close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆనందమాసం.. ఆశ్వయుజం!

ఆనందమాసం.. ఆశ్వయుజం!

వచ్చీరాగానే దసరా ఉత్సవాలను ఇస్తుంది. వెళ్తూవెళ్తూ అమావాస్య చీకట్లను తరిమే దీపావళిని ప్రసాదిస్తుంది - ఎంతైనా ఆశ్వయుజ వైభవమే వేరు. ఈ రెండు పెద్దపండగల మధ్యలో వ్రతాలూ పూజలూ బోలెడన్ని. చెడు మీద మంచి గెలిచితీరుతుందన్నదే ఈ వెన్నెలమాసపు సందేశం.

మ్మవారు మహామహా రాక్షసుల మదాన్ని అణచిన మాసమిది. పాండవులు జమ్మిచెట్టు మీదున్న అస్త్రశస్త్రాల్ని కిందికి దించి, కౌరవసేనల్ని పరుగులు పెట్టించిన నెల ఇది. విక్రమార్క చక్రవర్తి పేరు మీద విక్రమశకం మొదలైందీ ఇప్పుడే. రాములవారికి సరిగ్గా ఈ సమయంలోనే పట్టాభిషేకం జరిగిందంటారు. ఒకటారెండా, అనేకానేక ప్రత్యేకతల మాసం...ఆశ్వయుజం. ప్రబంధ, భావ సాహిత్యాల్లోనూ ఈ మాసపు వెన్నెలను వన్నెల పీఠం మీద కూర్చోబెట్టారు. మాసాలలో మహా సౌందర్యరాశి...ఆశ్వయుజం! అప్పటిదాకా బోరున కురిసిన వర్షాలు మెల్లగా తగ్గుముఖం పడతాయి. పచ్చని పట్టుచీర కట్టుకున్న పడుచు పేరంటాల్లా చెట్లూచేమలూ కొత్త సింగారాలు అద్దుకుంటాయి. బుడిబుడి అడుగుల బాల వటువుల్లా...లేలేత మొక్కలు పుట్టుకొస్తాయి. ఆశ్వయుజం శరదృతువులో వస్తుంది. వెన్నెల వైభోగాన్ని శరత్తులోనే చూడాలి. ‘శరదిందు వికాస మందహాసాం, స్ఫురదిందీవర లోచనాభిరామాం...అరవింద సమాన సుందరాస్యాం....అరవిందాసన సుందరీముపాసే’ అంటూ ఆ తల్లి దివ్యకాంతి శరదృతువులోని పండువెన్నెలని గుర్తుకు తెస్తుందంటారు ఉపాసకులు. శరత్కాలంలోనే అమ్మవారు పుట్టారట. అందుకే ఆ తల్లికి ‘శారద’ అన్న పేరొచ్చింది.

ఎన్నో ప్రత్యేకతలు...
శుక్లపక్షం ప్రారంభంకాగానే శరన్నవరాత్రులు మొదలవుతాయి. తొమ్మిదిరోజులూ తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని కొలుస్తారు. దసరా..పదిజన్మల పాపాల్ని పటాపంచలు చేసే పండగ. మనిషిలోని దశవిధ దుర్గుణాల్ని తొలగించే పండగ కూడా ఇదే. దేవీపురాణంలో ఒక్కో రాక్షస సంహార ఘట్టం పూర్తయిపోగానే, మనలోని ఓ అసుర గుణాన్ని వదిలించుకోవాలి. లోభం, మదం, మాత్సర్యం ...ఇలా రోజుకొకటి. విజయదశమి నాటికి మనలోని పది దుర్గుణాలూ రావణుడి తలకాయల్లా తెగిపడాలి! అదీ పండగ పరమార్థం. విజయదశమినాడే మధ్వజయంతి. ద్వైతగురువు మధ్వాచార్యులు రామాయణంలో ఆంజనేయుడి అవతారమనీ మహాభారతంలో భీమసేనుడి రూపమనీ విశ్వసిస్తారు. ఆయన నేతృత్వంలోనే కర్ణాటకలోని ఉడుపీక్షేత్రం జగద్విఖ్యాతమైంది. అక్కడి కృష్ణమఠంలో మధ్వజయంతి ఘనంగా జరుగుతుంది. దశమినాటి సాయంత్రం శమీవృక్ష సందర్శనంతో...తొమ్మిదిరోజుల దసరా ఉత్సవాలు పూర్తవుతాయి.

మరుసటి రోజు ఏకాదశి....పాశాంకుశైకాదశి. పాశం అంటే యమపాశం, యముడిచేతిలోని చావుతాడు. దాంతోనే...పాపుల్ని నరకానికి లాక్కెళ్లేది. ఈరోజున కనుక ఉపవాసం చేస్తే, ఆ వ్రతఫలం...అంకుశంలా యమ పాశాన్ని అడ్డుకుంటుందట! సమవర్తి అయిన యముడు కూడా ఏకాదశి వ్రతం చేసినవారి పట్ల కరుణ చూపుతాడట. తరువాత వచ్చే పున్నమి కూడా శ్రేష్ఠమైందే! ఈరోజు ‘కోజాగరీ వ్రతం’ చేస్తారు. కోజాగర్‌...మేలుకున్నదెవరు? - అని ఈ మాటకు అర్థం. అంటే, ఎవరెవరు జాగరణ చేశారో వాకబు చేసి మరీ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది! నాటి రాత్రి పాచికలాడటం సంప్రదాయం. పండగల్లోని పరమార్థాన్ని తెలుసుకోగలిగితే...అదే వేయి వికాస గ్రంథాలకు సమానం. ఒక వ్రతం ఉపవాసం ద్వారా జిహ్వచాపల్యాన్ని ఓడించమని సూచిస్తుంది. మరో వ్రతం జాగరణ ద్వారా నిద్ర అనే బలహీనతను అధిగమించమని హెచ్చరిస్తుంది. పాచికలు ఆడమంటే, వ్యసనానికి బలైపోయి ఆస్తుల్ని తెగనమ్ముకోమని ప్రోత్సహించడం కాదు. పాండవులు జూదమాడి ఎన్ని కష్టాల్ని కొనితెచ్చుకున్నారో, ఆ ఒక్క దురలవాటు కారణంగా ధర్మరాజు అంతటివాడి వ్యక్తిత్వానికి ఎన్నెన్ని మరకలు పడ్డాయో గుర్తుచేసుకోడానికి ఈ సమయం, చక్కని సందర్భం.

కృష్ణపక్షంలో..
కృష్ణపక్ష తదియరోజు ‘చంద్రోదయోమా వ్రతం’. చంద్రోదయం తర్వాత జరిపే ఉమాదేవీ వ్రతం అన్నమాట! ఏకాదశిని వాల్మీకి జయంతిగా జరుపుకునేవారూ ఉన్నారు. రత్నాకరుడనే కిరాతుడు ఆదికవిగా అవతరించిన ఘట్టం మనిషిలో అంతర్లీనంగా ఉన్న మహాశక్తికి సంకేతం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారన్న మహత్తర సందేశం. ద్వాదశినాడు ధన్వంతరి జయంతి. ధన్వంతరిలో చాలావరకూ విష్ణుమూర్తి పోలికలు కనిపిస్తాయి. కనిపించడం ఏమిటి, విష్ణువు అంశే! క్షీరసాగర మధనంలో కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి...ఈ వరుసలో పదకొండో స్థానంలో ధన్వంతరి అవతరిస్తాడు. ఓ చేతిలో అమృతభాండం, ఓ చేతిలో వనమూలికలూ ఉంటాయి. ధన్వంతరి అంటే, శరీరానికి పట్టిన వ్యాధుల్నీ మనసుకు పట్టిన రుగ్మతల్నీ వదిలించేవాడని అర్థం. పెసరపులగం స్వామికి నైవేద్యం. ఇక కృష్ణపక్ష చతుర్దశే...నరక చతుర్దశి. సత్యాదేవి కృష్ణస్వామి సాక్షిగా నరకుడిని సంహరించిన సుదినం. నరకం అంటే చీకటి. నరకుడు చీకటికి అధిపతి. చీకటి అజ్ఞానానికీ అసురత్వానికీ ప్రతీక. వెలుతురు మంచికి సంకేతం. అఖండ దీపకాంతులు మంచేగెలిచిందన్న మహత్తర సత్యాన్ని చాటి చెబుతాయి. దీపావళి అమావాస్యనాడు సాక్షాత్తూ లక్ష్మీదేవే ఘల్లుఘల్లుమని అడుగులేస్తూ ఇంటింటికీ వెళ్తుందట. ఆ సిరిదేవత అసూయాపరుల గడపతొక్కదు. అజ్ఞానుల ఆహ్వానాన్ని మన్నించదు. నిత్య అసంతుష్టులవైపు తొంగి కూడా చూడదు. ఎక్కడ ఆనందం ఉంటే, అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. అదే ఆమె స్థిరనివాసం, నిజవాసం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.