close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అబ్రకదబ్ర... అరలు మాయం!

ఓసారి... గోడకు చూడచక్కని పెయింటింగో వాల్‌పేపరో కనిపిస్తుంది. మరోసారి... ఆ పెయింటింగ్‌ మధ్యలో ఓ చోట అరా దానిమీద ఫ్లవర్‌ వేజూ పెట్టుంటుంది. ఇంకోసారి... ఆ పక్కనే మరో అరా దానిమీద అందమైన బొమ్మా కనిపిస్తుంది. మళ్లీసారి... అరలన్నీ మాయం. పూర్తి వాల్‌పేపర్‌ ప్రత్యక్షం. రివేలీ షెల్ఫులు ఉంటే ఇలాంటి అందమైన మ్యాజిక్కుల్ని ఎన్నింటినైనా చేసేయొచ్చు.

గోడకు అందంకోసం అలంకరణలు. మరో గోడకు వస్తువుల కోసం అరలు. ఏదైనా... ఎప్పుడూ అలానే ఉంటే మన ఇల్లు మనకే బోర్‌ కొట్టేస్తుంది. ఇక, అలంకరణ వస్తువుల కోసమూ అవసరమైన వస్తువుల్ని పెట్టుకునేందుకూ ఏదైనా ఆకారంలో ఒక్కసారి షెల్ఫుల్ని కట్టించుకుంటే, అవి ఎన్నేళ్లైనా అలానే ఉండిపోతాయి. ఆ షెల్ఫుల్ని బట్టే మనం వస్తువుల్ని పెట్టుకోవాలి గానీ మన అవసరాన్ని బట్టి, షెల్ఫులు మారవు. ఒక్కోసారి కొంతకాలం పాటు వాటిని వాడాల్సిన అవసరమే రాదు. అయినా, ఖాళీ ఖాళీగా ఇంటి అందాన్ని పోగొడుతూ ఆ అరలు అలానే ఉంటాయి.

అలా రూపొందాయి
చికాగోకి చెందిన మార్క్‌ కిన్స్‌లీ కూడా తన చిన్న ఫ్లాట్‌లోని అరలతో ఇలాగే ఇబ్బంది పడ్డాడట. దాంతో తనే సొంతంగా అవసరం లేనపుడు స్థలాన్ని ఆదా చేసే అరల్ని రూపొందించుకున్నాడు. వాటినే తర్వాత రివేలీ ఫోల్డ్‌ డౌన్‌ షెల్ఫులుగా మార్కెట్లోకి తెచ్చాడు. ఈ అరలు అల్యూమినియంతో చేసిన చిన్న చిన్న టైల్సులా ఉంటాయి. వీటిని మూడూ అంతకన్నా ఎక్కువ వరుసల్లో చతురస్రంగానో దీర్ఘచతురాస్రాకారం వచ్చేలానో గోడకు బిగిస్తారు. మూసేసినపుడు వరుసగా గోడకు అమర్చిన టైల్సులానే ఉండే వీటిని అవసరమైనపుడు తెరుచుకోవచ్చు. ఇక, మూసి ఉన్నప్పుడు ఇవి ఇంటికి అందాన్ని తెచ్చేలా వాటిమీద రకరకాల డిజైన్లున్న మ్యాగ్నటిక్‌ ప్యానెల్‌ స్టిక్కర్లను అంటిస్తారు. జిగురుతో కాకుండా అయస్కాంత శక్తితో అంటుకునే వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా తియ్యొచ్చు, కొత్తరకం స్టిక్కర్లను అంటించుకోవచ్చు.

అదండీ సంగతి, రివేలీ షెల్ఫులు స్థలాన్ని ఆదా చెయ్యడంతో పాటు, ఇంటి అలంకరణకూ పనికొస్తాయన్నమాట. వీటికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ అరల్లో కొన్నిటిని మూసి, కొన్నిటిని తెరుస్తూ వాటిలో ఫ్లవర్‌ వేజ్‌లూ బొమ్మల్ని పెడుతూ ఎప్పటికప్పుడు ఇంటికి సరికొత్త లుక్‌నీ తేవొచ్చు. మీకూ కావాలంటే రివేలీ.నెట్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.అరల్లో అందమైన వస్తువుల్ని పెట్టడం తెలిసిన విషయమే. కానీ అరలే అందంగా ఉండడం మరింత భిన్నం కదూ!


సబ్బు మెత్త మెత్తగా!

సాధారణంగా సబ్బు అనగానే రకరకాల రంగుల్లో గట్టిగా గుండ్రంగానో, బాదం కాయలాగో, దీర్ఘచతురస్రాకారంలోనో ఉండేది గుర్తొస్తుంది. కానీ అచ్చం మనం తినే జెల్లీలా ఉండే సబ్బులూ బజార్లో ఉన్నాయి. పారదర్శక రంగుల్లో ఉండే ఇవి చేత్తో ముట్టుకుంటే జెల్లీలా మెత్తగా వంగిపోతుంటాయి. వాడుకునేందుకు మాత్రం మామూలు సబ్బుల్లాగే పనికొస్తాయి. జెల్లీ సోప్‌, షవర్‌ జెల్లీ పేరుతో దొరుకుతున్నాయి. చాన్నాళ్ల క్రితమే యూకేలో మొదట తయారైనా... ఇటీవల ఓ సంస్థ పెట్టిన వీడియోను 2.9 కోట్ల మంది చూడటంతో ఇవిప్పుడు ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా మారి ప్రపంచ దేశాలన్నింటికీ పరిచయం అవుతున్నాయి.


నిలువెత్తు శ్మశానం!

వేదాంతం చెప్పేవాళ్లు... మనం ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఓ ఆరడుగుల నేల మాత్రమే అంటుంటారు. కానీ జనాభా పెరిగిపోయే కొద్దీ ఆ ఆరడుగుల నేల దొరకడమూ కష్టంగానే తయారవుతోంది. అందుకే శ్మశానాలూ అపార్టుమెంట్లలా తయారవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగు ఓ శ్మశానం. బ్రెజిల్‌లో ఉన్న ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్మశానమట. ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి. పాతికవేల శవాలను ఉంచగలిగే సామర్థ్యం ఉంది. అంతే కాదు ఇందులోనే ఓ రెస్టారెంటూ, నెమళ్లపార్కూ, వచ్చిన వాళ్లు ఉండేందుకు గదులూ, సమావేశ మందిరం ఉన్నాయి. వింతేంటంటే ఎంత ఎక్కువ ఎత్తులో సమాధి ఉండాలి అనుకుంటే అంత ఎక్కువ డబ్బులట. స్తోమత కొద్దీనో లేక ప్రేమ కొద్దీనో డబ్బులు ఎక్కువ కట్టి పై అంతస్తులో తమ వాళ్లని సమాధి చేసే వాళ్లూ ఉన్నారు. ఎవరి ఆనందం... కాదు కాదు ఎవరి బాధ వారిది మరి!


టీ కెటిల్‌ గిన్నీసు రికార్డు!

టీ కెటిల్‌ ధర మామూలుగా అయితే వందల్లోనో మహా అయితే వేలల్లోనో ఉంటుంది. కానీ కోట్లలో ఉన్న టీ కెటిల్‌ను చూశారా. అయితే ఇదిగోండి ఇదే ఆ కెటిల్‌. ప్రఖ్యాత టీ తయారీ సంస్థ న్యూబీ వాళ్లు ‘ద ఇగోయిస్ట్‌’ పేరిట దీన్ని ఇటీవల తయారు చేశారు. వజ్రాలు, కెంపులూ పొదిగి ఉన్న దీని విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు. టీకి మానవ సంస్కృతిలో ఉన్న స్థానం, దాని చరిత్రల గుర్తుగా దీన్ని రూపొందించారట. కేవలం ఒక కప్పు టీ మాత్రమే పట్టే ఇది అతి ఎక్కువ ధర గల టీ కెటిల్‌గా గిన్నిస్‌ రికార్డుకెక్కింది.


ఒకే ఒక్కడు!