close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందంగా రంగేద్దాం..!

ఫొటో ఫ్రేములూ, డెకరేటివ్‌ అద్దాలూ, షోకేసులో బొమ్మలూ, పూల కుండీలూ... ఇలా మనింట్లో చాలా వస్తువులు కొన్నాళ్లకు పాతబడిపోతుంటాయి. కొన్నేమో చూసీ చూసీ బోర్‌ కొట్టేస్తుంటాయి. వాటిని మళ్లీ తళతళా మెరిసేలా చేయడానికీ, రంగులు అద్దేసి కొత్తగా కనిపించేలా చేసేందుకూ సాయపడేవే స్ప్రే పెయింట్లు. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల రంగులను ఆయా వస్తువులకు అతి సులభంగా మనమే అద్దగలగడమే వీటిలోని ప్రత్యేకత.

ఏంటివి?
చూసేందుకు దాదాపు జానెడు పొడవుతో అచ్చం సాధారణ స్ప్రే బాటిళ్లలా కనిపిస్తాయివి. స్ప్రే పెయింట్‌ క్యాన్లుగా పిలిచే వీటిలో పల్చటి పెయింట్‌ నింపి ఉంటుంది. పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ను నొక్కినట్టు దీని మూతను తీసి నొక్కితే తుంపర్లలా పెయింట్‌ బయటకు వస్తుంది. దీన్ని మెటల్‌, చెక్కా, రాయీ, ప్లాస్టిక్‌, గాజు, మట్టి ఇలా దేంతో తయారు చేసిన వస్తువులకైనా వాడవచ్చు.

ఎన్నో రకాలు...
మనం ముస్తాబు చేయాలనుకున్న వస్తువునూ లేదా బొమ్మనూ బట్టి బోలెడు రకాల స్ప్రే పెయింట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఓ అందమైన రకం మెటాలిక్‌ పెయింట్లు. అంటే బంగారు, వెండి, రాగి, కంచు, ఇత్తడి రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయివి. వీటిని ఇంటి అలంకరణ సామగ్రి కోసం బాగా వాడతారు. పాత ఫొటో ఫ్రేమును కొత్తగా చేసుకునేందుకూ, ఓ సాధారణ బొమ్మను బంగారు రంగుతో ఖరీదైన దానిలా కన్పించేలా చేసేందుకూ, పెబుల్‌ డెకరేషన్‌ కోసం రకరకాల రాళ్లకు అద్దేందుకూ వీటిని వాడతారు. వీటిలోనే కాస్త పాత లోహంలా కనిపించేలా చేసే ఆక్సిడైజ్డ్‌ మెటల్‌, యాంటిక్‌ మెటల్‌ లాంటి రంగులవీ దొరుకుతున్నాయి. మిర్రర్‌కోట్‌ పేరుతో వచ్చే పెయింట్లయితే వేసిన వస్తువుల్ని అచ్చం అద్దంలా తళుక్కున మెరిసేలా చేస్తాయి. ఇక స్టోన్‌ స్ప్రే పెయింట్లు మనం రంగు వేసిన వస్తువు రాయితో చేసిందేమో అనిపించేలా చేస్తాయి. వీటిలోనూ వర్ణాల తేడాలుంటున్నాయి. ఇవి కాక నలుపూ, తెలుపూ, పసుపూ, ఎరుపూ ఇలా అన్ని సాధారణ రంగులూ స్ప్రే క్యాన్ల రూపంలో దొరుకుతున్నాయి. ఎనామిల్‌ స్ప్రే పెయింట్లయితే దుద్దులూ, గొలుసుల్లాంటి వాటికి కొత్త లుక్‌ తీసుకొస్తాయి.

ఇక, సోఫాలూ, ఇతర గుడ్డతో కుట్టిన కుషన్లతో ఉన్న కుర్చీల్లాంటి వాటికి ఫ్యాబ్రిక్‌ స్ప్రే పెయింట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మనింట్లో రంగు వెలిసి పాతబడిపోయిన ఈ సీట్లన్నింటికీ ముదురు రంగులు వేసి మళ్లీ కొత్తగా కనిపించేలా చేయొచ్చు. ఇవే కాదు, ఈ రకం పెయింట్‌ను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో నెట్లో బోలెడు ఐడియాలూ, యూట్యూబ్‌ వీడియోలూ ఉన్నాయి. ఇక, మీరూ మీ ఇంట్లోని వస్తువులన్నింటినీ కొత్తగా మార్చేయొచ్చన్న మాట!


 

మూడు రంగులూ ఒకేసారి

  కేకులూ కప్‌కేకుల మీద ఐసింగ్‌ కోసం కోన్‌ను వాడడం మనకు తెలిసిందే. అయితే అలా వేసేప్పుడు ఒకసారి కేవలం ఒక రంగును మాత్రమే అద్దడానికి వీలుంటుంది. కానీ ‘కలర్‌ స్విర్ల్‌ త్రీ కలర్‌ కప్లర్‌’ సాయంతో మూడు రంగులూ ఒకేసారి అందంగా బయటికి వచ్చేట్టు చేస్తుంది. దీని నాజిల్‌ దగ్గర మూడు విడి భాగాలుంటాయి. వెనుక భాగంలో ఉండే కప్పులాంటి దానికి మూడు రంధ్రాలుంటాయి. ఒక్కొక్క దాంట్లో కోన్‌ ముందు భాగాన్ని దూర్చి దాన్ని పట్టి ఉంచేలా ఉండే మరో వరుస ప్లాస్టిక్‌ మూతను బిగించాలి. తరువాత క్రీమ్‌ బయటికి వచ్చే నాజిల్‌ భాగాన్ని జత చేస్తే దానికీ విడివిడిగా మూడు రంధ్రాలుంటాయి కనుక, బయటికి వచ్చే క్రీం మూడు విడి రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. చూసిన ఎవరైనా దీన్ని ఎలా ఐసింగ్‌ చేశారబ్బా అని ఆశ్చర్యపోవాల్సిందే మరి!


సులభంగా వండేద్దాం!

ఒకేసారి ఒకే గిన్నెలో రెండు రకాల కూరలు వండేయగలిగితే ఎంత బాగుంటుంది. ఈ రెండిటితో పాటూ అదే గిన్నెలో ఓ పక్క నాలుగు చిలగడదుంప ముక్కలూ ఉడికిపోతే ఇంకెంత బాగుంటుంది. ఇక అలా వండిన వంటలు సాయంకాలం మనం బయటికెళ్లి వచ్చేసరికి వేడివేడిగా సిద్ధమై ఉంటే అంతకన్నా ఏం కావాలి. ఇలాంటి అవకాశాన్ని మనకిస్తున్నాయి క్రాక్‌పాట్‌ స్లో కుక్కర్‌ డబుల్‌ డిప్పర్‌, ట్రిపుల్‌ డిప్పర్లు. స్లో కుక్కర్‌లుగా పిలిచే వీటి లోపల ఉండే గిన్నెలు రెండు లేదా మూడు భాగాలుగా ఉంటాయి. ఇవి ప్రెజర్‌, ఎలక్ట్రానిక్‌ కుక్కర్లకు భిన్నమైనవి. పింగాణీ లేదా రాయితో చేసిన గిన్నెలు కరెంటు ద్వారా వేడెక్కి వంటను పూర్తిచేస్తాయి. ఈ పద్ధతిలో పదార్థాలు ఉడికేందుకు కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. అందువల్ల మనం ఎక్కడికైనా వెళ్లొచ్చేలోపు వంట సిద్ధంగా ఉంటుంది. వండే పదార్థాలను బట్టి ఉష్ణోగ్రతను మనమే ఎంచుకోవచ్చు. మాంసంలాంటివి ఉడికించుకునేందుకు ఇవి బాగుంటాయి. వంటకాలను చాలాసేపు వేడిగా ఉంచడం వీటి ప్రత్యేకత.


ఇది స్టవ్‌ గ్రిల్‌