close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచు శిఖరాల మీద విమానంలో విహరించాం

మంచు శిఖరాల మీద విమానంలో విహరించాం

‘ఎవరెస్టు శిఖరంమీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు’ అంటూ ఆ విశేషాలను మనతో పంచుకుంటున్నారు ఇటీవలే నేపాల్‌ను సందర్శించిన మిర్యాలగూడకు చెందిన బి.దయానంద్‌.

చుట్టూ భూభాగంతో ఉండే నేపాల్‌లో ప్రకృతి అందాలకూ జీవ వైవిధ్యానికీ లోటు లేదు. ప్రధాన ఆదాయం పర్యటక రంగమే. అందుకే ఆ దేశాన్ని చూసేందుకు ఖమ్మం నుంచి గోరఖ్‌పూర్‌ వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి మరో రెండు గంటలు ప్రయాణించి నేపాల్‌ సరిహద్దుకి చేరుకున్నాం. అక్కడ గేటు దగ్గర తనిఖీలన్నీ పూర్తయ్యాక నేపాల్‌లోని భైరవ పట్టణంలో అడుగుపెట్టాం. ఇది విశాలమైన రోడ్లతో చక్కని కట్టడాలతో పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఓ గంట ప్రయాణం చేశాక లుంబినీకి చేరుకున్నాం. బుద్ధుడు జన్మించిన రాజప్రాసాదం ఓ పెద్ద ఉద్యానవనంలో అవసానదశలో ఉంది. మొండిగోడలతో శిథిలావస్థలో ఉన్న ఆ పురాతన రాజప్రాసాదంమీద బౌద్ధమత సంప్రదాయంలో ఓ పెద్ద డోమ్‌ను నిర్మించారు. మర్నాడు పదిగంటలపాటు హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రయాణించి ఖాట్మండు చేరుకున్నాం. ఇక్కడ హోటల్‌ గదుల ధరలు భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ. మన రూపాయి 1.60 నేపాలీ రూపైయాలతో సమానం. పైగా మన రూపాయలు అక్కడ చలామణీ అవుతాయి. నేపాల్‌లో 90 శాతం హిందువులూ పది శాతం మంది ఇతరులూ ఉన్నారు. ఖాట్మండులో చూడాల్సిన ప్రదేశాల్లో పశుపతినాథ్‌ మందిరం ముఖ్యమైనది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ మందిరంలోని శివలింగానికి నాలుగువైపులా ముఖాలు దర్శనమిస్తాయి. దానిపైన బంగారురేకుతో చెక్కిన శివముఖాకృతిని తొడుగుతారు. భారత సంతతికి చెందినవారే ఇక్కడ పూజారులు. ఈ మందిరానికి దిగువన ఓ పక్కగా భాగమతీ నది ప్రవహిస్తుంటుంది. మందిర ప్రాంగణం నుంచి కిందకు చూస్తుంటే కొంతమంది మంత్రోచ్ఛారణతో ఓ పార్ధివ శరీరాన్ని నదిలో మూడుసార్లు ముంచి ఒడ్డునే ఉన్న చితిపై దహనం చేయడం కన్పించింది. అందులో నుంచి వస్తోన్న పొగ పశుపతి మందిరంవైపు వస్తూ గోపురాన్ని తాకుతూ ఉంటే ఆ శరీరంలోని ఆత్మ ఆ గోపురంద్వారా మందిరంలోకి ప్రవేశించి ఆ దైవంలో ఐక్యమవుతుందా అన్న భావన కలుగుతుంది.

దర్బారు కూడలి!
తరవాత మేం దర్బార్‌ స్క్వేర్‌కు వెళ్లాం. రాజమహల్‌తోపాటు ఇతరత్రా అనేక మందిరాలూ ప్రజాదర్బారు భవనాలూ పచ్చికబయళ్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడే కాదు, పాటన్‌, భక్తపుర్‌ పట్టణాల్లో కూడా దర్బారు స్క్వేర్‌లు ఉన్నాయి. చెక్కలతోనూ ఇటుకలతోనూ కట్టిన అనేక అంతస్తుల పగోడాలతో ఇవి ఎంతో చూడచక్కగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు పట్టణాలూ కలిసిపోయి ఖాట్మండు వ్యాలీగా మారాయి.

తరవాత అక్కడ నుంచి బౌద్ధ స్థూపానికి వెళ్లాం. బుద్ధుడి మరణానంతరం ఓ పేద మహిళ తన జీవితకాలం కష్టపడి దీన్ని నిర్మిస్తూ మరణించిందనీ ఆమె కోరిక మేరకు నలుగురు కొడుకులూ దాన్ని పూర్తిచేశారనీ చెబుతారు. 118 అడుగుల ఎత్తూ 325 అడుగుల చుట్టుకొలతలతో ఉన్న ఈ స్థూపం ప్రపంచంలోని ఎత్తైన స్థూపాల్లో ఒకటి. ఇక్కడి నుంచి బుడా నీలకంఠ దగ్గరకు వెళ్లాం. అక్కడ ఉన్న నీటికొలనులో ఆదిశేషునిమీద నిద్రిస్తున్నట్లుగా ఉన్న నలభై నాలుగు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంది. క్షీరసాగర మథనంలో ఏర్పడిన గరళాన్ని తాగిన శివుడు ఆ గరళకంఠాన్ని చల్లార్చుకోవడానికి ఈ కొలనులో నీరు తాగాడనీ అందుకే ఆ పేరు వచ్చిందనీ పూజారులు చెప్పారు. ఇక్కడ నుంచి స్వయంభూనాథ్‌కి వెళ్లాం. దీన్నే కోతుల ఆలయం అనీ పిలుస్తారు. ఈ కొండమీదకి రోడ్డుమార్గంలోగానీ 365 మెట్లు ఎక్కిగానీ చేరవచ్చు. ఇక్కడికి ఉదయం తొమ్మిదిగంటలలోపు వెళ్లడం మంచిది. ఓ పెద్ద సరస్సు మధ్యలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోన్న తామరపుష్పాన్ని దగ్గరగా చూడాలని మంజుశ్రీ అనే యోధుడు కొన్ని కొండరాళ్లను తొలగించి సరస్సులోని నీటిని ఖాళీచేసి ఆ పుష్పం దగ్గరకు వెళ్తూ ఉంటే తామరపుష్పం పెద్ద కొండగానూ దాని తేజస్సు స్థూపంగానూ మారాయనీ అందుకే దీన్ని స్వయంభూ స్థూపం అంటారనీ చెప్పారు. ఈ స్థూపానికి నలువైపులా బుద్ధుడి కళ్లను చిత్రించారు. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది.

పర్వత శిఖరాల్లో విహారం

తరవాత రాయల్‌ ప్యాలెస్‌కి వెళ్లాం. మ్యూజియంగా మార్చిన ఈ ప్యాలెస్‌లో అనేక కళాఖండాలూ నేపాల్‌ సంస్కృతీ చిహ్నాలూ ప్రాచీన వస్తువులూ కనిపించాయి. ఖాట్మండులోని థామెల్‌ ప్రాంతంలో క్యాసినోలూ నైట్‌క్లబ్‌ల సందడి కనిపించింది. తరవాతిరోజు ఉదయం త్రిభువన్‌ ఏరోడ్రోమ్‌కి వెళ్లాం. ఓ మౌంటెయిన్‌ ఫ్లైట్‌లో లాంగ్‌టాంగ్‌ నుంచి గౌరీశంకర్‌, ఎవరెస్టు, మకాలు వరకూ ఉన్న అన్ని పర్వతాల ఉపరితలాన్నీ చూపించారు. విమానం ఆయా పర్వత శిఖరాలమీద ఎగురుతుంటే సూర్యుడి కిరణాలు ఆ మంచు శిఖరాలమీద రంగులు మారుతూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎవరెస్టు పర్వతశిఖరంమీద ఎగురుతున్నప్పుడు ఎంతో ఉద్విగ్నతకు గురవుతాం. కదిలే మేఘాల నీడలు సూర్యుడి వెలుగులో తెల్లని మంచుకొండలమీద నల్లగా పడుతూ వేగంగా పరుగెడుతున్నట్లు కనిపిస్తుంటే తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాం.

ఆ మర్నాడు ఉదయం ఖాట్మండు నుంచి మూడుగంటలపాటు ప్రయాణించి మనోకామన అనే ప్రదేశానికి చేరుకున్నాం. కొండమీద ఉన్న ఈ మందిరానికి రోప్‌వే ద్వారా ప్రయాణిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ మందిరంలోని అమ్మవారిని త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరతాయట. అందుకే దీనికా పేరు. దర్శనానంతరం అక్కడి నుంచి మూడు గంటలపాటు ప్రయాణించి పోఖరాకి చేరుకున్నాం. ఈ పట్టణంలో సగభాగం సరస్సులే. మరోపక్క మంచుతో కప్పబడిన అన్నపూర్ణ పర్వతశిఖరాలు కనువిందు చేస్తుంటాయి. ఫెవా సరస్సు పక్కన గల బజారులో ఖరీదైన షాపులూ రెస్టరెంట్లూ కనిపించాయి. ఈ పట్టణంలో చూడదగ్గవాటిలో గుప్తేశ్వర్‌ మహదేవ్‌ కేవ్‌ మందిరం ముఖ్యమైనది. ఈ గుహలోకి వెళ్లడానికి సుమారు యాభై అడుగుల లోతుకి ఉన్న మెట్లు దిగాలి. ఈ మెట్లు దిగి కిందకు వెళితే ఓ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం గుండా లోపలకు వెళితే ఓ గుహ కనిపిస్తుంది. అందులో కొంతదూరం నడిచాక మరో వందమెట్లు కిందకు ఉంటాయి. అవి దిగుతూ ఉంటే చల్లని నీటి చుక్కలు మనమీద ధారలాగా పడుతుంటాయి. అయినా గాలి లేకపోవడంతో చెమటలు పడుతుంటాయి. అలా మెట్లన్నీ దిగి కొంతదూరం నడిస్తే అక్కడ శివాలయం కనిపించింది. దైవదర్శనానంతరం మందిరం వెనక వైపున ఉన్న గుహలోకి వెళ్లాం. అక్కడ గుహ చాలా ఇరుకుగా ఉంటుంది. తరవాత అక్కడ నుంచి కొంతదూరంలోని ఓ కొండమీద ఉన్న వింధ్యవాసినీ మందిరానికి వెళ్లాం. ఇందులోనే అనేక దేవాలయాలు ఉన్నాయి.

అది పెద్ద సాహసమే!
తరవాత గబ్బిలాల గుహకి వెళ్లాం. ఇందులోకి వెళ్లడానికి అందరికీ టార్చిలైటు ఇస్తారు. ఈ గుహలో ఏటవాలుగా ఉన్న మార్గంలో యాభై అడుగులు వెళ్లాక గుహ అంతా ఎత్తుపల్లాలతో చీకటిగా ఉంటుంది. కొంతదూరం వెళ్లాక బయటకు రావడానికి మరో మార్గం ఎక్కడో పైన కనిపించింది. అక్కడకు పాకుతూ వెళితే ఓ రంధ్రం కనిపించింది. ముందు చేతులు బయటపెట్టి దాన్ని పట్టుకుని తల బయటకు పెట్టాలి. తలను పూర్తిగా నేలవైపు వంచి చేతులతో పాకుతూ శరీరాన్ని బయటకు లాగాలి. ఇది చాలా క్లిష్టమైన చర్య. పర్వతారోహణ శిక్షణలో ఓ భాగమని ఆ గుహ నిర్వాహకులు చెప్పారు. తరవాత అక్కడే ఉన్న డెవీస్‌ ఫాల్స్‌, మహేంద్ర కేవ్స్‌, ఫెవా సరస్సుల్నీ చూశాం. సరస్సు మధ్యలోని విష్ణు మందిరాన్ని సందర్శించుకుని పోఖరాకు సమీపంలోని సారంగపూర్‌కి వెళ్లాం. అక్కడ బంగీజంప్‌, జిప్‌మర్‌, పారాగ్లైడింగ్‌, రాఫ్టింగ్‌, క్యాంపింగ్‌, రాక్‌క్లైంబింగ్‌... వంటి సాహస క్రీడలు ఉన్నాయి.

ముక్తినాథ యాత్ర!