close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మోదుగపువ్వు

మోదుగపువ్వు
- వెన్నెల

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ మూడవ నంబరు ప్లాట్‌ఫాం పైకి వచ్చి ఉన్నది’ అనౌన్సర్‌ గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచింది అన్నపూర్ణమ్మ.
‘అయ్యో, ఏంటి ఇలా నిద్రపట్టేసింది. ఇంకానయం... స్టేషన్లోనే మెలకువొచ్చింది’ అనుకుంటూ నెమ్మదిగా లేచి కంపార్ట్‌మెంట్‌ గేటు దగ్గరకొచ్చి నిలుచుని నరేష్‌ కోసం వెదకసాగింది.
నరేష్‌- అన్నపూర్ణమ్మ, విశ్వనాథ్‌గార్ల పెద్దకొడుకు. విశ్వనాథ్‌గారు కరెంటు బోర్డులో పనిచేసి రిటైరయ్యారు. ఆయన ఆరెస్సెస్‌ సభ్యుడు. రిటైరైనా వాటి పనుల్లో ఎప్పుడూ తీరికలేకుండా ఉంటారు. నరేష్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించాడు. చిన్నప్పట్నుంచీ చదువులో చురుకైనవాడు. బుద్ధిమంతుడు. సంవత్సరంక్రితమే అన్నపూర్ణమ్మగారు తన అన్న కూతుర్ని ఏరికోరి కోడలుగా చేసుకుంది. మల్లి అందంలోనూ చదువులోనూ నరేష్‌కు సరిజోడి. అయితే తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం, ఐశ్వర్యంలో పెరగడంతో ఆ దర్పం, మొండితనం బాగానే అబ్బాయి. అయినా కూడా అన్నపూర్ణమ్మ గారికి పెద్దకోడలు మల్లి అంటే ఎంతో అభిమానం. నరేష్‌ దగ్గరే ఉండిపోవాలని ఆమె కోరిక. విశ్వనాథంగారు మాత్రం పిల్లల దగ్గర అలా తిష్టవేయకూడదనీ, వాళ్ళకీ కొంత స్వేచ్ఛనివ్వాలనీ అంటారు. అందుకే ఉద్యోగంలో ఉండగానే తాను హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంట్లో ఉండటానికే ఆయన ఇష్టపడతాడు. ఇప్పుడు నరేష్‌, మల్లీశ్వరిల మొదటి పెళ్ళిరోజు. విశ్వనాథంగారు తనకి తీరికలేదు రానన్నారు. మల్లీవాళ్ళ నాన్నగారికి రోడ్డు ప్రమాదంలో చిన్న గాయమైందనీ తాము రాలేమనీ మల్లీవాళ్ళమ్మ అన్నపూర్ణమ్మగారికి ఫోన్‌ చేసింది. ఇక తనకు తప్పదనుకుని ఒంటరిగానే విశాఖపట్నం బయల్దేరిందావిడ. కొడుకు స్టేషనుకి వస్తానన్నాడు. ఇప్పుడు అతని కోసమే ఆవిడ వెదుకుతోంది.

‘‘నమస్కారం ఆంటీ...’’ తెలిసిన గొంతు వినపడగానే తలతిప్పి చూసింది. నరేష్‌ ఫ్రెండ్‌ శేఖర్‌. పక్కపక్క ఫ్లాట్లలోనే ఉంటారు స్నేహితులిద్దరూ.‘‘ఏమిటి ఆంటీ, ఒంటరిగా వచ్చారా?’’
‘‘అవును నాయనా, నరేష్‌ వస్తానన్నాడు స్టేషనుకి. వాడికోసమే చూస్తున్నాను.’’
‘‘వాడి మొహం... పక్కమీది నుంచి లేచుండడు. నేను తీసుకెళ్తా రండి ఆంటీ’’ అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్‌ అందుకుంటూ అన్నాడు.
‘‘వాడొస్తే నేను కనపడక కంగారుపడతాడేమో నాయనా...’’ సందేహించింది.
‘‘నేను ఫోన్‌ చేస్తానులెండి ఆంటీ... ఫర్వాలేదు’’ అంటూ బయల్దేరాడు.

అనుసరించింది అన్నపూర్ణమ్మ. ఆటోలో ఇంటికి తీసుకొస్తూ నరేష్‌కి ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు శేఖర్‌. ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. చెబితే పెద్దావిడ కంగారుపడుతుందేమోనని, ఆ విషయం చెప్పకుండా తన సంగతులు చెప్పుకొచ్చాడు శేఖర్‌. ఆఫీసు పనిమీద హైదరాబాద్‌ వెళ్ళి వస్తున్నానని చెప్పాడు. గలగలా మాట్లాడే శేఖర్‌ని చూస్తుంటే తన చిన్నకొడుకు ప్రవీణ్‌ గుర్తుకొచ్చాడు అన్నపూర్ణమ్మకి.

ప్రవీణ్‌- తండ్రి ఎంతచెప్పినా వినకుండా అన్నలా ఇంజినీరింగ్‌కాక, ఆంత్రొపాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాడు. పరిశోధనపై ఆసక్తితో భద్రాచలం అటవీ ప్రాంతంలోని గిరిజనుల జీవితాన్ని అధ్యయనం చేయడానికి వెళ్ళాడు. అతనికి ఆ అమాయక గిరిజనులంటే ఎంతో ప్రేమ. కానీ అన్నపూర్ణమ్మ దంపతులను కలవరపెడుతున్న విషయమేమిటంటే మొన్నీమధ్య ఇంటికి వచ్చినప్పుడు బాంబు పేల్చాడు ప్రవీణ్‌... తాను అమాయకమైన గిరిజన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఈకాలం పిల్లల సంగతి తెలిసిన విశ్వనాథంగారు ఏమీ మాట్లాడలేదుకానీ అన్నపూర్ణమ్మ మాత్రం తనకి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించింది. ససేమిరా అన్నాడు. సరే మళ్ళీ నెమ్మదిగా చెప్పి చూద్దాం అని అప్పటికి వూరుకుందావిడ.

‘‘ఆంటీ, దిగండి’’ అన్న శేఖర్‌ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది. నరేష్‌ అపార్ట్‌మెంట్‌ ముందు ఆటో ఆగింది. ఆటోవాడిని పంపి, బ్యాగు తీసుకుని ముందుకు నడిచాడు. లిఫ్ట్‌ ముందాగి బటన్‌ నొక్కాడు. లిఫ్ట్‌ కిందకి రాగానే మూడో అంతస్తులో ఉన్న శేఖర్‌ ఫ్లాటు మీదుగా నరేష్‌ ఫ్లాట్‌ దగ్గరికి తీసుకువచ్చాడు. బెల్‌ కొడదామనుకునేంతలో తలుపు దగ్గరగా వేసి ఉండటం చూసి ఆగాడు. లోపలనుంచి మల్లి అరుపులు గట్టిగా విన్పిస్తున్నాయి.

‘‘పెళ్ళిరోజునాడు మనిద్దరికీ ప్రైవసీ ఉంటుందని నేను ఎన్ని ప్లాన్స్‌ వేశాను. ఇప్పుడు ఆవిడ వస్తే మొత్తం... ఛీ... ఛీ... నువ్వు రమ్మన్నావనుకో, ఆవిడ తగుదునమ్మా అంటూ అంత దూరం నుంచి పరిగెత్తుకొచ్చేయాలా? ఆవిడిక్కడ ఉన్నన్నాళ్ళూ నేను చేయాల్సిన చాకిరీ తల్చుకుంటే భయమేస్తోంది.’’

‘‘ఇక చాలు మల్లీ! అమ్మ వచ్చినప్పుడెప్పుడైనా నిమిషమైనా తీరిగ్గా కూర్చుందా? నీకు అదిష్టం, ఇదిష్టం అని వండిపెడుతూనే ఉంటుంది. ఆవిడిక్కడికి వస్తే చాకిరీ పెరిగేది అవిడకి - నీకు కాదు.’’
‘‘అంటే, నేను మీ అమ్మ వండి పెడుతుంటే కూర్చుని తింటున్నాననా?’’
‘‘అది వేరే చెప్పేదేముంది. ఇక మాట్లాడింది చాలు, ట్రెయిన్‌ వచ్చి ఎంతసేపయిందో... నేను వెళ్ళాలి.’’
నరేష్‌ వస్తున్న అలికిడి విని గబగబా అన్నపూర్ణమ్మని తన ఫ్లాట్‌ వైపుకి తీసుకువెళ్ళాడు. నరేష్‌ తలుపు తీసి బయటికి వచ్చేసరికి, వాళ్ళిద్దరూ అప్పుడే లిఫ్ట్‌ దగ్గర్నుంచి వస్తున్నట్లు అనిపించింది.
‘‘అరె... అమ్మా... వచ్చేశావా? సారీ అమ్మా, రాత్రి నిద్రపోయేసరికి ఆలస్యం అయింది. పైగా మల్లికి కొంచెం నలతగా ఉంది. అయినా ట్రెయిన్‌కి ఇంకా టైముంది కదా?’’ బ్యాగ్‌ శేఖర్‌ చేతిలోంచి అందుకుంటూ అన్నాడు.
‘‘ఒరేయ్‌ ఫూల్‌, రైలొచ్చి గంటయింది. పెద్దావిడ కంగారుపడరూ నువ్వు కనపడకపోతే. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇలాంటి సమయంలోనా నీ బద్ధకం’’ మందలించాడు శేఖర్‌.
‘‘పోనీలే నాయనా, క్షేమంగా చేరుకున్నాను కదా... ఇక వాడినేమీ అనకు.’’ కొడుకును చూసిన సంబంరంలో ఇంకేమీ పట్టించుకోలేదామె- చివరకు కోడలు మాటల్ని కూడా. తల్లిని తీసుకుని లోపలికెళ్ళాడు నరేష్‌.
లోపలికి వెళ్ళాక మల్లీశ్వరి జాడ కనబడలేదు. తల్లి చూపులను గ్రహించి, ‘‘తలనొప్పిగా ఉందని పడుకుందమ్మా, లేపుతానుండు. నీకు కాఫీ చేస్తుంది’’ అన్నాడు.

‘‘వద్దు బాబూ, పడుకోనీ... నేను కాఫీ చేసి తీసుకొస్తానుండు’’ అని వంటగదిలోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీతో తిరిగొచ్చింది. ఒకటి నరేష్‌కిచ్చి తాను కూడా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోసాగారు. అరగంట తర్వాత గదినుంచి బయటకు వచ్చి మొక్కుబడికి అత్తగారిని పలకరించింది మల్లీశ్వరి.
‘‘నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. ఫలహారాలూ, వంట సంగతి నేను చూస్తానులే’’ కోడలి సంగతి తెలిసి ముందే చెప్పింది అన్నపూర్ణమ్మ.
‘‘పనిమనిషి వారంరోజులు సెలవడిగిందత్తయ్యా, ఎలాగూ మీరొస్తున్నారని సరేనన్నాను’’ అనేసి, మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది మల్లీశ్వరి.
సింక్‌లో గిన్నెలన్నీ తోమి, జీడిపప్పు ఉప్మా చేసి, కొడుకుకీ కోడలికీ పెట్టింది. నరేష్‌కి ఆఫీసు సమయం అయిపోతోందని గుర్తొచ్చి గబగబా వంటింట్లోకి వెళ్ళి ఆలుగడ్డల వేపుడూ టొమాటొ పప్పూ చేసి, క్యారియర్‌లో పెట్టింది. నరేష్‌ వెళ్ళిపోయాడు.

అతన్ని పంపి హాల్లోకి వచ్చిన మల్లీశ్వరి- అత్తగారు తిన్నదా లేదా అని అడగకుండానే ‘‘నా స్నేహితురాలు అమెరికా నుంచి వచ్చి వారమైందత్తయ్యా. తనకి ఆంధ్రా భోజనం అంటే చాలా ఇష్టం. భోజనానికి పిలిచాను. తనతోపాటు మరో అయిదుగురు కూడా వస్తారు. గోంగూర పచ్చడీ, పులిహోరా, రెండు కూరలూ, పప్పూ, అప్పడాలూ చేయండి. వీలుంటే స్వీటేదైనా చేయండి’’ ఆర్డరు వేసి, స్నానానికి వెళ్ళిపోయింది.

అన్ని పనులూ పూర్తయ్యేసరికి పన్నెండయింది. స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మల్లీశ్వరి స్నేహితులందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు గుర్తొచ్చింది అన్నపూర్ణమ్మకి తాను ఫలహారం చేయలేదని. వంటగదిలోకి వెళ్తుంటే ‘‘అందరికీ వడ్డించేయండత్తయ్యా’’ అని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు తీసుకొచ్చేసింది మల్లీశ్వరి. అంతకుముందే సర్ది ఉంచిన అన్నం కూరలూ వడ్డించింది. భోజనాలు ముగించి వాళ్ళంతా వెళ్ళేసరికి రెండయింది. బాగా అలసటగా అనిపించి, సోఫాలో కూలబడింది అన్నపూర్ణమ్మ. తెలియకుండానే నిద్రలోకి జారుకుంది మెల్లగా. లీలగా మాటలు వినపడుతుంటే బరువుగా ఉన్న రెప్పలు తెరవలేక అలాగే పడుకుంది.

‘‘అమ్మ భోంచేసిందా?’’ అడుగుతున్నాడు నరేష్‌.
‘‘ఆఁ... చేసి పడుకున్నారు’’ కోడలి సమాధానం.

లేవాలనిపించలేదు అన్నపూర్ణమ్మకి. తాను ఉదయం నుంచీ ఏమీ తినలేదని కోడలికి తెలుసు. గోడ గడియారం సాయంత్రం అయిదు గంటలు కొట్టింది.

* * *

రెండోరోజు ఉదయం పనులన్నీ ముగించుకున్నాక నరేష్‌తో చెప్పింది అన్నపూర్ణమ్మ ‘‘ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్తాన్రా చిన్నాడి దగ్గరికి.’’
‘‘అదేంటమ్మా, వారం రోజులుంటానని వచ్చావు కదా!’’
‘‘చిన్నాడిని చూడాలని ఉందిరా. వెళ్తాను. రాత్రికి టిక్కెట్‌ బుక్‌ చెయ్యి.’’
తల్లి ఇక ఆగదని అర్థమైంది నరేష్‌కి. ‘‘సరే, ఈ ఒక్కరోజు ఆగు. కనక మహాలక్ష్మి గుడికి తీసుకువెళ్తాను. తర్వాత రేపు రాత్రి బయల్దేరుదువులే’’ అన్నాడు.
అమ్మవారి గుడి అనేసరికి ఆ రోజుకి ఉండటానికి ఒప్పుకుంది అన్నపూర్ణమ్మ. సాయంత్రం నాలుగు గంటలకి నరేష్‌ చెప్పినట్లు తయారై కూర్చుంది గుడికి వెళ్ళడానికి. కొంతసేపటికి తన గదిలోంచి రుసరుసలాడుతూ బయటికొచ్చింది కోడలు. ‘‘మీ అబ్బాయికి ఏదో అర్జంటు పనుందట. మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళమన్నారు’’ ముఖం మరోవైపు పెట్టుకుని చెప్పింది. సరేనని లేచింది అన్నపూర్ణమ్మ. ఆటోలో కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళేసరికి ఆరయింది. శుక్రవారం కావడంతో జనం బాగానే ఉన్నారు.

ప్రదక్షిణలు చేస్తుండగా మల్లిని ఎవరో పలకరించారు. మాట్లాడుతోంది. ‘‘మీరు దర్శనం చేసుకుని రండి, నేను ఇక్కడే ఉంటాను’’ అనేసి మళ్ళీ మాటల్లో పడిపోయింది స్నేహితురాలితో.
దర్శనం చేసుకుని వచ్చేసరికి మల్లీశ్వరి కనబడలేదు. ఇద్దరు, ముగ్గురిని అడిగి చూసింది ‘ఆకుపచ్చ చీర కట్టుకున్నామెని చూశారా’ అని. తెలియదన్నారు. ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుంది కోడలి కోసం ఎదురుచూస్తూ.
రాత్రి ఎనిమిదయింది. జనం పల్చబడుతున్నారు. కంగారుపడుతూ వచ్చాడు నరేష్‌ తల్లిని వెతుక్కుంటూ. తను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికి మల్లి మాత్రమే కనపడడంతో ‘అమ్మ ఏది’ అని అడిగాట్ట. ‘గుడిలో దింపి, తాను స్నేహితురాలి కారులో వచ్చేశా’నని చెప్పేసరికి నరేష్‌కి కోపం వచ్చి చెంప ఛెళ్ళుమనిపించి, తల్లిని వెతుక్కుంటూ వచ్చాడట. నరేష్‌ చెబుతుంటే విని నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ.

* * *

‘‘భూదేవిపల్లీ... భూదేవిపల్లీ...’’ బస్‌ కండక్టరు అరుపు విని మెలకువ వచ్చింది అన్నపూర్ణమ్మకి. నరేష్‌ దగ్గర్నుంచి ప్రవీణ్‌ని చూడటానికి భద్రాచలం వరకు వచ్చి, అక్కడనుంచి మరో బస్సులో భూదేవిపల్లి చేరుకుంది. ‘కొ..క్కొ..క్కొ..కో’ బస్సులో మనుషులతోపాటు కోళ్ళు కూడా చాలా ఉన్నాయి. బస్సు ఆగగానే ప్రవీణ్‌ లోపలికొచ్చి, అన్నపూర్ణమ్మ బ్యాగు తీసుకుని కిందకు దింపాడు. ఎవరిదో జీపు అడిగి తెచ్చాడు. ఎక్కగానే ఆ గతుకుల రోడ్డుమీద ఎగురుతూ పోతోంది ఆ వాహనం.
‘‘ఎలా జరిగిందమ్మా ప్రయాణం. ఏమీ ఇబ్బందిపడలేదు కదా. భద్రాచలమే వస్తానంటే వద్దంటివి. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసా... ఎలా వస్తావోనని’’ మాట్లాడుతూనే ఉన్నాడు ప్రవీణ్‌. ఆ అడవిలాంటి స్వచ్ఛమైన ప్రేమ అతని కళ్ళలో కన్పించింది.
‘‘ఇబ్బందేమీ లేదురా. కానీ, ఈ బస్సులోనే కోళ్ళూ మేకలూ తడికెలూ అన్నీ ఎక్కించారు. ఒకటే కంపు.’’
‘‘అదంతా పైపైనేనమ్మా. వీళ్ళ మనసులు మాత్రం నగరంలో ఉండే మనలాంటి వాళ్ళకంటే ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. అబద్ధం, మోసం అనేవి వీళ్ళకి తెలియదు. అందుకే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం.’’
నిజమేననిపించింది అన్నపూర్ణమ్మకి కూడా.
దారిపొడవునా అడవిని అక్కడక్కడా నరికి పంటలు పండిస్తున్నారు. ‘మిరపచెట్లు నేలమ్మ ఎర్రంచు పచ్చచీర కట్టిందా’ అన్నంత అందంగా ఉన్నాయి. సూర్యోదయం ఇంకా కాలేదు. పక్షుల అరుపులకైతే కొదవే లేదు. చల్లని సమీరాలు వీస్తుంటే అలసటంతా తీరిపోయింది అన్నపూర్ణమ్మకి.
దూరంగా ఏవో చెట్లకి ఎర్రని పూలు కన్పిస్తున్నాయి. ‘‘అవేమిటీ?’’ అని అడిగింది నరేష్‌ని.
‘‘వాటిని ‘మోదుగపూలు’ అంటారమ్మా. జనవరి, ఏప్రిల్‌ మధ్యలో పూస్తాయి. ఆయుర్వేదంలో కూడా వాడతారు. వాసనైతే ఉండదు. కానీ, వాటి రంగువల్ల దూరం నుంచి కూడా కన్పిస్తాయి. ‘ఫైర్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌’ అనీ అంటారు వాటిని.’’
మోదుగపూలు బాగా నచ్చాయి అన్నపూర్ణమ్మకి ఎందుకో. ఇంటికి చేరుకున్నారిద్దరూ. అది రెండుగదుల ఇల్లు. రెల్లుగడ్డితో కప్పినట్టున్నారు. చల్లగా హాయిగా ఉంది. అన్నపూర్ణమ్మ స్నానం చేసి వచ్చేటప్పటికి గదిలో రాగిజావ సిద్ధంగా ఉంది. ఆశ్చర్యంగా చూస్తుంటే సన్నని గొంతుతో కూనిరాగాలు విన్పించాయి. మెల్లగా బయటికి వచ్చింది అన్నపూర్ణమ్మ. ఛామనచాయ రంగూ, మోకాళ్ళ వరకు వేసుకున్న లంగా, ఓణీతో ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి వాకిలి వూడుస్తోంది.
‘‘ఎవరూ..?’’ మెల్లగా అడిగింది.
‘‘నేను కమ్లినమ్మా, సారుకి అన్ని పనులూ సేసిపెడ్తా. రాగిజావ తాగారా... ఎట్టుంది?’’
‘‘ఈ అమ్మాయి ఈ వూళ్ళొ పదో తరగతి వరకూ చదివిన ఏకైక అమ్మాయమ్మా. మొగిలి అని నాకు పరిశోధన విషయంలో చాలా సమాచారం ఇస్తాడు. అతని కూతురు. ఇదిగో వద్దన్నాసరే, నాకు రోజూ ఫలహారం, భోజనం పంపించేవాడు. నేనే వారించి ఇక్కడికే వచ్చి వండమన్నాను. డబ్బులు తీసుకోమన్నా వినరు వీళ్ళు. నాకు మొహమాటంగా ఉంటోంది’’ అంటూ వచ్చాడు ప్రవీణ్‌.

‘‘మీ దగ్గర డబ్బు తీసుకుంటే పాపం సారూ. మా గూడేనికి ఎంత సేసారు మీరు. ఐదో తరగతితో సదువాపేసిన నన్ను ప్రయివేటుగా పది రాయించారు. మీ వల్లనే కదా, గూడెంలో పిల్లలందరూ పనికికాక బడికి ఎల్తున్నారు. చింతపండు, ఇప్ప పువ్వు, తునికాకు ఇయ్యన్నీ మేము గిరిజనాభివృద్ధి ఆఫీసువాళ్ళకి అమ్ముకుని నాలుగు రూకలు సంపాయిత్తున్నాం. అంతకుముందు ఆ దళారోళ్ళ బెదిరింపులకి ఆళ్ళకే అమ్మితే ఇంట్లోవాళ్ళకి గంజికి కూడా సరిపోయేయి కాదు. ఇదంతా మీ పున్నెమే సారూ. మీరు మా దేముడు. మీ దగ్గర పైసలెట్టా తీసుకుంటా’’ కృతజ్ఞతతో అన్న కమ్లి మాటలకి అన్నపూర్ణమ్మకి ఆశ్చర్యమేసింది.

ఇంత చేస్తున్నాడా వీడు. ఏదో పరిశోధన అంటూ పిచ్చివాడిలా తిరుగుతున్నాడనుకుంది తను.

ఆరోజు సాయంత్రం కమ్లి దగ్గరుండి అడవిలోని చెట్టూ పుట్టా చూపించింది అన్నపూర్ణమ్మకి. మోదుగపూలు కోసిచ్చింది. వాగులోని చల్లని నీళ్ళు తాగితే ప్రాణం లేచొచ్చింది అన్నపూర్ణమ్మకి. ఏ పుణ్యనదిలో దొరుకుతాయి ఇంత స్వచ్ఛమైన నీళ్ళు అనుకుంది. ఇంటికొచ్చాక కమ్లి జొన్నరొట్టెలు చేసి, కొసరి కొసరి తినిపిస్తుంటే ఎన్ని తిన్నదో కూడా గుర్తులేదు అన్నపూర్ణమ్మకి. నాలుగు రోజుల నుంచీ కోడలి దగ్గర అలసిపోయిన శరీరం, ప్రయాణ బడలికతో వెంటనే నిద్రపట్టేసింది.

* * *

‘‘అమ్మగారూ...అమ్మగారూ...’’ పిలుస్తున్న కమ్లి గొంతుతో మెలకువొచ్చింది. చాలా నీరసంగా ఉంది.
‘‘ఎలా ఉందమ్మా ఇప్పుడు’’ ప్రవీణ్‌ అడుగుతుంటే-
‘‘ఏమైంది నాకు...’’ అయోమయంగా అడిగిందావిడ.
‘‘రెండు రోజులనుంచీ విపరీతమైన జ్వరమమ్మా నీకు. నాకు భయమేసింది. ఇక్కడికి అనవసరంగా రమ్మన్నానేమోనని. మొత్తం కమ్లినే నిన్ను చూసుకుంది. రాత్రిపూట కూడా నీ పక్కనే ఉండి ఏవో పసర్లూ ఆకులూ ఇచ్చింది.’’
‘‘అవునమ్మగారూ, నాక్కూడా బయమేసింది. అడివంతా తిప్పాను గదా - ఏ నదరు తగిలిందోనని. గాలోనాకు నూరి పొట్టకి కట్టాను. మా అయ్య తెచ్చిన పసరు తాగించాను. మా దేవరగుట్టకెళ్ళి కుంకం తెచ్చి పెట్టాను. అమ్మయ్య... మీరైతే బాగున్నారు గదా.’’
‘‘బావున్నాను కమ్లీ. నువ్వు చూడు, నిద్రలేకుండా ఎలా ఉన్నావో!’’
‘‘నేనింటికెళ్తానమ్మా. మాయమ్మని రోజూ సూడకపోతే ఏదోలాగుంటది. రెండు రోజులైంది. మా అయ్య కూడా నాతోపాటు ఇక్కడే ఉన్నాడు’’ బయల్దేరుతూ అంది.


‘‘ఇక నేను వంట చేయగలనులే కమ్లీ. నువ్వు ఇంటికెళ్ళు’’ అని ఆమె వెళ్ళే వరకూ ఆగిన తర్వాత ‘‘నువ్వు చెప్పింది నిజమేరా... వీళ్ళలో ఉన్న స్వచ్ఛతా, నాగరికతా, ప్రేమా... నాగరికులమని విర్రవీగే మనలో లేశమైనా లేవు. నువ్వు నీ పెళ్ళి విషయంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో ఇప్పుడర్థమైంది.’’

‘‘అవునమ్మా, డబ్బూ, చదువూ, హోదా నుంచి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో వదినని చూసిన తర్వాత అర్థమైంది. అందుకే ఈ ప్రాంతంలోని అమ్మాయిలలో నీకు నచ్చిన ఏ అమ్మాయినైనా పెళ్ళాడతాను.’’
‘‘వేరే అమ్మాయి ఎందుకురా... కమ్లి అయితే...’’
‘‘అమ్మా...’’
‘‘అవున్రా, ఏరికోరి తెచ్చుకున్న నా పెద్దకోడలి దగ్గర్నుంచే కదా ఇక్కడికొచ్చాను. అది కల్మషంతో మురికిపట్టిన మల్లెపూవయితే, కమ్లి స్వచ్ఛమైన వాతావరణంలో విరబూసిన మోదుగపువ్వురా. నాకు బాగా నచ్చింది. ఇక మీ నాన్నగారితో మాట్లాడతాను. ఒప్పిస్తాను. నీ పెళ్ళయ్యాక నేను కూడా వచ్చి నీ దగ్గరే, ఇక్కడే ఉండిపోతాను.’’
ప్రవీణ్‌ మొహంలో ఆనందం వెల్లువయింది.
అది చూసి తృప్తిగా నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.