య ఆయుర్వేద ఫార్మసీని హరిద్వార్‌లో ఓ చిన్న దుకాణంలో మొదలుపెట్టారు. ఆపైన రామ్‌దేవ్‌ దగ్గర యోగా నేర్చుకునే ఇద్దరు ఎన్నారై దంపతుల దగ్గర కొంత అప్పు తీసుకొని ఉత్పత్తుల సంఖ్యను పెంచసాగారు. స్థానికంగా గిరాకీ బాగా పెరగడంతో బ్యాంకు రుణాలు తీసుకొని శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వచ్చారు.

* పదేళ్ల క్రితమే వ్యాపారం మొదలైనా పతంజలి వేగం పుంజుకుంది గత ఐదేళ్లలోనే. బాలకృష్ణ శ్రమ, మార్కెటింగ్‌ మెలకువలే దానికి కారణమన్నది ఆర్థిక నిపుణుల మాట. సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు ప్రయోగ దశలో ఉన్నప్పట్నుంచీ వినియోగదారుడి చేతికొచ్చే వరకూ పూర్తి బాధ్యత ఆయనదే. హరిద్వార్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో 450 రకాలకు పైగా ఆయుర్వేద మొక్కల సాగుని మొదలుపెట్టిన ఆయన, తమ ఉత్పత్తులన్నీ ఆ మొక్కల నుంచే తయారవుతాయని ప్రచారం చేసి ప్రజల్ని ఆకర్షించారు. గాంధీ మార్గంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న నినాదంతో జనాలకు పతంజలిని ఆయన దగ్గర చేశారని నిపుణులు చెబుతారు. మార్కెట్లో పోటీ సంస్థలకంటే రేట్లు బాగా తగ్గించి దాదాపు ఐదువేల పతంజలి రిటైల్‌ దుకాణాలను వేగంగా విస్తరించడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ మందికి దగ్గరయ్యారన్నది వాళ్ల విశ్లేషణ. ఫేస్‌ క్రీమ్‌ నుంచీ నూడుల్స్‌ వరకూ దాదాపు 450 రకాల ఉత్పత్తుల్ని పతంజలి తీసుకొస్తోంది. ఐదేళ్ల క్రితం రూ.450కోట్ల విలువైన అమ్మకాల్ని నమోదు చేసిన పతంజలి, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్ల అమ్మకాల మార్కుని దాటి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. సంస్థ ప్రచారంలో తొంభై శాతం నోటి మాట ద్వారానే సాగుతుండటం విశేషం.

* పతంజలి సంస్థతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 34 సంస్థలకు బాలకృష్ణే అధినేత. వేల కోట్ల రూపాయల సంపద ఆయన పేరనున్నా విలాసవంతమైన జీవితానికి ఆయన దూరం. నిత్యం తెల్లని దుస్తులూ, సాధారణ చెప్పులనే వేసుకొని కనిపిస్తారు. గత పదేళ్లలో ఆఫీసుకి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకపోవడం, రోజుకి పదిహేను గంటలకు తగ్గకుండా పనిచేయడమే తన విజయ రహస్యమని అంటారాయన. కంప్యూటర్‌ని ఉపయోగించడానికి ఇష్టపడని బాలకృష్ణ కాగితాల మీదే వ్యాపార లావాదేవీల్ని నిర్వహిస్తారు. రోడ్డు భద్రత గురించి రామ్‌దేవ్‌ ఒత్తిడి చేయడంతోనే రేంజ్‌ రోవర్‌ కారుని ఉపయోగిస్తున్నట్లు చెబుతారు. ఆయుర్వేదంపైన అనేక పుస్తకాలతోపాటు 40కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

* ఏ సంస్థయినా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చేముందు విస్తృతంగా సర్వే నిర్వహిస్తుంది. కానీ బాలకృష్ణ తాను నమ్మింది కచ్చితంగా నిజమవుతుందనే అనుకుంటారు. అందుకే మార్కెట్‌ విధానాలతో సంబంధం లేకుండా ఒకేసారి పదుల సంఖ్యలో ఉత్పత్తులను తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘జనాలు అల్లం జ్యూస్‌ తాగుతారని ఎవరూ వూహించరు. చాలామంది సన్నిహితులు మొదట్లో సర్వే చేయించమన్నారు. కానీ నేను నేరుగా విడుదల చేశా. ఇప్పుడు ఎక్కువగా అమ్ముడయ్యే మా ఉత్పత్తుల్లో అదీ ఒకటి’ అంటారు బాలకృష్ణ. అందరూ సినిమా తారల్ని ప్రచారానికి ఉపయోగిస్తే ఆయన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను తమ ఫేస్‌క్రీమ్‌కి ప్రచారకర్తగా ఉపయోగించడం విశేషం.

‘సంపన్నుల ర్యాంకులపైన నాకు పెద్దగా అవగాహన లేదు. మాకొచ్చే లాభాల్నీ సేవా మార్గంలోకి మళ్లించే ప్రయత్నాల్లో ఉన్నాం. కాబట్టి ఆ జాబితాలో నేను ఎక్కువ కాలం కొనసాగలేకపోవచ్చు’ అన్నది బాలకృష్ణ మాట. వేల కోట్ల రూపాయలు సంపాదించడం గొప్పే... కానీ వాటిని తిరిగి అందరికీ పంచాలన్న ఆలోచన మరింత గొప్పదేమో..!

అమ్మ నిద్రకు పరిష్కారమే యార్కర్‌!

2016 జనవరి... ఆస్ట్రేలియాలో టీమ్‌ ఇండియా పర్యటన... వరసగా నాలుగు వన్డేల్లో మనజట్టుకి పరాజయమే ఎదురైంది. అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలుపు ఖాతా తెరవలేదనుకుంటున్న దశలో జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా చేరికతో ఆ అద్భుతం జరిగింది. బుమ్రా ఆడిన ఆ అయిదో వన్డేతోపాటు తర్వాత జరిగిన టీ20 సిరీస్‌ని 3-0తో మన జట్టు గెల్చుకుంది. స్వల్ప వ్యవధిలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలకంగా మారిన బుమ్రా క్రికెట్‌ ప్రస్థానమిది...

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కాకుండా తర్వాత జరిగే టీ20 సిరీస్‌కి బుమ్రా ఎంపికయ్యాడు. టీ20కి ఎంపికైన ఆటగాళ్లతో వెళ్లాల్సిన బుమ్రాకి ఆ విమానంలో సీటు దొరకకపోవడంతో వేరే విమానంలో ఒక రోజు ముందే అతణ్ని పంపింది బీసీసీఐ. అలా సిడ్నీలో ఉన్న జట్టుతో కలిశాడు బుమ్రా. ఆ సమయానికి భువనేశ్వర్‌కి గాయం కావడంతో అతడి స్థానంలో అప్పటికప్పుడు బుమ్రాని ఆడించారు. ఆ మ్యాచ్‌లో 40 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు బుమ్రా. తర్వాత ఆసీస్‌ను టీ20ల్లోనూ ఓడించింది మన జట్టు. పదునైన యార్కర్లను సంధిస్తూ ఆఖరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు బుమ్రా. ‘ఈసారి ఆసీస్‌ పర్యటనతో మనజట్టుకి కలిగిన లాభమేదైనా ఉందంటే అది బుమ్రానే’నని కెప్టెన్‌ ధోనీ చెప్పడాన్నిబట్టి అర్థమవుతుంది జట్టులో బుమ్రా ప్రాధాన్యం.

* 12 ఏళ్లపుడు వేసవిలో ఇంట్లో గోడపైన వికెట్లు గీసి బౌలింగ్‌ ప్రాక్టీసు చేసేవాడు బుమ్రా. దాంతో అతడి తల్లి దల్జీత్‌ మధ్యాహ్నం నిద్రకి ఇబ్బంది కలిగేది. బంతి నేలకీ గోడకీ తగిలేలా కాకుండా ఆ రెండూ కలిసే చోట పడేలా వేస్తే శబ్దం రావడంలేదని గమనించాడు బుమ్రా. తల్లి నిద్రకు భంగం కలగకుండా ఆ బంతుల్ని పదేపదే వేసేవాడు. మైదానంలోనూ అలా స్టంప్స్‌, నేలకి తాకేచోట బంతిని వేయడంతో అతడికి యార్కర్‌ అలవాటైంది. బుమ్రా తండ్రి అహ్మదాబాద్‌లో చిన్న పరిశ్రమని నడిపేవారు. బుమ్రాకి ఏడేళ్లపుడు తండ్రి చనిపోవడంతో బుమ్రా, అతడి సోదరి జుహికాల పోషణ బాధ్యత తల్లి దల్జీత్‌పైన పడింది. అహ్మదాబాద్‌లోని ‘నిర్మాణ్‌ హైస్కూల్‌’లోని నర్సరీ విభాగానికి ఆమె ప్రిన్సిపల్‌. బుమ్రా కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌ని చూశాక అతణ్ని స్కూల్‌ అండర్‌-14 జట్టులో చేర్చుకున్నాడు క్రికెట్‌ కోచ్‌.

* రోజూ ఉదయాన్నే ప్రాక్టీసు, మధ్యలో పాఠాలు, సాయంత్రం మళ్లీ ప్రాక్టీసు... స్కూల్‌ రోజుల్లో బుమ్రా టైమ్‌టేబుల్‌ ఇది. స్వల్పవ్యవధిలోనే ఆ రాష్ట్ర అండర్‌-16 జట్టుకి ఎంపికయ్యాడు. తర్వాత ఓసారి కీలక మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసినా రాష్ట్ర అండర్‌-19 జట్టుకి బుమ్రాని ఎంపికచేయలేదు. చాలా విచారంగా ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పాడు. ‘అందుకే చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దని చెప్పేది’ అందామె. బుమ్రా మాత్రం ప్రాక్టీసు మానలేదు. స్వల్పవ్యవధిలోనే గుజరాత్‌ అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యాడు. బుమ్రా బౌలింగ్‌ శైలిని చూసిన శిక్షకులంతా చాలా భిన్నంగా ఉందని చెప్పేవారు. బుమ్రాకి భుజాలు కాస్త ఎత్తుగా ఉండటంవల్ల బౌలింగ్‌ సమయంలో అతడి మోచేయి పెద్దగా తిరగకుండా కాస్త నిటారుగా వస్తుంది. దానివల్ల బంతిని బలంగా విసిరికొట్టినట్టు వేయగలడు. అతడి యాక్షన్‌తో బంతిని వేసేటపుడు ఒక్క క్షణం చెయ్యి నిలపడంద్వారా బ్యాట్స్‌మెన్‌ కదలికల్ని గమనించి దానికి తగ్గట్టు బంతి వేయడానికి సమయం దొరుకుతుంది. ఎం.ఆర్‌.ఎఫ్‌. ఫౌండేషన్‌లో శిక్షణకు బుమ్రా వెళ్లినపుడు అక్కడ ప్రధాన కోచ్‌ మెక్‌గ్రాత్‌ కూడా ‘నీది మంచి యాక్షన్‌ దీన్ని మార్చుకోవద్దు’ అని చెప్పడంతోపాటు అతడి బౌలింగ్‌ని మెరుగుపర్చుకునేందుకు సలహాలు ఇచ్చాడు. 2012లో సయ్యద్‌ ముస్తక్‌ అహ్మద్‌ టోర్నీ ఆడుతున్న బుమ్రాని అప్పుడు ‘ముంబయి ఇండియన్స్‌’ హెడ్‌ కోచ్‌గా ఉన్న జాన్‌ రైట్‌ చూశారు. కొద్ది రోజులకి బుమ్రాకి ‘ముంబయి ఇండియన్స్‌’ నుంచి పిలుపొచ్చింది. 2013లో ఆ జట్టులో చేరాక తెందుల్కర్‌, రికీ పాంటింగ్‌, మలింగా, మిచెల్‌ జాన్సన్‌ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నాడు. 2013 ఐపీఎల్‌లో బెంగళూరుతో అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. అందులో కోహ్లీ వికెట్‌ కూడా ఉంది. ఆ సమయంలో మలింగా నుంచి చాలా నేర్చుకున్నాడు.