close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న

నాన్న
- బెలగాం గాయత్రి

మెదడులో ఎన్నో సంఘర్షణలు... మనసు అలసిపోయింది. కూలబడ్డాను. చల్లనిగాలి జో కొడుతున్నా కనురెప్పలు వాలటం లేదు. కళ్ళతడి ఆరటం లేదు. నా ఆలోచనలన్నీ నాన్న చుట్టే తిరుగుతున్నాయి. ‘నాన్న!’ ఇది రెండక్షరాల పదం మాత్రమే కాదు. ఒక అమూల్యమైన బంధం. ఈ బంధాన్ని అమ్మ నానుండి శాశ్వతంగా తెంచేసింది. డిగ్రీ పూర్తి చేసుకుని హాస్టల్‌ నుంచి తిరిగివచ్చిన నాకు అమ్మ ఇచ్చిన బహుమానం ఇదే! ‘‘ఎందుకిలా చేశావు?’’ అని ఆమె మనసును నొప్పించకుండా అడిగాను. అమ్మ సమాధానం మౌనం. కానీ, ఆ మౌనం వెనుక ఆమె భయాలూ ఆందోళనా నేను అర్థంచేసుకోగలను.

జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను అమ్మ రుచి చూసింది. సమాజంలో ఎన్నో అవమానాలు అనుభవించింది. అటువంటి పరిస్థితులు నా దరిదాపులకు కూడా రాకూడదని జాగ్రత్తపడుతుంది. నిజమే, ఒక తల్లి తన కూతురు బంగారు భవిష్యత్తు కోసం ఆరాటపడటంలో న్యాయం ఉంది. జీవితంలో ఎదురుదెబ్బలు తిన్న ఆమె మనసు మొద్దుబారిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలు మబ్బుల్లా ఆమె మనసును కప్పేశాయి. అందుకే వాస్తవాన్ని గ్రహించలేకపోతోంది. నాన్నకు నాపై ఉన్న ప్రేమని అంగీకరించలేకపోతోంది.

అమ్మకు నేను ఒక్కర్తినే. నాకు అమ్మ, అమ్మకు నేనుగా నా బాల్యం గడిచింది. మేము మా అమ్మమ్మ దగ్గర ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో నేను నాన్న గురించి తరచూ మారాం చేసేదాన్ని. నాన్న వేరే దేశంలో ఉన్నారనీ, తొందరలో వస్తారనీ, ఉత్తరాల్లో నా గురించే అడుగుతున్నారనీ, నాకు చాలా బొమ్మలు కొని తెస్తారనీ అమ్మ సున్నితంగా నాకు నచ్చచెప్పేది. అమ్మమ్మ మనసు మంచిదే కానీ మాట కటువుగా ఉండేది. నాన్న కోసం నేను మారాం చేసినప్పుడు తను చిర్రుబుర్రులాడేది. అటువంటి సందర్భంలో అమ్మా, అమ్మమ్మా గొడవపడేవారు. కానీ, ఆ వాదనలు నా పసిమనసుకు అర్థమయ్యేవి కాదు.

నాకు తెలిసినదల్లా నాన్న కోసం ఎదురుచూడటం. నాన్న నా దగ్గరకు తొందరగా వచ్చేయాలనీ, నాన్నతో ఎన్నో కబుర్లు చెప్పాలనీ, నాన్న భుజాలనెక్కి వూరంతా తిరగాలనీ, నాన్న గుండెలపై నిదురపోవాలనీ ఎన్నో ఆశలు.

నాకు పదేళ్ళ వయసున్నప్పుడు స్నేహితులతో ఆడుకుని అప్పుడే ఇంటికి వచ్చాను. నన్ను చూసి అమ్మ అమాంతంగా దగ్గరకు తీసుకుని, ముద్దులతో ముంచెత్తేసింది. అమ్మని ఎగాదిగా చూశాను. ముఖంలో సంతోషపు ఛాయలూ, పెదవులపై చిరునవ్వూ, మెడలో ఒక పసుపుతాడు! ఈ మార్పును మొదటిసారిగా అమ్మలో చూస్తున్నాను. ‘‘ఈరోజే మనం మీ నాన్న దగ్గరకు వెళుతున్నాం’’ అంటూ నన్ను హత్తుకుంది. ఇప్పటివరకూ కలలో మాత్రమే కలిసిన నాన్నను నిజంగా కలవబోతున్నాను. నా ఆనందానికి అవధుల్లేవు. ఎన్నో ఏళ్ళుగా నేను కన్నకలలు నిజమవ్వబోతున్నాయి. అమ్మ, నాన్న, నేను... మాది ఒక కుటుంబం కాబోతోంది. ఆనందంతో నవ్వుతూ అమ్మ చేతిని పట్టుకుని చుట్టూరా తిప్పేస్తున్నాను. అమ్మ కూడా నా నవ్వుతో జత కలిపింది.

‘‘చాల్లెండి సంబరం’’ అంటూ అమ్మమ్మ కోపంగా అక్కడకు వచ్చింది.

ఇద్దరం నవ్వులు ఆపేశాం. అమ్మ నన్ను గదిలోకి వెళ్ళమని సైగ చేసింది. గదిలోకి వెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు వింటున్నా.

‘‘అమ్మా, నీ కూతురికి ఒక మంచి జీవితం దొరికిందని నీకు సంతోషంగా లేదా?’’ అమ్మ అమ్మమ్మని అడుగుతోంది.

‘‘మంచి జీవితం అని ఎలా చెబుతున్నావు? చెడిపోయిన మనలాంటి ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు. నీ మెడలో వాడు కట్టింది పసుపుతాడు కాదు, పలుపుతాడు. గుడ్డిగా నమ్ముతున్నావు, మోసపోతావు’’ అంటూ హితబోధ చేస్తోంది.

‘‘కొత్తగా మోసపోవడానికి ఏముంది? ఎప్పుడో నా జీవితానికి అన్యాయం జరిగిపోయింది. ఆయన చాలా మంచివాడు. నేను ఎటువంటిదాన్నో తెలిసి కూడా తాళి కట్టాడు. నాకు భార్య హోదాను ఇచ్చాడు. నా కూతురికి తండ్రి స్థానంలో నిలబడతానని మాట ఇచ్చాడు. నాకు జరిగిన అన్యాయం నా కూతురి విషయంలో జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అంటూ అమ్మ కళ్ళు తుడుచుకుంటోంది.

ఇంతలో ఒక కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. అమ్మ నా చేయి పట్టుకుని బయలుదేరింది. అమ్మమ్మ ఏడుపు గొంతుతో వెళ్ళొద్దని అరుస్తూనే ఉంది. ఆమె మాటలు వినిపించుకోకుండా అమ్మ అడుగులు ముందుకేస్తోంది.

కారు ఎక్కబోతున్న అమ్మను చూసి ‘‘వెళ్ళు, వెళ్ళు... మగవాళ్ళలో మంచివాళ్ళంటూ ఉండరు. అందరూ అవకాశవాదులే. నీపై మోజు తీరిపోయిన తర్వాత నీ కూతురిపై ఆశపడతాడు. అప్పటికి కానీ నీకు ఈ అమ్మ మనసు అర్థంకాదు’’ అంటూ అమ్మమ్మ ఏడుస్తూ పక్కకు ఒరిగిపోయింది.

ఆ మాటలు సూటిగా అమ్మ మనసులో అనుమానపు విత్తును నాటాయి. అమ్మ రెండో ఆలోచనకి తావివ్వకుండా కారు ముందుకు దూసుకుపోయింది.

అందమైన ఒక ఇంటిముందు కారు ఆగింది. నేనూ, అమ్మా లోపలికి వెళ్ళాం. ఓ వ్యక్తి మాకు ఎదురుగా వచ్చారు. భయంగా నేను అమ్మ వెనుక దాగుండిపోయాను. ‘‘నాన్న దగ్గరకు రాకుండా అక్కడే ఉండిపోయావేంటీ?’’ అంటూ ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆయన ఒళ్ళొ నన్ను కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నారు. అమ్మ అమాంతంగా నన్ను తన పక్కకు లాగేసింది. అమ్మమ్మ వేసిన అనుమానపు విత్తు అప్పుడే అమ్మ మనసులో మొక్కగా మొలిచింది.

రోజులు గడుస్తున్నాయి. నాన్నతో నా బంధం బలపడిపోయింది. తండ్రి ప్రేమను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నాన్న నా నవ్వులు చూసి మురిసిపోయేవారు. నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నా కలతలను తీర్చేవారు. ఓడిపోతున్న సమయంలో ధైర్యాన్నిచ్చేవారు. గెలిచినప్పుడు భుజాన్ని తట్టేవారు. నీతి నిజాయతీల గురించి ఎప్పుడూ చెప్పేవారు. చదువు విషయంలో చేయూతనిచ్చేవారు. నాన్న నాపై కళ్ళెర్రజేసినా నాకిష్టమే. దాని వెనుక నా భవితపై ఆయన ఆరాటం కనిపించేది.

నాన్న మా జీవితాల్లోకి వచ్చి అప్పుడే అయిదేళ్ళు పూర్తయ్యాయి. అమ్మ నాన్నతో ఆనందంగానే ఉంటోంది. కానీ, తన మనసులో నా గురించి ఏర్పడ్డ భయాన్ని నేను గమనిస్తుండేదాన్ని.

ఓరోజు రాత్రి నిద్రలో ‘నాన్న’ అంటూ కలవరిస్తున్నాను. నా కలవరింతలు ఆయన మనసును తడిమాయో ఏమో... నా గదిలోకి వచ్చి నా తలపై చేయి వేశారు. అప్పుడు నేను తీవ్ర జ్వరంలో ఉన్నానని నాన్నకు అర్థమైంది. వెంటనే మందులు వేశారు. తడిగుడ్డని నుదుటిపై వేస్తూ ఆ రాత్రంతా నా దగ్గరే ఉన్నారు.

అమ్మ నాన్నని వెతుక్కుంటూ నా గదికి వచ్చింది. నాన్న వైపు కోపంగా చూస్తూ ‘‘మీరిక్కడేం చేస్తున్నారు?’’ అని నిలదీసింది. నాన్న విషయం చెప్పినా అర్థంచేసుకునే ప్రయత్నం చేయలేదు.

‘‘మీ మగవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీ విషపు చూపుల్ని నా కూతురిపై పడనీయను’’ గొంతు చించుకుని అరిచింది.

‘‘తండ్రీకూతుళ్ళ బంధాన్ని అవమానిస్తావా?’’ కోపాన్ని అణుచుకుంటూ నాన్న ప్రశ్నించారు.

‘‘మీరేమైనా తనకు కన్నతండ్రా?’’ ఎదురు ప్రశ్నించింది అమ్మ.

నాన్న మనసు చివుక్కుమంది. అక్కడి నుంచి నాన్న వెళ్ళిపోయారు. అమ్మకు నచ్చచెప్పే వయసు నాకు లేదు. నాన్నని తలచుకుని బాధపడ్డాను.

మూడు రోజుల్లో అమ్మ నన్ను హాస్టల్‌లో చదివించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. నాన్న అడ్డుపడ్డాడు. అమ్మ పట్టుపట్టింది. ఏదిఏమైనా నేను అమ్మానాన్నలకు దూరమయ్యాను. హాస్టల్లో మానసికంగా ఒంటరినయ్యాను. ప్రతి ఆదివారం అమ్మ వచ్చి నన్ను కలిసేది. కానీ, నాన్న లోటుని తీర్చలేదు కదా! ఈ మానసిక ఆందోళనల వల్ల చదువులో వెనుకబడ్డాను.

అటువంటి సమయంలోనే నా చేతికందింది ఒక ఉత్తరం. అవును! అది నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఆ ఉత్తరం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. రోజూ నాన్న ఉత్తరాల కోసం ఎదురుచూసేదాన్ని. జవాబులు రాసేదాన్ని. ఈ ఉత్తరాలు నా ఒంటరితనాన్ని దూరం చేశాయి. ఉత్తరాల ద్వారా నాన్న చదువులో ఎన్నో మెలకువలు నేర్పేవారు. పోటీతత్వాన్ని నాకు పరిచయం చేశారు. భవిష్యత్తు గురించి బెంగపడకూడదని నాలో ధైర్యాన్ని నింపేవారు. భయపడటం మానేస్తేనే జీవితంలో ముందుకెళ్ళగలమని అర్థమయ్యేలా వివరించేవారు. చక్కని నడవడికనూ, విలువలనూ తెలియజేశారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, సమస్యలు ఎదుర్కొనేవారే సాహసవంతులంటూ సలహాలనిచ్చారు. జీవిత ప్రయాణంలో ఓర్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియజేసేవారు. నాన్నకు ఉన్న ఆదర్శగుణాలన్నీ ఆ ఉత్తరాల ద్వారా నాకు చేరువయ్యాయి. ఇప్పుడు మా నాన్నకు ప్రతిరూపం నేను.

సెలవుల్లో కూడా అమ్మ నన్ను ఇంటికి రానివ్వలేదు. నాన్న నుండి నన్ను దూరం చేయటానికే ఈ ప్రయత్నం. ఇలాగే అయిదేళ్ళు గడిచిపోయాయి. నేను డిగ్రీ పూర్తి చేశాను. హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో మాట్లాడి నాన్నపై తనకు ఉన్న భయాలూ, అనుమానాలకు అర్థంలేదని వివరించాలనుకున్నాను. ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాను. అన్నీ నీరుకారిపోయాయి. అసలు ఇంట్లో నాన్న లేరు. అర్థంలేని అపోహలతో అమ్మ నాన్నను దూరం చేసుకుంది. నన్ను జీవితంలో ఎప్పుడూ కలవకూడదని ఆంక్షలు పెట్టింది. నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? ఎలా ఉన్నారో? ఎంతగా కుమిలిపోతున్నారో? నాన్న మాపై చూపిన ప్రేమాభిమానాలకు ప్రతిఫలం ఇదేనా? నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. ఆ వేదనే నన్ను నిద్రకు దూరం చేస్తోంది.

లేచి కూర్చున్నాను. ఓ కాగితం తీసుకున్నాను. అమ్మను ఉద్దేశించి ఉత్తరం రాయటం మొదలుపెట్టాను.

‘‘అమ్మా, మన జీవితాలు ఎలా మొదలయ్యాయో నాకు తెలుసు! మనల్ని ఉద్ధరించటానికి నాన్న నీ చేయిని అందుకున్నారు. నీ గతం ఎలాంటిదో తెలిసి కూడా నాన్న నిన్ను భార్యగా అందలమెక్కించారు. కూతురుగా నాకు అన్ని హక్కులూ కల్పించారు. సమాజంలో మనం వూహించని గౌరవాన్ని దక్కించారు. కానీ, అమ్మమ్మ నాటిన ఓ అనుమానపు విత్తు నీ మనసులో మహా వృక్షమయింది. అదే నీ మనసును కమ్మేసింది. అందుకే అపురూపమైన మా తండ్రీకూతుళ్ళ బంధాన్ని అర్థంచేసుకోలేకపోతున్నావు. ఆ అనుమానపు వృక్షాన్ని పెకలించి చూడు... నాన్న మహనీయుడు, మానవోత్తముడు. నాన్న అంతరంగం అర్థంచేసుకో. నా బ్యాగులో ఉన్న ఉత్తరాలను చదువు. అవి ఆయన నాకు రాసినవే. ఈ ఐదేళ్ళూ నాన్న నాకు దూరం కాలేదు. తండ్రిగా ఆయన బాధ్యతనూ మర్చిపోలేదు. ఉత్తరాల ద్వారా నాకు మరింత దగ్గరయ్యారు. నాన్నకు నాపై ఉన్న అమితమైన ప్రేమనీ, నా భవిష్యత్తుపై ఆయనకున్న ఆరాటాన్నీ తెలుసుకో. నాన్న నాకు కన్నతండ్రి కాకపోవచ్చు. నాకంతకంటే ఎక్కువ. నా కన్నతండ్రే నా దగ్గర ఉన్నా నాకింత ప్రేమను పంచలేకపోవచ్చు. నాన్న నా నేస్తం, నా గురువు, నా దైవం. మా అమూల్యమైన బంధాన్ని అపవిత్రం చేయొద్దు. చుక్కలున్నంత వరకూ మా బంధానికి మచ్చలు ఏర్పడవు. ఈ ఉత్తరం చదివిన తర్వాత అయినా నీ మనసులోని భయాలను తుడిచేయి. నాన్నను నానుంచి దూరం చేయకు. మనస్ఫూర్తిగా ఆయనను క్షమాపణ అడిగి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. ఇదే ఓ బిడ్డగా నా కోరిక.’’

ఇట్లు
నీ కూతురు
సారిక

ఈ ఉత్తరాన్ని నిద్రలో ఉన్న అమ్మకు దగ్గరగా ఉంచాను. నా గదికి వచ్చి నిద్రకు ఉపక్రమించాను.
తెల్లవారిపోయింది. అమ్మ నేను రాసిన ఉత్తరం చదివిందో లేదో? ఆమెలో మార్పు కోసమే నా ఆరాటం. దేవుణ్ణి తలచుకుని మంచం దిగబోయాను. ఎదురుగా అమ్మ వచ్చి నిల్చుంది. ఒక చేతిలో ఉత్తరాల బ్యాగూ, మరో చేతిలో నాన్న చేయీ. అమ్మ కళ్ళలో అపరాధభావం, నాన్న కళ్ళల్లో సంతోషం. అవధుల్లేని ఆనందంతో అమ్మానాన్నలిద్దరినీ హత్తుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.