close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనోహరం.. ఆ సరోవరం..!

మనోహరం.. ఆ సరోవరం..!

‘పర్వతారోహణలో ఓనమాలు దిద్దుకుంటున్నవాళ్లు కూడా సర్‌పాస్‌ ట్రెక్‌కి వెళ్లాలనుకోవడం సహజం. ఎందుకంటే 13,800 అడుగుల ఎత్తులోని ఆ మంచుకొండలూ విశాలమైన పచ్చికబయళ్ళతో కనువిందు చేసే పార్వతి వ్యాలీ రారమ్మని పిలుస్తున్నట్లే ఉంటుంది’ అంటూ ఆ ట్రెక్‌ అనుభూతుల్ని మనతో పంచుకుంటున్నాడు కాకినాడకు చెందిన సుశాంత్‌ కనుమూరి.
ర్‌ పాస్‌ అంటేనే ‘పాసింగ్‌ ది ఫ్రోజెన్‌ లేక్‌’... అంటే మంచు సరస్సును దాటడం. నిటారుగా ఉండే కొండలమధ్యలోని ఆ సరస్సు ట్రెక్కర్లకు సవాలు చేస్తున్నట్లే ఉంటుంది. ఆ కొండలు ఎక్కడం అంటే ఒళ్లు గగుర్పొడిచే అనుభూతుల్ని సొంతం చేసుకోవడమే అని తెలుసు. అందుకే మూడు నెలలు ముందుగానే యూత్‌హాస్టల్స్‌ నిర్వహించే ఆ ట్రెక్‌కి బుక్‌ చేసుకున్నాను. జులైలో సెలవులు ఇచ్చాక కాకినాడ నుంచి రైల్లో దిల్లీ చేరుకున్నాను. అక్కడనుంచి మనాలీకీ, ఆపై రాత్రంతా ప్రయాణం చేసి భుంటార్‌కీ చేరుకున్నాం. సర్‌ పాస్‌ ట్రెక్‌కి వెళ్లేవాళ్లంతా భుంటార్‌కు నాలుగు గంటల దూరంలోని కాసోల్‌కు చేరుకోవాలి. అది బేస్‌ క్యాంప్‌. నడుస్తుంటే వెన్నుపూస కదిలిపోయేంత రఫ్‌గా ఉంటుందక్కడి నేల. పార్వతీనది పక్కనే ఏర్పాటుచేసిన మా టెంట్‌లోకి చేరగానే మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. అంతకుముందు రెండు ట్రెక్‌లు పూర్తి చేసుకున్న అనుభవంతో ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తిచేసుకుని బయటకు రాగానే పార్వతీశిఖరం మెరుస్తూ కనిపించింది.

కాసోల్‌లో ఇజ్రాయెల్‌, జర్మన్‌ కెఫెల దగ్గర్నుంచి పానీపూరీ వరకూ అన్నీ ఉంటాయి. పర్వతారోహణకు సంబంధించి గ్లోవ్స్‌, మంకీక్యాప్‌, షూస్‌, సన్‌స్క్రీన్‌... వంటివన్నీ ముందే సిద్ధం చేసుకున్నాం. కాసోల్‌లో అన్నీ దొరుకుతాయి కానీ ధర ఎక్కువ. ట్రెకింగ్‌కి ముందురోజు సభ్యులందరికీ కొండలు ఎక్కడం, దిగడం, దారిలో ఎదురయ్యే ఇబ్బందుల గురించిన శిక్షణ కార్యక్రమం ఉంటుంది.

చుక్కల విందు!
మర్నాడు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మా ట్రెక్‌ మొదలైంది. సన్నని దారిలో 9 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు ప్రయాణించి 7,700 అడుగుల ఎత్తులోని గ్రాహన్‌ గ్రామానికి చేరుకున్నాం. చిన్న చెక్కపెట్టెలాంటి ఇళ్లూ గుడీ చిన్న స్కూలూ మాత్రమే ఉంటాయక్కడ. అక్కడి గ్రామాలకు ఒక్కో దైవం ఉంటుంది. గ్రాహన్‌ గ్రామానికి దైవం యజ్ఞమహర్షి. అక్కడ మద్యం పూర్తిగా నిషేధమనీ, తాగిన వాళ్లకి భయంకరమైన శిక్షలు ఉంటాయనీ చెప్పారు. పైకి వెళ్లేకొద్దీ వాతావరణంలో సాంద్రత తగ్గుతుంది. దాంతో రాత్రివేళ నింగిలో నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. టీ తాగుతూ ఆకాశంలోని ధనూరాశినీ వృశ్చికరాశినీ సప్తర్షి మండలాన్నీ చూడటం ఎంతో బాగుంటుంది.

రెండోరోజు ప్రయాణంలో జలపాతాలూ పచ్చికబయళ్లతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. అలా 9 కిలోమీటర్ల దూరం నడిచి 9,300 అడుగుల ఎత్తులో ఉన్న పద్రి క్యాంపునకు చేరుకున్నాం. దారిలో కాళ్లకి జంతువుల అస్థిపంజరాలు తగిలినప్పుడల్లా ఒళ్లు జల్లుమనేది. టెంట్‌కి దగ్గరలోనే చిరుత తిని వదిలిన కళేబరం కనబడింది. దానికితోడు రాత్రంతా మంచువర్షం. దాంతో నిద్రపడితే ఒట్టు.

మూడోరోజు 12 కిలోమీటర్లు నడిచి 11,200 అడుగుల ఎత్తులో ఉన్న మింటాచ్‌ క్యాంపునకి చేరుకున్నాం. ఆ రోజంతా ఎత్తైన కొండల్లోనే ప్రయాణం. శరీరంలో నీటిస్థాయి పడిపోతుంటుంది. గుండె వేగం ఎక్కువై ఆక్సిజన్‌ సరిపోక మెదడు మొద్దుబారిపోతుంటుంది. అన్ని ఇబ్బందుల్లోనూ అక్కడి గొర్రెలు ఇళ్లకు చేరే దృశ్యాన్నీ కొండల్లోకి జారిపోతున్న సాయంసంధ్య అందాలనీ చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.