close
ఉపకారం

ఉపకారం
- రామిశెట్టి విజయలక్ష్మి

ఇల్లంతా అగర్‌బత్తీల సువాసన పరచుకుని ఉంది. పూజ పూర్తయిపోయి, హారతి ఇస్తున్న సూచనగా... గంట చప్పుడు వినబడుతోంది. హారతి కళ్ళకద్దుకుని దేవుడి గదిలో నుండి బయటకు వస్తూ, బెడ్‌రూమ్‌ వంక చూసింది విమల.

ఆనందరావు ఇంకా బెడ్‌ పైనే ముసుగుతన్ని ఉండటం చూసి ‘‘ఏమండీ... ఏమండీ..!’’ అని పిలిచింది విమల.

‘‘అబ్బా! ఏమిటే ఆ కేకలు’’ ముసుగు తీయకుండానే అన్నాడు ఆనందరావు.

‘‘ఈరోజు సరుకుల కోసం బజారుకి వెళదామన్నాను కదా. లేచి త్వరగా తెమలండి’’ అంటూ వంటగది వైపు నడిచింది విమల. ఇక లెగవక తప్పదని అయిష్టంగానే లేచి రెడీ అయ్యాడు ఆనందరావు.

తనూ రెడీ అయి, ఇంటికి తాళంవేసి కారు ఎక్కుతుండగా ‘‘విమలగారూ..!’’ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది విమల. ఎదురు ఫ్లాట్‌ రాధిక, వాళ్ళమ్మాయి నిలబడి ఉన్నారు.

‘‘ఏమిటి రాధికగారూ’’ అంటూ దగ్గరకి వెళ్ళింది విమల.

‘‘ఏమీ అనుకోకపోతే, మా అమ్మాయిని కాస్త స్కూలు దగ్గర దింపి వెళతారా? మావారు వూళ్ళొ లేరు. నాకు జ్వరంగా ఉంది’’ అని మొహమాటపడుతూ అడిగింది రాధిక.

అప్పుడు చూసింది రాధిక వంక... రేగిపోయిన జుట్టూ, లోతుకు పీక్కుపోయిన కళ్ళూ... పాపం నీరసంగా ఉంది.

‘‘అయ్యో, దానిదేం ఉందండీ... అలాగే. అటువైపేగా వెళుతున్నాం... అంతలా అడగాలా?’’

‘‘రామ్మా’’ అంటూ ఆ అమ్మాయిని పిలిచింది విమల. పెద్ద పుస్తకాల బ్యాగు మోస్తూ గబగబా విమల దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి.

ఇదంతా గమనిస్తున్న ఆనందరావు అసహనంగా, కోపంగా వూగిపోతున్నాడు. ‘‘ఏంటి విమలా, ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఎందుకు డ్రాప్‌ చేయాలి? మనం పనిమీద వెళుతున్నాం కదా! ఇప్పటికే లేట్‌ అయింది’’ అంటూ విరుచుకుపడ్డాడు.

‘‘ఇప్పుడేమయిందని..? ఇంకో పావుగంట లేట్‌ అవుతుంది, అంతేకదా. మనకేం అర్జంటు పనులు లేవుగా. ట్రెయిన్‌ క్యాచ్‌ చేయాలా, బస్‌ క్యాచ్‌ చేయాలా? పదండీ’’ అని భర్త ప్రవర్తనకి విసుక్కుంటూ అమ్మాయితోపాటు కారెక్కింది విమల. తన మాట నెగ్గనందుకు కోపంగా, రాష్‌గా డ్రైవ్‌ చేస్తున్నాడు ఆనందరావు.

కాస్త కూడా హెల్పింగ్‌ నేచర్‌ లేని తన భర్త గురించే ఆలోచిస్తోంది విమల. నెలరోజుల క్రితం కూడా ఆనందరావు ఇలానే చేశాడు.

‘‘విమలా, ఒక్కసారి తొందరగా రామ్మా’’ అని ఏడుస్తూ వచ్చింది పక్కింటి కాంతమ్మగారు. పెద్దావిడ అలా ఏడుస్తూ వచ్చేసరికి కంగారుగా ఆవిడతో వాళ్ళ ఇంట్లోకి నడిచింది విమల.

‘‘చూడమ్మా, ఈయన ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. టాబ్లెట్‌ వేసినా తగ్గలేదు. ఇప్పుడు పిలిచినా పలకటంలేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా’’ అంటూ కొంగుతో కన్నీళ్ళు వత్తుకుంటోంది కాంతమ్మగారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో సెటిలయ్యాడు. ముందుచూపుతో ఆస్తిగా ఈ ఫ్లాట్‌ కొని ‘అమ్మానాన్నాల కోసమే’ అని అందంగా అబద్ధమాడి, ఈ ఇంట్లో ముసలి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసి, తమ బాధ్యత అయిపోయిందన్నట్లు చేతులు దులిపేసుకున్నారు వాళ్ళ కొడుకూ కోడలు.

వాళ్ళని ఆ పరిస్థితిలో చూసిన విమల చలించిపోయింది. ఒక్క ఉదుటున ఇంట్లోకి వచ్చి జరిగింది ఆనందరావుకి చెప్పింది.

‘‘పెద్దాయనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి తొందరగా పదండి. ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు పాపం’’ అంది విమల.

అంతే... ఇంతెత్తున మండిపడ్డాడు ఆనందరావు. ‘‘నీకు మరీ చాదస్తం ఎక్కువైపోతోంది విమలా. ఇప్పుడు ఆయనని మనం హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలా... మనకి వేరే పనేమీ లేదా? ఎప్పుడు చూసినా ఎవరెవరికో ఏదో చేయాలంటావు.

పై ఇంటి అబ్బాయిని ‘ఎగ్జామినేషన్‌’ సెంటర్‌లో దింపమంటావు. పక్కవాళ్ళ పసిపాపకి అర్జంటుగా పాలడబ్బా తెమ్మంటావు. మొన్న నీ ఫ్రెండ్‌ మెట్ల మీద జారిపడిపోయి కాలు ఫ్రాక్చర్‌ అయితే కూడా మనమే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. ఎవరిదారి వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నువ్వెందుకు అన్నీ నీ నెత్తిన వేసుకుంటావు?’’

‘‘చూడండీ’’ ఆనందరావు మాటలకి బ్రేక్‌ వేస్తూ అంది విమల.

తల తిప్పి విమల వంక అదే కోపంతో చూశాడు ఆనందరావు. ఆనందరావు మాటలు అసలు రుచించలేదు విమలకి.

‘‘చూడండీ... వాళ్ళవాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకా, ఆత్మాభిమానంలేకా కాదండీ... మనల్ని అడగటం. తప్పనిసరి పరిస్థితుల్లో అభిమానం చంపుకుని మనల్ని అడుగుతారు. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఏ అనాథ శరణాలయంలోనో అన్నం వడ్డిస్తే సరిపోదండీ... మీ గొప్పతనం చూపించటానికి. మీ బర్త్‌డే రోజు ఓ జత బట్టలు ఓ పేదవాడికి అందించి, ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టడం కాదండీ. మన కళ్ళముందు కష్టమొచ్చినవాళ్ళని ఆదుకుని మనకు తోచినది, మన పరిధిలో ఉన్న చిన్నచిన్న సహాయాలైనా చేయాలి. దానివలన మనం నష్టపోయేదేమీ లేదు, ఈ చిన్నచిన్న సహాయాలే అవతలివాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. పైగా మనకీ ఎంతో తృప్తి కలుగుతుంది. మనం మనుషులమనిపించుకుంటాం. ఇలాంటి అవసరాలు రేపు మనకు రావని గ్యారంటీ ఉందా?’’ అంటూ భర్తని నిలదీసింది విమల.

పెద్దాయన్ని హాస్పిటల్లో జాయిన్‌ చేసి, ఆయన కోలుకునే వరకు అండగా ఉన్న విమల చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళ పర్యంతమైంది కాంతమ్మగారు. ఆయన కోలుకున్నందుకు చాలా సంతోషపడింది విమల.

ఈ ఆలోచనల మధ్య రాధికవాళ్ళ అమ్మాయిని స్కూల్లో దింపి, షాపింగ్‌ చేసుకుని ఇంటికొచ్చారు.

‘ఈయన ఎప్పుడు మారతాడో’ అని విమలా, ‘దీనికెందుకొచ్చిన తంటా ఇది’ అని ఆనందరావూ ఆలోచిస్తూనే ఉన్నారు.

***

వూరికి కాస్త దూరంగా ఉన్న శివాలయంకి వెళ్ళాలని విమల కోరిక. ఎలాగో భర్తని ఒప్పించి, ఓ సాయంకాలం గుడికి బయలుదేరారు ఇద్దరూ. అక్కడి ప్రశాంత వాతావరణం చూసి ఎంతో సంతోషపడిపోయింది విమల. స్వామికి అర్చన చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చీకటిపడింది.

‘‘ఏమండీ, అటు చూడండి. ఏదో యాక్సిడెంట్‌ అయినట్లుంది’’ గట్టిగా అరిచింది విమల.

‘‘ఆఁ... అవును, అయినట్లుంది’’ తాపీగా అన్నాడు ఆనందరావు.

‘‘అలా తాపీగా అవును అంటారేమిటండీ... కాస్త కారు స్లో చేయండి’’ అంది.

స్లో చేశాడు ఆనందరావు.

‘‘అయ్యో, అటు చూడండి- ఆయనెవరో... రక్తం కారిపోతోంది, బాధతో కొట్టుకుంటున్నాడు. ప్రాణం ఉంది. త్వరగా హాస్పిటల్‌కి తీసుకువెళదాం. కారు ఆపండి’’ ఆత్రుతగా అరుస్తూ అంది విమల.

చాలా ఆశ్చర్యంగా విమల వంక చూశాడు ఆనందరావు.

‘‘నీకేమైనా పిచ్చిపట్టిందా? ఎవరో, ఎలా జరిగిందో... చూసీచూడనట్లు వెళ్ళిపోకపోతే... పోలీసులూ ఎంక్వయిరీలూ... లక్ష ప్రశ్నలు. మనకు ఎందుకొచ్చిన గొడవ. పోలీసులు మనమే చేశామని అన్నా అంటారు. నోరు మూసుకుని పద’’ అని అరుస్తూ కారు ఆపకుండా స్పీడ్‌ పెంచి ఇంటికి తెచ్చాడు ఆనందరావు.

ఆ దృశ్యం కళ్ళల్లో మెదులుతుంటే... ఆ రాత్రి కనురెప్పలు మూతపడలేదు విమలకి.

***

పొద్దుననగా వెళ్ళిన కొడుకు ఆకాష్‌ రాత్రి వరకూ ఇంటికి రాలేదు. లేటుగా వచ్చిన ఆకాష్‌ స్నానం చేసి సోఫాలో చతికిలపడ్డాడు. వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో దిగులుగా కనిపిస్తున్న కొడుకు వాలకం గమనిస్తూనే ఉంది విమల.

‘‘భోజనం చేద్దువుగాని రారా’’ అని పిలిచింది.

‘‘నాకు ఆకలిగా లేదమ్మా!’’ అన్నాడు ఆకాష్‌ ముక్తసరిగా.

‘‘ఏంట్రా, అలా ఉన్నావ్‌? పొద్దున వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు, ఏం జరిగింది?’’ సోఫాలో పక్కన కూర్చుంటూ అడిగింది విమల.

కాసేపు మౌనంగా ఉన్న ఆకాష్‌ నెమ్మదిగా అన్నాడు ‘‘అమ్మా, నీకు నా ఫ్రెండ్‌ పవన్‌ తెలుసుగా... వాళ్ళ నాన్నగారు చనిపోయారమ్మా.’’

‘‘అవునా... పాపం ఏమయింది, ఏం జరిగింది?’’ వాళ్ళ ఫ్యామిలీతో కాస్త పరిచయం ఉంది కనుక ఆశ్చర్యపోతూ అడిగింది విమల.

‘‘ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదురా? నేనూ నాన్నా వచ్చేవాళ్ళం కదా. పాపం, వాళ్ళ అమ్మగారూ పిల్లలూ ఎలా ఉన్నారు?’’ బాధపడుతూ అడిగింది.

‘‘నిన్నరాత్రి శివాలయం రోడ్డులో ఏదో లారీ గుద్దేసిందట. అక్కడ ఎక్కువ ట్రాఫిక్‌ ఉండదు కదా, ఎవరూ చూసి ఉండరు. ఎవరైనా త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఉంటే బతికేవారంటమ్మా. రక్తం ఎక్కువగా పోవటంవల్ల చనిపోయారంట. పాపం వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేనిదైపోయిందమ్మా’’ ఏడుస్తూ చెబుతున్నాడు ఆకాష్‌.

ఇంకా ఏదో చెబుతున్న కొడుకు మాటలు విమల చెవులకి సోకటంలేదు. నిన్నరాత్రి దృశ్యం కళ్ళముందు కదులుతుంటే... చేష్టలుడిగి అలాగే ఉండిపోయింది.

***

ఫోన్‌ మోగటంతో చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి సెల్‌ ఆన్‌ చేసింది విమల. ‘‘హలో అమ్మా!’’ అవతల నుండి ఆకాష్‌ మాట్లాడుతున్నాడు.

కొడుకు చెప్పేది పూర్తిగా వినకుండానే ఒక్క పరుగున బయటకు వచ్చి ఆటో ఎక్కింది.

హాస్పిటల్‌ ముందు ఆటో దిగుతూ, చేతికి దొరికిన నోటు ఆటోవాలా చేతిలో కుక్కి చిల్లర కోసం చూడకుండా పరుగు పరుగున లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి.

‘ఐసియూ’ ముందు ఆకాష్‌, పవన్‌ మాట్లాడుకుంటూ కనబడ్డారు. కొడుకుని పట్టుకుని బావురుమంది విమల.

విమల కాస్త తేరుకున్న తరవాత, ఆనందరావుకి యాక్సిడెంట్‌ ఎలా జరిగిందో... టైమ్‌కి పవన్‌ హాస్పిటల్లో జాయిన్‌ చేసి ఎలా ప్రాణం కాపాడాడో... వివరంగా చెప్పాడు ఆకాష్‌.

‘‘నాన్న ఔట్‌ ఆఫ్‌ డేంజర్‌ అమ్మా’’ తల్లిని కాస్త ఓదార్చాడు ఆకాష్‌.

‘‘అంకుల్‌కి ఏమీ కాదు ఆంటీ, ఇప్పుడు బాగానే ఉన్నారు’’ అంటున్న పవన్‌ని దగ్గరకు తీసుకుని హత్తుకుంది విమల.

మరునాడు కాస్త తేరుకున్నాడు ఆనందరావు. బెడ్‌ పక్కనే ఉన్న భార్యనీ, కొడుకునీ చూసిన ఆయన కళ్ళల్లో సంతృప్తి. చివరగా నిలబడ్డ పవన్‌ని చూసి దగ్గరకు రమ్మని పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకుని పవన్‌ చేతులు పట్టుకున్నాడు ఆనందరావు. ఉద్వేగంతో ఆయన గొంతు పూడుకుపోతోంది.

‘‘బాబూ పవన్‌, నన్ను క్షమించమని కూడా అడగలేను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. నా అజ్ఞానంతో మీ నాన్న మరణానికి పరోక్ష కారణమయ్యాను. మీ కుటుంబానికి తీరని అన్యాయం చేశాను. అయినా... అయినా... కూడా నువ్వు నన్ను కాపాడావు. నా ప్రాణం నిలిపావు. ఈ అపకారికి ఉపకారం చేసి పెద్ద గుణపాఠం నేర్పావు. నా కళ్ళు తెరిపించావు’’ అంటున్న ఆనందరావు కళ్ళు పశ్చాత్తాపంతో వర్షించాయి.

***

‘‘ఏమండీ, ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళారు, చెప్పి వెళ్ళొచ్చుగా?’’ చెప్పులు విప్పి లోపలికి వస్తున్న ఆనందరావుని కాస్త కంగారుగా అడిగింది విమల.

‘‘ఏం లేదు విమలా! అలా బయటకు వెళ్ళాను. ఒక బామ్మగారు నడుస్తూ నడుస్తూ ఏదో రాయి తగిలి పడిపోయారు. కాలు బెణికింది. ఆవిడ నడవలేకపోతున్నారు. తోడు కూడా ఎవరూ లేరు. అందుకని... అడ్రస్‌ అడిగి ఆటోలో ఆవిడని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వచ్చాను. ఒక్కరే వెళ్ళొద్దని చెప్పినా తోచక బయటికి వచ్చారంట బామ్మగారు. వాళ్ళవాళ్ళు ‘థ్యాంక్స్‌ అండీ’ అంటూ ఎంతో సంతోషపడ్డారు తెలుసా! నాకూ చాలా సంతోషంగా అనిపించింది- నేను మంచిపని చేశానని’’ అని చెబుతున్నాడు ఆనందరావు.

తన భర్తలో వచ్చిన మార్పుని చూసి సంతోషంతో తబ్బిబ్బై కళ్ళు చెమర్చాయి విమలకి. తను కోరుకున్న మార్పు అదే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.