close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇత్తడి బొమ్మ ఇదిగోమ్మా!

ఇత్తడి బొమ్మ ఇదిగోమ్మా!

ఇత్తడి సామాన్లకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. పెద్దవాళ్లు ఉన్న ఇళ్లూ, తరతరాలుగా వస్తున్న ఆ వస్తువులూ చూడగానే ఓ ప్రత్యేకానుభూతి కలుగుతుంది. పిల్లలు ఆడుకునేలా బొమ్మపాత్రలూ ప్రత్యేకంగా ఇత్తడివి చేయించేవాళ్లు చాలా మంది. వాటిని ఇష్టపడేవారి సంఖ్య ఇప్పటికీ ఏమీ తగ్గలేదు. అందుకే ఎన్నో రకాల ఇత్తడి ఆట బొమ్మల సెట్లు బజార్లో, ఆన్‌లైన్లో ముచ్చటగొలుపుతున్నాయి.
త్తడి గంగాళం... చూడగానే, పెద్ద కట్టెల పొయ్యి మీద తెల్లారేసరి ఇంటిల్లిపాదికీ సరిపడేటన్ని నీళ్లు కాగుతూ కనిపించే దృశ్యం గుర్తొస్తుంది. ఉమ్మడి కుటుంబాలున్న వారికి దాన్ని చూస్తే కలిగే ఆనందం వేరు. అంతేకాదు ఇత్తడి బిందెలూ, గిన్నెలూ, పళ్లేలూ... అన్నింటినీ ఓ వరుసలో పేరిస్తే ఇంటికి అదో అందం. అప్పట్లో బకెట్ల నుంచి పెద్ద మొత్తంలో అన్నం వండే గుండిగల వరకూ అన్నీ ఇత్తడివే ఉండేవి. అవన్నీ అచ్చంగా అరచేతిలో ఇమిడిపోయే ఆటబొమ్మల్లా మారిపోతే... ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న బొమ్మల్లానే ఉంటాయి. అవే కాదు చేటా, చెంబూ, పొయ్యీ, పీటా, టీ కప్పులూ, ఇడ్లీ పాత్రలూ అన్నీ ఎంచక్కా బొమ్మల సెట్ల రూపంలో దొరుకుతున్నాయి.

పాత-కొత్త రుచులు...
పిజ్జా బాగుంది కదా అని ఆవకాయను తినడం మానేస్తామా! జీన్సు సౌకర్యంగా ఉంది కదా అని లంగా ఓణీలను రద్దు చేసేస్తామా! అలాగే రంగు రంగుల ప్లాస్టిక్‌ బొమ్మలొచ్చాయి కదా అని ఈ ఇత్తడి బొమ్మలను పక్కకు పెడతామా... ఇదే అనుకుంటున్నట్టున్నారు మనోళ్లంతా. ఆ మోజే లేకపోతే, తరాల క్రితం నుంచీ ఆడపిల్లలు ఉండే ఇంట్లో ముద్దు కోసం, ఇంటి స్వర్ణకారుడి చేత ప్రత్యేకంగా చేయించి పెట్టుకునే ఇత్తడి బొమ్మలు... లేదూ అంటే అమ్మమ్మల నుంచో అమ్మల నుంచో వారసత్వంగా వస్తే ఆడుకుని అపురూపంగా దాచుకునే వాళ్ల దగ్గర మాత్రమే కనిపించే ఆ ముద్దు పాత్రలు... ఇప్పటికీ ఎలా తయారవుతుంటాయి? బజార్లూ, ఎగ్జిబిషన్లతో పాటూ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలోనూ ఎందుకు దర్శనమిస్తాయి? ఒక్క తెలుగు వాళ్లకే కాదు తమిళ కన్నడ మలయాళీలకూ ఈ పాత్రలంటే చాలా ఇష్టమట. అందుకే వాళ్ల దగ్గరా ‘ఆటాడా సామాను’, ‘చొప్పు సెట్‌’, ‘చొప్పు సామాన్‌’ పేర్లతో వీటిని అమ్ముతున్నారు.

ఆటకీ అలంకరణకీ...
పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్‌ కిచెన్‌ సెట్లలాగే ఇత్తడి బొమ్మల సెట్లూ రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. సెట్‌ రకాన్ని బట్టి అందులో ఉండే వస్తువులు మారుతుంటాయి. ఒక సెట్లో గిన్నెలతో పాటూ కత్తిపీటా, పొయ్యీ ఉంటే మరో దాంట్లో చేటా, తాంబాలం లాంటివి ఉంటాయి. సెట్‌ రకాన్ని బట్టి ఒక్కోదాన్లో పది పన్నెండు నుంచీ 20 వరకూ వస్తువులు ఉంటాయి. విడివిడిగా కొనుక్కునేలానూ ఇడ్లీపాత్రలూ, టీ సెట్లూ, బోరింగు పంపులూ, ఇస్త్రీ పెట్టెలూ, ఫ్యాన్లూ, డైనింగ్‌టేబుళ్లలాంటివీ దొరుకుతున్నాయి. కొందరు వీటిని అలంకరణకూ ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్లో బ్రాస్‌టాయ్స్‌, బ్రాస్‌ మీనియేచర్‌ కిచెన్‌సెట్‌లాంటి పేర్లతో దొరుకుతున్నాయి. అమెజాన్‌, ఇండియామార్ట్‌, స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌లాంటి వివిధ సంస్థలు వీటి అమ్మకాలు జరుపుతున్నాయి. ఇత్తడితో పాటూ రాగితో చేసిన రకరకాల సెట్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ వంటింటి పాత్రలు మొదలు ఇంటి సామగ్రి చాలానే తయారవుతోంది. బుజ్జి సామాను భలే ఉంది కదూ!


 

బొమ్మల స్టూడియోలొస్తున్నాయ్‌..!

పాపాయి తొలిసారి నవ్వింది... డిజిటల్‌ కెమెరా క్లిక్‌మంటుంది. ఆ జ్ఞాపకం ఫొటోలో ముద్రితమై మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. అయితే అదంతా పాత ట్రెండ్‌... ఇప్పుడు పాపాయి నవ్వుతుంది... కెమెరా క్లిక్‌మంటుంది... నవ్వుతోన్న పాపాయి బొమ్మ ప్రింటర్‌లో నుంచి బయటకు వస్తుంది. అదే త్రీడీ బొమ్మ.. సరికొత్త జ్ఞాపకం..!
కెమెరాను 360 డిగ్రీల కోణంలో క్లిక్‌మనిపించడం లేదా స్కాన్‌ చేయడం... దాన్ని ప్రింటర్‌కి పంపించడం... బొమ్మ బయటకు రావడం...సినీఫక్కీలో జరుగుతోన్న ఈ తంతుకి వేదికలే త్రీడీ ఫిగర్‌/ షేపీ బూత్‌లు. క్లోన్‌మీ, త్రీడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌, ట్విన్‌మీ, నెక్ట్స్‌టూప్యూచర్‌, త్రీడీ మినీమీ...ఇలా భిన్న పేర్లతో మెట్రోనగరాల్లో వెలుస్తోన్న ఈ త్రీడీ స్టూడియోలు నిన్నమొన్నటి ఫొటోలూ నేటి సెల్ఫీల్నీ పక్కకు నెట్టేయబోతున్నాయి.

అచ్చంగా మనుషుల్నీ వాళ్ల భంగిమల్నీ పోలిన బొమ్మల్ని తయారుచేయడం మరీ కొత్తదేమీ కాదు. ఒకప్పటి విగ్రహాల తయారీ నుంచి మినీమీ పేరుతో బొమ్మల్ని రూపొందించే ట్రెండ్‌ ఇప్పటికే నడుస్తోంది. అయితే అందులో ఫొటో ఆధారంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో బొమ్మల్ని చేత్తోనే రూపొందిస్తారు కళాకారులు. కానీ ఈ బూత్‌ల్లో అనేక కోణాల్లో ఏర్పాటుచేసిన వందల కెమెరాలు ఏకకాలంలో క్లిక్‌మంటాయి. ఆ ఫొటోలన్నీ కంప్యూటర్‌లో త్రీడీ డిజిటల్‌ బ్లూప్రింట్‌గా రూపొందుతాయి. లేదా త్రీడీ స్కాన్‌ బూత్‌ల ద్వారా మనిషిని స్కాన్‌ చేసి ఆ చిత్రాన్ని త్రీడీ ప్రింటర్‌లోకి పంపిస్తే, అందులోని శాండ్‌ స్టోన్‌ లేదా జిప్సమ్‌ పొడులతో అది బొమ్మలా తయారై బయటకు వస్తుంది. రెండు నుంచి 12 అంగుళాలవరకూ రకరకాల ఎత్తులో ఈ బొమ్మలు తయారవుతున్నాయి. ఫొటోలోని ఏ చిన్న పోలికా మిస్సవకుండా జిప్సమ్‌ పొడి అనేక పొరల్లో ఏర్పడుతూ బొమ్మ తయారవుతుంది. ఫొటోలోని దుస్తులూ జుట్టు రంగులూ అన్నీ అచ్చంగా అలాగే ఉండటం ఇందులోని గొప్పతనం. ఒకవేళ శరీరంలో ఏ భాగమైనా నచ్చకపోతే దాన్ని అందంగా చేయగలిగే సౌలభ్యం కూడా ఉంది. దాంతో పొట్ట ఉన్నవాళ్లకి లేకుండా చేయమనీ, నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా కనిపించేలా చేయమనీ అడుగుతుంటారట. సూపర్‌మ్యాన్‌లుగా చూసుకోవాలనుకున్నవాళ్లకి త్రీడీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా బొమ్మల్ని రూపొందిస్తామని చెబుతున్నారు దిల్లీకి చెందిన నెక్ట్స్‌టూఫ్యూచర్‌ నిపుణులు. పెళ్లి, పుట్టినరోజు...లాంటి వేడుకల సమయంలో నిపుణులే స్వయంగా వెళ్లి త్రీడీ స్కాన్‌ చేస్తామంటోంది బెంగళూరుకి చెందిన క్లోన్‌మీ.ఇన్‌ ప్రియురాలికి ప్రేమను తెలిపే క్షణాలూ, పెళ్లివేడుకలూ, పుట్టినరోజులూ.... ఇలా జీవితంలో ముఖ్యమైన అనుభూతులన్నింటినీ బొమ్మల రూపంలో భద్రపరచుకోవాలనుకుంటోంది నేటి తరం. ఫొటోలతో పోలిస్తే వీటి ధరలు ఎక్కువే. అయితేనేం... మధుర జ్ఞాపకాలకు వెల కట్టలేం అనుకుంటూ వాటిని కానుకలుగానూ ఇచ్చిపుచ్చుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. సో, ప్రతి ఇల్లూ ఓ టుస్సాడ్‌ మ్యూజియమే అన్నమాట.