close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ ఇంటికొస్తా...మీ నట్టింటికొస్తా...

మీ ఇంటికొస్తా...మీ నట్టింటికొస్తా...

‘మీ వూరికొస్తా...
మీ వీధికొస్తా...
మీ ఇంటికొస్తా...
మీ నట్టింటికొస్తా...
అడ్రస్‌ మీరు చెప్పినా సరే...
జీపీఎస్‌లో నన్నే వెతుక్కోమన్నా సరే...’
సినిమాల్లో కలెక్షన్లు కురిపించిన డైలాగు, వ్యాపారంలో లాభాల్నీ పండిస్తోంది. నిన్నమొన్నటిదాకా...కాస్త ఫీజు ఎక్కువ ఇస్తే, ట్యూషన్‌ మాస్టారే ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవాడు. ‘బాబ్బాబూ పుణ్యముంటుంది...’ అని బతిమాలితే కిరాణాకొట్టు యజమానే సరుకుల్ని మన అడ్రసుకు పంపేవాడు. అంతే, అంతకుమించి ఏం కావాలన్నా కాళ్లీడ్చుకుంటూ బజారు దాకా వెళ్లాల్సిందే. వరుసలో నిలబడి, ఓపిగ్గా మన వంతు కోసం ఎదురుచూడాల్సిందే. జమానా బదల్‌గయా! ఇక, ఎవరి చుట్టూనో మీరు తిరగాల్సిన పన్లేదు. ఏ సేవలైనా మీ చుట్టే ప్రదక్షిణలు చేస్తాయి.

వేడివేడిగా చికెన్‌ బిర్యానీ, ఒత్తిడి తగ్గేలా హెర్బల్‌ మసాజ్‌...ఏదైనా కావచ్చు.
మీకు ఫేషియల్‌, మీ కుక్కపిల్లకు క్షవరం ...ఏమైనా కావచ్చు.
దుమ్ముదులిపి పెట్టడానికి పనిమంతుడైన పనోడు, పక్కాగా ముహూర్తం పెట్టడానికి విషయమున్న పురోహితుడు...ఎవరైనా కావచ్చు.

ఒక్క క్లిక్కు చాలు. చెప్పిన సమయానికి వచ్చేస్తారు. చెప్పిన పనులన్నీ చేసేస్తారు. ‘ఆన్‌ డిమాండ్‌ హోమ్‌ సర్వీస్‌’ ఇప్పుడో తిరుగులేని వ్యాపార ఆలోచన. జనం అవసరాల్ని అవకాశంగా మలుచుకోడానికి అంకుర సంస్థలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ ఐడియాలకు ముచ్చటపడి మహామహా దిగ్గజాలు కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. ఈ వేదిక మీద...రోజుకు ఐదువేల నుంచి పదివేల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే, రెండుకోట్ల మంది నగరజీవులు ఇంటి సేవల కోసం రకరకాల వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకున్నారని అంచనా. ఇదంతా ప్రారంభమే. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం, త్రీజీ ఫోర్‌జీ సేవలు చవకైపోవడం...తదితర పరిణామాలతో ఇంటి సేవల పంట పండుతోంది. ఈ విజయంలో సామాజిక, ఆర్థిక, మానసిక కోణాలూ అనేకం.

 

అవసరాన్ని తీర్చడం..
అహాన్ని సంతృప్తిపరచడం...
ఒకటి భౌతికమైంది, రెండోది మానసికమైంది.
- ఈ రెండు వలల్నీ జంటగా విసిరితే, కస్టమర్‌ చేప పడితీరాల్సిందే.

అనగనగా కథలో ఓ పెద్దమనిషికి చవకంటే మోజు. చవకగా దొరుకుతుందంటే చంద్రమండలానికైనా బయల్దేరే రకం. ఓరోజు ఏదో వస్తువు కొనుక్కోడానికి దుకాణానికెళ్తాడు. అక్కడి కంటే సంతలోనే చవగ్గా దొరుకుతుందంటే, నేరుగా సంతకెళ్లిపోతాడు. సంతతో పోలిస్తే పొరుగూళ్లొ ఇంకా చవగ్గా అమ్ముతున్నారని అక్కడెవరో చెబితే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా పక్కూరికి ప్రయాణం అవుతాడు. తీరా అక్కడికెళ్లాక, ఏరుదాటి అవతలి గట్టుకు కనుక చేరుకోగలిగితే...ఫ్రీగా వచ్చేస్తుందన్న మాట వినిపిస్తుంది. మరో ఆలోచన లేకుండా ఏట్లోకి దూకేస్తాడు. తర్వాత, ఆ చవకప్పారావు ఎవరికీ కనిపించలేదు.

కాలం కంటే డబ్బే విలువైన రోజులవి! ఇప్పుడలా కాదే. సాఫ్ట్‌వేర్‌ కొలువులూ, రెండు జీతాల కుటుంబాలూ ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేలా చేశాయి. సమస్యంతా సమయంతోనే. ఉరుకులపరుగుల జీవితంలో ఓ గంట సమయాన్ని తమకంటూ మిగుల్చుకోవడం కూడా గగనమైపోతోంది. ఆ కాసేపూ టీవీలో నచ్చిన కార్యక్రమం చూసుకోవచ్చు, పిల్లలతో హాయిగా ఆడుకోవచ్చు, జీవితభాగస్వామితో మాట్లాడుకోవచ్చు. ఆఫీసు పన్లేమైనా మిగిలిపోయి ఉంటే, చకచకా పూర్తిచేసుకోవచ్చు. ఆ కాస్త వెసులుబాటు కోసమే, సమయాన్ని కరెన్సీలో కొలిచి కొనుక్కోడానికైనా సిద్ధపడుతున్నారు. నెలకో అరవై వేలు సంపాదిస్తున్న ఉద్యోగి ఒక రోజు సమయం విలువ రెండువేలు. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తాడనుకుంటే, గంట విలువ రెండొందల యాభై. ఓ పాతిక రూపాయలు మనవి కాదనుకుంటే పూర్తయిపోయే పనుల కోసం, రెండొందల యాభై ఖరీదు చేసే సమయాన్ని వృథా చేసుకుంటామా? ఎంత మూర్ఖత్వం. అందులోనూ, ఏ పనిమీదో వీధిలోకి వెళ్లడమంటే మన కాలాన్ని ఐస్‌క్రీమ్‌లా కరిగించుకోవడమే. ఒక్కసారి ట్రాఫిక్‌లో చిక్కుకున్నామా, బయటికి రావడం అన్నది మన చేతుల్లో ఉండదు. కాలుష్యం, రణగొణధ్వనులు, బాధ్యతలేని చోదకులు...ఆ హింస కంటే ఇల్లే నయమనిపిస్తుంది. కోరుకున్నవన్నీ... కాళ్లకు చక్రాలు కట్టుకుని నేరుగా మనింటికే వచ్చేస్తే బావుండనిపిస్తుంది.

సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాటు కావచ్చు, నాలుగు పడకల డూప్లెక్స్‌ కావచ్చు. ఏదైతేనేం, ఇంటికి చేరుకోగానే మనదైన సామ్రాజ్యంలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఆఫీసులో బాసూ, రోడ్డు మీద ట్రాఫిక్‌ పోలీసూ, ఆసుపత్రిలో నర్సూ...ప్రతి చోటా ఎవరో ఒకరు మనల్ని నియంత్రించాలని చూసేవారే. అదే, ఇంట్లో - మనమే రాజా! కాబట్టే, ఫైవ్‌స్టార్‌ విలాసం కంటే, మన ఇరుకిరుకు బెడ్‌రూమే మహా సౌకర్యంగా అనిపిస్తుంది.

అన్నిటికీ మించి...మనల్ని వెతుక్కుంటూ ఎవరో వస్తున్నారన్న ఆలోచన అహానికి ఆముదమేసి మర్దనా చేస్తుంది. ఆ ఫీలింగ్‌ కోసమే, ఓ వంద ఎక్కువైనా ఖర్చు చేస్తాం. కాబట్టే, ‘మీ గడపకే డాక్టరు’, ‘మీ ఇంటికే బిర్యానీ’ తదితర ప్రకటనలు కనిపించగానే, ‘భలే బావుందే’ అనుకుంటాం. మరో ఆలోచన లేకుండా ఆర్డరు ఇచ్చేస్తాం. అందువల్లే, ‘గడప సేవ’ భవిష్యత్తులో అరవై ఆరువేల కోట్ల రూపాయల పరిశ్రమగా రూపుదిద్దుకోనుంది.

ఇల్లే ‘ప్యారడైజ్‌’...
నగరజీవి కమ్మని రుచులకు మొహం వాచిపోయాడు. ఇద్దరూ ఉద్యోగులే. ఎవరి పరుగు వారిది. దుకాణం దాకా వెళ్లి సరుకులూ, మార్కెట్‌ దాకా వెళ్లి పండ్లూ కూరగాయలూ తెచ్చుకునే తీరిక అస్సలు ఉండటం లేదు. ఆ పరిమితిని ‘బిగ్‌ బాస్కెట్‌’ లాంటి సంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. అదే రోజు డెలివరీ ఇచ్చేస్తున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. సరుకు ఇంటికొచ్చినా వండి వార్చే తీరిక ఎంతమందికి ఉంటుందీ? వండుకున్నా...అన్నం పప్పూ కూరల వరకే! కొత్తరుచులు కావాలంటే, రెస్టరెంట్లకు వెళ్లాల్సిందే. మళ్లీ ఇక్కడో ఇబ్బంది. ‘ప్యారడైజ్‌’కు వెళ్తే వేడివేడిగా బిర్యానీ దొరుకుతుంది. సంతోషమే. కానీ, అక్కడే కూర్చుని ‘చట్నీస్‌’లో అందించే సుతిమెత్తని స్టీమ్డ్‌ దోసెల్ని రుచి చూడలేం! ‘ఉలవచారు’లో రాజుగారి కోడి పులావ్‌ లాగిస్తూ...షాగౌస్‌లో సర్వ్‌చేసే స్పైసీస్పైసీ తంగ్డీ కబాబ్‌ ముక్కల్ని నంజుకోవాలనుకోవడం భోజన ప్రియులకు తీరని కోరికే. అంటే, ఒకసారి బయటికెళ్తే ఒక రెస్టరెంట్‌ రుచుల్నే ఆరగించగలం. ఆ పరిమితిని పక్కన పెడుతూ...కోరిన రుచుల్ని కోరుకున్న రెస్టరెంట్‌ నుంచి తెచ్చి ఇస్తున్నాయి జొమాటో, ఫుడ్‌పాండా లాంటి సంస్థలు. ‘అబ్బే! మాకు బయటి భోజనం పడదు. ఇంటి తిండే కావాలి, అదీ మేమే వండుకోవాలి’ అని షరతు పెట్టేవారి కోసం...‘కుక్‌ఫ్రెష్‌.ఇన్‌’, ‘ఈజీకుక్‌’ మొదలైన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఏ చికెన్‌ బిర్యానీయో తినాలని మనసు తహతహలాడుతోంది అనుకోండి...వండుకోడానికి అవసరమైన పదార్థాలన్నీ కొలతలతో సహా వాళ్లే పంపిస్తారు. దాంతోపాటే, ‘చికెన్‌ బిర్యానీ వండటం ఎలా?’ అన్న కరపత్రమూ అందుతుంది. ఇంకేం, నిక్షేపంగా వండుకు తినొచ్చు. ‘మేం వండుకోం, హోటల్లోనూ తినం! కానీ కమ్మని ఇంటి భోజనం కావాల్సిందే’ అంటూ మడతకాజా పేచీలు పెట్టేవారి కోసమే...ఎవరింట్లోనో ప్రత్యేకంగా వండించి క్యారేజీ పంపే సంస్థలూ వెలుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా, ‘మా ఇంటికే వచ్చి మాకిష్టమైన వంటలు వండిపెట్టేవారు కావాలి’ - అని భీష్మించుకు కూర్చునే వారి కోసం ‘ఆన్‌ డిమాండ్‌ షెఫ్‌ సర్వీసులు’ ఉండనే ఉన్నాయి. నేరుగా నలభీములే మనింటికొచ్చి, వంటింటిని ఫైవ్‌స్టార్‌ కిచెన్‌గా మార్చేస్తారు.

ఇల్లలికి ముగ్గేసి...
వారానికోసారి బాత్‌రూమ్‌ శుభ్రం చేసుకోవాలి, పదిహేను రోజులకోసారి వంటిల్లు సర్దుకోవాలి, తరచూ సోఫాల దుమ్ము దులపాలి - ఎవరుచేస్తారు ఇన్ని పనులు? భార్యాభర్తలు సమానమే అయినా, భర్త కొంచెం ఎక్కువ సమానం కాబట్టి, అవన్నీ ఆమె మెడకే చుట్టుకుంటాయి. పెండింగ్‌ ఫైళ్లు దులపడానికే నానా తిప్పలు పడుతుంటే, ఇక ఇల్లేం దులుపుతుంది! మేనేజరుగానో, టీమ్‌ లీడరుగానో సిబ్బందిని ఉతికి ఆరేయడానికే ఉన్న ఎనర్జీ అంతా ఖర్చయిపోతుంటే, దుప్పట్లేం ఉతుకుతుంది! గృహిణులు ఆ ఇబ్బందుల్ని తప్పించుకునే బ్రహ్మాండమైన ఐడియా ఒకటుంది. చిన్న మెసేజీ చాలు. ఠక్కున వాలిపోతారు. ఇల్లు తుడుస్తారు. టాయిలెట్లు శుభ్రం చేస్తారు. టైల్స్‌ను మెరిపిస్తారు.మూలమూలల్లోని బూజంతా దులిపేస్తారు. బొద్దింకలూ గట్రా కనిపిస్తే పురుగుమందు చల్లుతారు. సోఫాల్నీ పక్కల్నీ శుభ్రం చేస్తారు. పన్లోపనిగా, టప్‌టప్‌మంటూ వృథాగా నీళ్లు పోతున్న కుళాయిల్ని బలంగా బిగిస్తారు, పాడైపోయిన స్విచ్‌బోర్డుల్ని మార్చేస్తారు. గొళ్లాలేమైనా వదులైపోయి ఉంటే అవీ సరిచేస్తారు. వెళ్తూవెళ్తూ పార్కింగ్‌లో దుమ్ముకొట్టుకుపోయిన కారునూ ఓ పట్టు పడతారు. ఒకరే అన్ని సేవలూ చేయవచ్చు. ఏ సేవకు ఆ సేవ అందించే సంస్థలూ ఉన్నాయి. అర్బన్‌క్లాప్‌, లోకల్‌ ఓయె, మిస్టర్‌ రైట్‌, మిస్టర్‌.హోమ్‌కేర్‌, హౌస్‌జాయ్‌ తదితర అంకురాలు ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతానికి వ్యాపారం నగరాలకే పరిమితమైనా, జిల్లా కేంద్రాల దాకా విస్తరించే రోజు ఎంతోదూరం లేదు.

తక్షణం ‘తాత్కాలిక’ సేవ...