close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పిజ్జా భలే మజా..!

‘రోమ్‌లో రోమన్‌లానే ఉండాలి’... చాలా పాత సామెత. కానీ ఇది నేటి ఆహారపదార్థాలకూ ముఖ్యంగా పిజ్జాకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందన్నది అక్షరసత్యం. అందుకే అది దేశాల సరిహద్దులు దాటి విభిన్న ప్రాంతీయ రుచులను సంతరించుకుని మరీ ఆదరణ పొందుతోంది.

‘ఆనందం ఓ బాక్సు రూపంలో ఇంటికి వస్తుంది’ అని ఎవరైనా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది పిజ్జానే. నిజానికి ఆనందాన్ని డబ్బులతో కొనలేం. కానీ పిజ్జా రూపంలో మాత్రం కొనగలం అని అంటుంటారు పిజ్జాప్రియులు. ఆ పేరు చెబితేనే మొహం పుచ్చపువ్వులా విచ్చుకునేవాళ్లు కోకొల్లలు. ఎవరైనా సరే ఒక్కసారి దాన్ని రుచి చూసినవాళ్లు మళ్లీ తినకుండా ఉండలేరు. ఆ గొప్పతనం దానిమీదున్న చీజ్‌దా... మొత్తంగా పిజ్జాదా అంటే చెప్పడం కాస్త కష్టమే. అదీగాక అందులోని టాపింగ్స్‌ను తమ అభిరుచులకు తగ్గట్లుగా వేసుకునే సౌలభ్యం ఒక్క పిజ్జాకే సొంతం. అందుకే పిజ్జా తయారీలో ఎవరి ప్రత్యేకత వాళ్లదే.

వందల సంవత్సరాలక్రితం గ్రీకులూ ఇటాలియన్లూ వెల్లుల్లి, ఉప్పు, చీజ్‌, తులసిఆకుల టాపింగ్స్‌తో చేసిన సమతలాకారపు రొట్టె, క్రమంగా అనేక ప్రయోగాలకు వేదికగా మారి చివరకు 18వ శతాబ్దంనాటికి ఇటలీలోని నాపల్స్‌లో ఆధునిక పిజ్జా రూపంలోకి మారింది. స్థానికంగా దొరికే పదార్థాలతో విభిన్న రూపాల్నీ రుచుల్నీ సంతరించుకుంది. సమతల పిజ్జాలతోబాటు, లోతుగా ఉండే ‘డీప్‌ డిష్‌ చికాగో’, అత్యంత పలుచని రొట్టెతో చేసే థిన్‌ క్రస్ట్‌ పిజ్జా... వంటి విభిన్న రూపాలనూ సంతరించుకుంది. నియాపాలిటన్‌, మార్గరిటా, పెప్పరొని... వంటి సంప్రదాయ పిజ్జాలతోపాటు వెజిటేరియానా, ఆఫ్రికానా, మెక్సికానా... ఇలా మరెన్నో సరికొత్త రుచుల్లోనూ అభిమానుల మనసు దోచుకుంటోంది. దానికితోడు ఫాస్ట్‌ఫుడ్‌ ఛెయిన్స్‌ విభిన్న దేశాల్లోని స్థానిక రుచుల్ని కలగలిపి అందించడంతో పిజ్జా రుచుల జోరు మరీ పెరిగింది. సేవ్‌పురి, చికెన్‌ టిక్కా, తందూరీ పన్నీర్‌, మసాలా సాస్‌... వంటి భారతీయ రుచులతో స్పైసీస్పైసీగా వడ్డిస్తోన్న ఇండియనైజ్డ్‌ పిజ్జాలే వందల రకాలున్నాయి. అంతెందుకు... దసరా నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని ఆ పదిరోజులపాటూ శాకాహార పిజ్జాలనే అందించే ఫుడ్‌ఛెయిన్లకూ కొదవ లేదు. అందుకే పిజ్జా... అటు శాకాహారప్రియుల్నీ ఇటు మాంసాహారప్రియుల్నీ కూడా ఆకట్టుకుంటోంది. మినీ, మీడియం, లార్జ్‌... అంటూ రకరకాల పరిమాణాల్లో చవులూరిస్తోంది.

ఎలా చేస్తారు?
రెడీమేడ్‌ పిజ్జా బేస్‌లు తీసుకుంటే మనకిష్టమైన రీతిలో ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవడం పిజ్జాలోని మరో సౌలభ్యం. లేదూ బేస్‌ కూడా ఇంట్లోనే తయారుచేసుకునేవాళ్లూ ఉన్నారు. మైదా లేదా గోధుమ పిండిలో గోరువెచ్చని నీళ్లూ కాస్త ఈస్ట్‌, కొద్దిగా ఆలివ్‌ నూనె కలిపి మర్దిస్తూ పిండిముద్దని చేయాలి. ఇటీవల రాగి, సోయా, మల్టీగ్రెయిన్‌, ఓట్‌మీల్‌, క్వినోవా... ఇలా రకరకాల పిండులను సైతం బేస్‌ తయారీలో వాడుతున్నారు. పిండి పులిసి పొంగాక మందపాటి రొట్టెలా చేసి దానిమీద టొమాటో, ఉల్లి, ఆలివ్స్‌, క్యాప్సికమ్‌, సోయాచంక్స్‌, రొయ్యలు, మొక్కజొన్నగింజలు, పుట్టగొడుగులు, చేపముక్కలు, చికెన్‌ముక్కలు, మటన్‌ముక్కలు... ఇలా మనకు కావల్సినవి వేసుకుని చీజ్‌ తురుము చల్లి బేక్‌ చేయాలి. ఒకప్పుడు పిజ్జా తయారీలో అచ్చంగా మొజారెల్లా చీజ్‌నే వాడేవారు. ఇటీవల చాలా రకాల చీజ్‌లనూ వాడుతున్నారు.

 

ప్రాంతీయ రుచుల్లోనూ...
ఎక్కడో ఇటలీలో పుట్టిన ఆ వంటకం, నేడు దేశభాషలతో సంబంధం లేకుండా ఇడ్లీ పిజ్జా, పిజ్జా దోసె, పిజ్జా పరాటా... ఇలా మనదైన ప్రాంతీయవంటకాలతోనూ జత కట్టేసి మన వంటింట్లోనూ తిష్టవేసుక్కూర్చోవడం అనేది సాధారణ విషయమేమీ కాదు. ఇడ్లీలూ దోసెలూ వూతప్పాలమీద చీజ్‌తోపాటు నచ్చిన కూరగాయల ముక్కల్ని వేసి ఓ నిమిషం బేక్‌ చేసేసి పిజ్జా రూపంలో అందించేస్తున్నారు ఆధునిక గృహిణులు. అలాగే తమ సూషీతోనూ పిజ్జాలు చేసేసి ఆనందంగా చప్పరించేస్తున్నారు జపాన్‌వాసులు. అయితే పిజ్జాల్లో ఉప్పు ఎక్కువగా వాడటంవల్ల ఆరోగ్యానికి మంచిది కాదనేవాళ్లు కొందరయితే, మధ్యధరా రుచులతో కలిపి తింటే ఇది ఆరోగ్యానికి మంచిదే అనేవాళ్లూ ఇంకొందరు. ఏది ఏమయినా ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అన్నది దృష్టిలో పెట్టుకుంటే ఇటాలియన్ల పిజ్జా అయినా తెలుగువారి పరమాన్నమైనా రుచిమొగ్గల్ని అలరిస్తూనే ఉంటాయి మరి.


రకరకాలు..!