close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికాలో చదివిన ఐఐటీ ప్రొఫెసరీయన!

అమెరికాలో చదివిన ఐఐటీ ప్రొఫెసరీయన!

  చింపిరి జుట్టూ, గుబురుగా పెరిగిన గడ్డం, ఎండిపోయిన డొక్కలూ, ఒంటిని అంటిపెట్టుకున్న ఓ లుంగీ... చూడగానే ఎలాంటి ఆదరణా లేని అభాగ్యుడిలా, బతికిచెడ్డ పేద రైతులా కనిపిస్తారు అలోక్‌ సాగర్‌. కానీ ఐఐటీలో చదివి, అమెరికాలో పీహెచ్‌డీ చేసి, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌కు ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పింది అతడే అంటే నమ్మగలరా..!

కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో గోడొంగరీ అనే అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు గిరిజనులపైన సర్వే చేయడానికి అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఒక్కో వూళ్లొ గిరిపుత్రుల గురించి ఆరా తీస్తుంటే వాళ్లకు సైకిల్‌ మీద చొక్కా లేకుండా తిరుగుతున్న ఓ పెద్ద మనిషి కనిపించాడు. అతడి మొహం చూస్తే గిరిజనుడు కాదని వాళ్లకు అర్థమైంది. వాళ్లకు సంబంధం లేని వ్యక్తి అక్కడేం చేస్తున్నాడనే అనుమానం కలిగింది. తానూ వాళ్లలో ఒక్కడినేనని ఆ పెద్దాయన పదేపదే చెప్పినా అధికారులకు నమ్మకం కలగలేదు. ఆయనకు సంబంధించిన రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు లాంటి ధ్రువ పత్రాలేవైనా ఉంటే చూపించమని నిలదీశాక కానీ అసలు విషయం బయట పడలేదు. ఆ గిరిపుత్రుల్లో ఒకడిగా కలిసిపోయి జీవిస్తోన్న ఆ పెద్దాయన పేరు అలోక్‌ సాగర్‌. అతడి తండ్రి ఐఆర్‌ఎస్‌ అధికారి. తల్లి ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌. దిల్లీ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, పీజీ పూర్తి చేసిన మేధావి. ఆపైన టెక్సాస్‌లోని హూస్టన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. భారత్‌కు తిరిగొచ్చి దిల్లీ ఐఐటీలో పదేళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలా అలోక్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది ప్రముఖుల్లో మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కూడా ఉన్నారు. ఆయన నేపథ్యాన్ని ధ్రువీకరించుకున్నాక అక్కడి అధికారులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.

ఉద్యోగానికి రాజీనామా
ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓసారి ఏదో పరిశోధన పనిమీద మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి వెళ్లారు అలోక్‌. అక్కడ ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీస సదుపాయాలకు కూడా దూరంగా జీవిస్తోన్న గిరిజనుల దీనస్థితి ఆయన్ని కలవరపెట్టింది. వాళ్లకోసం ఏదైనా చేయాలని అనిపించినా, బయటి వ్యక్తులను అంత త్వరగా గిరిజనులు నమ్మలేరు. అందుకే అలోక్‌ ఎంత అడిగినా వాళ్లకేం కావాలో, అక్కడి సమస్యలేంటో చెప్పలేదు. గిరిజనుల్లో ఒకడిగా మారితేనే వాళ్లు తనని ఆహ్వానిస్తారని అలోక్‌కి అనిపించింది. ఐఐటీలో పాఠాలు తాను కాకపోతే మరొకరు చెబుతారనీ, కానీ వాళ్ల జీవితాలని మార్చడానికి తాను పూనుకోకపోతే ఇంకొకరు వస్తారన్న గ్యారంటీ లేదనీ అనిపించింది. దాంతో మరో ఆలోచన లేకుండా దిల్లీ వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి 32ఏళ్ల క్రితం కట్టుబట్టలతో కొచాము అనే గిరిజన గ్రామానికి చేరుకున్నారు. అప్పట్నుంచీ వాళ్లు తినేదే తింటూ, వాళ్లతోనే ఉంటూ పిల్లలకు చదువు చెబుతూ, వూళ్లొ చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆ అమాయకులకు పెద్దదిక్కుగా అక్కడే ఉండిపోయారు అలోక్‌. బయటి వాళ్లెవరైనా గ్రామానికి వచ్చినా తన నేపథ్యం బయటపెట్టేవాడు కాదు. ఇప్పుడుకూడా, ఎన్నికల అధికారులు తనను ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోమని ఆదేశించడంతో, తప్పనిసరై వాటిని బయట పెట్టాల్సి వచ్చిందంటారు అలోక్‌.

దుస్తులు మూడు జతలే...
గిరిజనుల్లో ఒకడిలా ఉండాలంటే వేషభాషలూ వాళ్లకు తగ్గట్లే ఉండాలి. పాతికేళ్లుగా అలానే జీవిస్తున్నారు అలోక్‌. ఒక సైకిలు, మూడు జతల దుస్తులూ... ఇవే ఆ గూడెంలో ఆయనకున్న ఆస్తి. ఆ సైకిల్‌ మీదే సుదూర ప్రాంతాలకు వెళ్లి రకరకాల విత్తనాలను సేకరించి నామమాత్రపు ధరకు వాటిని గిరిజనులకు విక్రయించడమే జీవనోపాధిగా మార్చుకున్నారు. అక్కడి వాళ్లు మాట్లాడే రెండు మూడు యాసల్లో ప్రావీణ్యం సంపాదించి, అలానే సంభాషించడం అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజనులకు అందే అన్ని రకాల సౌకర్యాలూ పూర్తిగా అందేలా చూస్తూ, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచుతూ అండగా నిలబడ్డారు.

యాభైవేల మొక్కలు...
గిరిజనులతో పాటు ప్రకృతిపైనా అలోక్‌కు మమకారం ఎక్కువే. ఆ ప్రేమతోనే ఇన్నేళ్లలో తానుంటోన్న బీటుల్‌ జిల్లాలో యాభై వేలకు పైగా మొక్కలు నాటారు. ఆయన గిరిజన గ్రామాల్లో అడుగుపెట్టాక బడికెళ్లకుండా పనిబాట పట్టే చిన్నారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడంలో సహాయ పడుతున్నారు. ఖాళీ సమయంలో పెద్దలకు చదువుతోపాటు పరిశుభ్రత పాఠాలూ బోధిస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని గిరిజన గ్రామాల నుంచి దూరం చేయడానికి శ్రమిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వానికీ గిరిపుత్రులకూ మధ్య పాతికేళ్లుగా వారధిలా పనిచేస్తున్నారు అలోక్‌. అతడి సోదరుడు ఇప్పటికీ దిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటం విశేషం. ఎన్నికల సమయంలో అలోక్‌ గిరిజనుల మనసు మార్చి తమకు వ్యతిరేకంగా ఓటేయిస్తారని స్థానిక నాయకులు భయపడ్డారు. అందుకే అతడిని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకా హక్కులేదని అతడికి తెలుసు. ఎక్కువగా ఒత్తిడి పెడితే గిరిజనులూ వూరుకోరనిపించి పోలీసులూ వెనక్కితగ్గారు. ‘ప్రజలకు మంచి చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలతో పనిలేదు. అందుకే వాటితో నాకు అవసరం లేదు. ఎప్పటికీ నా గురించి బయట పెట్టకూడదనుకున్నా, కానీ కుదరలేదు’ అంటారు అలోక్‌. ‘మేము గాంధీని చూడలేదు, మాకు తెలిసిన గాంధీ అలోక్‌ సారే’ అంటాడు అనురాగ్‌ అనే ఓ స్థానిక సామాజికవేత్త. పోలిక సరైనదే అనిపిస్తోంది కదూ..!

పుణె కోసం పూనావాలా 100 కోట్లు

‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’... వ్యాక్సిన్‌లు తయారు చేసే ఈ సంస్థ విలువ రూ.4000 కోట్లు. కంపెనీ సీయీవో ఆదర్‌ పూనావాలా. ఇంటి పేరులోనే ఆ నగరాన్ని పెట్టుకున్నందుకో మరేమో పుట్టి పెరిగిన పుణె నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారాయన.

ఇప్పుడు పుణె నగరంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా చెత్త డబ్బాలూ, రోడ్లపైన చెత్తను తరలించే అధునాతన ట్రక్కులూ, వాటితోపాటు రోడ్లను శుభ్రపరిచే సరికొత్త యంత్రాలూ దర్శనమిస్తున్నాయి. ఈ మార్పునకు కారణం వ్యాపారవేత్త ఆదర్‌ పూనావాలా. ‘ఆదర్‌ పూనావాలా క్లీన్‌ సిటీ మూవ్‌మెంట్‌’ పేరుతో గతేడాది స్వచ్ఛ పుణె కార్యక్రమం మొదలుపెట్టారు ఆదర్‌. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోన్న ప్రాజెక్టు ఇది. ‘పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌’, ‘నోబుల్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్విరాన్మెంట్‌ సొల్యూషన్స్‌’ల భాగస్వామ్యంతో దేశంలో పుణెను సుందర నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ‘రోడ్ల మీద చెత్తాచెదారం కనిపించినపుడు దానికో పరిష్కారం చూపాలనుకుంటాం. కానీ అంతలోనే అది మన పరిధిలో లేని విషయంగా భావించి ముందుకు పోతాం. నాకు మాత్రం అది నా పరిధిలోని అంశమే అనిపించింద’ని చెబుతారు ఆదర్‌. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని మూడేళ్లపాటు కొనసాగిస్తారు. మొత్తం వ్యయంలో పుణె కేంద్రంగా పనిచేస్తోన్న ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ సీఎస్‌ఆర్‌లో భాగంగా ఖర్చుచేస్తున్నది రూ.10కోట్లు కాగా, పూనావాలా కుటుంబం రూ.90 కోట్లు కేటాయించింది. మూడేళ్లలో ఈ ప్రాజెక్టును స్వయంచాలిత వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు.

మూడు దశల్లో...
‘క్లీన్‌ సిటీ మూవ్‌మెంట్‌’ ప్రాథమిక దశలో పుణె నగరపరిధిలోని 30-40 కి.మీ.దూరంలో ప్రతి 100 మీటర్లకీ తడి, పొడి చెత్త సేకరణకు జత చెత్త డబ్బాలను ఏర్పాటుచేశారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ట్రక్కుల్లో శుద్ధి చేసే కేంద్రాలకు చేరవేస్తారు. రెండో దశలో జూలై నాటికి ఈ రోడ్ల పరిధిని 300కి.మీ. వరకూ విస్తరించారు. దాంతో నగరంలో మూడో వంతు చెత్తను సేకరించగలుగుతున్నారు. వీటితోపాటు రోడ్లను శుభ్రం చేయడానికి ఇంగ్లాండ్‌, జర్మనీ లాంటి దేశాల్లో ఉపయోగించే వాక్యూమ్‌ క్లీనర్లలాంటి యంత్రాల్నీ తెప్పించారు. కొన్ని వాహనాల్లో చెత్తను అక్కడికక్కడే శుద్ధి చేసే సాంకేతికతా ఉంది. మూడో దశలో ఈ ఏడాది చివరకు నగర పరిధిలోని 1000కి.మీ. మేర ఈ సేవల్ని విస్తరించనున్నారు. తద్వారా నగరమంతా ఈ కార్యక్రమం అమలైనట్టవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పనిచేసే సిబ్బందికీ వీరే జీతాలిస్తున్నారు. త్వరలో ముంబయికీ ఈ సేవల్ని విస్తరించాలని చూస్తున్నారు.

చెత్తతో ఇంధనం
వ్యర్థాలను ప్రాథమిక దశలోనే తడి, పొడిగా విభజించడంవల్ల వాటి పునఃవినిమయ ప్రక్రియను సులభతరం చేస్తున్నారు. అంతేకాదు చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నగర శివార్లలో కుప్పలుగా నిల్వచేసే ప్రక్రియకూ ముగింపు పలకాలని చూస్తున్నారు. తద్వారా వందకుపైగా ఎకరాల భూమిని మిగతా అవసరాలకు కేటాయించవచ్చంటారు ఆదర్‌. ఇప్పటివరకూ ఈ కార్యక్రమానికి దాదాపు రూ.40కోట్లు ఖర్చుచేశారు. వీరు సేకరించిన తడి చెత్తని ‘నోబుల్‌ ఎక్స్ఛేంజ్‌’ కంపెనీ శుద్ధి చేస్తూ జీవ ఇంధనాన్ని ఉత్పత్తిచేస్తోంది. పొడి చెత్త రీసైక్లింగ్‌ బాధ్యతను మాత్రం ప్రస్తుతానికి పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపడుతోంది. అక్కడా ఆధునిక పద్ధతుల్లో శుద్ధిచేయడంలో మార్గనిర్దేశం చేస్తున్నారు. ‘తడి చెత్త వల్ల డెంగీ, మలేరియా లాంటివీ త్వరగా వ్యాప్తిచెందుతాయి. వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిస్తే ఇంకెన్నో సమస్యలు. అందుకే దీనిపైన ముందు దృష్టిపెట్టాం. పుణెలో రోజూ 1700 టన్నుల తడి చెత్త తయారవుతోంది. అందులో ఎక్కువ ఆహార వ్యర్థాలే. ఆ చెత్తను వేరుగా సేకరించి శుద్ధి చేస్తే నగర పరిశుభ్రతతోపాటూ పర్యావరణానికీ, ప్రజా ఆరోగ్యానికీ మేలు చేసినట్టవుతుంది. అందుకే, ప్రజలూ దీన్లో భాగమవ్వాలి’ అనేది ఆదర్‌ మాట. ఈ కార్యక్రమంలో గృహ సముదాయాల్నీ, హోటళ్లనీ, కార్యాలయాల్నీ భాగం చేసుకొని వెళ్తున్నారు.

సాధారణంగా వాణిజ్యవేత్తలు తమ సంస్థల సేవా కార్యక్రమాల్లో భాగంగా కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తుంటారు. కానీ వారి సమయాన్నీ, యాజమాన్య విధానాల్నీ మాత్రం అక్కడకి తీసుకువెళ్లరు. ఆదర్‌ మాత్రం కేవలం డబ్బు కేటాయించి వూరుకోకుండా తగినంత సమయాన్ని కేటాయిస్తూ చెత్త డబ్బాల ఎంపిక, వాహనాల కొనుగోలు, ఉద్యోగుల పనితీరు, చెత్తను శుద్ధి చేసే విధానం... ఇలా ప్రతి అంశాన్నీ పరిశీలిస్తూ ప్రణాళికలు వేస్తారు. తద్వారా తక్కువ బడ్జెట్‌లోనే మంచి పాలనా దక్షతతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు రాబట్టవచ్చో చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

‘మేం రోడ్లు శుభ్ర పరుస్తున్నాం. ఇంకొకరు టాయిలెట్లు కట్టించడం, మరొకరు మొక్కలు నాటడం... ఇలా చేస్తే మొత్తంగా పుణె రూపురేఖలు మారిపోతాయి’ అంటారు ఆదర్‌. తర్వాత పుణె స్ఫూర్తితో మిగతా నగరాలూ పనిచేస్తాయంటారు. త్వరలో మురుగు నీటిని శుద్ధి చేసి పుణె నీటి అవసరాలను తీర్చే ఆలోచనా ఉందంటారు ఆదర్‌. పుట్టి పెరిగిన నగరం కోసం ఇంత చేస్తున్న ఆదర్‌ ఉదారత... ఎందరికో ఆదర్శం.

ధీవరా... సాహసం చేయరారా!

  దట్టమైన అడవులూ, పాలనురగలను తలపించే జలపాత ధారలూ, సహ్యాద్రి పర్వత శ్రేణుల అందాలకూ నెలవు ఆదిలాబాద్‌ జిల్లా. ఇన్నాళ్లూ తన ఒంపుసొంపులతో చూపరులను కట్టిపడేసిన అక్కడి గాయత్రి జలపాతం తొలిసారి ప్రపంచస్థాయి సాహస క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు రోజుల పాటు అక్కడ జరగనున్న వాటర్‌ఫాల్‌ ర్యాపెల్లింగ్‌ ప్రపంచకప్‌ సన్నాహక పోటీలు సాహసికులతో పాటు వీక్షకులకూ వినోదాన్ని పంచనున్నాయి.