close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందం వెలిగిపోతోంది

అందం వెలిగిపోతోంది

పగటి పూట ఎన్ని అందాలైనా ఉండొచ్చు గాక. కానీ చీకటి రాజ్యానికి అందాల రాజైనా రాణైనా వెలుగే. అలాంటి కాంతి మరిన్ని వన్నెలను అద్దుకుని వెలిగితే ఆ అందాన్ని చూసేందుకు రెండు కళ్లేం సరిపోతాయి..? ఈ కారణం చాలదూ లైట్లు ఇంటి అలంకరణలో భాగం అయిపోవడానికి...

వెలుగులు విరబూసె

  పువ్వులే అందంగా ఉంటాయి. ఇక, అవి మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లితే ఆ సౌందర్యం చీకటిని సైతం చూడచక్కగా మార్చేయదూ... ‘ఆర్నమెంటల్‌ ఫ్లవర్‌ ప్లగ్‌ లైట్ల’ పేరుతో వస్తున్న ఈ లైట్లను చూస్తే ఎవరైనా ఈ మాటల్ని ఒప్పుకోవాల్సిందే. మామూలు ప్లగ్‌లైట్లకే చిన్న కుండీ అందులో మొక్కా, పువ్వులూ ఉన్నట్లు తీర్చిదిద్దిన ఇవి చూడ్డానికి అంత బాగుంటాయి మరి. ఇక, ‘లోటస్‌ ఫ్లవర్‌ టేబుల్‌ ల్యాంప్‌’ని చూస్తే సినిమాలోని గ్రాఫిక్కులోలా విచ్చుకున్న తామర పువ్వులోంచి కాంతి వెలువడుతున్నట్లు అనిపిస్తుంది. ‘సిరామిక్‌ తులిప్‌ వేజ్‌ ల్యాంప్‌’ అయితే, మరీ ప్రత్యేకం. పగటిపూట నిజమైన వేజూ అందులో తులిప్‌ పువ్వులా ఉండే ఈ వేజ్‌ వెలుగుతున్నప్పుడు కూడా సహజమైన పువ్వులానే కనిపించడం విశేషం. ఏమైనా పువ్వు పువ్వే, వెలుగు వెలుగే..!

అవాక్కయ్యారా..?

వెలుగుతున్న మనిషి చీకట్లో గోడను చీల్చుకుని దూసుకొస్తుంటే, స్పైడర్‌ మ్యాన్‌, కారు, బంతీ అన్నీ గోడను పగలగొట్టి వెలుగుతూ బయటికొస్తున్నట్లుంటే... అవాక్కవకుండా ఎవరైనా ఉంటారా... అందుకే, ఈ మార్వెల్‌ ఎవెంజర్స్‌ త్రీడీ వాల్‌ లైట్లకు ఇప్పుడు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్లగ్‌లో గుచ్చితే వెలిగే ఈ లైట్లతో పాటు త్రీడీ వాల్‌ స్టిక్కర్లు కూడా వస్తాయి. గోడ పగిలినట్లు కనిపించే ఈ స్టిక్కర్లను ప్లగ్‌ హోల్డర్‌ చుట్టూ అతికించి ప్లగ్‌కు లైటుని గుచ్చితే చాలు... పగిలిన గోడలోంచి స్పైడర్‌మ్యాన్‌, కారు, బంతీలాంటి వివిధ రూపాలు వెలుగుతూ బయటికి వచ్చినట్లనిపిస్తుంది.

కాంతి సిత్రాలు

  లైట్లు రకరకాల రూపాల్లో ఉండడం తెలిసిందే. కానీ వెదజల్లే వాటి కాంతులు విభిన్న రూపాల్లో కనిపించడం ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మాగీడీల్‌ స్పైరల్‌ ఎల్‌ఈడీ వాల్‌ లైట్లు, ఇన్నోరీ ఎల్‌ఈడీ వాల్‌ స్కోన్స్‌ అలాంటివే. చిన్నసైజు డబ్బాల్లా ఉండే వీటి లోపల రంగు రంగుల లైట్లు ఉంటాయి. డబ్బాలకు వేరు వేరు డిజైన్లలో రంధ్రాలు ఉండడంతో లోపలున్న కాంతి ఆయా రూపాల్లో గోడమీద పడి ఓ అందమైన డిజైన్‌ను ఆవిష్కరిస్తుంది. ఇవుంటే ఇల్లు ప్రతిరోజూ కళకళలాడిపోతుందనడంలో సందేహమేముందీ..?

ప్రియమైన కానుక

మనసైనవారితో సంతోషంగా గడిపిన క్షణాలు ఎవరికైనా చాలా విలువైనవి. అలాంటి సంఘటనల్ని గుర్తుచేసే ఫొటోలను ఎన్నిసార్లు చూసినా సంతోషం రెట్టింపే అవుతుంది. ఆ జ్ఞాపకాల్ని అందమైన కానుకగా మార్చి ఆత్మీయులకు అందిస్తే... ఇంకెంత ఆనందపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఇప్పుడు లైట్లు కూడా పర్సనలైజ్‌డ్‌ గిఫ్టులుగా మారిపోతున్నాయి. అమెజాన్‌, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌, ద గిఫ్ట్స్‌ ఫ్యాక్టరీ... లాంటి చాలా కంపెనీలు లైట్ల మీద మనకు నచ్చిన ఫొటోలను ప్రింటు చేసి ఇస్తున్నాయి. అందం, ఆనందం కలగలిస్తే ఎంత బాగుంటుందో మీరూ చూడండి.

నీడ కూడా అందమే

షాడో ఎల్‌ఈడీ లైట్లు... ఇవి వెలుగునివ్వడం మాత్రమే కాదు, రకరకాల ఆకర్షణీయమైన రూపాల్లో ఇంటికే అందాన్ని తెస్తాయి. ఇంకా ప్రత్యేకమైన విషయమేంటంటే వాటి నీడతోకూడా చూపరులను ఆకట్టుకుంటాయి. అవును, పువ్వులూ జంతువులూ కీటకాల్లా ఉండే ఈ వాల్‌ లైట్ల వెనుక గోడకు తగిలించే భాగం కాస్త పెద్దగా ఉండి, గోడకూ లైటుకూ మధ్య దూరం వచ్చేలా చేస్తుంది. దాంతో లైటు వెలిగినపుడు నీడ కూడా వెనుకవైపున మరింత పెద్దగా పడుతుంది. ఇవి, వేరు వేరు రూపాల్లో ఉండడంతో చూడ్డానికీ బాగుంటాయి.

వింతైన మెరుపు

లైటంటే లైటులానే ఎందుకుండాలి... పక్షి గూడూ అందులో గుడ్లలానూ, నీళ్లపంపూ అందులోంచి కారే నీరులానూ, ఒక బక్కెట్లో నుంచి మరో బక్కెట్లోకి పోస్తున్న పాలలానూ ఎందుకుండకూడదూ అనుకున్నట్లున్నారు కొందరు సృజనకారులు. నెస్ట్‌ ల్యాంప్‌, లిక్విడ్‌ ఎల్‌ఈడీ లైట్స్‌ పేరుతో ఇలా రకరకాల విద్యుద్దీపాలను రూపొందించేస్తున్నారు. కళ్లప్పగించేసేంత ప్రత్యేకంగా ఉన్నాయి కదూ!