close
అలాంటి రోజొస్తే రిటైరవుతా...

అలాంటి రోజొస్తే రిటైరవుతా...

బోర్డుమీద ఆయన పేరు ముందు ‘డాక్టర్‌’ అని రాసి ఉంటుంది. లోపలకెళ్లి మాట కలిపితే ముందున్నది మన మిత్రుడే అనిపిస్తుంది. కీళ్ల మార్పిడి చేస్తూ ఆ డాక్టర్‌ పూసే మానవత్వమనే ఆయింట్‌మెంట్‌తో ఎలాంటి కీళ్లయినా ‘కీ’ ఇచ్చిన బొమ్మకారులా తిరగాల్సిందే! ఎముకల సమస్యలకు ‘సన్‌షైన్‌’ పేరుతో ఓ నమ్మకమైన చిరునామాను చూపిన ఆ డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఎండీ. వైద్యుడితోపాటు ఆయనలో రచయితా, ప్రేమికుడూ, సంగీతారాధకుడూ ఉన్నారు. తనలోని ఆ భిన్నకోణాలను మనముందు ఉంచారిలా...

నేను పుట్టింది గుంటూరులో... అన్నంత తేలిగ్గా ఏమీ జరగలేదు నా పుట్టుక. అమ్మ(రాజ్యలక్ష్మి)ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంటే తోవలో ఆ రిక్షా పంక్చరైంది. జోరు వాన, హోరు గాలి... ఆ దెబ్బకు కరెంటు పోయింది. అలా గాఢాంధకారంలో గాభరాగా ఆ రిక్షాలోనే పుట్టాన్నేను. నాన్న (సత్యనారాయణరెడ్డి) బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్‌. ఆయన ఉద్యోగరీత్యా నేను ఆర్నెల్ల పిల్లాడిగా ఉన్నపుడు మా కుటుంబం గుంటూరు నుంచి బాపట్ల వెళ్లింది. టెన్త్‌వరకూ అక్కడ మున్సిపల్‌ హైస్కూల్లో, ఇంటర్మీడియెట్‌ ఆర్ట్స్‌ కాలేజీలో పూర్తిచేశాక నాన్న పాఠాలు చెప్పిన కాలేజీలోనే అగ్రికల్చర్‌ బీఎస్సీలో చేరాను. మరి నేను డాక్టర్ని ఎప్పుడయ్యాననే కదా మీ సందేహం? పొయ్యిలో లేవని పిల్లి, దగ్గుతో బాధపడుతున్న తల్లి, పెళ్లీడుకొచ్చిన చెల్లి... ఇవేవీ నేను డాక్టర్‌ అవ్వాలనుకోవడానికి కారణాలు కావు. బాపట్లలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారని ఓ డాక్టర్‌ ఉండేవారు. ఆయన ఆసుపత్రి వెలుగుల్నీ, ప్రజలు ఆయనకు ఇచ్చే గౌరవ మర్యాదల్నీ చూసి చిన్నపుడే తెల్లకోటుపైన మనసు పారేసుకున్నాను. ఇంటర్‌ తర్వాత ఎంబీబీఎస్‌ ప్రవేశ పరీక్ష రాశాను. ఒకటి కాదు, రెండు కాదు నాలుగు సార్లు రాశాను. ప్రతిసారీ ఒకట్రెండు మార్కులు తక్కువై సీటు రాకుండా పోయేది. నా మార్కులకి కాకినాడలో రూ.75వేలు డొనేషన్‌ కడితే సీటు వచ్చేదే. కానీ ఇంట్లో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఫ్రీ సీటుకోసం ప్రయత్నిస్తూనే ఉండేవాణ్ని. మరో వైపు ‘ప్లాన్‌ బి’గా అగ్రికల్చర్‌ కాలేజీలో చేరానేకానీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాన్న అయితే ‘డిగ్రీపైనే దృష్టిపెట్ట కూడదూ’ అనేవారు. అమ్మ మాత్రం... ‘నువ్వు డాక్టర్‌ కావాలి నాన్నా’ అని ప్రోత్సహిస్తూనే ఉండేది. దాంతో నేను వెనకడుగు వెయ్యకుండా పట్టుదలగా చదివాను. డిగ్రీ ఫైనలియర్లో ఉండగా గుంటూరు మెడికల్‌ కాలేజీలోనే ఫ్రీ సీటు సంపాదించాను. ముగ్గురు అన్నదమ్ముల్లోకీ నేనే పెద్ద. పెద్ద తమ్ముడు హరి ఐఐఎమ్‌లో, చిన్న తమ్ముడు బుజ్జి ఐఐటీలో చదువుకున్నారు. దాన్నిబట్టి అర్థమవుతోందిగా ముగ్గురిలోకీ తెలివైంది ఎవరో? కానీ తెల్లకోటు వేసుకోవాలన్న కోరికే నన్ను చదివించింది, గెలిపించింది. ఎంబీబీఎస్‌ తర్వాత పుణెలో ఆర్థోపెడిక్స్‌లో పీజీ చేశాను.

మనకో లవ్‌స్టోరీ ఉంది!
1986లో నాకో పెద్ద యాక్సిడెంట్‌ అయింది. అది ఇంకేదో కాదు నా పెళ్లి. నా శ్రీమతి భవాని. మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌ గారి కుమార్తె. మాది ప్రేమ పెళ్లి. పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలాక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. మా కుటుంబాల మధ్య బంధుత్వమూ ఉంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలూ, అవకాశాలూ ఆరోజుల్లో ప్రేమికులకు లేవు. కలిసి మాట్లాడుకోవడమే చాలా కష్టమయ్యేది. నేను గుంటూరులో ఎంబీబీఎస్‌ చేస్తున్నపుడు, తను విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేస్తుండేది. నాకు మూడేళ్లు జూనియర్‌. మా కబుర్లు ఉత్తరాల్లోనే ఎక్కువగా సాగేవి. మా ఇంట్లో ఫోన్‌ కూడా లేదు. మా ఎదురింటి లాయర్‌ గారింటికి ఫోన్‌ చేస్తుండేది భవాని. నేను మా అరుగు మీద కూర్చొని ఫోను కోసం ఎదురుచూసేవాణ్ని. భవానీ నుంచి ఫోన్‌ రాగానే లాయర్‌గారి అమ్మాయి సైగ చేసేది. కానీ ఆనాటి ప్రేమలోని మాధుర్యం వేరు. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆదర్శ్‌ 1988లో హైదరాబాద్‌లో పుట్టాడు. అమ్మాయి కావ్య... 1992లో ఇంగ్లాండ్‌లో ఉన్నపుడు పుట్టింది. ‘లిటిల్‌ సోల్జర్స్‌’లో ‘ఐ యామ్‌ ఎ గుడ్‌ గర్ల్‌...’ అంటూ ఆడిపాడిన చిన్నారి తనే! ఆ సినిమా దర్శకుడు గంగరాజు నా తోడల్లుడు.

ఇంగ్లాండ్‌లో పదేళ్లు...
పుణెలో పీజీ తర్వాత గుంటూరులో క్లినిక్‌ పెట్టాలనేది నా ఆలోచన. కానీ నా ఆలోచనల్ని ఇంగ్లాండ్‌వైపు తీసుకెళ్లారు అక్కడ నా సీనియర్‌ అయిన డాక్టర్‌ సతీష్‌ కుట్టి. మా ఇద్దరిదీ మంచి స్నేహబంధం. ఆయన మొదట ఇంగ్లాండ్‌ వెళ్లారు. ఆయన సహకారంతో తర్వాత నేనూ వెళ్లాను. ఇంగ్లాండ్‌లో మోకాలి శస్త్రచికిత్సలు చేస్తూనే మూడు ఎఫ్‌ఆర్‌సీఎస్‌లూ, ఎంఆర్‌సీఎస్‌ చేశాను. అక్కడున్న పదేళ్లే నా జీవితాన్ని మార్చేశాయని చెప్పాలి. వృత్తి పరంగా, మానసికంగా, వ్యక్తిగతంగా బోల్డన్ని విషయాలు నేర్చుకున్నాను. నగర జీవనంతోపాటు అక్కడ గ్రామీణ అందాలూ అబ్బురపరిచేవి. అక్కడ పదేళ్లు ఉండి మంచి అనుభవం సంపాదించాను. కానీ ఏదో అసంతృప్తి. దాంతో 1999లో ఇండియా వచ్చేశాను. డయానా చనిపోయాక అక్కడ గ్లామర్‌ లేదనిపించి ఇండియా వచ్చేశానేమో అని కూడా అనిపిస్తుంది నాకు.

ఇక్కడికి ఎందుకన్నారు...
ఇండియా వస్తున్నానని చెప్పేసరికి... ‘ఇక్కడికి ఎందుకు..?’ అన్నదే చాలామంది ప్రశ్నా, సందేహమూ. నా దేశానికి రావడానికి అసలు కారణాలెందుకు..! ఇండియా అంటే ప్రేమా, ఇక్కడ ఏదైనా చేయాలన్న తాపత్రయమే నన్ను ఇక్కడికి రప్పించాయి. అమెరికా, ఇంగ్లాండ్‌లలో మన పాత్ర ఓ పెద్ద యంత్రంలో చిన్న బోల్ట్‌ లాంటిది. ఇండియాలో మనం చేసే ప్రతి చిన్న పనికీ చాలా పెద్ద సంతృప్తి దొరుకుతుంది. ఇక్కడివారు చూపే ఆప్యాయతా, ప్రేమలు అక్కడ ఉండవు. అందుకే వైద్య వృత్తి కూడా ఆఫీసు పనిలానే అనిపించేదక్కడ. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్‌లోని అపోలోలో చేరాను. ఆ తర్వాత మా తోడల్లుడు డాక్టర్‌ భాస్కరరావు, మరికొందరితో కలిసి 2004లో కిమ్స్‌ హాస్పిటల్‌ను ప్రారంభించాను. స్వల్ప వ్యవధిలోనే ఆ హాస్పిటల్‌కు మంచి పేరు వచ్చింది. ప్రతి అయిదేళ్లకూ నా మెదడుని పురుగు తొలుస్తుంది. ‘తర్వాత ఏంటి’ అన్న ఆలోచన మొదలవుతుంది. అప్పుడే ఆర్థోపెడిక్స్‌కి సంబంధించి ఇంకా పెద్ద హాస్పిటల్‌ కట్టాలనిపించింది. అక్కడుంటే అందుకు వీలు కాకపోవచ్చని బయటకు వచ్చి 2009లో ‘సన్‌షైన్‌’ను ప్రారంభించాను. నిజానికి ఆ సమయానికి నా దగ్గర డబ్బులేదు. నేను బయటకు వచ్చి హాస్పిటల్‌ కడతానని మిత్రులకూ శ్రేయోభిలాషులకూ చెప్పగానే... ‘ఎప్పుడు ఇస్తావు, ఎంత వస్తుంది’ లాంటి ప్రశ్నలేవీ అడగకుండానే హాస్పిటల్‌కు డబ్బు పెట్టారు. సన్‌షైన్‌ పెట్టి ఏడేళ్లవుతోంది. 150 పడకల నుంచి 450కు పెరిగాం. జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాం. మల్టీ స్పెషాలిటీగా మారాం. సికింద్రాబాద్‌లో ప్రస్తుతం రెండు వేల మంది సిబ్బంది ఉన్నారు. భువనేశ్వర్‌లోనూ శాఖని ప్రారంభించాం. త్వరలో గచ్చిబౌలిలో మరో శాఖను తెరుస్తాం. మా హాస్పిటల్‌లో ఏడాదికి నాలుగువేల జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ ఆపరేషన్స్‌ చేస్తాం. ‘పేషెంట్‌ ఫస్ట్‌’ ఇదే మా నినాదం, విధానం. అదే మేం విజయవంతమయ్యేలా చేసింది. అదే సమయంలో మా సేవల్ని ఎప్పటికప్పుడు మెరుగు పర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

ఆసుపత్రిలో 12గంటలు
ఉదయం తొమ్మిదింటికి ఏ రకమైన ఉత్సాహం, ప్రేమ, చిరునవ్వులతో పేషెంట్‌ని చూస్తానో సాయంత్రం ఆరింటికీ అలానే చూడటం నా నైజం. అలా చూడలేని రోజున రిటైరవుతాను. పేషెంట్లని చూడటమే కాదు మా హాస్పిటల్‌లో ఏడాదికి 30 మంది డాక్టర్లకి శిక్షణ ఇస్తుంటాను. ప్రపంచవ్యాప్తంగా పాఠాలు చెప్పడానికి వెళ్తుంటాను. ఏటా 10-15 పర్యటనలు అలాంటివి ఉంటాయి. వయసు పరంగా చూసుకుంటే పదేళ్ల తర్వాత రిటైరవ్వాలని ఉంది. కూతురికి పెళ్లయింది. ఆమె కూడా డాక్టర్‌. అల్లుడూ, కొడుకూ ఇద్దరూ ఆర్థోపెడిక్‌ సర్జన్లు. మా హాస్పిటల్‌లోనే ఉన్నారు. వారికి హాస్పిటల్‌ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నాను. ఈ మధ్యనే ‘సొసైటీ టు ప్రివెంట్‌(స్టాప్‌) యాక్సిడెంట్స్‌’ అనే ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దాని ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం. ఉదయం నాలుగున్నరకి నిద్రలేస్తాను. 5-6 మధ్య ట్రైనర్‌ సమక్షంలో వ్యాయామం చేస్తాను. తర్వాత మా ఆవిడా నేనూ ఇంటి ఆవరణలో ఉన్న కోర్టులో గంటపాటు టెన్నిస్‌ ఆడతాం. ఎనిమిదింటికి హాస్పిటల్‌లో ఉంటాను. అప్పట్నుంచి రాత్రి ఎనిమిది వరకూ హాస్పిటల్‌లోనే. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు ఉంటే సాయంత్రం వెళ్తాను. లేదంటే నేరుగా ఇంటికే. మామూలుగా శని, ఆదివారాలు హాస్పిటల్‌కి రాను. అది ఇంగ్లాండ్‌లో ఉండగానే అలవాటయింది. ఇప్పుడు హాస్పిటల్‌ నిర్వహణకు సంబంధించిన పనులవల్ల శనివారాలూ పనిచేయాల్సి వస్తోంది. లేకుంటే శనివారం నాకు నచ్చిన సినిమాలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, తోచింది రాస్తుంటాను. ఆదివారం మాత్రం పూర్తిగా కుటుంబానికే. ఆరోజు లంచ్‌కి ఇంట్లో అందరం ఉండాల్సిందే! అమ్మాయీ, అల్లుడూ కూడా వస్తారు. ఈ విషయంలో మాత్రం మా ఆవిడ చాలా స్ట్రిక్ట్‌.

సాహిత్యం, సంగీతం
స్కూల్‌ రోజుల్నుంచీ నాలో భాషా ప్రేమికుడు ఉన్నాడు. వ్యాస రచన, వక్తృత్వం లాంటి అంశాల్లో నాకు బహుమతులు వచ్చేవి. మెడికల్‌ కాలేజీలో కాలేజీ తెలుగు మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్నాను. ఆ మ్యాగజైన్లో ‘రెండు జడలు మూడు ముళ్లు నాలుగు కళ్లు’ పేరుతో రాసిన కథతో నాలోని రచయితని నా స్నేహితులు గుర్తించి ప్రోత్సహించారు. తర్వాత కూడా వివిధ పత్రికల్లో కొన్ని వ్యాసాలు రాశాను. ‘గురవాయణం’ పేరుతో ఒక పుస్తకం తెచ్చాను. సామాన్యమైన అంశాలతో సామాన్యుడి భాషలో రాసిన వ్యాసాలవి. అది చదివాక ‘ఉన్నతస్థాయిలో ఉండి కూడా మీ బలాలూ బలహీనతల్ని అంగీకరిస్తూ రాయడం గొప్ప విషయం...’ అన్నారు చాలామంది. సాహిత్యంతోపాటు సంగీతం కూడా ఇష్టమే. ఇప్పుడు నేనూ, మా ఆవిడా పియానో నేర్చుకుంటున్నాం. ఇంట్లో కొన్ని వేల సీడీలూ, పుస్తకాలూ ఉన్నాయి. అవే నాకు విలువైన ఆస్తి. కార్లో వచ్చేటపుడూ, ఇంట్లో ఉన్నపుడూ పాటలు వింటుంటాను. దూర ప్రయాణాలపుడు పుస్తకాలు చదువుతాను. పుస్తకాల్లోనూ ఆత్మకథలూ, జీవిత చరిత్రలూ, హాస్యానికి సంబంధించినవే చదువుతుంటాను. ఈ మధ్య ‘వెన్‌ బ్రెత్‌ బికమ్స్‌ ఎయిర్‌’ అని ఓ అద్భుతమైన పుస్తకం చదివాను. సానియా మీర్జా జీవిత చరిత్ర, గొల్లపూడి మారుతీరావు ఆత్మకథ ‘అమ్మకడుపు చల్లగా’ చదువుతున్నాను. పాత పాటలు, ముఖ్యంగా రఫీ పాటలంటే చెవి కోసుకుంటాను. ఈరోజుకీ రేడియోలో రాత్రి పదింటికి ‘ఛాయా గీత్‌’ వింటుంటాను. వాద్య సంగీతం అన్నా ఇష్టమే. మా ఆవిడకీ సంగీత కచేరీలంటే చాలా ఇష్టం. నగరంలో అలాంటి కార్యక్రమాలుంటే ఇద్దరమూ వెళ్తాం. ఇవన్నీ ఎలా సాధ్యమని చాలామంది అడుగుతుంటారు... ‘యూ డు వాట్‌ యు ఎంజాయ్‌. యు ఎంజాయ్‌ వాట్‌ యు డు’... అనేది నా జీవన విధానం. ఎప్పుడైనా కాస్త ఉత్సాహం తగ్గినా, ఒత్తిడిగా అనిపించినా నా హాస్పిటల్‌ గదిలోని ఆక్వేరియం ముందు కూర్చొని చేపల కదలికల్ని చూస్తూ రిలాక్స్‌ అవుతాను.

తల్లిదండ్రులతో మాట్లాడండి!
నా శ్రీమతి మా హాస్పిటల్‌లోనే గైనకాలజిస్టు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా నన్నూ, కుటుంబాన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. పిల్లలు కూడా ఫలానా డాక్టర్‌ గారి పిల్లలమంటూ నకరాలు చేయరు. మా అబ్బాయికీ డిసెంబరులో పెళ్లి. ఇవన్నీ చూశాక ‘నేనెంత అదృష్టవంతుడిని...’ అనిపిస్తుంది. ఇంట్లో శాంతీసుఖమూ లేకుంటే సమాజాన్ని ఇంకేం ఉద్ధరించగలం. శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌రెడ్డి గారు నా ఆత్మీయ నేస్తం. మా పొరుగునే ఉంటారు. మెడికల్‌ కాలేజీ నాటి ‘ఆ నలుగురు’ స్నేహితులు సుధాకర్‌ రెడ్డి, కృష్ణశారద, మోహన్‌ భాస్కర్‌, శివనారాయణలతో ఇప్పటికీ స్నేహబంధం కొనసాగుతోంది. అమ్మా, నాన్నా నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ ఆరోగ్యం ఈ మధ్య అంత బాగాలేదు. వూళ్లొ ఉన్నపుడు ‘ఒకసారి వచ్చిపో నాయనా’ అని పిలిచినా వెళ్దాంలే అనుకొని బిజీ పనులతో వెళ్లలేకపోయేవాణ్ని. ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది. కానీ మాట్లాడే స్థితిలో లేదు. అదే బాధాకరమైన విషయం. ఈతరం పిల్లలకు నే చెప్పేది ఒకటే... తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నపుడే వీలైనంత ఎక్కువ సమయం వాళ్లతో గడపండి. ప్రేమాప్యాయతలు పంచుకోండి! జీవితంలో అలాంటి రోజుల్ని వెనక్కి తీసుకురాలేం!

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.