close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీవనయానం

జీవనయానం
- మొక్కపాటి శ్యామల

ఎంత వద్దనుకున్నా శేఖర్‌కి నిన్నటి సంఘటన మనసులో పదేపదే తొలిచేస్తోంది. తన ఏకైక సంతానం, తన ప్రాణానికి ప్రాణం అయిన లహరి తను ప్రేమించిన తరుణ్‌ని పెళ్ళి చేసుకుంటానని కోరింది. తన కూతురు అందరాడపిల్లల్లాగా అందానికీ ఆస్తికీ ఆధునికత్వానికీ ఆకర్షితురాలయ్యే రకంకాదని తనకు గట్టి నమ్మకం.
అందుకే కూతురు చెప్పిన అడ్రస్‌ ప్రకారం వాళ్ళింటికెళ్ళాడు. వాళ్ళతో పరిచయం చేసుకుని, వాళ్ళని తనింటికి ఆహ్వానించాలని సతీసమేతంగానే వెళ్ళాడు.
తరుణ్‌ వాళ్ళ తాతగారు వీధిలోనే ఎదురయ్యారు. ఇంటినిండా చిన్నా పెద్దా చాలామంది కనిపిస్తున్నారు. చుట్టాలు కాబోలు చాలామంది ఉన్నారు.
రెండుమూడు సంవత్సరాలక్రితం అయితే, అలాంటి వాతావరణం తనకి చాలా చికాకు. అందుకే తను చుట్టాలకి దూరంగా పారిపోతూ వచ్చాడు. కానీ ఈమధ్యన ఎందుకో ఈ జీవితం కూడా నచ్చట్లేదు, అలాగని కొత్తచోటుకు పారిపోవాలన్నంత ఉత్సాహమూ లేదు. ఈ అసంతృప్తీ, జీవితం పట్ల నిర్లిప్తతా ఎందుకేర్పడ్డాయో అర్థంకావట్లేదు. సర్లే ఈ వాతావరణం కూడా ఏదో మనసుకు కొంత మార్పుగా ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
తరుణ్‌ వాళ్ళ బాబాయిగారింట్లో ఉంటున్నాడు. తల్లీ తండ్రీ, తమ్ముడూ చెల్లెలూ అంతా వైజాగ్‌లో ఉంటారు. తరుణ్‌వాళ్ళ తాతగారూ, నాయనమ్మా, బాబాయిలూ, మేనత్తలూ... అందరూ ఆ చుట్టుపక్కల వూళ్ళలో కొందరూ వైజాగ్‌లోనే కొందరూ ఉంటారట. తరుణ్‌వాళ్ళ బాబాయి ఒక్కడే బెంగుళూరులో ఉంటాడు. ఈయన కూడా ప్రతి పండగకీ, శుభకార్యాలకీ వైజాగ్‌ వెళ్ళిపోతుంటాడు. తరుణ్‌కి చదువైపోయిన వెంటనే బాబాయి దగ్గరకొచ్చేశాడు. ఇక్కడే ఏవో కోచింగ్‌ క్లాసులలో జాయినై, ఉద్యోగం సంపాదించుకున్నాడు. అలా కోచింగ్‌ క్లాసులలోనే లహరికి పరిచయమయ్యాడు.
తను అడగకపోయినా తరుణ్‌వాళ్ళ తాతగారు వాళ్ళ కుటుంబం గురించి కథలాగా చెప్తుంటే, ఆసక్తి లేకపోయినా తప్పక విన్నాడు శేఖర్‌.
‘‘కాఫీ తీసుకోండి మామయ్యగారూ!’’ అంటూ తరుణ్‌వాళ్ళ పిన్ని హాల్లోకి రావటంతో తాతగారి నోటికి బ్రేక్‌ పడింది.
విచిత్రం ఏమిటంటే, ఇదివరకటిలాగా శేఖర్‌కి అంతమంది జనాల మధ్య విసుగుగా, చికాకుగా అనిపించట్లేదు సరికదా... ‘వాళ్ళందరూ అలా కలిసిమెలిసి అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారా?’ అని ఆశ్చర్యం వేస్తోంది.
కాఫీలూ టిఫిన్లూ పూర్తయ్యాక, ‘‘మీ స్వస్థలం ఎక్కడ?’’ అంటూ మళ్ళీ సంభాషణ ప్రారంభించాడు ముసలాయన.
‘‘మాదీ వైజాగే’’ అన్నాడు శేఖర్‌. వైజాగ్‌లో ఎక్కడ? అని మళ్ళీ ప్రశ్న వేస్తాడేమో, ఏం చెప్పాలో- అని మనసులో ఆలోచించుకుంటూ...
ఎందుకంటే, తరుణ్‌వాళ్ళ కుటుంబంలాగా తన అన్నయ్యా, చెల్లెళ్ళూ కూడా వైజాగ్‌లో ఉన్నా, తను వాళ్ళందరికీ దూరంగా వచ్చేసి చాలా సంవత్సరాలైంది. అక్క చనిపోయినప్పుడు కూడా తను వెళ్ళనేలేదు.
కానీ, తను సమాధానం చెప్పే అవసరం లేకుండా ముసలాయనకి ఫోన్‌ వచ్చింది.
ఆయన ఫోన్‌లో మాట్లాడి, ‘‘చిన్నదాని కొడుక్కి ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉందట, రాత్రికి బయలుదేరివస్తున్నాడట’’ అని చెప్పారు తరుణ్‌ బాబాయికి.
అక్కడే ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు ‘‘హాయ్‌, తేజా కూడా వస్తున్నాడు’’ అంటూ ఆనందంగా అరిచారు.
‘‘పోన్లే వాడికి కూడా ఇక్కడే ఉద్యోగం వస్తే సరదాగా అందరం ఇక్కడే ఉంటాం’’ అంటున్న తరుణ్‌వాళ్ళ బాబాయి ముఖంలోకి పరీక్షగా చూశాడు శేఖర్‌. ఆయన నిజంగానే అంటున్నాడా, తప్పక ఫార్మాలిటీగా అంటున్నాడా చూద్దామని.
నిజాయతీగానే ఉంది ఆయన చూపు. ఆయన భార్య కూడా ‘‘మా పిల్లలకి తరుణ్‌, తేజా ఇద్దరూ తోడుంటారు ఫర్వాలేదు. ఇక వాళ్ళ చదువు గురించి నాకు బెంగ ఉండదు’’ అంటోంది.
తనకు ఆశ్చర్యం వేసింది. ‘వీళ్ళు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఉద్యోగాలూ, సంపాదనా నాకన్నా పెద్దవేమీ కాదు. ఈ సంతృప్తీ, సంతోషం ఎలా సాధ్యం’ అని ఆలోచిస్తూనే, వాళ్ళని తన ఇంటికి ఆహ్వానించి, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు.
తిరుగు ప్రయాణంలో పరధ్యానంగా కారు నడుపుతున్న శేఖర్‌ని చూసి ‘‘ఏమిటాలోచిస్తున్నారు? లహరి ఈ కుటుంబంలో కలవగలదా లేదా అనేనా?’’ అంది భార్య పద్మ.
‘‘ఔను’’ అంటూ అప్పటికేదో తోచిన సమాధానం చెప్పాడుగానీ, నిజానికి శేఖర్‌ మనసు మాత్రం, ఇంత సంపాదించినా తనకులేని ఆనందం, ధైర్యం వాళ్ళకెలా వచ్చాయి?’ అని ఆలోచిస్తూనే ఉంది.
ఆఫీసులో యాంత్రికంగా పనిచేస్తున్నాడుగానీ, శేఖర్‌ మనసు మాత్రం దశాబ్దాల వెనక్కివెళ్ళి ఆలోచిస్తోంది.

తండ్రికి ఇద్దరన్నయ్యలూ నలుగురు అక్కలూ ముగ్గురు చెల్లెళ్ళూ ఉండేవారు. తన చిన్నతనంలో తమ ఇల్లు కూడా ఇంటినిండా చుట్టాలతో గందరగోళంగా ఉండేది. చిన్నప్పటినుంచీ తనకి- అందరికన్నా తన కుటుంబమే గొప్పగా ఉండాలనీ, అందరికన్నా చదువులో తనే ముందుండాలనీ చాలా పట్టుదల ఉండేది. పెదనాన్నలూ మేనత్తలూ వీళ్ళందరి పిల్లలకన్నా తనే గొప్పగా ఉండాలనీ వాళ్ళెవరూ వూహించుకోలేనంత ఉన్నత స్థితిలో ఉండాలనీ కోరికగా ఉండేది. అందరితో కలిసిమెలిసి ఉంటే, తన కోరిక నెరవేరదేమోననే భయం, బంధువుల మీద ద్వేషంగా, చిన్నచూపుగా మారింది.

అనుకున్నట్లుగానే ఉద్యోగం వచ్చాక కొంతకాలం సాఫీగానే ఉన్నాడు కానీ, పెళ్ళయి కూతురు పుట్టాక తన పోటీ అన్నయ్యతో కూడా మొదలయింది. అన్నయ్యకి బంధుప్రీతి ఎక్కువ. దూరం చుట్టాలను అందరినీ పలకరిస్తూ అవసరమైతే తోచిన సాయం చేస్తూ ఉండేవాడు. అందుకే కొన్నాళ్ళకి తను అన్నయ్యని కూడా విడిచిపెట్టి బెంగుళూరులో ఉండటం మొదలుపెట్టాడు. కూతురు చిన్నపిల్లగా ఉండగా పండగలకీ శుభకార్యాలకీ అప్పుడప్పుడూ అన్నయ్య దగ్గరకీ అక్కయ్య దగ్గరకీ వెళ్ళేవాడు. కానీ కూతురు పెద్దదై హైస్కూలు, కాలేజీ చదువుకి వచ్చేసరికి అది కూడా తగ్గించేశాడు. చుట్టాలందరిలో తనే గొప్పగా ఉండాలనీ తన కూతురు మిగిలినవాళ్ళందరి పిల్లలలాగా కాకుండా ప్రత్యేకంగా పెరగాలనీ, అందరికన్నా బాగా చదువుకోవాలనీ తెగ ఆరాటం ఉండేది. అందరితో కలిస్తే అది సాధ్యపడదేమోనని చుట్టాలకీ చివరికి తన కుటుంబసభ్యులకీ కూడా దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ ఆరాటం, జీవనపోరాటం తననెప్పుడూ ప్రథమ స్థానంలోనే నిలబెట్టడంవల్ల తనెప్పుడూ మిగిలినవాళ్ళ గురించి ఆలోచించలేదు.తన కూతురికి- తనూ, పద్మా తప్ప ఇంకెవ్వరూ తెలియరు. పరిచయం కూడా చేయలేదు తను. అలాంటిదాన్ని తరుణ్‌ వాళ్ళ కుటుంబంలో ఇస్తే- అది అక్కడ ఎలా బతకగలదు? అలాగని ‘వద్దు, ఈ సంబంధం మానుకో’ అని చెబుదామంటే, చిన్నప్పటినుంచీ అది అడిగినదేదీ కాదనలేదు తను. ఇంత గారాబంగా, ఆధునిక భావాలతో పెంచి, ఇప్పుడు అది కోరిన ఒక్క కోరిక కాదనటానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎలా, ఏం చేయాలి? తను పొరపాటు చేశాడా? తను చేసిన పొరపాటు తన కూతురు జీవితానికి శాపం అవుతుందా? అందరికన్నా ప్రత్యేకంగా, గొప్పగా ఉండాలనే ఆరాటంలో కూతురికి కష్టాలు కొనితెస్తున్నాడా తను? లహరి కోరిక ప్రకారం పెళ్ళి చేస్తే అది వాళ్ళలో కలవలేక ఇబ్బందిపడుతున్నా తను చూడలేడు. చేసుకున్న తరవాత అభిప్రాయభేదాలతో విడిపోయినా తను భరించలేడు. పోనీ, ఈ సంబంధం కలుపుకోవటం విషయం పక్కన పెట్టేసినా, తను అనుకున్నట్లుగానే తను ఉద్యోగ జీవితంలో మొదట్నుంచీ అందరికన్నా ముందే ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉంటున్నాడు. కూతుర్ని కూడా అలాగే పెంచాడు. ఎప్పుడైనా చుట్టాల ఇళ్ళకు వెళ్ళినా ‘వాళ్ళ పిల్లలకన్నా తన కూతురు ప్రత్యేకంగా ఉంది, అన్ని విషయాల్లో ముందుంది’ అనుకుని ఆనందించేవాడు. అసలు వెళ్ళటమే తక్కువ. తప్పనిసరై వెళ్ళాల్సివచ్చినా పద్మో, తనో ఇద్దరిలో ఒకళ్ళు కూతురి కోసం ఉండిపోయి, ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు. తను కోరుకున్నట్లుగానే అన్నీ సాధించినా, రెండుమూడు సంవత్సరాలనుంచీ ఎందుకో జీవితం నిస్సారంగా అనిపిస్తోంది. కూతురికి ఉద్యోగం వచ్చిన ఈ సంవత్సరం నుంచీ మరీ నిస్సారంగా అనిపిస్తోంది. నిన్న వాళ్ళ కుటుంబాన్ని చూశాక ఆ అశాంతి ఇంకా పెరిగింది.

‘‘మాకు వైజాగ్‌లో పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా, మేమందరం ఉద్యోగాలకి తలా ఒకచోటుకి పోయినా, మా నాన్నగారు వైజాగ్‌ విడిచి రారు. ఎప్పటికైనా మేమందరం అక్కడికే చేరాలట’’ అన్న తరుణ్‌వాళ్ళ బాబాయి మాటలూ, దానికి సమాధానంగా ‘‘ఔను బాబూ! నోరులేని పక్షులు కూడా ఉదయాన్నే ఎక్కడెక్కడికో పోతాయి. ఎంతదూరం పోయినా, సాయంత్రమయ్యేసరికి అదే గూటికి చేరుకుంటాయి. గుంపులు గుంపులుగానే పోతాయిగానీ, ఒంటరిగా ఉండాలని కోరుకోవు. నోరులేని వాటికి కూడా సొంతగూటిమీదా, జాతిమీదా అంత మమకారం ఉంటే మనకి ఉండటంలో తప్పులేదుగా! అయినా, ఆస్తి ఉంటేనే సొంత వూరిమీద మమకారం ఉంటుందా? నువ్వు బాగుపడితే చూసి సంతోషించేదీ... చెడిపోతే బాధపడేదీ నీ కుటుంబసభ్యులూ, తరవాత నిన్ను చిన్నప్పటినుంచీ ఎరిగిన నీ వూరివాళ్ళే కదా!’’ అన్న తరుణ్‌ తాతగారి మాటలూ, శేఖర్‌కి సినిమాల్లోలాగా పదేపదే గుర్తుకువస్తున్నాయి.

‘‘నాన్నా, నీకు ఇష్టంలేకపోతే తరుణ్‌ని పెళ్ళి చేసుకోను. తరుణ్‌ కూడా నాలాగే అర్థంచేసుకోగలడు. ఫరవాలేదు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించకండి’’ అంది లహరి తరుణ్‌ వాళ్ళింటినుంచి వచ్చిన దగ్గరనుంచీ పరధ్యానంగా ఉంటున్న తండ్రిని భోజనాల దగ్గర పలకరిస్తూ.

‘‘నాకు తెలుసురా, నువ్వు నాకన్నా బాగా ఆలోచించగలవని. దాని గురించి నేను అంతగా ఆలోచించట్లేదుకానీ, ఎందుకో నాకు ఈమధ్య ఏ విషయంలోనూ ఉత్సాహం ఉండట్లేదు. ఏదో తెలియని బాధా, నిర్లిప్తతా చోటుచేసుకుంది. తరుణ్‌వాళ్ళ కుటుంబం అరమరికలు లేకుండా తామే అధికంగా ఉండాలనే ఆరాటంలేకుండా, అందరూ కలిసి ఆనందంగా ఉండడం చూసిన దగ్గరనుంచీ, నేనేదో కోల్పోయినట్లుగా అనిపిస్తోందిరా!’’ అని తన మనసులో ఉన్న ఆవేదన అంతా కూతురికి చెప్పుకుని, కొంత ఉపశమనం పొందాడు శేఖర్‌.

కుర్చీ దగ్గరగా లాక్కుని తండ్రి చేతిమీద చేయివేసి, చిన్నపిల్లలని అనునయిస్తున్నట్లుగా ‘‘నాన్నా, నీకొక విషయం చెప్పనా?’’ అంది లహరి.

‘‘జీవితాన్ని ఆస్వాదించాలి, ఆ అనుభూతులను జీవితాంతం పదిలపరుచుకోవాలి. అంతేగానీ, పరుగుపందెంలాగా గెలుపే ధ్యేయంగా పరుగెత్తకూడదు. అందరికన్నా మనమే గొప్పగా ఉండాలీ, అన్ని విషయాల్లోనూ మనమే ముందుండాలీ అనే ఆరాటానికి అంతెక్కడుంటుంది చెప్పు. తరుణ్‌తో పరిచయమయ్యాకే నా ఆలోచనలలో మార్పు వచ్చింది. ఎన్నో కొత్తకొత్త విషయాలు అర్థమయ్యాయి. చూడకపోయినా- వాళ్ళ కుటుంబసభ్యుల గురించీ వాళ్ళ మధ్యన ఉండే ఆత్మీయతా, అనుబంధాల గురించీ, తరుణ్‌ చెబుతుంటే విని అర్థంచేసుకున్నాను. చిన్నప్పటినుంచీ నా చదువూ, క్లాసులో ఫస్ట్‌ రావటం, దానికోసం ఆరాటం... ఇవి తప్ప ఇంకో విషయాలు తెలియని నేను, తరుణ్‌తో పరిచయమయ్యేదాకా - జీవితమంటే అంతే అనుకున్నాను. కానీ, తరుణ్‌తో మాట్లాడుతుంటే కుటుంబమంటే ఏమిటో, ఎలా ఉండాలో అర్థమైంది. ఇప్పటివరకూ ఎలా గడిచినా, ఇకముందునుంచీ అలాంటి కుటుంబంతో గడపాలనీ వాళ్ళలాగా ప్రశాంతంగా జీవించాలనీ నిర్ణయించుకున్నా. అందుకే తరుణ్‌ని పెళ్ళి చేసుకుందామనుకున్నా.

ఇప్పటివరకూ మీరు గెలుపే ధ్యేయంగా పరిగెత్తారు తప్ప, జీవితాన్ని జీవించలేదు. ఇప్పుడు మీ మనసు అలసిపోయింది. గుర్తుచేసుకోవటానికీ ఆస్వాదించటానికీ ఆనందించటానికీ మీ మనసులో ఏ అనుభూతులూ లేవు. అంతేకాదు, మీ మనసుకి ముందుకు పోవాలనే ఆరాటమేకానీ ఆస్వాదనా, అనుభూతీ తెలియవు నాన్నా! అదే మీ నిర్లిప్తతకి కారణం. నిన్న తరుణ్‌వాళ్ళ కుటుంబాన్ని చూసేసరికి మీ జీవితంలో మీరేం కోల్పోయారో అవన్నీ అక్కడ కనిపించి మీ మనసు తట్టుకోలేకపోతోంది. అదే మీ అశాంతికి కారణం.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నాన్నా! మిగిలిన ప్రయాణాన్ని సాఫీగా, ప్రశాంతంగా సాగించండి. అందరితో కలిసి ముందుకు సాగుతూ, మధ్యమధ్యలో ఆగుతూ, అప్పుడప్పుడూ వెనక్కి తిరిగిచూస్తూ, వెనకనున్నవాళ్ళు మనతో కలిశాక, వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంటూ, సాగించే జీవిత ప్రయాణంలో అడుగడుగునా ఆనందం ఉంటుంది. మలుపు మలుపులో మధురానుభూతులు మిగులుతాయి’’ అంటూ ఓదారుస్తున్న కూతుర్ని చెప్పలేనంత ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు శేఖర్‌.

ఎంత ఎదిగింది తన కూతురు. ఎంత చక్కగా ఆలోచిస్తోంది. ఎంత సున్నితంగా తన తప్పు తనకి తెలియజేసింది.

‘‘ఇక నాకు ఏ బెంగా లేదురా! నేను చేసిన పొరపాటుని కూడా సరిదిద్దుకునే సంస్కారం, సమర్థతా నీకున్నాయి. తరుణ్‌తో నీ పెళ్ళి జరిగాక నిశ్చింతగా నేను కూడా తరుణ్‌వాళ్ళ నాన్నగారిలాగా వైజాగ్‌లో స్థిరపడతా. పెదనాన్నా, అన్నయ్యలూ, అక్కయ్యలూ, మీ మేనత్తలూ, వాళ్ళ పిల్లలూ... బోలెడుమంది ఉన్నారు మనకు కూడా, తరుణ్‌వాళ్ళ కుటుంబంలాగా! అసలు నీ పెళ్ళి కూడా అక్కడే చేస్తాను. అక్కడైతే నాకు అందరూ అండగా ఉంటారు’’ అంటూ చిన్నపిల్లాడిలాగా ఉత్సాహంగా చెప్పుకుపోతున్న తండ్రికేసి సంతృప్తిగా చూసింది లహరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.