close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాపు... తొలిచూపు!

బాపు... తొలిచూపు!

గాంధీజీ...
ఆ పేరే పరమమంత్రమై స్వాతంత్య్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపింది. అభేద్యమైన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేసింది.
సత్యాగ్రహం...
ఆ సూత్రం సామాన్యుల్ని అహింసా యోధుల్ని చేసింది. సత్యానికి పరమోన్నత స్థానం కల్పించింది.
సత్యశోధన...
ఆ ఆత్మకథ ఎన్నో జీవితాల్ని మార్చింది, ఎందరి ఆలోచనల్నో సరిదిద్దింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ‘మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ ఒకటి.
ఆన్‌లైన్‌లోనో ఆఫ్‌లైన్‌లోనో, వేదికల మీదో వ్యక్తిగత చర్చల్లోనో- ప్రతి నిమిషం...ఏదో ఓచోట, ఎవరో ఒకరు మహాత్ముడిని తలుచుకుంటూనే ఉంటారు. టైమ్స్‌ పత్రిక ‘ఈ శతాబ్దపు స్ఫూర్తిప్రదాత’ ఎవరని ప్రశ్నించినప్పుడు ...ప్రపంచం చెప్పిన తొలి రెండు పేర్లలో ఒకటి - గాంధీజీ!
ఆరేడు దశాబ్దాల తర్వాత కూడా...ఆయన పేరూ, ఆయన బోధనలూ, ఆయన రచనలూ ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయంటే - నేరుగా చూసినవారు ఇంకెంత సమ్మోహితులై ఉండాలి!
జీవితాన్ని మార్చే భేటీ అది.
కర్తవ్యాన్ని తట్టిలేపే కరచాలనం అది.
పరుసవేది లాంటి పలకరింపది.
చూపులైతే స్ఫూర్తి తరంగాలే!
నెహ్రూ, పటేల్‌, వినోబా...ఆ అదృష్టం ఏ కొద్దిమందికో దక్కింది. అయితేనేం, వారివారి ఆత్మకథల్లో అధ్యాయాలుగానో, డైరీల్లో పేజీలుగానో...చదివి తరించే అవకాశాన్ని మనకిచ్చింది.


నమ్మకం కలిగింది!
- సరోజినీ నాయుడు

‘గాంధీగారు లండన్‌ వస్తున్నారట’ - ఎవరో చెప్పారు. మరుక్షణమే, నా చూపులు క్యాలెండరు మీదికి వెళ్లాయి. ఎలాగైనా ఆయన్ని కలవాలి, మాట్లాడాలి. ఎన్నాళ్లొ వేచిన ఉదయం రానేవచ్చింది. నేరుగా ఓడరేవుకే వెళ్దామనుకున్నా. కుదర్లేదు. ఏదో ముఖ్యమైన పని అడ్డు తగిలింది. సాయంత్రానికంతా ఆయన బస చేసిన లాడ్జీకి బయల్దేరా. అదేమంత ఖరీదైన ప్రాంతం కాదు. గదులు కూడా ఇరుకుగా అనిపించాయి. మెట్లెక్కి పైకెళ్లగానే... ఎదురుగా గాంధీజీ! జైళ్లలో ఖైదీలకిచ్చే నల్లటి బొంతలాంటి దానిమీద కూర్చుని ఫలహారం చేస్తున్నారు. ఫలహారమంటే, అవేవో కమ్మని గుజరాతీ రుచులు కాదు. టమాటా ముక్కలూ, ఆలివ్‌ నూనె, పల్లీలూ, ఇంకేవో కలుపుకుని తింటున్నారు. అలికిడికి తల పైకెత్తారు. ‘మిసెస్‌ నాయుడు కదూ!’ - ముందే సమాచారం పంపడంతో, సులభంగానే గుర్తుపట్టారు. తన ముందున్న చెక్క గిన్నెను నా వైపు జరిపారు ‘తీసుకో...’ అంటూ! మొహమాటంతో ‘అబ్బే...వద్దండీ!’ అన్నా. అయినా వదల్లేదు. రెండు ముక్కలు నోట్లో వేసుకున్నా. రుచించలేదు. ప్రపంచ రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం అనడం కంటే, వింటూ కూర్చున్నా అంటేనే బావుంటుందేమో! దాదాపుగా నాది ప్రేక్షకపాత్రే! ఆయన ఆలోచనల్లో చాలా స్పష్టత ఉంది. అహింస మీద అపారమైన విశ్వాసం ఉంది. దక్షిణాఫ్రికాను ప్రయోగశాలగా చేసుకుని, సత్యాగ్రహశక్తిని నిరూపించారు కూడా. తొలి సమావేశంలోనే... భారత స్వాతంత్య్ర పోరాటాన్ని లక్ష్యం వైపు తీసుకెళ్లగల శక్తి ఆయనకు ఉందన్న నమ్మకం కలిగింది. అప్పటికే చీకటిపడటంతో ‘నమస్తే..వెళ్లొస్తాను’ అంటూ చేతులు జోడించాను. మరొక్కసారి, ఆ చెక్కగిన్నెను నాముందు పెట్టారు. ఎందుకో, ఈసారి ఆ ఫలహారం మహాద్భుతంగా అనిపించింది. ఆ కొద్దిగంటల వ్యవధిలో నాలో వచ్చిన మార్పునకు అది ప్రతీక కావచ్చు.


ఆ ప్రశ్నే జీవితాన్ని మార్చింది!
- బాబు రాజేంద్రప్రసాద్‌

‘త్యాగాలకు సిద్ధంగా ఉన్నావా?’
- తొలి సమావేశంలోనే గాంధీజీ సూటిగా అడిగిన ప్రశ్న ఇది. ఎదుటివాళ్లను ప్రశ్నలతో ఇరుకునపెట్టడమే నాకు తెలుసు. అలాంటి నేనే ముద్దాయిలా తడబడాల్సి వస్తుందని వూహించలేదు. అప్పటికే పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నిలదొక్కుకున్నా. రాబడి బాగానే ఉంది. ఇంకా కష్టపడాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి...అన్న ఆరాటం ఉండేది. నా వృత్తే నా ప్రపంచం. కాంగ్రెస్‌ కార్యక్రమాల్ని మాత్రం నిశితంగా గమనిస్తూ ఉండేవాడిని. గాంధీజీ మీద ప్రత్యేకించి ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడలేదు. సరిగ్గా అప్పుడే, చంపారన్‌లో రైతుల ఉద్యమం మొదలైంది. వాళ్లను కలవడానికి గాంధీజీ వస్తున్నారని తెలిసింది. ఆయనకు హిందీ ఓమోస్తరుగానే తెలుసు. సహాయకులు ఉంటే బావుంటుందని ..నన్నూ మరికొందరు న్యాయవాదుల్నీ సాయంగా వెళ్లమన్నారు. కాదనడానికి కారణం కనిపించలేదు. ఆయనా బారిస్టరే కాబట్టి, తొలి పరిచయంలో ఏవైనా చట్టపరమైన విషయాలు చర్చకు వస్తాయేమో అనుకున్నా. ఆయన మాత్రం అనూహ్యమైన ప్రశ్నను సంధించారు. ఏం జవాబు చెప్పాలి? అంతకుముందే ఒకరిద్దరు నాయకులు రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. ప్రస్తుతానికి వీలుపడదని కచ్చితంగా చెప్పేశాను. గాంధీగారి దగ్గర మాత్రం అంత నిర్మొహమాటంగా వ్యవహరించలేకపోయాను.

గతంలో ఓసారి బాపూజీని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయానికి ఆయన ఏదో సమావేశంలో ఉన్నారు. బయటి వూళ్లొ నాకూ కోర్టు పనులు ఉండటంతో వేచి చూడకుండా, వెళ్లిపోయాను. గాంధీజీతో వచ్చిన ఓ స్నేహితుడు, నేను వూళ్లొనే ఉన్నాననుకుని మా బంగళాకు తీసుకొచ్చాడు. ఆ ముతక గుడ్డలూ బోడిగుండూ చూసి, మా నౌఖరు గాంధీగారిని ఏ పల్లెటూరి కక్షిదారో అనుకున్నాడు. పెరట్లోని పాత సామాన్ల గదిలో కూర్చోమని చెప్పాడు. ఆ విషయం తెలిసిన ఓ కాంగ్రెస్‌ నాయకుడు, పరుగుపరుగున వచ్చి తనింటికి తీసుకెళ్లిపోయాడు. ఆతర్వాత తెలిసింది ఇదంతా! నౌఖరును చడామడా తిట్టేశాను. అయినా, బాధ వదల్లేదు. వీలైనంత తొందరగా మహాత్ముడికి క్షమాపణలు చెప్పాలని తీర్మానించుకున్నాకే, మనసు కాస్త కుదుటపడింది. కొన్నాళ్లకి ఆ సంగతే మరచిపోయాను. ఓ సమావేశంలో తనే, ‘మీరు లేరనుకుంటా, మీ ఇంటికొచ్చానోసారి...’ అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంత నిర్మల హృదయం ఆయనది.

గాంధీజీతో కలసి చంపారన్‌లో పర్యటించిన రోజులు నా జీవితంలో అతి ముఖ్యమైనవి. ఒకట్రెండు రోజులకని వెళ్లినవాడిని.. నెలలు గడుస్తున్నా అక్కడే ఉండిపోయాను. పోరాటం ఓ కొలిక్కి వచ్చాకే తిరుగుప్రయాణం అయ్యాను. అదీ అన్యమనస్కంగానే. వెళ్లాక కూడా, మనసంతా మహాత్ముడి చుట్టే తిరిగేది. కేసులూ కోర్టులూ సంపాదనా చాలా చిన్న విషయాల్లా అనిపించాయి. పూర్తిస్థాయిలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. మరో ఆలోచన లేకుండా, సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకేశాను.

గాంధీజీలోని నిరాడంబరత నన్ను బలంగా ప్రభావితం చేసింది. భారత తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు...ఓ ప్రజాసేవకుడికి అంత జీతం అవసరమా అనిపించింది. అందులో సగం కంటే తక్కువే తీసుకోవాలని తీర్మానించాను. అది త్యాగం కాదు, బాధ్యత. గాంధీజీ సాహచర్యంలో అలవడిన సంస్కారం. మహాత్ముడు నా జీవితంలో తారసపడకపోయి ఉంటే, నేను ఓ మామూలు న్యాయవాదిగా మిగిలేవాడినేమో.


అపోహ తొలగించారు
- చార్లీ చాప్లిన్‌

కాసేపట్లో గాంధీజీ వచ్చేస్తారని ప్రకటించారు. నేను కూర్చున్న గదిలో కోలాహలం మొదలైంది. దాంతోపాటే నా మనసులోనూ. గాంధీజీతో భేటీ ఖరారైన రోజు నుంచీ ఓ ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఆయనతో ఏం మాట్లాడాలి? దక్షిణాఫ్రికాలో వివక్ష గురించా, భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం గురించా, అహింసా విధానం గురించా, లేకపోతే...యంత్రాల పట్ల ఆయన వ్యతిరేకత గురించా? - నేనేం మేధావిని కాదు. నా చిన్నిబుర్రకు ఇంతకు మించి ఏమీ తట్టడం లేదు. అంతలోనే గాంధీజీ వచ్చారు. నేరుగా నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఆత్మీయంగా కరచాలనం చేశారు. ఆ నవ్వులో ఏదో మహత్యం ఉంది. ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం పట్ల నాకు సానుభూతి ఉంది. నా మద్దతు మీకే...’ అని హృదయపూర్వకంగా చెప్పాను. కృతజ్ఞతగా నవ్వారు. ‘కానీ, యంత్రాల్ని మీరు దయ్యాల్లా భూతాల్లా చూడటమే నాకు నచ్చడం లేదు...’ ఫిర్యాదు చేస్తున్నట్టుగా మాట్లాడాను.

‘కాదుకాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను యాంత్రికశక్తికి వ్యతిరేకం కాదు. ఆ యంత్రాల్ని అడ్డంపెట్టుకుని మానవశక్తిని గెలవాలనుకునే సామ్రాజ్యవాద శక్తులకే నేను వ్యతిరేకం. మనిషి శ్రమను తగ్గించే యంత్రమంటే నాకెప్పుడూ గౌరవమే’ అంటూ నా సందేహం తీర్చారు. నిజమే, ఇప్పటిదాకా నేను ఆలోచించని కోణమిది.

నిజానికి, నేను షూటింగ్‌లతో తీరికలేకుండా ఉన్నా. ఓ దశలో అయితే, సమావేశాన్ని రద్దు చేసుకోవాలన్న ఆలోచనా వచ్చింది. ఎందుకో, చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఇక్కడికొచ్చా. గాంధీజీని కలవకపోయి ఉంటే, ఓ మహావ్యక్తిని మరోలా అర్థం చేసుకుని ఉండేవాడిని. ఒకానొక అపోహ జీవితాంతం వెంటాడేది.


ఆయనొక హిమశిఖరం...
- వినోబా భావే

నాకు హిమాలయాలంటే ఆరాధనాభావం. బెంగాల్‌ అంటే గౌరవం. ఒకటి ప్రశాంతతకు ప్రతిరూపం. మరొకటి విప్లవాల గడ్డ.
గాంధీజీని తొలిసారిగా చూసినప్పుడు...ఒకేసారి, ఆ రెండూ నాకళ్లముందు మెదిలాయి. ఆయనో ప్రశాంత విప్లవం! సత్యాగ్రహానికి సంబంధించి నాకు కొన్ని సందేహాలు ఉండేవి. నా మనసులోని ఆలోచనలతో ఓ ఉత్తరం రాశాను. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం లేఖల్లో లభించదు. వీలుచూసుకుని రండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం’ అని జవాబిచ్చారు. లేఖతో పాటు ఆశ్రమ నిబంధనల్ని తెలిపే కరపత్రాన్ని జతచేశారు. రైలుబండిలో అహ్మదాబాద్‌ బయల్దేరాను. తెల్లారేలోపు ఆశ్రమానికి చేరుకున్నాను. స్నానం ముగించుకుని బాపూ దర్శనానికి వెళ్లాను. నేను వెళ్లే సరికి కూరగాయలు తరుగుతూ కూర్చున్నారు. ఓ జాతీయ నాయకుడిని అలా చూడటం వింతగా అనిపించింది. గదిలోకి వెళ్లగానే పలకరింపుగా నవ్వారు. నా చేతికీ ఓ కత్తి ఇచ్చారు. బొత్తిగా తెలియని వ్యవహారమది. అయినా ప్రయత్నించాను. ఫర్వాలేదు, కాసేపటికి పనిమీద పట్టు వచ్చింది. ఆశ్చర్యం! అప్పటి దాకా మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ‘ఇక్కడి వాతావరణం నచ్చిందా? నీ జీవితాన్ని దేశసేవకు అంకితం చేస్తావా?’ అంటూ తనే సంభాషణ ప్రారంభించారు. నేను మౌనంగా తలూపాను. అంతలోనే ఎవరో రావడంతో, సంభాషణ మరోవైపుమళ్లింది. ఆశ్రమంలో బాపూ అప్పగించిన ప్రతి పనినీ శ్రద్ధగా చేసేవాడిని. నా దృష్టిలో పాకీ పని అయినా, ప్రార్థన అయినా ఒకటే. ప్రార్థనలో నన్ను నేను మరచిపోయినట్టే, పాయిఖానాల్ని శుభ్రం చేస్తున్నప్పుడూ ఆ పనిలో తాదాత్మ్యం చెందేవాడిని. వంటశాలలోనూ చురుకైన పాత్ర నాదే. ఆ సమయంలో పొడిపొడి మాటలు తప్పించి, మహాత్ముడితో సుదీర్ఘ సంభాషణలేం జరగలేదు. ఓ ప్రార్థన సమావేశంలో నన్ను వేదిక మీదికి పిలిచి..అన్ని మతాల్లోని మంచినీ వెలికితీయమని ఆదేశించారు. దీంతో నా అరకొర సంస్కృత పాండిత్యానికి మెరుగులు పెట్టుకున్నాను. వేదాల్నీ ఉపనిషత్తుల్నీ లోతుగా అధ్యయనం చేశాను. అనువాదాల మీద ఆధారపడకుండా ఖొరాన్‌ చదవాలన్న ఉద్దేశంతో అరబిక్‌ నేర్చుకున్నాను. బాపూ మాట నిజమే! ప్రతి ధర్మం ఓ విజ్ఞాన భాండాగారమే.