close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓడిపోతే... ఎంత బావుంటుందీ!

ఓడిపోతే... ఎంత బావుంటుందీ!

రావణుడి మీద రాముడు గెలిస్తే ‘దసరా’, నరకాసురుడి మీద సత్యభామ గెలిస్తే ‘దీపావళి’, ఆంగ్లేయుల మీద భారతీయులు గెలిస్తే ‘స్వాతంత్య్ర దినోత్సవం’. విజయాలకేనా పండగలు? వైఫల్యం మాత్రం ఏం పాపం చేసింది? ఆమాటకొస్తే, విజయం కంటే వైఫల్యమే చాలా గొప్పది! కాబట్టే, ప్రపంచమంతా ఇప్పుడు ఓటమి విలువను గుర్తిస్తోంది. వైఫల్య పాఠాల్ని సగర్వంగా నెమరేసుకోడానికి వేదికలూ పుట్టుకొస్తున్నాయి.

వరన్నారు?
విజయానికే బంధుగణం ఎక్కువని.
ఎవరు పోల్చారు?
వైఫల్యాన్ని అనాథతో.
ఓటమికి కూడా పెద్ద బలగమే ఉంది. పడ్డవాడి నుంచి పాఠాలు నేర్చుకోడానికి విజయ సాధకులు సిద్ధంగా ఉన్నారు. పరాజితుడి అనుభవాల్ని విజయ సోపానంగా మలుచుకోడానికి చాలా సంస్థలే ముందుకొస్తున్నాయి. ‘నిఘంటువు ప్రకారం విజయానికి వ్యతిరేక పదం అపజయం అయితే కావచ్చు కానీ...నిజ జీవితంలో మాత్రం వైఫల్యం అనేది ఓటమికి పర్యాయపదం కానేకాదు. మహా అయితే, విజయానికి ముందు దశ!’ అని విశ్వసించేవారూ పెరుగుతున్నారు. ఇప్పుడెవరూ...ఓటమిని దాచుకోవడం లేదు, ఓడిపోయినందుకు కుమిలిపోవడం లేదు, చావుదెబ్బ తిన్నవాడిని చిన్నచూపూ చూడటం లేదు. అంతేనా, వైఫల్యాన్ని ఓ పతకంలా ధరిస్తున్నారు. పరాజయాన్ని పట్టాలా పేరు పక్కన జోడించుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, వైఫల్యం...విజయంలా వెలిగిపోతోంది!
ఓటమి సదస్సులు...
విజయగాథ మంచి పాఠం అయితే...

ఓటమి కథ గొప్ప పాఠం!
నిన్నమొన్నటిదాకా వ్యాపార విజేతల లక్షణాల మీదో, విశ్వవిజేతల అలవాట్ల మీదో, విజయ యాత్రికుల ఆలోచనా విధానం మీదో సదస్సులు జరిగేవి. తమదైన రంగంలో గొప్పగొప్ప విజయాలు సాధించినవాళ్లు వేదిక మీద కూర్చునేవారు, మైకు ముందుకొచ్చి అనర్గళంగా ఉపన్యసించేవారు. గెలుపు రుచే తెలియనివాళ్లంతా ప్రేక్షకుల్లో కూర్చుని ఆ అనుగ్రహభాషణాన్ని ఆలకిస్తూ...పనికొచ్చే ముక్కలేమైనా ఉంటే, జాగ్రత్తగా ఏరుకునేవారు. ఇదంతా గతం.

ఇప్పుడు, వైఫల్యమే కార్పొరేట్‌ సదస్సుల ఇతివృత్తం! ఆమధ్య ముంబయిలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ‘వృత్తి జీవితంలో నేను చేసిన ఘోరమైన తప్పు’ - అనే అంశం మీద యువ వైద్యుల కోసం ఓ సెమినార్‌ నిర్వహించారు. పొట్టలో కత్తి పెట్టి కుట్లు వేశాననో, కుడికాలికి చేయాల్సిన శస్త్రచికిత్స ఎడమకాలికి చేశాననో, గడువు పూర్తయిపోయిన సూదిమందును ఎక్కించాననో, నిక్షేపంగా ఉన్న రోగిని పట్టుకుని బాల్చీతన్నాడని తేల్చేశాననో...తాను చేసిన తప్పుల గురించి బహిరంగంగా చర్చించడానికి ఏ వైద్యుడూ సంకోచించ లేదు. దాంతోపాటే, ఆ పొరపాటుకు కారణం ఏమిటన్నదీ విశ్లేషించాడు. దాన్ని అధిగమించడం ఎలా అన్నది కూడా సభికులకు వివరించాడు. ‘ఎదుటివారి విజయాల నుంచి నేర్చుకునే పాఠాలకంటే, వైఫల్యాల నుంచి తెలుసుకునే సత్యాలే చాలా విలువైనవి. కొత్తతరానికి ఉపయోగపడతాయి కూడా’ అంటాడు యువవైద్యుడు శ్రీనివాస చక్రవర్తి. నిజంగానే, ఆ సదస్సు నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు...ప్రతి ఒక్కరి మొహంలోనూ ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నామన్న సంతృప్తి కనిపించింది. అమెరికా అంతరిక్ష సంస్థ...నేషనల్‌ ఏరొనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) కూడా వైఫల్యాన్ని సగౌరవంగా స్వాగతిస్తోంది. ‘మై బెస్ట్‌ మిస్టేక్‌’ పేరుతో వార్షిక సదస్సులు జరుపుతోంది. ‘ఏ సంస్థ అయినా వైఫల్యాల్ని నమోదు చేయగలిగితే - అంతకు మించిన విజయ రహస్యాలు ఉండవు. ఇది నా వైఫల్యమే...అంటూ సిబ్బంది ఓటమిని సొంతం చేసుకోగలిగే వాతావరణం ఉండాలి. పరాజయాల్ని చర్చించుకోడానికి ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలి. అప్పుడే, ఏ ఉద్యోగీ వైఫల్యానికి భయపడడు. ప్రయోగాలకు వెనకడుగు వేయడు’ అంటుంది నాసా. ఎలా ఓడిపోయామో గ్రహించగలిగితే, ఎలా గెలవాలన్నదీ అర్థమైపోతుంది. ఇక తిరుగేం ఉంటుంది! ‘‘కాలేజీ రోజుల్లో ఎవరు ఏం అడిగినా ‘ఓస్‌ ఇంతేనా!’ అన్నట్టు మాట్లాడేవాడిని. ‘తెలియదు’ అని చెప్పడానికి మనసొప్పేది కాదు. దీంతో, చచ్చినట్టు ఏదో ఓ సమాధానం ఇవ్వాల్సి వచ్చేది. అది తప్పని తెలిసినా సరే! చదువైపోగానే నాసాలో ఉద్యోగం వచ్చింది. అంతరిక్షంలోని వ్యోమగాములకు ఏవైనా సందేహాలుంటే తక్షణం తీర్చేసుకోడానికి నాసాలో ప్రత్యేక విభాగం ఉంటుంది. అక్కడే నా కొలువు. ఓ సందర్భంలో నేనిచ్చిన సూచన వికటించింది. ఉద్యోగం వూడినంత పనైంది. తెలియకపోవడం తప్పుకాదు. తెలియదని ఒప్పుకోవడమూ తప్పుకాదు. అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడమే అసలు సిసలు వైఫల్యం - అని అప్పుడే అర్థమైంది’’ అంటూ సంస్థ వెబ్‌సైట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడో ఉద్యోగి. గతంలో, ఇలాంటి వాతావరణాన్ని కలలో కూడా వూహించలేం. ఎవరికివారు వైఫల్య పాపాన్ని పక్కవారి మీదికి నెట్టేసేవారు. ఆ పలాయనవాదాన్ని అధిగమించడమే విజయానికి తొలిమెట్టు.

ఓటమి నాది కాదు...
రెజ్యూమేలో ‘గతానుభవం’ అన్నచోట ‘హాఫ్‌ ఎ డజన్‌ ఫెయిల్యూర్స్‌’ అని రాయడానికి యువతరం ఏమాత్రం సంకోచించడం లేదు. అంతటితో ఆగకుండా...నేను వేరు, నా ఓటమి వేరు. నేను ఓడిపోలేదు, నా ప్రాజెక్టు విఫలమైందంతే - అంటూ ఓటమికి ద్వైత సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నారు. ‘యువర్‌స్టోరీ.ఇన్‌’ లాంటి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వెబ్‌సైట్లలో బోలెడు వైఫల్య వ్యాసాలు కనిపిస్తాయి. ‘పెట్టబోయే కంపెనీ గురించి ఎన్ని కలలు కన్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో! రేపటి నుంచి నన్ను నేను ఎంట్రప్రెన్యూర్‌గా నలుగురికీ పరిచయం చేసుకోబోతున్నానన్న ఆలోచనే ఎక్కడలేని బలాన్నిచ్చింది. పట్టా ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యార్థికి నైపుణ్యం ఉండాలి. అదెక్కడ దొరుకుతుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ అవసరాన్నే నా వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాను. శిక్షణ సంస్థల పేర్లూ, ఫీజులూ, అక్కడ బోధించే పాఠాల నమూనా వీడియోలూ...తదితర వివరాలు మా కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నాను. వెబ్‌ డిజైనింగ్‌ పరిజ్ఞానం కోసం ఓ కోర్సు కూడా చేశాను. నా ఆలోచన అద్భుతమంటూ శిక్షణ సంస్థలవారు ప్రోత్సహించారు. కాస్త పారితోషికం కూడా ఇచ్చారు. ఈ దశలోనే ఘోరమైన పొరపాటు చేశాను. విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యం - అనుకున్నవాడిని కాస్తా శిక్షణ సంస్థల వైపు మొగ్గుచూపడం మొదలుపెట్టాను. ఓ గొప్ప వ్యాపారాన్ని స్థాపించాలన్న కలను పక్కనపడేసి, లాభదాయకమైన వ్యాపారం కోసం ఆరాటపడ్డాను. అడ్మిషన్ల సీజన్‌లో డబ్బేడబ్బని కలలుగన్నాను. స్పందన నామమాత్రంగా ఉండటంతో అప్పులు చేసి మరీ ప్రకటనలు గుప్పించాను. అయినా లాభం లేకుండా పోయింది. ఏడాది తిరిగేలోపు దుకాణం కట్టేయాల్సి వచ్చింది’ అంటూ తన వైఫల్య గాథను వివరిస్తాడో ఎంట్రప్రెన్యూర్‌. ఆ అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాల్ని కూడా చెప్పాడు...‘మంచి మిత్రులంతా మంచి భాగస్వాములు కాలేరు. నీలో లేని ప్రత్యేక లక్షణాలేవో నీ వ్యాపార భాగస్వామిలో ఉండాలి. అలాంటి పార్ట్‌నర్‌నే ఎంచుకోండి. నీ ఐడియాతో నువ్వు పీకల్లోతు ప్రేమలో పడ్డావంటే సగం ఓడిపోయినట్టే. అవసరమైతే దాన్ని మార్చుకోడానికైనా, సవరించుకోడానికైనా, చెత్తబుట్టపాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. నీకు గొప్పగా అనిపించినవన్నీ నిజంగా గొప్ప ఆలోచనలు కాకపోవచ్చు. ముందు మార్కెట్లోకి వెళ్లండి. పదిమందితో మాట్లాడండి. నిపుణుల్ని సంప్రదించండి. ఆతర్వాతే ఓ నిర్ణయానికి రండి. ప్రతి దశలోనూ ఎందుకు?- అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోండి’ ఇలా సాగుతుందా హితబోధ. ఒకటా, రెండా ఇలాంటి పరాజయగాథలు చాలానే కనిపిస్తాయి. అందులోనే కాస్త హాస్యం ఉంటుంది, కాస్త వ్యంగ్యమూ ఉంటుంది. ‘నా బిజినెస్‌ ఐడియా మాడు పగలగొట్టేసింది’ అంటూ తన మీద తాను సెటైరు వేసుకోడానికి ఎంత దమ్ముండాలి? ‘డబ్బే విజయం కాదు. లాభాలన్నవి విజయంతో పాటూ వచ్చే ఉప ఉత్పత్తులు మాత్రమే’ అని అంగీకరించాలంటే ఎంత అంతర్మథనం జరగాలి? ఏడాదిలో విఫలమైనవాళ్లూ, రెండేళ్లలో బొక్కబోర్లా పడినవాళ్లూ, అప్పులు చేసి చేతులు కాల్చుకున్నవాళ్లూ, భాగస్వాముల చేతిలో చావుదెబ్బలు తిన్నవాళ్లూ? - ఎవర్లోనూ ఓడిపోయామన్న బాధలేదు, ఓడిపోకుండా ఉండాల్సిందన్న పశ్చాత్తాపమూ కనిపించదు. ఓటమిని స్వాగతించే గుండెదిటవు పుష్కలంగా ఉంటోంది. ఈ ఒక్క అర్హత చాలు, అపజయాన్ని చిత్తుగా ఓడించడానికి.

కార్పొరేట్‌ సంస్థలకు డిజిటల్‌ వీడియోల్ని తీసిచ్చే ‘స్టేజ్‌పోడ్‌’ వ్యవస్థాపకుడు నిఖిలేశ్‌ తయాల్‌ ఏకంగా తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోనే ‘ఎస్‌.. ఐ ఫెయిల్డ్‌’ అని పెద్దక్షరాల్లో పెట్టేశాడు. ‘నిజమే, నేను గతంలో ఓడిపోయాను. సీవీభేజో.కామ్‌ పేరుతో నియామకాల కంపెనీని ప్రారంభించాను. తొలి ప్రయత్నంలోనే వందమంది క్లైంట్లను సాధించాను. యాభైవేలమంది ఉద్యోగార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక తిరుగులేదన్న మితిమీరిన నమ్మకంతో నిధుల సేకరణ మీద దృష్టిపెట్టాను. ఆ పరుగులోపడి, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్ని పట్టించుకోవడం మానేశాను. ఆ రెండు నెలల్లోనే అంకెలు తలకిందులైపోయాయి. గత చరిత్రను చెప్పుకుంటూ ఎంతకాలం నెగ్గుకొస్తాం? దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. అద్దెలకూ జీతాలకూ ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో షట్టరు దించేశాను. అయినా నేనేం పశ్చాత్తాప పడటం లేదు. ఓ వైఫల్యంతో ఒక పాఠం నేర్చుకున్నా, ఇంకో పాఠం నేర్చుకోడానికి మళ్లీ ఓడిపోడానికైనా సిద్ధం’ అంటాడు నిఖిలేశ్‌. ఇదీ ఓటమికి కృతజ్ఞత చెప్పే పద్ధతి.

‘వైఫల్యానికి భయపడ్డామంటే మార్పుకూ భయపడతాం. చుట్టూ ఓ గీత గీసుకుని బతికేస్తాం. నేను వరుసగా ఐదు వైఫల్యాల్ని ఎదుర్కొన్నాను. ఆ ఐదు పాఠాల ఫలితమే నా ఆరో ప్రయత్నం’ అంటాడు మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్‌ బన్సల్‌. ‘ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఏమంత సులభమైన పని కాదు. అదీ గెలుపంత కష్టమైందే! ఓడిపోయినంత మాత్రాన తత్వం బోధపడదు. ఆ వైఫల్యాన్ని విశ్లేషించుకోవాలి. లోపం ఎక్కడుందో గుర్తించాలి. మన బాధ్యతని మనం నిజాయతీగా అంగీకరించాలి. కాలం గడిచేకొద్దీ గాయం మానినట్టుగానే, ఓటమి తీవ్రతా క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టే, వెంటనే సమీక్ష జరిపేసుకోవడం, మరుక్షణమే ఆ లోపాల్ని సరిదిద్దుకుని తాజా ప్రయత్నాన్ని మొదలుపెట్టడం చకచకా జరిగిపోవాలి’ అని సలహా ఇస్తాడు సీరియల్‌ ఎంట్రప్రెన్యూర్‌ శివదాస్‌ రాఘవ. ‘ఫెయిల్యూర్‌ టు మిలియనీర్‌’ పుస్తకంలో తన వ్యాపార జీవితంలో ఎదురైన వరుస వైఫల్యాల్ని భేషజాల్లేకుండా ప్రస్తావించాడా యువకుడు. ‘రాత్రికి రాత్రే ఎవరూ విజయం సాధించలేరు. సాధించగలమని ఎవరైనా అంటే, ఆ రాత్రి చాలా సుదీర్ఘమైనదై ఉండాలి. నా విషయంలో పదిహేడు సంవత్సరాల చీకటి రాత్రది’ అంటాడు శివ.

వైఫల్య సంఘాలు....
‘కోటీశ్వరుడిని ఎలా అయ్యానో చెబుతా రండి’ అంటే జనం పొలోమని పోగైపోతారు. ‘ముప్పైరోజుల్లో కోటి రూపాయలు’ అన్న ట్యాగ్‌లైన్‌ కనిపిస్తే చాలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం ఎగబడేస్తారు. కానీ, ‘నా ఓటమి కథ చెబుతాను వింటారా!’ అని పిలిస్తే ఎవరూ స్పందించరని అనుకుంటాం. ‘వ్యాపారంలో పాతిక లక్షలు పోగొట్టుకున్న చంటిగాడి వీరగాథ ఇదీ..’ అని మొదలుపెడితే ఒక్క ఈలా వినిపించదని ముందే నిర్ధారణకు వచ్చేస్తాం. అలా అనుకుంటే మాత్రం మీ అంచనా తలకిందులైనట్టే. ఓటమి కథలు వినడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. వీలైతే ఆ వైఫల్య సంఘాల్లో చేరడానిక్కూడా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ‘ఫకప్‌ నైట్స్‌’ ఓ అంతర్జాతీయ వైఫల్య సంఘం. నాలుగేళ్ల క్రితం మెక్సికోలో మొదలై హైదరాబాద్‌ దాకా వచ్చింది. సంఘం ఆధ్వర్యంలో తరచూ వైఫల్య సమావేశాలు జరుగుతాయి. పరాజితులు వేదిక మీద నిలబడి ఉపన్యసిస్తారు. చివర్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఎదుటివారి ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తుందీ వేదిక. అశీశ్‌గోయెంకా అనే ‘ఫెయిల్‌’ప్రెన్యూర్‌ దీన్ని భారతదేశానికి పరిచయం చేశాడు. వరుసబెట్టి నాలుగైదు వెంచర్లు దడదడా మూతబడిపోవడమే అతడికున్న ఏకైక అర్హత. ‘ఫెయిల్యూర్‌ ల్యాబ్‌’ కూడా దాదాపుగా అలాంటి వేదికే. వైఫల్యవీరులు ధైర్యంగా ముందుకొచ్చి తన పరాజయాల కథల్ని యథాతథంగా చెబుతారు. వ్యాఖ్యానాలూ ఉపమానాలూ అస్సలు ఉండవు. మెట్టవేదాంతాలకూ ఆచరణసాధ్యం కాని బోధనలకూ చోటే ఉండదు. ఉపన్యాసం పూర్తయ్యేలోపు..తమ ఆలోచనల్నీ స్పందనల్నీ ప్రేక్షకులు ట్వీట్‌ చేస్తారు. చివర్లో ఏదో ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం ఉంటుంది. నాలుగేళ్లక్రితం అమెరికాలో ప్రారంభమైన ఈ సంఘం భారత్‌లోనూ కాలుపెట్టింది. ‘ఫన్‌ హైదరాబాద్‌’ పేరుతో హైటెక్‌సిటీ పరిసరాల్లోనూ ఓ సంస్థ పనిచేస్తోంది. ‘ఫెయిల్‌కాన్‌’ కూడా వైఫల్య వేదికే. ఎంట్రప్రెన్యూర్లూ, ఏంజిల్‌ ఇన్వెస్టర్లూ, వెంచర్‌ క్యాపిటల్‌ నిర్వాహకులూ ఓ చోట కలుసుకుని తమ తొలి ఫైఫల్యం గురించి చర్చించుకుంటారు. వాటిని ఎలా అధిగమించవచ్చన్నది కొత్తతరానికి వివరిస్తారు.

ఇలాంటి వేదికల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒకటి, గుండె లోతుల్లో పేరుకుపోయిన ఓటమి బాధంతా కొవ్వులా కరిగిపోతుంది. రెండు, ఆ తప్పులు మరొకరికి హెచ్చరికలా ఉపయోగపడతాయి. సురక్షితంగా రిస్క్‌ తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. దీనికే ఫెయిల్యూర్‌ ల్యాబ్‌ ‘రిస్క్‌ ఇంటెలిజెన్స్‌’ అని పేరుపెట్టింది. ‘ఇంజినీర్స్‌ వితవుట్‌ బారియర్స్‌’ లాంటి అంతర్జాతీయ సంస్థలైతే, ఏటా ప్రోగ్రెస్‌ రిపోర్టులకు బదులుగా ఫెయిల్యూర్‌ రిపోర్టులను ముద్రిస్తున్నాయి. ఓడిపోవడం అన్నది తెలివితక్కువతనానికో అజ్ఞానానికో నిదర్శనమన్న అపోహ నుంచి మనం మెల్లమెల్లగా బయటపడుతున్నాం. అందుకు ఇవన్నీ సంకేతాలు. పిల్లాడు ‘నాకు నూటికి తొంభై ఆరు మార్కులు వచ్చాయి’ అనగానే, ‘మిగతా నాలుగూ ఏమైపోయాయి?’ అని నిలదీసే వ్యవస్థలో ఈ మాత్రం మార్పు అయినా గొప్పే!

పడిలేచినవాడే పనిమంతుడు..
బెంగళూరులోని కో-వర్కింగ్‌ స్టేషన్‌లో కూర్చుని...రాత్రంతా ఆలోచించాడు కృష్ణ. తాను రూపొందించిన టెక్నాలజీకి విదేశాల్లో మార్కెట్‌ ఉంటుందని భావించాడు. కానీ పరిస్థితి ఘోరంగా ఉంది. అదో ఎదురుదెబ్బ. వ్యాపారంలో ఎత్తుపల్లాలున్నా, అర్ధాంగి సంపాదన అండగా నిలుస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పైచదువులకు వెళ్తానని ఆమె పట్టుబడుతోంది. ఇది మరో ఎదురుదెబ్బ. తనలాంటి సాంకేతిక సేవలే అందించే సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇంత తీవ్ర పోటీని అంచనా వేయలేకపోయాడు. సిబ్బంది వలసల్ని తగ్గించడానికి, జీతాల పద్దు భారీగా పెంచకతప్పని పరిస్థితి. ఇవన్నీ దెబ్బమీద దెబ్బలు. డెబిట్లూ క్రెడిట్లూ తూకమేసుకున్నాక, వ్యాపారాన్ని కట్టేయడమే ఉత్తమం అనిపించింది. ఆతర్వాత పరిస్థితి ఏమిటి? బిజినెస్‌లో బొక్కబోర్లా పడినవాడికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? అనేకానేక అనుమానాల మధ్యే కొలువుల వేట ప్రారంభించాడు కృష్ణ. ఆరు కంపెనీలకు దరఖాస్తు చేశాడు. అనూహ్యంగా ఐదింటి నుంచి పిలుపు వచ్చింది. అందులో నలుగురి దాకా, అడిగినంత జీతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దేనిలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాడు కృష్ణుడు. ఓలాలో విలీనమైపోయిన ‘టాక్సీ ఫర్‌ ష్యూర్‌’లో పదిమందికి పైగా కీలక ఉద్యోగులు ఎంట్రప్రెన్యూర్స్‌గా ఓటమి దెబ్బ రుచి చూసినవారే.

‘పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు..’ అన్న పెద్దల మాటే, ఇప్పుడు తిరుగులేని నియామక సూత్రం. కార్పొరేట్‌ సంస్థలు వైఫల్యానికి హార్వర్డ్‌ యూనివర్సిటీ పట్టా అంత ప్రాధాన్యం ఇస్తున్నాయి, పడిలేవడమే పాతిక డిగ్రీలకు పెట్టని అంగీకరిస్తున్నాయి. ఒకప్పుడు...ఏడాదో రెండేళ్లొ ఏ ఉద్యోగమూ చేయకుండా ఉంటే, దాన్నో అనర్హతగా భావించేవారు. ప్రాథమిక వడపోతలోనే దరఖాస్తు చెత్తబుట్టపాలయ్యేది. ఇప్పుడలా కాదు. ఆ వ్యవధిలో అతనేం చేశాడన్నది కూడా ఆరాతీస్తున్నారు. ఏ అంకుర సంస్థనో ప్రారంభించి, చేయి కాల్చుకున్నట్టు తేలితే కళ్లకద్దుకుని కొలువు ఇస్తున్నారు. ఉద్యోగి ఉద్యోగిలా ఆలోచించడం మామూలు విషయం. కానీ, ఉద్యోగి ఓ ఎంట్రప్రెన్యూర్‌లా ఆలోచిస్తేనే ఆ ఆవరణలో అద్భుతాలు జరిగేది.

గెలిచినవాడికీ ఓడినవాడికీ తేడా - రేఖామాత్రమే. ఇద్దరూ కొత్తగానే ఆలోచిస్తారు. ఇద్దరూ పక్కాగానే ప్రణాళిక రచించుకుంటారు. ఇద్దరూ మార్కెట్‌ సవాళ్లకు ఎదురొడ్డే నిలుస్తారు. అంతిమంగా...ఒకర్ని విజయం వరిస్తుంది, మరొకర్ని ఓటమి ఆలింగనం చేసుకుంటుంది. ఇక, ఏ ప్రయత్నమూ చేయనివాడితో పోలిస్తే, ప్రయత్నించి విఫలమైనవాడు ఎప్పుడూ గొప్పే!

విజయం మహా అయితే ఓ పతకాన్నో కప్పునో ఇస్తుంది. అదే వైఫల్యం, జీవితాన్ని మలుపుతిప్పే సత్యాల్ని బోధిస్తుంది. ఆ పాఠాలు ఏ విశ్వవిద్యాలయాల సిలబస్‌లోనూ కనిపించవు. ఏ ప్రొఫెసరూ విశ్లేషించడు. ఆ అనుభవసారాన్ని తమ కంపెనీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలన్నది కార్పొరేట్‌ సంస్థల ఆరాటం. సరుకుల్ని ఇంటికే చేరవేసే వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌... పోటీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గాలం వేయలేదు. వైఫల్యం పాలైన ఓ అనామక కంపెనీ సిబ్బందిని పిలిపించి మరీ ఉద్యోగాలిచ్చాడు. వైఫల్యాన్ని తట్టుకోవడం తెలిసినవాడు, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా నెగ్గుకొస్తాడన్నది జెఫ్‌ అభిప్రాయం. ఆ అంచనా తప్పుకాలేదు.

* * *

వర్షం మొదలైపోగానే పక్షులన్నీ ఓటమిని అంగీకరించి, ప్రయాణాన్ని విరమించుకుంటాయి. చెట్టుకొకటి పుట్టకొకటి చెదిరిపోతాయి. కానీ, గద్ద మాత్రం...కుండపోతను లెక్కచేయకుండా, మేఘాల కంటే పైకెళ్లిపోతుంది. భీకరమైన తుపాన్లు కూడా ఏమీ చేయలేనంత ఎత్తులో ప్రయాణిస్తుంది.

అదీ సంకల్ప బలం...అవరోధాల్ని ఎదుర్కొనే విధానం.
ఆ సత్తువ అయాచితంగా రాలేదు. వేయి వైఫల్యాల తర్వాతే సమకూరింది.


 

ఓటమి సాహిత్యం!

 నిన్నమొన్నటిదాకా వ్యక్తిత్వవికాస సాహిత్యమంటే గెలుపు కథలే, విజయాల చిట్టాలే. ఆ ధోరణి మారుతోంది. ‘వై ఐ ఫెయిల్డ్‌’ పుస్తకంలో అభినవ్‌ బింద్రా, నారాయణమూర్తి, డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తదితరులు తమ ఓటమిని నిర్మొహమాటంగా పంచుకున్నారు. శ్వేతాపుంజ్‌ ఆ అనుభవాల్ని సంకలనం చేశారు. ‘ఇట్‌ ఈజ్‌ ఓకే టు ఫెయిల్‌ మె ౖసన్‌’ కాల్పనిక సాహిత్యం లాంటి వికాస గ్రంథం. ‘ఓడిపోయినా ఏం ఫర్వాలేదోయ్‌!’ అంటూ ఓ తండ్రి ఇందులో తన కొడుక్కి భరోసా ఇస్తాడు. రచయిత పేరు వసంత్‌ కల్లోల. స్కాట్‌ ఆడమ్స్‌ రచన ‘హౌ టు ఫెయిల్‌ ఎట్‌ ఆల్మోస్ట్‌ ఎవ్రీథింగ్‌ ఎండ్‌ స్టిల్‌ విన్‌ బిగ్‌’ ఆత్మకథాత్మక శైలిలో సాగిపోతుంది. ‘మై ఫెంటాస్టిక్‌ ఫెయిల్యూర్‌’ శ్రేయ ఉపాధ్యాయ అనే ఎంట్రప్రెన్యూర్‌ రచన. ఈ తరహా పుస్తకాలకు పాఠకుల్లోనూ ఆదరణ పెరుగుతోంది.


పాత నిఘంటువుల్ని తగులబెట్టేసి, కొత్తవాటిలో ‘ఫెయిల్యూర్‌’ అంటే ‘ఫీడ్‌బ్యాక్‌’ అన్న అర్థాన్ని ఇవ్వాలి.
- స్టీవ్‌జాబ్స్‌

నా మిత్రుడు అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత సాధించాడు. నేను మాత్రం అత్తెసరు మార్కులు కూడా సంపాదించలేకపోయాను. తనిప్పుడు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగి. నేను యజమానిని. ఇప్పుడు చెప్పండి, ఓటమిని చిన్నచూపు చూస్తారా?
- బిల్‌గేట్స్‌

వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలే నన్ను విజేతగా నిలబెట్టాయి. అలా అని, ఓటమిని తలవంచి భరించకూడదు. మనల్ని మనం అంచనా వేసుకోడానికి ఆ గాయాల గుర్తుల్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే ఓటమికి ఓ విలువ, ఓడిపోయినందుకు ఓ ప్రయోజనం.

- సత్య నాదెళ్ల