close
అద్దం.. భళారే చిత్రం..!

అద్దం.. భళారే చిత్రం..!

అద్భుతమైన కళాఖండాలు ఎన్ని ఉన్నా స్టెయిన్డ్‌గ్లాస్‌ కళదో ప్రత్యేకమైన అందం. ఉదయభానుడి కిరణాలో దీపకాంతులో వాటిమీద పడినప్పుడు ప్రతిఫలించే ఆ రంగుల సోయగం నిత్యం కొత్త అనుభూతుల్నీ ఒకలాంటి ఆనందపారవశ్యాన్నీ కలిగిస్తుంది. అందుకే ఆనాటి చర్చి కళ, ఆధునిక గృహాలంకరణలోనూ అందాల్ని వెదజల్లుతోంది.
ద్దం ప్రతిబింబాన్ని చూసుకునేందుకే కాదు, కళల్నీ కాంతినీ అద్భుతంగా ప్రతిఫలింపజేస్తుంది అనడానికి అద్భుత నిదర్శనమే ఈ స్టెయిన్డ్‌ గ్లాస్‌ కళ. ఇది ఎంతో సంక్లిష్టమైనదీ అత్యంత పురాతనమైనదీ కూడా. అంతా అనుకున్నట్లుగా గాజుమీద రంగుల బొమ్మల్ని చిత్రించడమే స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ కాదు. రంగుల గాజు ముక్కల్ని ఓ అందమైన చిత్రం వచ్చేలా అతికించడమే ఈ కళలోని గొప్పతనం. అందుకే ఈ కళ కోసం కుంచె, రంగులూ కాకుండా గ్లాస్‌ కట్టరూ, రంగుల గాజుముక్కలూ, కరిగించిన సీసమూ, అట్టముక్కలూ అవసరమవుతాయి. అన్నింటినీమించి కళాకారులకు అద్భుత సౌందర్య దృష్టితోబాటు సాంకేతిక నైపుణ్యమూ అంతకుమించిన సాహసమూ అత్యవసరం.

 

ఎలా చేస్తారు?
 

ముందుగా కాగితంమీద డిజైన్‌ వేసుకుని వాటికి ఏయే రంగులు వేయాలో నిర్ణయించుకుంటారు. ఆపై డిజైన్‌ని ఎన్ని భాగాలుగా విడదీయాలో చూసుకుని ఆయా సైజుల్లో కార్డుబోర్డుని కత్తిరిస్తారు. ఇప్పుడు ఒక్కో అట్టముక్క ఆధారంగా రంగు గాజుని కట్టర్‌తో ముక్కలుగా చేస్తారు. ఆపై ఒక్కో గాజుముక్కనూ కట్టర్‌తో అంచులు సరిగ్గా వచ్చేలా పాలిష్‌ చేశాక, ఆ ముక్కల్ని కరిగించిన సీసం సహాయంతో అందమైన చిత్రం వచ్చేలా అతికిస్తారు. కొందరు రాగి, జింకు ఇత్తడి... తదితర లోహాల్ని కూడా గాజుని అతికించేందుకు వాడతారు. సాధారణ గాజులా కాకుండా ఈ రంగుల గాజు తయారీ కూడా ప్రత్యేకమే. సిలికా, పొటాష్‌, లెడ్‌ ఆక్సైడ్‌లతోబాటు భిన్న రంగులకోసం కాపర్‌, కోబాల్ట్‌, కాడ్మియం, సెలీనియం వంటి విభిన్న లోహ ఆక్సైడ్‌లను కూడా కలిపి కొలిమిలో కాల్చి స్టెయిన్డ్‌గ్లాస్‌ను తయారుచేస్తారు. అందుకే సాధారణగాజుతో పోలిస్తే ఇది ఎంతో దృఢంగా ఉంటుంది. అదేసమయంలో ఖరీదూ ఎక్కువే. అయినప్పటికీ ధరను లెక్కచేయకుండా నేటి ఆధునిక గృహాలంకరణప్రియులు ఆ రంగుల కాంతుల్ని నట్టింట్లో ప్రతిఫలింప చేయాలనుకుంటున్నారు. దాంతో కళాకారులు సైతం వ్యయప్రయాసలకోర్చి ఈ కళాఖండాలను రూపొందిస్తున్నారు.

ఎన్నెన్నో వర్ణాలూ... ఏవేవో అందాలు...!
తలుపులూ కిటికీలూ పార్టిషన్లతోబాటు గోడమీద కళాఖండాలనూ స్టెయిన్డ్‌గ్లాస్‌తో తయారుచేస్తున్నారు నేటి కళాకారులు. సంపన్నులయితే సీలింగుల్లోనూ స్టెయిన్డ్‌గ్లాస్‌ ప్యానల్సును అమర్చి, వాటిల్లో ఎల్‌ఈడీ బల్బుల్ని చొప్పించి ఇంటిని రంగుల కాంతులతో మెరిపించేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, హాల్లోనూ లివింగురూముల్లోనూ అలంకరించుకునే త్రీడీ బొమ్మలూ ల్యాంప్‌షేడ్ల రూపాల్లో కూడా ఈ రంగులగాజు కనువిందుచేస్తోంది. అంతేకాదు, కుర్చీలూ టీపాయ్‌లూ సోఫాలూ డ్రెస్సింగ్‌టేబుల్‌... వంటి ఫర్నిచర్‌ను సైతం స్టెయిన్డ్‌గ్లాస్‌తో తయారుచేసేస్తున్నారు. పైగా ఈ స్టెయిన్డ్‌ గ్లాస్‌ ప్యానెల్స్‌ విభిన్న సైజుల్లో దొరకడంతో తలుపులూ, కిటికీల మొత్తానికీ కాకుండా మనకు కావలసిన మేర అమర్చుకోవచ్చు. వీటిల్లో వస్తోన్న డిజైన్లకూ కొదవ లేదు. సహజ ప్రకృతిదృశ్యాలతోబాటు అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ డిజైన్లూ; దేవతారూపాలూ పిల్లల్ని ఆకర్షించే సూపర్‌మ్యాన్‌, బ్యాట్స్‌మ్యాన్‌... వంటి బొమ్మల్నీ కూడా రూపొందిస్తున్నారు. అయితే అసలు సిసలు స్టెయిన్డ్‌గ్లాస్‌ కళారూపాల్ని కొనలేనివాళ్లకోసం అచ్చంగా వాటిని తలపించే గాజు చిత్రాలూ వస్తున్నాయి. సాధారణ గాజుమీద స్టెయిన్డ్‌ గాజు కళను తలపించే చిత్రాలను ఎంపికచేసి ఎయిర్‌బ్రషింగ్‌ లేదా చేత్తోనే రంగుల్ని వేస్తారు. ఇవి మాత్రమే కాదు, ఈ స్టెయిన్డ్‌గ్లాస్‌ కళారూపాల డిజైన్లను త్రీడీ వాల్‌డెకాల్స్‌, వాల్‌పేపర్లలోనూ చొప్పిస్తున్నారు. దాంతో అసలేవో నకిలీవేవో తెలియనంత అందంగా ఈ పురాతన గాజు కళ సరికొత్త గృహాలంకారమై అలరిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.