close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మలగన్న అమ్మ... చాల పెద్దమ్మ!

అమ్మలగన్న అమ్మ... చాల పెద్దమ్మ!

అమ్మను అర్థం చేసుకుంటే ప్రకృతిని అర్థం చేసుకున్నట్టే. ప్రకృతిని అర్థం చేసుకుంటే సకల సృష్టినీ అర్థం చేసుకున్నట్టే. సృష్టిని అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే, స్థూలసృష్టికి సూక్ష్మరూపమే మనం. ఆ సాధనకు దసరా... ఓ ఆసరా!
‘మంచి పిల్లలెప్పుడూ అల్లరి చేయరు, సరేనా...’
సరస్వతిలా హితవు చెబుతుంది.
‘నా తండ్రివి కదూ! చాక్లెట్‌ కొనిస్తా?’
లక్ష్మీదేవిలా తాయిలం ఇస్తుంది.
‘వెధవా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు?’
పార్వతిలా మందలిస్తుంది.
‘వీపు చీరేస్తా, ఏమనుకున్నావో...’
కాళిలా కళ్లెర్రజేస్తుంది.
అదే అమ్మ, అంతే ప్రేమ. సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే మారింది. మందలించినా, హెచ్చరించినా, కర్రపుచ్చుకున్నా - అంతా మమకారంతోనే. ఇంట్లో అమ్మ పోషించే పాత్రనే, సృష్టిలో జగదాంబ పోషిస్తుంది. ప్రతి అవతారం ఆ మాతృతత్వంలో భాగమే.

సకలశక్తులకూ మూలమైన ఆదిశక్తికి భారతీయత స్త్రీరూపం ఇచ్చింది. మహాకాళిగా, శ్రీలక్ష్మిగా, సరస్వతిగా...ఎవరి సంప్రదాయాన్ని బట్టివారు తొమ్మిదిరోజులూ ఉపాసించినా...అంతర్లీన రూపం ఒకటే. అమ్మ ధరించిన అవతారాలూ, అమ్మ కురిపించిన వరాలూ, అమ్మ సంధించిన శరాలూ మానవజాతికి మహత్తర సందేశాలు.

బంగారుతల్లి...పార్వతి!
పరిపూర్ణ స్త్రీత్వమే పార్వతీదేవి. ఓ నాన్న కూతురిగా, ఓ భర్త భార్యగా ఎంత హుందాగా ఎంత ప్రేమగా ఎంత ఆత్మాభిమానంతో నడుచుకోవచ్చో చాటిచెప్పింది. కలికాలం మినహాయిస్తే...ఆడపిల్లని చిన్నచూపు చూసే కుసంస్కారం భరతఖండంలో ఎప్పుడూ లేదు. మహామహా సార్వభౌములూ, గొప్పగొప్ప మహర్షులూ కూడా ఏళ్లకేళ్లు తపస్సుచేసి ‘తల్లీ! మా కడుపున నువ్వు పుట్టాలి. మా ఇంటికి లక్ష్మీకళ తీసుకురావాలి’ అని విన్నవించుకున్నవారే. కాబట్టే...పర్వతరాజు ప్రార్థించగానే పార్వతిగా పుట్టింది, మలయధ్వజుడు బతిమాలుకోగానే మీనాక్షిగా అవతరించింది, భృగువు వేడుకోగానే భార్గవిగా జన్మించింది. ఆ తండ్రి పండితుడా పామరుడా అన్నది ఆలోచించలేదు. సురుడా అసురుడా అన్నది పట్టించుకోలేదు. అభ్యర్థించడమే ఆలస్యం, ఆ దంపతుల కడుపు పండించింది. బోసినవ్వులతో, బుడిబుడి అడుగులతో, అందెల రవళులతో, పట్టు పావడాల రెపరెపలతో ఆ ఇళ్లకు నిండుదనాన్నిచ్చింది. కూతురి గుణగణాల కారణంగా తనకొచ్చిన ప్రఖ్యాతిని తలచుకుని హిమవంతుడు మురిసిపోయాడు. ‘వీరభద్ర విజయం’లో పోతనామాత్యుడు ఎంత గొప్పగా చెప్పాడా మాట...‘గిరులలోన నొక్క గిరినైన నాపేరు వెలయజేసితివిపుడు జలజ నయన...నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన’! ఆడపిల్ల తండ్రి అనిపించుకోవడంలోని ఆనందమూ అదృష్టమూ అంత గొప్పది. శైలపుత్రి కారణంగానే పర్వతరాజుకు ఆ గుర్తింపు! లేకపోతే, అతడు కొండల్లో ఓ కొండ, బండల్లో ఓ బండ! వేయి పేర్లున్నా...గిరిజ, శైలజ అని పిలిస్తేనే పరమేశ్వరి మురిసిపోతుందట. అమ్మానాన్నలు గుర్తించగలగాలి కానీ, ప్రతి ఆడపిల్లలోనూ పార్వతీ అంశ ఉండితీరుతుంది. దక్షుడిలా మనసును గాయపరచనంత కాలం...పుట్టింటి కోసం ఆ హృదయం పరితపిస్తూనే ఉంటుంది.

జీవిత భాగస్వామి ఎంపికలో మగువ లెక్కలేమిటో చక్కగా నిరూపించింది పార్వతి. పుంసా మోహనరూపాయా అన్నంత అందగాడు కాకపోయినా, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే చాలనుకుంటుంది. మణులూ మాన్యాలూ లేకపోయినా, మంచితనాన్నే మహాసంపదగా పరిగణిస్తుంది. శివస్వామితో మనువుకు సిద్ధమైనప్పుడు ఎన్ని విమర్శలొచ్చాయీ?

‘తరళాక్ష! యాతండు ధనవంతుడందమాకోరివేడినగాని గూడు లేదు చిన్నారి! వయసున చిన్నవాడందమా యెన్నటివాడొకో యెరుగరాదు...

డబ్బున్నవాడా అంటే, అదీ కాదు. నాలుగిళ్లు యాచించి పొట్టనింపుకునే ఆదిభిక్షువాయె! వయసులో ఏమైనా కుర్రవాడా అంటే, కానేకాదు. ఎప్పుడో, సృష్టి ఆరంభం నాటికే ఉన్న ముదురు వరుడు - అని వేలెత్తిచూపడం మొదలుపెట్టారు. ఎవరెన్ని మాటలన్నా, శైలజ మనసు మారలేదు. అయినా ఆమె, శివుడి బాహ్యరూపాన్ని చూసి ప్రేమించలేదు. బేసికన్నులున్నాయని బాధపడలేదు. బూడిద పూసుకుంటాడని బెంబేలెత్తిపోలేదు. ఆ బంధం రూపాతీతం, గుణాతీతం! పెనిమిటి మీద ఈగవాలినా భరించలేని ఆ ఇల్లాలే, క్షీరసాగర మథనంలో పెల్లుబికిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించాలంటూ దేవతలు శరణువేడినపుడు... మొహమాటానికైనా వద్దనలేదు. పక్కనే కూర్చుని, పాయసంలా తాగించింది.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్‌
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
అదంతా...భర్త మీద నమ్మకం. భర్త మీద తనకున్న నమ్మకం మీద నమ్మకం! పార్వతి స్వభావాన్ని ఆదర్శంగా తీసుకోగలిగితే ఆలూమగల మధ్య అపోహలూ అగాథాలూ ఉండవు. అతను మాట అయితే, ఆమె అర్థం అవుతుంది!

చదువులమ్మ...వాగ్దేవి!
నవరాత్రుల్లో దుర్గమ్మను సరస్వతిగా అలంకరిస్తారు. శారదాంబ చదువుల రాణి. విజ్ఞతకు అధిదేవత. పలుకుచల్లని తల్లి. కాళిదాసు అమ్మవారి అనుగ్రహంతోనే మహాకవి అయ్యాడు. భోజరాజు ఆస్థానంలోని ముగ్గురు దిగ్గజాల్లో ఒకడై వెలుగొందాడు. ఓసారి, ఆ ముగ్గుర్లోనూ ఎవరు గొప్పన్న వివాదం తలెత్తింది. భోజుడు అందర్నీ కాళికాదేవి ఆలయానికి తీసుకెళ్లాడు. అమ్మవారే తీర్పు చెబుతారన్న విశ్వాసం. ‘కవిర్దండి’ ...కవి అంటే దండే! - అన్న మాట మూలవిరాట్టు లోంచి వినిపించింది. ఆతర్వాత, ‘భవభూతిస్తు పండితః ... పండితుడంటే భవభూతే’ అన్న పలుకూ వెలువడింది. ‘మరి నేనెవర్నే?’ - అసహనంలో నోరుజారాడు కాళిదాసు. అయినా అమ్మ చిన్నబుచ్చుకోలేదు. అజ్ఞానంతోనో, ఆవేశంతోనో బిడ్డ మాటతూలినంత మాత్రాన మాతృమూర్తి కోపగించుకుంటుందా? ‘త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః...నేనే నువ్వు, నువ్వే నేను-నిస్సందేహంగా’ అని జవాబిచ్చింది. అమ్మ ప్రేమ అనంతం! ఆ మాటకు కాళిదాసును కమ్మేసిన అహం మంచులా కరిగిపోయింది.

శారదాదేవి పరిపూర్ణతకు ప్రతీక. ఆమె ఒంటిమీది తెల్లచీర స్వచ్ఛతకు నిదర్శనం, వాహనమైన హంస మంచిచెడుల్ని వేరుచేసి చూడగల వివేకానికి ప్రతీక, వీణ సత్యవాక్కుకు ప్రతినిధి. ఆలోచనకు శబ్దరూపమే మాట. మాట బాగా లేదంటే, ఆలోచనలోనూ ఏదో లోపం ఉన్నట్టు. మూకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడిని ఉద్దేశించి తపస్సు చేశాడు. మృత్యుంజయుడు కావాలన్నది ఆ అసురుడి ఆశ. విషయం దేవతల దాకా వెళ్లింది. ఈ నిమిషమో, మరునిమిషమో వెళ్లిపోయి వరం ఇచ్చినా ఇచ్చేయగలడు బోళాశంకరుడు. అదే జరిగితే ముల్లోకాలు నేలమట్టమైపోవూ! అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. శివుడు ప్రత్యక్షమయ్యే సమయానికి రాక్షసుడికి వాగ్బంధనం చేసింది అమ్మ. అంటే, తన శక్తితో నోట మాటరాని పరిస్థితిని కల్పించింది. ఇంకేముంది, శివుడి ముందు తెల్లమొహం వేశాడు మూకాసురుడు. ఆతర్వాత విషయం తెలుసుకుని, ఆగ్రహంతో అమ్మవారి మీదికి దండెత్తాడు. హోరాహోరీగా యుద్ధం జరిగింది. అమ్మ ముందు, ఎంతటి వీరులైనా అంగుష్ఠమాత్రులే. చేతిలోని త్రిశూలాన్ని అసురుడి గొంతులో దించబోయే సమయానికి, ఆ తల్లిలో మాతృత్వమమకారం పొంగుకొచ్చింది. ‘నేనే కనుక అడ్డుపడకపోయి ఉంటే, ఈ మూర్ఖ బాలకుడు ఇప్పటికే మృత్యుంజయుడు అయ్యేవాడు కదా...’ అని బాధపడిపోయింది. వాక్కు వెనక్కి ఇచ్చి, ‘ఏదైనా వరం కోరుకో బిడ్డా!’ అని తల నిమురుతూ అడిగింది. మాతృస్పర్శకు ఆ కఠినాత్ముడి గుండె కదిలిపోయింది, కరిగిపోయింది. ‘మాట పోయాకే మాట విలువ ఏమిటో తెలిసింది. నోరుంది కదా అని, ఇష్టం వచ్చినట్టు వాగేవాడిని. నా కళ్లు తెరిపించావు తల్లీ!’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదీ వాక్కుకున్న శక్తి! గొంతులోంచి పొంగుకొచ్చే ప్రతి మాటా అమ్మ స్వరూపమే అన్న ఎరుక ఉంటే...అధిక ప్రసంగాలుండవు, అహంభావపూరిత ప్రకటనలుండవు. దుర్గ వేరూ, సరస్వతి వేరూ, లక్ష్మి వేరూ కానేకాదు. మహాశక్తిలోని మూడు కోణాలకు ముగ్గురూ ప్రతినిధులంతే! మూడేమిటి ముక్కోటి రూపాలూ అమ్మవే. ‘ఆమే లక్ష్మి, ఆమే సరస్వతి, ఆమే పార్వతి, ఆమే పరబ్రహ్మ పట్టమహిషి’ అంటారు శంకరులవారు ఓ స్తోత్రంలో.

దుష్ట శిక్షకురాలు...దుర్గమ్మ!
దుర్గతిని దూరం చేస్తుంది కాబట్టి దుర్గ అన్న పేరొచ్చింది. దు...తో మొదలయ్యే అవరోధాలన్నీ ఆమె పేరు చెప్పినా దూరమైపోతాయట - దురాశ, దుఃఖం, దురహంకారం, దుర్బుద్ధి ఇలా! ఆ జాడ్యాలన్నీ తొలగిపోతే మనిషి దుర్గంలా అభేద్యుడై నిలుస్తాడు. దుర్గముడనే రాక్షసుడిని సంహరించడం వల్ల కూడా ఆ పేరు స్థిరపడింది. నవరాత్రుల్లో దుర్గమ్మను శాకంబరిగా అలంకరిస్తారు. రకరకాల కూరగాయల్ని హారాల్లా వేస్తారు. దీనివెనకో ఐతిహ్యం ఉంది. పూర్వం దుర్గముడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షంకాగానే ‘వేదాలన్నీ నాలో కలసిపోవాలి’ అని వేడుకున్నాడు. చతుర్ముఖుడు సరేనన్నాడు. అంతే, నాలుగు వేదాలూ మాయమైపోయాయి. వేదం లేదంటే...యజ్ఞాల్లేవు. యజ్ఞం లేదంటే వర్షాల్లేవు. దీంతో కరవు ఏర్పడింది. పంటలు ఎండిపోయాయి. చెట్లు గొడ్డుబోయాయి. జనం ఆకలితో అలమటించారు. బిడ్డ ఆకలి అమ్మకే ముందు తెలుస్తుంది. దుర్గమ్మ శతాక్షిగా అవతరించింది. ఆ తల్లికి ఒళ్లంతా కళ్లే! ఆ కన్నీటి ప్రవాహం ఏరైపారింది. జనం తృప్తిగా గొంతు తడుపుకున్నారు. ఆతర్వాత, శాకంబరిగా వృక్షరూపాన్ని ధరించింది. తనువెల్లా పండ్లూ కాయలే! ప్రజలు కోరినన్ని తెంచుకుని కడుపునింపుకున్నారు. వేదాలు జ్ఞానానికి ప్రతీక. వేదజ్ఞానం కనుమరుగైతే, అజ్ఞానం రాజ్యమేలుతున్నట్టే. అమ్మ జ్ఞాన ఫలాలిచ్చి సన్మార్గాన్ని చూపింది, ‘నలుగురి కోసం...’ అన్న సందేశాన్నీ చాటి చెప్పింది.

ఉత్సవాల్లో అమ్మను గాయత్రిగానూ పూజిస్తారు. ‘...ప్రచోదయాత్‌, ప్రచోదయాత్‌...’ అంటూ వేదమాతను వేడుకుంటారు. నాలోని వివేకాన్నీ ఆధ్యాత్మికశక్తినీ మేల్కొలపమని ప్రార్థిస్తారు. సత్యయుగంలో దైత్యులు ఏ పాతాళంలోనో దాగుండేవారు. త్రేతాయుగంలో భూమ్మీదే సముద్రాల అవతలికి వచ్చారు.ద్వాపరలో ఆ హద్దు కూడా చెరిగిపోయింది. మన మధ్యే దాయాదుల్లా సంచరించడం మొదలుపెట్టారు. కలియుగంలో ఆ కాస్త తేడా కూడా లేదు. ప్రతి మనిషిలోనూ దురాలోచన రూపంలో ఉనికిని చాటుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దేవీనవరాత్రుల సందర్భంగా ఆ తొమ్మిదిరోజులూ...మనలోని తొమ్మిది రకాల అసుర ప్రవృత్తుల్ని వదిలించుకోవాలి.

జ్ఞానప్రసూనాంబ...