close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మార్పువీరుల్లో ముగ్గురు మనోళ్లే!

మార్పువీరుల్లో ముగ్గురు మనోళ్లే!

ప్రపంచాన్ని మార్చగల శక్తిమంతమైన యువత కోసం ఐక్యరాజ్య సమితి అన్వేషణ మొదలుపెట్టింది. 186 దేశాల నుంచి 18వేల మందిని జల్లెడ పట్టి చివరికి కేవలం 17మందిని ‘యూఎన్‌ యంగ్‌ లీడర్స్‌’గా ఎంపిక చేసింది. వాళ్లలో ముగ్గురు భారతీయులకు చోటు దక్కడం విశేషం. అంకిత్‌, త్రిష, కరణ్‌... పాతికేళ్లు కూడా నిండని ఈ ముగ్గురూ వయసులోనే చిన్న. మార్పు తేవడంలో మాత్రం అందరికంటే మిన్న..!
స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో ఆఖరికి ఇంట్లో కూడా అమ్మాయిలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతుంటారు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో, అవతలి వాళ్ల నేరాన్ని ఎలా రుజువు చేయాలో తెలీక తమలో తామే కుమిలిపోతుంటారు. ఇక్కడ తప్పు చేసేదొకరు, శిక్ష మరొకరికి. అలాంటి పరిస్థితుల నుంచి ఆడపిల్లల్ని బయట పడేసి వేధింపులకు గురైన వాళ్లను అన్ని విధాలుగా ఆదుకుంటూనే, నేరగాళ్లకు శిక్షపడేంత వరకూ బాధితులకు సహాయపడుతోన్న సంస్థ ‘షీ సేస్‌’. 24ఏళ్ల వయసులోనే ఆ సంస్థకు ప్రాణం పోసింది ముంబయి అమ్మాయి త్రిష శెట్టి. ‘ఒకవేళ నన్నెవరైనా వేధిస్తే పోలీసుల్నీ, లాయర్లనీ ఎలా ఆశ్రయించాలన్న సందేహం వచ్చి ఆ విధానం గురించి గూగుల్‌లో వెతికా. వేధింపులూ, అత్యాచారాలకు సంబంధించిన వార్తలూ, కొన్ని స్వచ్ఛంద సంస్థల పేర్లొచ్చాయి తప్ప నాక్కావాల్సిన సమాచారం దొరకలేదు. అప్పుడే బాధితులకు సహాయపడేందుకు ‘షీ సేస్‌’ను మొదలుపెట్టి వెబ్‌సైట్‌ని (shesays.in) సృష్టించా. అసలు వేటిని వేధింపులుగా పరిగణిస్తారూ, బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలీ, ఆస్పత్రులూ, పోలీసు స్టేషన్లను ఎలా ఆశ్రయించాలీ... ఇలా బాధితులకు మానసిక, వైద్య, చట్టపర సహాయం అందించే సమాచారంతోపాటు, నిపుణుల అండా ఇక్కడ లభిస్తుంది’ అంటుంది త్రిష. ఇప్పటిదాకా ఆ సంస్థ 72వేల మందికి లైంగిక వేధింపులపైన అవగాహన కల్పించడంతో పాటు, ఎంతోమంది బాధితులతో కలిసి న్యాయపోరాటం చేసింది. ఆ చొరవే త్రిషను అంతర్జాతీయ యువ నాయకుల జాబితాలో చేర్చింది.

రూ.4కోట్ల వృథా ఆదా
చాలామంది ఇళ్లలో రోజూ ఉదయాన్నే సింక్‌ దగ్గరికి వెళ్తే కనీసం ఒక మనిషికి సరిపడా అన్నం వృథాగా పడుంటుంది. అదే ఒక హోటల్‌లో, పెళ్లిలో, పార్టీలో, ఏకంగా ఒక వూళ్లొ అయితే రోజుకి ఎంత ఆహారం చెత్తబుట్ట పాలవుతుందో వూహించడం కష్టమే. మట్టిపాలవుతున్న ఆ అన్నంతో పేదల పొట్ట నింపితే వ్యర్థానికీ కొత్త అర్థానివ్వొచ్చు. అదే పని చేస్తోంది అంకిత్‌ కత్వార్‌ అనే కుర్రాడి సంస్థ ‘ఫీడింగ్‌ఇండియా (feedingindia.org-). పెళ్లిళ్లూ, పార్టీలూ, హోటళ్లూ, ఇతర వేడుకల్లో ఆహారాన్ని వృథా పోనివ్వకుండా సేకరించి జాగ్రత్తగా ప్యాక్‌ చేసి వీధిబాలలూ, బిచ్చగాళ్లూ, అనాథ శరణాలయాలకు అందించడమే ఫీడింగ్‌ ఇండియా పని. దీని కోసం రెస్టరెంట్లూ, క్యాటరింగ్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వేడుకలు మధ్యలో ఉండగానే ఆ రోజు ఎంత ఆహారం మిగిలే అవకాశం ఉందన్న సమాచారాన్ని క్యాటరింగ్‌ వాళ్లు వీళ్లకందిస్తారు. మొత్తం 28 నగరాల్లో 2వేల మందికి పైగా వలంటీర్లు దీని కోసం పనిచేస్తున్నారు. ‘నేను దిల్లీలో ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేసేప్పుడు ఓ సెలెబ్రిటీ పెళ్లికి వెళ్లా. అక్కడ దాదాపు పదివేల మందికి ఆహారాన్ని సిద్ధం చేశారు. మిగిలిన పదార్థాలని ఏం చేస్తారో చూద్దామని వేడుక పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నా. చివరికి నాలుగైదు వేల మందికి సరిపోయే భోజనం చెత్త పాలవుతుందని వంటవాళ్లు చెప్పడంతో బాధేసింది. నేను చేస్తోన్న ఉద్యోగం కంటే చేయబోయే ఉద్యమమే ఎక్కువ సంతృప్తినిస్తుంది అనిపించి ఈ పని మొదలుపెట్టా’ అంటాడు అంకిత్‌. ఫీడింగ్‌ ఇండియా ఇప్పటి వరకూ నాలుగు కోట్ల రూపాయల విలువైన వృథాని అరికట్టడంతో పాటు దాదాపు పది లక్షల మంది పేదల ఆకలి తీర్చింది.

సముద్రానికి జల్లెడ
ఏటా వేట కంటే ఎక్కువగా నడి సంద్రంలోని చమురు ఉత్పత్తి కేంద్రాల్లో పైపు లైన్లు పగిలినప్పుడో, చమురుని తరలించే నౌకలు ప్రమాదానికి గురైనప్పుడో జీవరాశులకు జరుగుతోన్న నష్టమే ఎక్కువ. ముంబైలో పుట్టి టెక్సాస్‌లో పెరుగుతున్న కరణ్‌ అనే కుర్రాడు ఆ పరిస్థితికి పరిష్కారంగా కనిపెట్టిన పరికరం యావత్‌ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. కరణ్‌కు పదమూడేళ్ల వయసప్పుడు టెక్సాస్‌ సముద్ర తీరంలో బ్రిటిష్‌ పెట్రోలియం బావి దెబ్బతిని లక్షల లీటర్ల చమురు నీటిపాలైంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరిగే అలాంటి ప్రమాదాల వల్ల జలచరాల మనుగడకు ఎంత ప్రమాదమో తెలుసుకున్నాడు. అప్పట్నుంచే సముద్రంలో చమురూ, విషవాయువులను వేగంగా పీల్చుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రంచేసే పరికరాన్ని కనిపెట్టే ప్రయోగాలు మొదలుపెట్టిన కరణ్‌, ఆరేళ్ల తరవాత అందులో విజయవంతమయ్యాడు. గతేడాది అతడు కనిపెట్టిన పరికరానికి గుర్తింపుగా ‘ఇంటెల్‌ యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డు దక్కింది. అందులో భాగంగా వచ్చిన 33లక్షల రూపాయలతో తన ప్రయోగాలకు నిధులు సమకూర్చుకోవడంతో పాటు, టెక్సాస్‌ యూనివర్సిటీలో పెట్రోలియం ఇంజినీరింగ్‌లో చేరి తన పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకునే పనిలో పడ్డాడు.

అంకిత్‌, త్రిష, కరణ్‌లానే ప్రపంచవ్యాప్తంగా మరో పద్నాలుగు మంది ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ‘ఐరాస యువ నాయకులుగా’ ఎంపికయ్యారు. పాతికేళ్లు నిండకుండానే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వీళ్లకు రాబోయే రోజుల్లో ప్రపంచంలో సానుకూల మార్పులు తీసుకురావడం పెద్ద కష్టం కాదేమో కదూ..!


 

ఉగ్రవాదులకు వణుకు పుట్టిస్తున్నారు

చాలా మంది సైన్యంలో చేరతారు. దేశాన్ని దగ్గరుండి కాపాడాలన్న భక్తితో. కానీ కొందరు అమ్మాయిలూ సైన్యంగా మారారు... తమ ప్రాంతాన్నే కాదు తమ వాళ్లందరినీ ఐఎస్‌ఐఎస్‌ ఘాతుకాల నుంచి విడిపించాలన్న కసితో. ఎందుకంటే అక్కడున్న అమ్మాయిలందరూ వాళ్ల అఘాయిత్యాలను కళ్లారా చూసిన వాళ్లూ, అనుభవించిన వాళ్లూ కూడా. దెబ్బ తిన్న పులుల్లా పోరాడుతున్న వాళ్లను చూస్తే అక్కడి ఉగ్రవాదులూ పరుగులు తీస్తున్నారట!

 
ది 2014 జూన్‌ నెల పదో తారీఖు..ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ద ఇరాక్‌ అండ్‌ ద లెవాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)... ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ మరో రూపం. ఇరాక్‌లోని మొసల్‌ దాదాపు పాతిక లక్షల మంది జనాభా ఉన్న పట్టణం. ముస్లిమేతరులుగా చెప్పే యాజిదీ, కుర్ద్‌ తెగలకు చెందిన జనాభా ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలోకి ఒక్కసారిగా వందలాది ఉగ్రవాదులు చొరబడ్డారు. వేల మందిని మూకుమ్మడిగా హతమార్చారు. మొత్తంగా ఆ పట్టణాన్ని హస్తగతం చేసుకున్నారు. మగవాళ్లను ఇనుప బోనుల్లో బంధించి బతికుండగానే పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఆడవాళ్ల పరిస్థితి అంతకన్నా దారుణం. వాళ్లను లైంగిక బానిసలుగా మార్చుకున్నారు. వాళ్లకు చిక్కకుండా కొండల్లో ఉండిపోయిన కుటుంబాల్లో చాలా మంది ఎండకూ ఆకలికీ చనిపోయారు. ఆ ఘోరకలిని చూసిన ఓ మహిళ బాధతో కుమిలిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయింది. కసితో తిరగబడింది. తమ చోటునూ తమ వాళ్లనూ చెరపట్టిన ఐఎస్‌ఐఎస్‌ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. వాళ్లు చెరపట్టిన వ్యక్తుల్నే ఆయుధాలుగా తయారుచేసి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తిరగబడ్డారు
ఐఎస్‌ఐఎస్‌కు సింహస్వప్నంలా మారిన ఆ ధీరవనితే ఖాటూన్‌ ఖిదేర్‌. ప్రజాగాయనిగా ఇరాక్‌లో ఆమెకు పేరుంది. ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా ఫోర్స్‌ ఆఫ్‌ ద సన్‌ లేడీస్‌ పేరిట బెటాలియన్‌ను స్థాపించింది. దాదాపు ఎనిమిది వందల మంది ఇందులో ఉన్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ... దాడి నాటికి గర్భిణిగా ఉన్న ఓ మహిళ చెరలోనే ప్రసవించింది. సరిగ్గా పాలివ్వనివ్వకపోగా బిడ్డ ఏడుస్తుంటే, చికాకు పడి తల నరికేశారా కిరాతకులు. అక్కడి నుంచి బయటపడ్డ ఆమె ఖాటూన్‌ బెటాలియన్‌లో చేరింది. జిహాదీలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సైన్యం సాయంతో
ఉగ్రవాదులకు ఎదునిలవాలన్న తన ఆలోచనను పెష్‌మెర్గాగా పిలిచే ఇరాక్‌ సైన్యంతో పంచుకున్నారు ఖిదేర్‌. పెష్‌మెర్గా అంతకు ముందు నుంచే మహిళా ప్రత్యేక దళాలకు శిక్షణ నిస్తోంది. ఆ దళంలోని కొందరు సభ్యులైతే ఒక్కొక్కరూ వంద మంది జిహాదీలను అంతమొందించారు. అలాంటి శిక్షణ తమకూ ఇప్పించమని కోరారు ఖిదేర్‌. అధికారులు అందుకు అంగీకరించారు. మగవాళ్లకు కూడా కష్టంగా తోచే అత్యంత కఠినతర శిక్షణను పొందిన ఈ మహిళలు సైన్యంలో భాగమై ఉగ్రవాదులకు అతి చేరువలో ఉండే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కీలక ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే కనీసం ఓ వంద మంది ఉగ్రవాదుల్ని వీరు మట్టుపెట్టారు. ‘ఆడవాళ్ల చేతుల్లో చస్తే స్వర్గానికి పోరని ఉగ్రవాదుల నమ్మకం. అందుకే మా గొంతులు వినిపిస్తే వణికి పోతారు. అక్కడ బందీలుగా ఉన్న మా వాళ్లందరినీ బయటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఒకవేళ మేం దొరికితే పరిస్థితేంటో తెలుసు. అందుకే మా గన్‌లో ఒక్క బులెట్‌ ఎప్పటికీ ఉంటుంది. అది మా కోసమే!’ అంటూ గర్వంగా చెబుతారా బెటాలియన్‌ సభ్యులు. వీళ్లే కాదు ఈ ప్రాంతపు సరిహద్దుల్లోని సిరియాలోని పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌, కుర్దిస్థాన్‌ వర్కర్క్స్‌ పార్టీ పేర్లతో నడుస్తోన్న బెటాలియన్లలోనూ చాలా మంది ఐఎస్‌ఐఎస్‌ బాధిత మహిళలు కసితో పోరాడుతున్నారు. ధైర్యానికి ప్రతీకలుగా ఉన్న వీళ్లను చూస్తే ఎవరైనా సెల్యూట్‌ చేయాల్సిందే!

వహీదా... పేరంటేనే భయం