close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌ పూజా సమర్పయామి

ఆన్‌లైన్‌ పూజా సమర్పయామి

  ‘పండగ దగ్గరకొచ్చేస్తోంది. ఇంట్లో పూజ చేయించడానికి ఇంతవరకూ పురోహితుడే దొరకలేదు. పూజకు ఇరవై రకాలకు పైగా సామగ్రి కావాలి. వాటికోసం ఎన్ని షాపులకు తిరగాలో... ఏం అర్థం కావడంలేదు...’ ఇక, ఇలా టెన్షన్‌ పడే అవసరమే లేదు. ఎందుకంటే, పురోహితులూ పూజావస్తువుల దగ్గర్నుంచి ప్రముఖ ఆలయాల ప్రసాదాల వరకూ ఇప్పుడన్నీ ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో ఇంటికొచ్చేస్తున్నాయి మరి.
కొత్తగా పెళ్లి చేసుకుని నగరానికి వచ్చిన గణేష్‌ అతని భార్యా దసరా సందర్భంగా ఇంట్లో చండీహోమం చేయించాలనుకున్నారు. కానీ నగరంలో పురోహితుడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు. పూజకు అవసరమైన రకరకాల సామగ్రి కోసం ఎక్కడికెళ్లాలో తెలియదు. అసలే భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీ బిజీ. అలాంటి వారికి ఆలయాల చుట్టూ తిరిగి హోమం చేసేందుకు పురోహితుడిని పట్టుకోవడమూ షాపుల చుట్టూ తిరిగి అవసరమైన సామగ్రిని తేవడమూ ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లోనూ చాలామందికి ఎదురయ్యే సమస్యే ఇది. కానీ అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ఈ హైటెక్‌ కాలంలో పూజలు చేసేందుకు ఇంత ఇబ్బందిపడితే ఎలా... అందుకే, పండుగల సమయాల్లో చేసే పూజలూ వ్రతాలతో పాటు, పెళ్లి, గృహప్రవేశం... లాంటి సంప్రదాయ వేడుకల కోసం పురోహితులతో పాటు పూజా సామగ్రి, పూజలకు సంబంధించిన మరెన్నో సేవల్ని ఆన్‌లైన్‌ద్వారా అందించే స్టార్టప్‌లు చాలానే వస్తున్నాయి. పూజలు.కామ్‌, మైపండిత్‌జీ.కామ్‌, ఆన్‌లైన్‌పురోహిత్‌.కామ్‌ లాంటి వెబ్‌సైట్‌లు ఇలాంటివే.

చిటికెలో ఏర్పాట్లు
దసరా, దీపావళి, వరలక్ష్మీ వ్రతం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, పెళ్లి, నామకరణం, బారసాల... ఏ పూజ అయినా ఎలాంటి వేడుకైనా వినియోగదారులు తాము చేయించుకోవాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకుంటే చాలు. సంబంధిత పురోహితుడ్ని పూజకు అవసరమైన సామగ్రితో సహా ఆ సమయానికి అక్కడికి పంపుతాయి ఆయా కంపెనీలు. ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా ఈ వెబ్‌సైట్‌ల్లోని పండితులను సంప్రదించవచ్చు. కాబట్టి, మనం అడుగు బయట పెట్టకుండా, హడావుడి లేకుండా, పూజలూ హోమాలకు కూడా ఏర్పాట్లన్నీ చేసేసుకోవచ్చు.

‘నగరాల్లోని వారికి పురోహితుల్ని సంప్రదించడమూ పూజా సామగ్రి కొనుక్కోవడమూ కాస్త కష్టమైన పనే. పూజలు చెయ్యడానికి వెళ్లినపుడు చాలామంది నాతో ఈ సమస్యల గురించి ప్రస్తావించేవారు. అప్పుడే ఆన్‌లైన్‌లో పురోహితులు దొరికే సౌలభ్యం ఉంటే బాగుంటుందనిపించింది. అలా ప్రారంభమైందే పూజలు.కామ్‌ వెబ్‌సైట్‌. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా పురోహితుల కోసం మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారికోసం స్థానికంగా ఉండే మా పురోహితుల్ని పంపిస్తాం. కావాలంటే పురోహితులే పూజకు అవసరమైన సామగ్రి మొత్తాన్ని తీసుకెళ్తారు’ అంటారు పూజలు.కామ్‌ వ్యవస్థాపకుడు రవికుమార్‌ శర్మ. ఈ కంపెనీ విదేశాల్లో ఉండేవారికి వీడియోచాట్‌ ద్వారా కూడా పూజలు చేయిస్తోంది. అంటే ఎవరైనా అక్కడ పూజ చేయించాలంటే ముహూర్తాన్ని నిర్ణయించి పూజకు అవసరమైన వస్తువుల గురించి ఇక్కణ్నుంచే ఆన్‌లైన్‌లో చెబుతారు. వారు అక్కడ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక వీడియో చాట్‌ ద్వారా మంత్రాలు చదువుతూ అక్కడున్నవారితో పూజలు చేయిస్తారు. మిగిలిన వెబ్‌సైట్‌లు కూడా కొన్ని ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ప్రసాదం
ఈపూజా.కో.ఇన్‌ అయితే, ఇంటిదగ్గరుండే మన దేశంలోని 3,600 ఆలయాల్లో ఎక్కడైనా మన పేరున హోమాలు జరిపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి, ఆ సీడీనీ ప్రసాదాన్ని వారికి పంపిస్తారట.

తెలిసిన పురోహితులు ఉన్నారు, వస్తారు... లేదా చిన్న చిన్న వ్రతాలు పుస్తకం చదివి మనమే చేసుకుంటాం... అనుకున్నా... కొన్నిటికి 20 రకాలకు పైగా పూజా సామగ్రి అవసరం అవుతుంది. అన్నీ ఒకే షాపులో దొరకడమూ కష్టమే. అందుకే, ఆ ఇబ్బంది కూడా లేకుండా పూజలూ వ్రతాలకు సంబంధించిన అన్నిరకాల వస్తువులూ ఒకే చోట దొరికే సైట్‌లూ చాలానే ఉన్నాయి. పూజా ద్రవ్యం18.కామ్‌, డివైన్‌ స్టోర్‌, ఈ పూజాస్టోర్‌.కామ్‌, శుభ్‌ పూజా.కామ్‌ లాంటివి ఆ కోవకు చెందినవే. వీటిలో ప్రధాన పండుగలూ వేడుకలకు అవసరమైన సామగ్రి అంతా దొరుకుతుంది. మన దగ్గర సామగ్రి లిస్టు ఉంటే అవసరమైన వాటిని ఎంచుకుని తీసుకోవచ్చు. లేదంటే వరలక్ష్మీ వ్రతం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, నవరాత్రి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం, పెళ్లి, వాహనపూజ... ఇలా దేనికి దానికే సామగ్రి ఓ కిట్‌లా దొరుకుతుంది. ఆ కిట్‌ను ఆర్డరిస్తే అన్నీ వచ్చేస్తాయి.

ఇలాంటి వస్తువుల్నే కాదు, దేవుడి ప్రసాదాన్ని కూడా ఆన్‌లైన్‌లో తెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఆన్‌లైన్‌ ప్రసాద్‌.కామ్‌. దీనిద్వారా మనం వెళ్లకుండానే షిరిడీ, తిరుపతి, పూరీ జగన్నాథ్‌ ఆలయం, వైష్ణోదేవి... ఇలా దేశంలోని ఎన్నో ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాన్ని తెప్పించుకోవచ్చు.

ముస్లింలూ సిక్కులూ జైనులకు సేవలందించే వెబ్‌సైట్‌లూ చాలానే ఉన్నాయి. రహత్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ హజ్‌, ఉమ్రా యాత్రలకు అవసరమైన ఉత్పత్తులను అమ్ముతుంటే, సిక్‌ రుమాలాసెంటర్‌.కామ్‌ సిక్కులకు సంబంధించిన ఉత్పత్తుల్ని అమ్ముతోంది.
అదండీ సంగతి... ఈరోజుల్లో వ్రతాలూ హోమాల ఏర్పాట్లు చెయ్యడం కూడా ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్‌ కొన్నంత సులభం అయిపోయింది.


 

పరిశుభ్రతలో వాళ్ల తరువాతే..!

  చెత్తను బుట్టలోనే వేయాలీ, కాలకృత్యాలకు మరుగు దొడ్లనే ఆశ్రయించాలీ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలీ... అని మహారాష్ట్రలోని ‘సింధుదుర్గ్‌’ జిల్లాలో అధికారులు డప్పులు కొట్టీ, హోర్డింగులు పెట్టీ ప్రచారం చేయరు. ఇప్పుడు వాళ్లకా అవసరం లేదు కూడా. ఎందుకంటే అక్కడి ప్రజలకు పరిశుభ్రతే జీవన విధానం. దేశంలో తొలిసారి నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వే’లో ఆ జిల్లాకు తొలిస్థానం దక్కడానికి ఆ నిబద్ధతే కారణం.
‘మన ఇల్లూ, మన వూరూ, మన దేశం’ అన్న ఆలోచన అందరికీ ఉంటే, ‘స్వచ్ఛత’ కోసం కోట్ల రూపాయల ఖర్చుతో పథకాలు పెట్టాల్సిన పని లేదు. సింధుదుర్గ్‌ ప్రజలు అలానే ఆలోచిస్తారు. ఎవరికి వాళ్లు పరిశుభ్రతను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. పథకాలూ, ప్రభుత్వాలకూ అతీతంగా పదిహేనేళ్ల క్రితమే ఆ జిల్లాలో స్వచ్ఛ ఉద్యమం మొదలైంది. ఎప్పటికప్పుడు స్థానిక పాలక సంస్థలు పారిశుద్ధ్య విధానాలను మార్చుకుంటూ గ్రామాలనూ, పట్టణాలను స్వచ్ఛ బాట పట్టిస్తూ వచ్చాయి. అవన్నీ సరైన ఫలితాల్నే రాబట్టాయి. ఇప్పుడక్కడ మరుగుదొడ్లు లేని ఇళ్లూ, రోడ్ల మీద చెత్తా చెదారం, వీధుల్లో పందులూ, పశువుల గుంపులూ, నిర్వహణ లేని డ్రైనేజీ వ్యవస్థలూ లాంటి మురికి వాతావరణానికి చోటులేదు. గుళ్లూ, బళ్లూ, వీధులూ, గ్రామాలన్నీ పరిశుభ్రతకు పట్టుగొమ్మల్లా కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వమూ ఆ విషయాన్ని గుర్తించింది. అందుకే ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేలో మైదానాల ప్రాంతాల్లో ఆ జిల్లాకు తొలి స్థానాన్ని కల్పించింది. కొండ ప్రాంతాల్లో చాలా కాలంగా పరిశుభ్రతకు పెట్టింది పేరులా మారిన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మాండ్యాదే మొదటి స్థానం.

చెత్తతో రోడ్లు
పట్టణాల్లో సాధారణంగా చెత్తను తడీ, పొడీ అంటూ రెండు రకాలుగా విభజిస్తారు. కానీ సింధుదుర్గ్‌ వాసులు మాత్రం తడీ, పొడీ, ప్లాస్టిక్‌, ఇనుము, అట్టపెట్టెలూ, పాతబట్టలూ అంటూ పదకొండు రకాలుగా చెత్తను వేరు చేస్తారు. ఆ చెత్తనూ వృథా పోనివ్వరు. తడి చెత్తనంతా సేకరించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎరువుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్లాస్టిక్‌తో పాటు ఇతర చెత్తను రీసైక్లింగ్‌ కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ రోడ్ల నిర్మాణాలన్నీ దాదాపు అలా పునర్వినియోగంలోకి తీసుకొచ్చిన వ్యర్థాలతోనే సాగుతాయి. వ్యర్థాలకు వాణిజ్య విలువ కల్పించడంతో ప్రజలతో పాటు వ్యాపారులూ లాభపడుతున్నారు. ప్లాస్టిక్‌ సంచుల వాడకం పూర్తిగా నిషిద్ధం.

ఈమధ్యే సింధుదుర్గ్‌ వంద శాతం బహిరంగ మలమూత్ర రహిత జిల్లాగానూ గుర్తింపు సాధించింది. బెదిరించో, భయపెట్టో కాదు, ప్రజల్లో అవగాహన పెంచడంతోనే ఆ విజయం సాధ్యమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పూచీకత్తు లేకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి రుణాలందిస్తున్నాయి. కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్న ఇంట్లోని పిల్లల పేర్లతో పాటు, అవి లేని ఇళ్ల నుంచి వచ్చిన పిల్లల పేర్లనూ స్కూల్‌ నోటీసు బోర్డుల్లో చేరుస్తారు. దాంతో పిల్లలే తల్లిదండ్రులపైన ఒత్తిడి పెంచుతారన్నది అధికారుల ఆలోచన. ప్రతి ఇంటి బయటా స్టిక్కర్లు అంటించి మరుగుదొడ్లు లేని ఇళ్లూ, ఉన్నా వాడని ఇళ్లూ, మరుగుదొడ్లని సద్వినియోగం చేసుకునే ఇళ్లను వాటి ఆధారంగా వేరు చేస్తారు. మరుగుదొడ్లను బయోగ్యాస్‌ ప్లాంట్లకు అనుసంధానిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ గ్యాస్‌నే ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు.

వాహనాలకు జీపీఎస్‌
ఆరు బయట కాలకృత్యాలు తీర్చుకునేవాళ్లకు పిల్లలతో గులాబీలు ఇప్పించడం, వాళ్ల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో పెట్టడం, అప్పటికీ మాట వినని వాళ్ల పేర్లను కరపత్రాల్లో ముద్రించి పంపిణీ చేయడం, వాళ్ల ఇళ్ల బయట డప్పులు కొట్టించడం... ఇలా గతంలో రకరకాల మార్గాల్లో మాట వినని వాళ్లను దారిలోకి తెచ్చి, ఇప్పుడు మొత్తం జిల్లానే వంద శాతం బహిరంగ విసర్జన రహితంగా మార్చారు. పందుల్నీ, గేదెల్నీ విచ్చలవిడిగా రోడ్ల మీదకు వదిలితే యజమానులకు జరిమానా పడుతుంది. హోటళ్లలో మిగిలిన ఆహార పదార్థాల్ని వృథా పోనీయకుండా పందుల పెంపకం దార్లకు చేరవేయాలన్న నిబంధనా ఉంది. చెత్తను సేకరించే వాహనాలకు జీపీఎస్‌ పరకరాల్ని అమర్చి, అవి అన్ని ప్రాంతాలకూ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.